ఏప్రిల్ 30, 2018

రంగస్థలం – ఒక స్పందన

Posted in వెండి తెర ముచ్చట్లు at 8:22 సా. by వసుంధర

rangasthalam poster.jpg

బొమ్మకు లంకె

చిత్ర సమీక్ష

ట్రైలర్

ఈ చిత్రం ఈ మార్చి 30న విడుదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే పాతకాలపు – రోజులు మారాయి, నమ్మినబంటువగైరా చిత్రాల్లా బాగుంది.

సుకుమార్ సమకూర్చుకున్న కథలో కొంచెం కొత్తదనమున్నా- లోతు తక్కువ. కథనం కూడా బాగున్నా –  కొన్ని సన్నివేశాల్లో బలంకంటే సృజనకే ప్రాధాన్యం. అందువల్ల విలన్ – ఇంటికొచ్చి మంచినీళ్లు తాగినవాళ్లని గ్లాసు  కడిగి వెళ్లమనడం, తన ఇంటిముందునుంచి వెడితే జోళ్లు విప్పాలనడం – వంటి బలమైన సన్నివేశాలు కూడా తేలిపోయాయి. 1980ల నాటి గ్రామీణ వాతావరణాన్ని సృజించడం కష్టమే ఐనా సాధించగలిగారు. ముగింపులో సస్పెన్సు నవలలంత గొప్ప మలుపు మూడు గంటల సినిమాను కూడా చివరి క్షణం దాకా ఆసక్తికరం చేసింది. మొత్తంమీద కథ పేలవమే అనిపిస్తుంది కానీ కథనం కథని బ్రతికించింది. తార్కికంగా సుకుమార్ స్థాయి లేదు.

దర్శకుడు ప్రతి పాత్రధారినుంచీ అత్యుత్తమ నటనను రాబట్టారు. నటీనటులందరూ పాత్రలకు జీవం పోశారు. విలక్షణమైన పాత్రలోరామ్‍చరణ్ ఒప్పించాడు. ఐతే గోదావరి యాస పలకడంలో చిరంజీవి (ప్రాణం ఖరీదు) సౌలభ్యం లేదు. నటనలో కూడా హావభావాల్లోని లోపాన్ని గెడ్డం కొంత సరిచేసింది. అతడి నటజీవితంలో ఇది గుర్తుంచుకోతగిన పాత్ర. అభిమానులకైతే చితగ్గొట్టేశాడని కూడా అనిపించింది.

పల్లెటూరి అమ్మాయి పాత్రలో సమంత ముద్దుగా ఉంది. పట్నవాసం తప్ప తెలియని అమ్మాయి వేసిన ఫ్యాన్సీ డ్రస్సులా ఉన్నా – ఆమె ముచ్చటగానే అనిపిస్తుంది. ఆమె గొప్పగా నటించిందని అభిప్రాయపడేవాళ్లున్నారు. 

రంగమ్మత్త పాత్ర దర్శకుని సృజనాత్మకతకు నిదర్శనం. పల్లెటూరి యాసలో మాట్లాడినా ఆధునిక పోకడలో కనిపించే అలాంటివారు పల్లెటూళ్లలో ఉన్నారు. కొద్దిగా విషాదం పులిమిన ఆ రసవత్తర పాత్రకి అనసూయ ఎంపికని మెచ్చుకోవాలి. 

ఈ చిత్రానికి సాహిత్య, సంగీత, చిత్రీకరణ పరంగా ప్రత్యేకమైన అందాన్నిచ్చినవి పాటలు. వాటిలో ఎంత సక్కగున్నావే ఒక అద్భుతం. ఆ తర్వాత రంగమ్మా మంగమ్మా ఒక మనోహరం.

గొప్ప సినిమా అనలేం కానీ – చూసేక చాలా సంతృప్తిగా అనిపిస్తుంది.  నిర్మాత, దర్శకులు, నటీనటులు, తదితర సాంకేతక బృందం – అంతా అభినందనీయులు. 

 

 

 

 

Leave a Reply

%d bloggers like this: