మే 6, 2018

భరత్ అనే నేను – ఒక స్పందన

Posted in వెండి తెర ముచ్చట్లు, Uncategorized at 9:29 సా. by వసుంధర

bharat-ane-nenu poster

బొమ్మకు లంకె

చిత్రసమీక్ష

ట్రైలర్

అతినీతిపరుడికి అధికారం చేతిలో ఉంటే ఒక్కరోజులో అవినీతిని ఎలా అణిచెయ్యొచ్చో చెప్పింది గతంలో ఒకేఒక్కడు చిత్రం. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన అతినీతిపరుడు అవినీతిని ఎదుర్కొనే సమస్యల్ని వాస్తవంగా ప్రదర్శించింది లీడర్ చిత్రం. ఇలాంటి చిత్రాల కోవలోకే వస్తుంది ఈ ఏప్రిల్ 20న విడుదలైన భరత్ అనే నేను చిత్రం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హఠాన్మరణం చెందడంతో – నాయకత్వం కోసం పోరాటం మొదలై ఆ పార్టీ రెండుగా చీలిపోయే పరిస్థితి వచ్చింది. పార్టీని నడిపే నానాజీ ఈ సమస్యని పరిష్కరించడానికి – లండన్లో డిగ్రీలమీద డిగ్రీలు చదివేస్తూ I don’t know అని పాడుకుంటూండే భరత్‍ని ఇండియా రప్పిస్తాడు. అతడు ముఖ్యమంత్రి కొడుకు. చదువు తప్ప మరే విషయంమీదా ఆసక్తి లేని భరత్ అనాసక్తంగానే ఆ పదవిని చేపట్టాడు. ఏదైనా ప్రమాణం చేస్తే మాట తప్పకూడదని చిన్నప్పుడు తల్లి చేసిన ప్రబోధం అతడికి బాగా వంటబట్టింది. అందువల్ల ‘భరత్ అనే నేను’ అంటూ పదవికి ప్రమాణస్వీకారం చేసినప్పుడు – ఆ ప్రమాణానికి కట్టుబడి చిత్తశుద్ధితో బాధ్యతను నిర్వహించడం మొదలెట్టాడు. అందువల్ల అతడు సీనియర్ నేతల గుప్పెట్లో ఇమడలేదు సరికదా –  అధిష్ఠానాన్ని ఎదిరించడానికి కూడా వెనుకాడలేదు.

ప్రజలు అమాయకులు, బాధ్యతారాహిత్యానికి అలవాటుపడ్డవారు. నేతలు అవకాశవాదులు. రాష్ట్రమంతా అవినీతి. రాజకీయమంతా కుట్రలు, దగా, మోసం, దౌర్జన్యం, స్వార్థం.

తలచుకుంటే ఈ సమస్యలకి పరిష్కారం ఎంత సులభమో నేతలకే కాదు, అమాయకులనుకునే ప్రజలందరికీ కూడా తెలుసు. అది నిరూపించడమే ఈ చిత్రంలో భరత్ ఆశయం.

మచ్చుకి ట్రాపిక్ నియమోల్లంఘన, అవివీతిపరుల అమితబలం వంటి అంశాలను తీసుకున్న గొప్ప ప్రయోజనాత్మక సందేశాన్ని అందించిన చిత్రమిది. చిత్రం చూసినవారికి ఏమనిపిస్తుందంటే –

కథ కొత్తది కాదు. ఐనా మళ్లీ మళ్లీ చెప్పొచ్చు.

సమస్యల పరిష్కారాలు చూపించినంత సులభం కాదు. ఐనా ఓసారి వెన్ను తట్టి మందలించడానికి పనికొస్తాయి.

భరత్ అనే నేను – అన్న టైటిల్ ప్రమాణస్వీకారాన్ని ఎంత సీరియస్‍గా తీసుకోవాలో చెబుతుంది. చేసిన వాగ్దానాలనే మరుక్షణంలో మర్చిపోయే నాయకులకిది హెచ్చరిక. చిత్రానికి ఇంత మంచి పేరు పెట్టడం అభినందనీయం.

