ఏప్రిల్ 18, 2018

బలహీనుల ప్రతినిధిగా…. (జీ జీ వా జీ – 3)

Posted in జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, Uncategorized at 7:34 సా. by వసుంధర

(అగస్త్య మహాముని – తన కడుపులో ఉన్న వాతాపి అనే మహారాక్షసుణ్ణి జీర్ణించుకుందుకు వాడిన మంత్రం ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’.  పిల్లలకు తిన్న పదార్థం సులభంగా అరగడానికి తల్లులు ఈ మంత్రాన్ని వాడడం ఆచారంగా వస్తోంది.  మన పురాణాల్లోని ఈ కథను క్రింద ఇస్తున్నాం. లంకె కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఇప్పుడీ కథ ఎందుకంటే – నేడు సాంఘికంగా జరిగే ఎన్నో విశేషాలు సామాన్య పౌరులకు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆ విశేషాల్ని ఒకటొక్కటిగా చెప్పుకుని – ఈ మంత్రం పఠించదం మినహా ప్రస్తుతానికి మనం చెయ్యగలిగినదేమీ లేదు. 

ఈ శీర్షికకు తగిన విశేషాల్ని ఎవరైనా కథారూపంలో పంపవచ్చు. బాగున్నవి యథాతథంగానో, అవసరమనిపిస్తే ఆ మేరకు సరిచేసి కానీ అక్షరజాలంలో ప్రచురించగలం)

శ్రవణ్ కుమార్ తెలుగు చిత్రసీమలో పెద్ద హీరో. అతడికోసం ప్రాణాలు కూడా ఇచ్చే అభిమానులున్నారు. అతడి కొత్త చిత్రం విడుదలైతే టికెట్లకోసం తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు.

శ్రవణ్ కుమార్‍వి ఉన్నతాశయాలు. సామాన్యుడిగా పుట్టిన తను అసామాన్యుడిగా వెలిగి పోతూ, వైభవ జీవితాన్ని గడపడానికి కారణం జనమేనని అతడికి తెలుసు. ఆ జనం కోసం ఏదైనా చెయ్యాలన్న ఆలోచన అతడికి వచ్చింది. అందుకు రాజకీయాలే అనువు కాబట్టి కొత్త పార్టీ పెట్టాలనుకున్నాడు.

అప్పటికే రాష్ట్రంలో చాలా పార్టీలున్నాయి. వాటికి భిన్నంగా ఉండాలంటే – కొత్త నినాదం ఉండాలనుకున్నాడు. ‘నేను బలహీన వర్గాల ప్రతినిధిని, అందరికీ సమానావకాశాల కోసం కృషి చేస్తాను’ అని అతడు ప్రకటించగానే జనంలో కొత్త ఉత్సాహం వచ్చింది.

కొత్త పార్టీ కార్యకలాపాలకోసం అతడొక కార్యాచరణ కమిటీ వేశాడు. ఆ కమిటీ కొద్ది నెలల పాటు చర్చించి చర్చించి ఓ ప్రణాళిక రూపొందించింది. ఆ వివరాలు వినిపించడానికి కమిటీ అధ్యక్షుడు దిలీప్ శ్రవణ్ కుమార్‍ని కలవడానికి వెళ్లాడు. అతడికి వివరాలు వినిపించి, ”ఇంతవరకూ ఎన్నో పార్టీలు వచ్చాయి. వేటికీ చిత్తశుద్ధి లేదు. అందుకే జనంలో బలహీనులు బలహీనులుగానే ఉండిపోతున్నారు. అందరికీ సమానావకాశాలు రావడం లేదు. మన పార్టీ ఆ లోటు తప్పక తీర్చగలదన్న నమ్మకం కలిగించేలా ఈ ప్రణాళిక రూపొందింది. మనకే అధికారం వస్తే – ఏడాదిలోగానే అందరికీ సమానావకాశాలు కలిగించగలం” అని ఇంకా ఏదో చెబుతుండగా – అక్కడికి జనార్దన్ వచ్చాడు.

శ్రవణ్ కుమార్‍ కొత్త సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ ఏర్పాట్లు చూడ్డానికి వేసిన కమిటీ అధ్యక్షుడు జనార్దన్.

“అన్నీ సవ్యమే కదా!” అన్నాడు శ్రవణ్ కుమార్.

“సవ్యమే కానీ – ప్రస్తుతం రెండు చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. గ్యాప్ లేకుండా ఇంకో రెండు వారాలు ఆడితే మంచి లాభాలు తీస్తాయి. మన సినిమా విడుదలైనా కూడా తమ కోసం కొన్ని థియేటర్లు వదలమని ఆ నిర్మాతలు అడుగుతున్నారు సార్!” అన్నాడు జనార్దన్.

“దానికి మీరేమన్నారు?”

“మా శ్రవణ్ కుమార్ సినిమా విడుదలైతే కనీసం రెండు రోజులు ఏ థియేటర్లోనూ ఆ సినిమా తప్ప మరొకటి ఆడకూడదు. అది నియమం కాదు, శాసనం – అని ఖచ్చితంగా చెప్పాను”

“గుడ్” అని గర్వంగా నవ్వి దిలీప్ వైపు తిరిగి, “ఇందాకా మనమెక్కడున్నాం” అన్నాడు శ్రవణ్ కుమార్.

“బలహీనుల ప్రతినిధిగా మీరు స్థాపించనున్న కొత్త పార్టీ ఆశయాలు…..”

అతడేం చెబుతున్నాడో మీకు తెలుసు. సగటు పౌరులారా – జీర్ణించుకోవడం కష్టంగా ఉందా? జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకోండి.

Leave a Reply

%d bloggers like this: