Site icon వసుంధర అక్షరజాలం

ఓ ‘నిముషం’ కథ

గూగుల్ గ్రూప్ తెలుగు మాట సౌజన్యంతో

తెలుగులో నిముషం అనే మాట త్రేతాయుగం కాలానికి లేదన్న భావనతో – లవకుశ (1963) చిత్రంలో ‘ఏ నిముషానికి ఏమి జరుగునో’ అన్న పాటలో నిముషం పదాన్ని ప్రయోగించినందుకు గేయ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరిని తప్పు పడుతూ ఆంధ్రభూమి దినపత్రికలో ఓ వ్యాసం వచ్చింది. నిముషం సంస్కృత పదమంటూ దానికి వివరణ ఇచ్చారు మరొకరు. భాష గురించి ఈ మాత్రం ఆలోచన ఉండడాన్ని అభినందిస్తూ – ఆ రెండింటినీ ఇక్కడ అందిస్తున్నాం.

చిన్న పదం.. పెద్ద తప్పు!

ఆంధ్రభూమి వ్యాసం
Published Saturday, 21 April 2018

స్వర్ణయుగ కాలంలో అంటే దాదాపు 60 సంవత్సరముల క్రిందట ‘నందమూరి తారక రామారావు- అంజలిదేవి’ నటించిన చిత్రం ‘లవకుశ’. అప్పట్లో ఆ చిత్రం అఖండ విజయం సాధించి, తెలుగు చలనచిత్ర రంగంలో ఓ మైలురాయిగా నిలచిపోయింది. ఆ చిత్రంలో ‘‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు’’ అనే గొప్ప గీతం భవిష్యత్ గురించి వివరిస్తుంది. (క్షమించండి రచయిత పేరు గుర్తులేదు) ఆ గీత రచనలో రచయిత ‘నిమిషం’అనే పదం వాడారు. ఆ పదం గురించి విశే్లషణ చూద్దాం. రామాయణం ‘త్రేతాయుగ’ కాలంలో జరిగిందని చదువుకున్నాం, విన్నాం. ‘నిమిషం’ అనే పదప్రయోగం ‘తప్పా-వొప్పా’అన్న విషయం గురించి చూద్దాం. ‘నిమిషం’అనే పదం అప్పటి త్రేతాయుగ కాలంలో వుందా? ఎక్కడైనా అప్పటి రచయితలు ఆ పదం వాడారా? పురాణాలలో- ఇతిహాసాలలో ఆ పదమెక్కడైనా వుందా? వాడినారా? మరి మన సినీ రచయిత ‘‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు’’అంటూ ఆ పదం వినియోగించడం జరిగింది. ఆ పదం పొరపాటు పదమా కాదా అన్నది చర్చనీయాంశం. (ఆ మహారచయితను కించపరచడం కాదు.. ఆ పద వినియోగం తప్పని మాత్రం నేననుకుంటున్నాను) నిమిషం అనే పదం అప్పటిది కాదు, అప్పట్లో ఆ పదం లేదన్నది వాస్తవం. ‘ఘడియ, విఘడియ’అనే పదాలు తప్ప‘నిమిషం’ అనే పదం లేదు. కృతయుగం (సత్య హరిశ్చంద్రుని కాలం), త్రేతాయుగం (రామాయణ కాలం), ద్వాపర యుగా(మహాభారతం కాలం)లలో ‘నిమిషం’అనే పదం కనిపించదు. మరి పై గీత రచనలో రచయిత తెలిసి వ్రాశారా? తెలియక వ్రాశారో మనకు తెలియదు.
అప్పట్లో సమయమును పలు పదాలతో సంభాషించుకునేవారు, పలు పదములను వాడుకునేవారు. ‘‘సూర్యోదయవేళ, సూర్యాస్థమయ వేళ, చంద్రోదయ వేళ, చీకటి పడకముందే, వేకువన (వేకువ జామున) తొలిజాము, మలిజాము, వేగుచుక్క పొడిచేవేళ, మసక చీకటి వేళ, నిశాచర వేళ (అంటే క్రూర జంతువులు, దెయ్యాలు, భూతాలు తిరుగువేళ- అర్ధరాత్రి అని అర్ధం), పొద్దువాలకముందే, పొద్దు గుంకక ముందే, పొద్దుపొడిచే వేళ, సంధ్యవాలగనే, సంధ్యాసమయం, నడిరేయి, పున్నమివేళ, గోధూళివేళ’ యిలాంటి పద వినియోగం ద్వారా సమయాన్ని నిర్ధారించుకునేవారు. అప్పట్లో ‘కుక్కుటము’అంటే ‘కోడి’అనే సాకుడు పక్షి లేనందున ‘కోడి కూత’అనే ప్రశ్న ఉదయించలేదు. ఎవరూ ఆ కోడి అనే పదం వాడలేదు, వినియోగించలేదు. త్రేతాయుగ కాలంలో రామాయణంలో కాని, ప్రబంధాలలో కానీ, యితిహాసాలలో కాని, పురాణాలలో కాని, వారు చెప్పుకునే వీరగాథలలో కాని, అప్పటి సామాన్య ప్రజలలోగాని సమయంకోసం పై కనిన పదములను వాడేవారు. ‘నిమిషం’ అనే పదం అప్పట్లో లేదన్నది వాస్తవం. మనిషి నవీన యుగంలో సాంకేతిక విజ్ఞాన ఆరంభంలో వాచ్(గడియారం) కనిపెట్టిన పిదప సెకన్, మినిట్, హవర్ అను ఆంగ్ల పదములను మనం తర్జుమా చేసికుని, నిమిషం, గంట అని వాడుకుంటున్నాము. ‘సెకెండ్’కు (తెలుగులో ఆ పదానికి మరో పదం సృష్టంచ బడలేదు) అదే ఆంగ్ల పదాన్ని వాడుచున్నాము. ‘హవర్’అనే పదానికి మాత్రం ‘గంట’అనే పదం సృష్టించబడినది.