భరత్‍గా మహేష్ బాబు – చాలా హుందాగా ఉన్నాడు. తనకోసమే సినిమా చూడాలనిపించేటంత గొప్పగా ఉన్నాడు. కానీ ముఖంలో అణకువకంటే, అహం ఎక్కువ కనబడింది. ఐనా అభిమానులు కోరుకునేది అదే అని సరిపెట్టుకోవచ్చు. అలా సరిపెట్టుకుంటే – పాటల్లో డాన్సులు, ఫైట్లలో ఒక్కడు వందమందిని కొట్టడం కూడా ఓకే.

కెయిరా అద్వానీ ఎంబియ్యే చదివినా – హీరో తనని పెళ్లి చేసుకుంటాననడం ఒక గొప్ప వరంగా భావించడంవల్ల వ్యక్తిత్వం లేని మనిషి అనిపిస్తుంది. పాత్ర అలంకార ప్రాయమే ఐనా – అందంతోపాటు నటనా ప్రతిభ కూడా ఉన్నట్లు అనిపించడం విశేషం.

హీరో హీరోయిన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంలో ఉన్నప్పుడు – వారి ప్రేమ వ్యవహారం బయటపడ్డం ముఖ్యమంత్రి రాజీనామాకి దారి తియ్యాలా అనిపిస్తుంది. మన మీడియా అంత చిన్న విషయాన్ని కూడా పెద్దది చేస్తుందని దర్శకుని ఉద్దేశ్యమని సరిపెట్టుకోవచ్చు.

నానాజీ పాత్రచిత్రణ, నానాజీగా ప్రకాష్‍రాజ్ పాత్రపోషణ అద్భుతం. ఉన్నది కొన్ని క్షణాలే ఐనా భరత్ తల్లిగా ఆమని ఓ మెరుపులా పెరిసింది. చిత్రంలోని నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.

ఇందులో చూపించిన అసెంబ్లీ సన్నివేశాలు, మీడియాలో big debate పేరిట జరిగే వ్యర్థ చర్చలు – వగైరాల చిత్రీకరణ కొందరికి చెంపపెట్టు. ఇందులో కనిపించే ఓ అవినీతి కుటుంబం సమకాలీనుల్ని గుర్తు చేస్తుంది. ముఖ్యమంత్రి హఠాన్మరణపు సన్నివేశం – తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇలాగే చనిపోయిందా అన్న భావాన్ని కలిగిస్తుంది.

ఇది తెలుగువారి కథ. పాత్రల్లో, సన్నివేశాల్లో, మాటల్లో కనిపించిన తెలుగుతనం – పాటల్లో ఏకోశానా లేకపోవడం విచారించాల్సిన విషయం. ప్రేక్షకులు అలాంటి సంగీతమే కోరుకుంటారని సరిపెట్టుకుందామంటే – అమిత ఆదరణ పొందిన రంగస్థలం చిత్రంలో పాటలు ఒప్పుకోనివ్వడం లేదు.

కథలో కొత్తదనం లేకపోయినా, కథనంలో లోతు లోపించినా – 173 నిముషాల చిత్రం అన్ని నిముషాలూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతినిస్తుంది. నిర్మాతనీ, దర్శకుణ్ణీ, నటీనటుల్నీ అభినందించాలనిపిస్తుంది. మహేష్‍బాబుమీద అభిమానం కలిగిస్తుంది. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి కానీ – అస్తమానూ ఇలాగే మాత్రం కాదుసుమా అనిపిస్తుంది.

3 వ్యాఖ్యలు »

  1. Viswa said,

    విశ్లేషణ బాగుంది. Just OK movie. నీతిపరుడు అని వ్రాయబోయి అవినీతిపరుడు అని వ్రాసారు.. సరిదిద్ధుకోండి.

    • మీ స్పందనకు ధన్యవాదాలు. పొరపాటున అవినీతిపరుడు అన్న పదం ఎక్కడ దొర్లిందో తెలియజెయ్యగలరు. అతినీతిపరుడు అన్న పదాన్ని మీరు అవినీతిపరుడిగా భ్రమపడ్డారా?

  2. Anon said,

    Stone faced mahesh babu either underacts or overacts. In comedy scenes.


Leave a Reply

%d bloggers like this: