మార్చి 30, 2018

మన తెలంగాణా

Posted in సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం, Uncategorized at 7:40 సా. by వసుంధర

photo

మన తెలంగాణా

వ్యాస రచనః పల్లేరు వీరాస్వామి

తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్రవంటి విషయాల్లో తెలంగాణకు ఒక ప్రత్యేకత వుంది. తెలంగాణ పదాన్ని వాడకంగా పరికిస్తే చరిత్రకాధారాలను బట్టి మెదక్ జిల్లా తెల్లపూర్‌లో బయల్పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ అనే పదం ప్రయోగింపబడింది. ఇది తెలంగాణ పదాన్ని సూచించే మొదటి శాసన నిదర్శనం. అనంతరం క్రీ.శ. 1577లో ప్రతాపరుద్ర గజపతి వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణా’ వాడబడింది. కాకతీయులు, ముస్లిం రాజుల పాలనా వ్యవహారాల్లో తెలంగాణ పదం విస్తృతంగా ఉపయోగించారు కూడా. ఆంధ్ర వలసవాదులు తెలంగాణకు రావడం మొదలైన తర్వాత ఇక్కడి భాషా సంస్కృతులపై అవహేళనలు చేశారు. తెలంగాణ వారికి భాషా జ్ఞానం లేదన్నారు. ఇది తౌరక్యాంధ్రం అన్నారు. తెలంగాణలో తెలుగుతనమే లేదని, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మొదట దెబ్బ తీశారు. ఒక ప్రణాళిక ప్రకారంగా భాషపై దురాక్రమణ చేస్తే, ఇక ఈ ప్రాంతాన్ని ఆధీనం చేసుకోవచ్చనే దురుద్దేశం అందులో ఉంది. అట్లా వలసాధిపత్యం వల్ల, అణచివేతల వల్ల 1956 నుండి చాపకింది నీరులా తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, మేధో సంపత్తిని నిర్వీర్యం చేశారు. ఈ కుట్రలను గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. తెలంగాణ మేధావుల్లో జాగృతి మొదలయ్యింది. తమను తాము గుర్తించుకోవడం, గౌరవింప చేసుకోవడం, గుండెలకు హత్తుకోవడం మొదలయింది. “మరుగునపడిన తెలుగు జాతి చరిత్రకు తెలంగాణ నేల బంగారు గని వంటిది” అన్నారు కొమర్రాజు లక్ష్మణరావు. తెలంగాణలోని మేధావులు పూర్వం నుండీ సహజంగా తమ అధ్యయనాల్ని, ఆచరణలూ, బోధనలూ, ఎలాంటి ఆర్భాటాలు, ప్రచారాలు, పటాటోపాలు లేకుండా సాగించారు. అటువంటివారి కృషిని వారి రచనలను తవ్వి తీయవలసిన అవసరం మొదలయింది. ఆ దీపధారులను వెతుకులాడుకోవడం, వారిని తిరిగి ప్రపంచానికి తెలియజేయడం, వారి రచనల్ని కృషిని తిరిగి పునర్మించుకోవడం అనివార్యమైందిప్పుడు. సాహితీ సాంస్కృతిక, చారిత్రక అంశాలను తవ్వి తీయవలసిన పని ప్రారంభమయింది. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిం తర్వాత గత డిసెంబరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ఆ పునర్వికాస పనులను మరింత వేగవంతం చేశాయి. ఇదంతా ప్రభుత్వ పక్షాన, ఔత్సాహిక పుస్తక ప్రచురణల పక్షాన జరిగాయి.