అలాగే ‘మినిట్’అనే ఆంగ్ల పదానికి ‘నిమిషం’అనే తెలుగు పదం వాడుకకు తెచ్చారు. అలా ‘నిమిషం, గంట’ అనే తెలుగు పదాలు వాడుకకు వచ్చాయి. మన తెలుగు మేధావులు ‘సెకన్’ (సెకెండ్) అను ఆంగ్ల పదానికి తెలుగులో మరో పదం కనిపెట్టలేక పోయినందున ఆ ఆంగ్ల పదానే్న వాడుచున్నాము. ‘సెకండ్’అనే పదానికి ‘క్షణం’ అనే పదం వాడుచ్నుము, ఆ పదానికదే అర్ధమని వాదించేవారున్నారు. ‘సెకండ్’ అనే పదానికి ‘క్షణం’ అనే పదం సరికాదు, దానికిది తెలుగు పదం అసలే కాదు. ‘క్షణం’ అంటే వెంటనే, వెనువెంటనే, ఆలస్యం లేకుండా అనే అర్థాల పదం. అందువలన సెకండ్‌కు క్షణానికి సంబంధమే లేదు. ‘జగదేకవీరుని కథ’ చిత్రంలో అందాల హరివిల్లు బి.సరోజాదేవి, ఎన్‌టిఆర్‌లు కలసి ఆలపించే మధుర యుగళ గీతం ‘ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసి’ గానంలో రచయత ‘నిన్ను చూసిన నిమిషమందే మనసు నీ వశమైనది’ అంటూ రచనలో ‘నిమిషం’అనే పదం వ్రాసి పప్పులో కాలువేశాడనుకుంటాను. పూర్వం జానపద కథలలో(ఊహాకథ అయినప్పటికి) ‘నిమిషం’అనే పదం సంభాషణల్లోను, రచయితల కవిత్వాలలో కాని ‘నిమిషం’ అనే పదం వాడుకలో లేదు. కనిపించలేదు.‘ఏ క్షణానికి ఏమిజరుగునో ఎవరూహించెదరు’, ‘నిను చూసిన క్షణమందే మనసు నీ వశమైనది’అని ఆ రచయితలు చూపించ(వ్రాసి) వలసి వుంటున్నది. ‘నిమిషం’అనే పదం బదులు ‘క్షణం’అనే పదం వ్రాయాలి, ఆ పదమచట వుండి తీరాలి. కావున ఈ రెండు గీతాల రచయితలు చిన్న పదం వ్రాయుటలో పెద్ద తప్పు (పొరపాటు) చేశారన్నది నా వాదన. దాదాపు తెలుగు గీత రచయితలందరూ గొప్పవారే. మహాకవులే. సరస్వతిదేవి కటాక్షం పొందినవారే. కాని అప్పుడప్పుడు యిలాంటి చిన్న పొరపాట్లు జరగడం మామూలే. కావాలని ఎవరూ చెత్తగా రచనలు చేయరు. ఈ ‘నిమిషం’అనే పదం అనుకోని రీతిలో వారు వాడడం జరిగి వుంటుందని, లేదా నేటి సామాన్య ప్రేక్షకులకు అర్ధంకావలయుననే తలంపుతో ఆ పదం వాడడం జరిగి వుండవచ్చు కూడ. సరే ఏదిఏమైన ఆ చిన్న పొరపాటు భావార్థం యుగాలను దాటి వెళ్లడం సమంజసంకాదు. మహామహులైన తప్పు చేయడం మానవ సహజమే. మనిషి కాబట్టి పొరపాటు చేస్తాడని సర్దుకు పోవలసిందే. కోట్ల పారితోషికం అందుకునే నేటి టాలీవుడ్ రచయితలు సాహిత్యపు రచనలు చేస్తే బావుంటుంది. ‘చీమ-చీమ’, ‘బకర-బకర’, ‘చాయ్ చాయ్’, ‘సుబ్బలక్ష్మి’, ‘వానదేవుడా’లాంటి చెత్త పదాల గీతాలు వ్రాసి సాహిత్యానికి తూట్లుపొడవకండి. ‘నీ ముఖారవిందం కనిన నెలరేడు మేఘాలమాటు చేరాడు సిగ్గుతో’లాంటి అర్థ రచనలు చేస్తే గీతాలు పది కాలాలపాటు ప్రేక్షకుల పెదవులపై కదలాడుతూ జీవిస్తాయి. ఏమంటారు!

                                                                                                                                  -మురహరి ఆనందరావు

Exit mobile version