2009లో ‘తెలంగాణ ప్రచురణలు హైదరాబాద్’ వారి పక్షాన నలుగురు సాహితీ ప్రసిద్ధులు బి.నర్సింగరావు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, కాసుల ప్రతాప రెడ్డి ఉత్సాహంగా, ఉద్వేగంగా ఒక సోయితో చైతన్యం తో వెనుకటి తెలంగాణ అన్వేషణను సాహిత్య పరంగా మొదలుపెట్టారు. సా హితీ రంగంలోనే అనేక ప్రక్రియలు తెలంగాణలో ఉద్భవించాయనే సత్యాన్ని వెలికి తీసి చూపించారు. అణగారిన కళలూ, సంస్కృతినీ ఆవిష్కరింప పూనుకున్నారు. అట్లా మనల్ని మనం బతికించు కోవాలనీ, చరిత్రను పునర్నిర్మించుకోవాలనీ సంసిద్ధులయ్యారు. ఇప్పుడు బ్రతికి ఉన్న వాళ్లతో పాటు, గతించిన చరిత్ర పొరల్లో అజ్ఞాతంలో మ్రగ్గిపోతున్న వారినీ వెతుకులాడుకొని పునః ప్రతిష్ట గావించుతున్నారు.
నిజంగా ఇదొక యజ్ఞం. అస్తిత్వాన్ని నెలకొల్పడం, వాళ్ల వారసత్వాన్ని సొంతం చేసుకోవడం అంటే ఇది మరో సాహిత్య సంగ్రామం. ఈ ప్రయత్నం తెలంగాణ చరిత్రను సమగ్రం చేయడంతోపాటు, తెలుగు సాహిత్య చరిత్రను పరిపుష్టం చేయడానికి, అసమగ్రతలను సవరించడానికి చేస్తున్న ప్రయత్నంగా భావించాలి. అప్పుడే ‘ముంగిలి’ తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్రను తెలియజేసే మొదటి గ్రంథాన్ని సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సంపాదకత్వంలో విడుదల చేశారు. క్రమక్రమంగా పురోగమిస్తూ 2015 వరకు ఆరు పుస్తకాల్ని వెలికి తీసి ముద్రించారు. సురవరం ప్రతాపరెడ్డి “తెలంగాణ వ్యాసాలు’ “పొట్లపల్లి రామారావు కథలు” “తెలంగా ణ చరిత్ర”లతోపాటు కాసుల ప్రతాపరెడ్డి “తెలంగాణ సాహిత్యోద్యమాలు’ కె.శ్రీనివాస్ “తెలంగాణ సాహిత్యవికాసం” వంటి పుస్తకాల్ని వెలువరించారు.
గత డిసెంబర్ 2017లో నిర్వహింపబడిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భం వారి కార్యశీలతను తట్టి లేపింది. ఏకంగా ప్రాశస్తం గల 28 గ్రంథాల్ని అచ్చు వేయించారు. ఇవన్నీ పునర్ముద్రణలే. గతంలో చారిత్రకా వసరాలుగా ప్రచురితాలైన గ్రంథాలు కూడా ఇందులో ఉన్నాయి. తెలంగాణ తల్లికి గర్వకారణమై, అనంతర కాలాల్లో విస్మృతాలైన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. విహంగ వీక్షణంగా వాటి తీరు తెన్నులు.
‘ఆదిరాజు వీరభద్ర రావు జీవిత చరిత్ర’ ఆంధ్రదేశపు చారిత్రక పరిశోధన చేయడంతో, విద్యా సంస్థలు, గ్రంథాలయాల నిర్వహణలు, సారస్వత సంస్థల స్థాపనలు గావించాడు. ఈయన తెలుగు జాతి గర్వించదగిన తెలంగాణ బిడ్డ, ఆయన జీవిత చరిత్రను వేశారు. క్రీ.శ. 1940 కాలంలో సురవరం ప్రతాపరెడ్డి రాసిన ‘ఖగోళ విజ్ఞానం’ రెడ్డి గారు ఆధునిక జ్ఞానాన్ని అందించే పుస్తకాలు తెలంగాణలో లేని రోజుల్లో ఈ అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. ఇప్పటి వాళ్లకు ఇది మామూలుగా తోచిన ఆకాలం నాటి నుండి చూస్తే ఈ పుస్తక ప్రాశస్తం అర్థమవుతుంది. తెలంగాణలోనూ వైజ్ఞానిక సంపదకు కొదువలేదని చెప్పగలిగే పుస్తకమిది.
1936 నుండి 1950 వరకు వచ్చిన తెలంగాణ కవిత్వాన్ని పట్టి చూపే కవితా సంపుటులు తొలి సంజ, తొలి కారు, ప్రత్యూష, అంజలిలు. వీటిలో ఆకాలం నాటి ప్రముఖ కవుల రచనలు పొందుపరచనైనాయి. భావ, అభ్యుదయ, తెలంగాణ, ఆంధ్ర, జాతీయోద్యమ కవితలు నిండి ఉన్నత విలువలున్న గ్రంథాలివి. తెలంగాణలో విస్మృతులైన చరితార్థుల కవులను, వారి సాహితీ సేవలను, స్థల కాలాదులను వెలికి తీసి చూపే గ్రంథం “చరిత్ర కెక్కని చరితార్థులు’. ఎంతో శ్రమకోర్చి బిరుదురాజు రామరాజుగారు పరిశోధించి రాశారు. దీనివల్ల తెలంగాణలోని సాహితీ తెలంగాణలోని సాహితీ రత్నాలెందరో బయటపడ్డారు.
తెలంగాణలో తొట్టతొలిసారిగా దళిత బహుజన కవిత్వం చాటిచెప్పిన గ్రంథం ‘బహువచనం’. ఇందులో తెలంగాణ బహుజన రచయితలు తమ భాషను, అనుభవాలను, కులాలను, వారి జీవద్భాషను, ఆచార సంప్రదాయాలను చొప్పించి రాశారు. దేశ స్వాతంత్య్రం కోసం హిందువులతోపాటు మహ్మదీయ సోదరులు కూడా ఎన్నో త్యాగాలు చేశారని తెలిపే గ్రంథం ‘స్వాతంత్య్ర సమరంలో ముస్లిం యోధులు’ దీన్ని ప్రముఖ రచయిత హీరాలాల్ మోరియా రాశారు. దేశాన్ని కాషాయీకరణలో కొనసాగిస్తామంటున్న నేటి సమాజంలోని కొందరికి ఈ పుస్తకం తప్పక జవాబుగా నిలుస్తుంది. మత సామరస్యతను కాపాడుటలో తోడ్పడుతుంది.
1933 నాటికే తెలంగాణలో ఒక మహిళా రచయిత్రి ప్రణయ కవిత్వం ‘కావ్యావళి’ పేరిట రాసింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఇందుమతి రాసిన ఈ కవితా సంపుటి వల్ల తెలంగాణలో మహిళా కవయిత్రులకు కొదవలేదని తెలుస్తుంది. వరంగల్‌కు చెందిన పాములపర్తి సదాశివరావు పత్రిక రచయిత, ఆలోచనాపరుడు, సిద్ధాంత కర్త, తత్తవేత్త, కళాసాహిత్య విమర్శకుడు, బహుభాషా కోవిదుడు, సంగీతజ్ఞుడు, రాజకీయ సామాజిక కార్యకర్త ఆయన రాసిన ‘భారతీయ సాహిత్య పరిణామ పరిశీలన’ తొలి మార్కిస్టు విమర్శనా గ్రంథం. తెలంగాణలో ప్రసిద్ధులయిన మార్కిస్టు విమర్శకులున్నారని చెప్పడానికి ఈ గ్రంథం నిదర్శనం.
1930లో చెన్నూరు శోభనాద్రిచే విరచితమైన శృంగార ప్రబంధ కావ్యం ‘శృంగార సుధా సముద్ర పూర్ణ చంద్రోదయం ‘ఇది సిక్సున్నొక్క కావ్యాల్లో తెలంగాణకూ భాగముందని చెప్పే కావ్యం. ‘బొమ్మ హేమాదేవి కథలు’, మాదిరెడ్డి సులోచన ‘సుషుప్తి’ నవల ప్రచురణల తెలంగాణలో తొలి తరం నుండే మహిళ కథా నవలా రచయిత్రులు రాణించారని తెలుస్తుంది. ‘జాతీయ గేయములు’ రాసిన మంత్రి ప్రగడ వెంకటేశ్వర రావు విస్మృత రచయిత. 1939లో ప్రథమ ముద్రణ గావించిన పుస్తకాన్ని మలి ముద్రణ గావించారు. శతాధిక గ్రంథ కర్త లోకమహరి రాసిన సాంఘిక నవల ‘సంఘము’. ఇందులో తెలంగాణ జీవద్భాష, పద్మశాలీల జీవన విధానాలు తొణికిసలాడాయి. నూతన కవి సూరన రాసిన ‘ధనాభిరామం’ తెలుగు సాహితీ చరిత్రలోనే తొలి కల్పిత కావ్యం.
వివిధ నిష్ణాతులచే సంకలింపబడిన ‘సుజాత’ తెలంగాణ ప్రత్యేక సంచికలో తెలంగాణ చరిత్ర, భౌగోళిక స్వరూపం, సాహిత్యం, రాజకీయోద్యమాలు, ప్రకృతి సంపద, పరిశ్రమలు, నుడికారం, శిల్పం, పత్రికలు, చిత్రకళ వంటివి పొందుపరుచనైనాయి. ‘మహైక’ తెలుగులో తొలి వచనా కవితా కావ్యం. కవి పేరు కవిరాజ మూర్తి. పేదల జీవితాల్ని , అన్నార్తుల ఆక్రందనల్ని ఇందులో విప్పి చెప్పిండు. ఊటుకూరు రంగారావు ‘శరధార’, ‘శ్రీ వాసుదేవరావు కథలు’ , దైదవేములపల్లి దేవేందర్ రాసిన ‘భాగ్య నగర వైభవం’, భల్లా పేరయ రాసిన అధిక్షేపాత్మక ‘భద్రగిరి శతకం’, గంగుల శాయిరెడ్డి రాసిన ‘కాపుబిడ్డ మావూరు’ కావ్యం, శేషాద్రి రమణ కవులు విరచించిన ‘నైజాం రాష్ట్ర ప్రశంస’, గవ్వా మురహరి రెడ్డి ‘గుంటక పురాణం’ ఆధునిక అధిక్షేప పద్యాలు ఇలా వేటికవే ప్రసిద్ధ గ్రంథాలు.
తెలంగాణ గత సాహితీ వైభవాలు మరే ప్రాంతం కన్నా తక్కువ కావని ఇవన్నీ చాటిచెప్పేవే. ‘తెలంగాణ నవలా చరిత్ర 1956’ అనే పరిశోధనా గ్రంథాన్ని సంగిశెట్టి శ్రీనివాస్ రాశారు. ఇందులో తెలుగు నవలా వికాస ఆవిర్భావంపై వివిధ కోణాల్లో చర్చిస్తూ, తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి నవల ‘కంబు కంధర చరిత్ర’ గా నిర్ధారించారు. దీని రచయిత నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ (బేతవోలు) కు చెందిన తడకమళ్ల వెంకట కృష్ణారావుగా తేల్చి చూపారు. ఈ పరిశోధనా గ్రంథంలో 1910 నుండి వచ్చిన తెలుగు నవలల్ని ఆసాంతంగా వింగడించి చూపారు. తెలుగు నవల ఆవిర్భావం తెలంగాణలోనే జరిగిందని ఢంకా భజాయించి చెప్పారు. 197180 వరకు వచ్చిన తొలి ‘దశాబ్ది కవితా సంకలనం’ ఈ తరం యుద్ధ కవిత. ఉస్మానియా విశ్వ విద్యాలయ క్యాంపస్‌లో ఆనాటి వామపక్ష ఆలోచనలు కలిగిన విద్యార్థులు ‘రైటర్స్ సర్కిల్’ ను ఏర్పాటు చేసుకొని చైతన్యవంతంగా సాగుతూ ఉద్యమాలు కొనసాగిస్తున్న కాలం. దాదాపు ఇప్పటి ప్రసిద్ధ కవులందరూ ఆనాటి రైటర్స్ సర్కిల్ నుండి వచ్చినవారే. నాయకత్వ స్థానంలో ఉన్న సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఆ దశాబ్ది (197180) లో వచ్చిన ఉత్తమ కవితల్ని మిత్రుల సహకారంతో కష్టపడి సమకూర్చి 1982లో ప్రచురించిన కవితా సంకలనం ఇది. ఇందులోని కవులందరిదీ ఒకే లక్షం. కానీ వీరి కవిత్వంలో వస్తు వైవిధ్యముంది. బలమైన ఆధునిక వ్యక్తీకరణతోపాటు దృష్టి నైశిత్యం, వస్తు విస్తృతి వుంది.
కిషన్ రాసిన ‘విప్లవం పిలుస్తుందిరా!’ అనే కవితతో ప్రారంభమై నిజం రాసిన ‘కళ్లు’ వరకు 32 కవితలున్నాయి. కిషన్ ‘విప్లవమంటే / రాచపుండును కత్తులతో కోసి తీసేయడం’ గా విశ్లేషిస్తే, అప్పాజీ ‘ఇప్పుడు వీస్తున్న గాలి / పాలికావు నుదిటి చెమటను అని హామీ ఇచ్చాడు. శివసాగర్ ‘వేడీ, వెలుతురూ ప్రజలకు పంచడం’ సూర్యోదయంగా నొక్కి చెప్పాడు. ఉరి తీయబడ్డ విప్లవ వీరులిద్దరిని ‘వాళ్లిద్దరిలో ఒకడు భూమి, రెండవ వాడు ఆకాశం’ గా వింగడించాడు శ్రీశ్రీ. తనదైన ప్రత్యేక ముద్రతో అప్పటి నుండి ఇప్పటికీ రాస్తున్న నిజం ‘కళ్లు’ అనే కవితను రాశారు. ‘కళ్లను పీకేస్తున్న ఈ వ్యవస్థకు పిచ్చి ముదిరింది/ చూపును దోచేస్తున్న ఈ సమాజం సమాధికి చేరువవుతోంది’ అని ఆవేదనతో చెప్పాడు నిజం కవి. కె శివారెడ్డి, నగ్నముని, నందిని సిధారెడ్డి, టంకశాల అశోక్, వరవరరావు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అజంతా వంటి చేయి తిరిగిన రచయితల కవితల్ని జాగ్రత్తగా ఏరి సమకూర్చిన కవితా సంకలనం ఇది. నాటిచారిత్రక సందర్భాన్ని ఎత్తి చూపే గ్రంథమిది. కవిత్వం ఎందుకోసం, ఎవరి కోసం రాయాలో లక్ష నిర్దేశం చేసి గమ్యం చూపిన పుస్తకమిది. తెలంగాణ ప్రచురణలు హైదరాబాదు వారిచే పునర్ముద్రణలు కాబడుతున్న ఈ అపురూప గ్రంథాలన్నీ వేటికవే చెప్పుకోదగ్గవి. తెలంగాణ ప్రాంతేతరులచే కావాలనే అణచబడిన, విస్మృతి గావించబడిన సంస్కృతీ సాహితీ చరిత్రలకు సవాలుగా నిలిచిన రచనలివి. ఇప్పటికీ కొంతవరకే పరిమితమైన ఇలాంటి రచనలు ఇంకా విస్తృతంగా వెలువడాలని ఆశిద్దాం. ఇందుకు ‘తెలంగాణ ప్రచురణలు’ సంస్థను అన్ని విధాలుగా ఆదరించవలసిన ఆవశ్యకత అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీదా, ఇటు ప్రజల మీదా ఉంది.

 

 

 

 

 

 

Leave a Reply

%d bloggers like this: