మే 22, 2018

పుస్తక పరిచయం – కప్పస్తంభం

Posted in పుస్తకాలు, Uncategorized at 10:58 ఉద. by వసుంధర

గూగుల్ గ్రూప్ తెలుగు మాట సౌజన్యంతో

kappastaMbhaM

కన్యాశుల్కం వినేవరకూ, ఇష్టపడి చదివేేవరకూ ఓ వైపు అలాంటి పలుకుబడి వుంటుందని నాకు తెలియదు. నక్క పుట్టి నాలుగు వారాలే కాలేదు.. నేనింత గాలివాన యెరగనన్నదట..! ఆబోరు దక్కదు, రొకాయించడం, మరి బుర్ర గొరిగించుకుందామంటే చేతిలో దమ్మిడీ లేదు, ఫెడేల్మంటే పస్తాయించి చూస్తున్నా, కనిస్టీబు ఇంకా గిర్రడనే గిరీశం, మధురవాణీ- ఆవిడ మాటలూ మొత్తానికి ఆ నాటకం తెలుగొచ్చిన వారందరికీ వెర్రెక్కించింది. కళింగాంధ్ర పచ్చి మాండలికం సింహాచలం సంపెంగల్ని, పలాస జీడిపప్పుల్ని మరిపించింది. నాకే గనక అధికారం వుంటే విజయనగరం చౌరాస్తాలో మధురవాణి కాంస్య విగ్రహం పెట్టిస్తానని నండూరి రామ్మోహనరావు అడపా తడపా డిక్లేర్‌ చేస్తుండేవారు. అదొక వెర్రి వ్యామోహం.
ఈ వినాయకస్తవం అయిపోయాక మనం ఇప్పుడు మాట్లాడుకోవల్సింది చింతకింది శ్రీనివాసరావు ‘కప్పస్తంభం’ కథా సంపుటి గురించి.. సింహాచలం దేవుడికెంత పేరు, ప్రతిష్ట ఉన్నాయో కప్పస్తంభానికి కూడా అంతటి మహత్తుంది. ఇంతా చేసి అది ఆలయంలో ఒకానొక స్తంభం. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, కష్టం చెప్పుకుని కడతేర్చమంటే చాలు… కష్టాలీడేరతాయని భక్తకోటి విశ్వాసం. వున్నట్టుండి అలాంటి స్తంభం మాయమైంది. ‘విషయమంతా ఆ నోటా ఈ నోటా అడవివరం పాకిపోయింది. గోపాలపట్నం తెలిసిపోయింది. పెందుర్తి చేరిపోయింది. చోడారం, మాడుగుల, పాడేరు దాటేసింది. విశాఖ నగరమంతా అల్లేసింది. ఉత్తరాంధ్ర ముట్టుకుపోయింది. ఒరిస్సా అంటుకుపోయింది. హైదరాబాద్‌ అగ్గయిపోయింది’- అని వర్ణిస్తాడు కథారచయిత. మాయవార్త సర్వత్రా వ్యాపించిందని మూడు ముక్కల్లో సరిపెట్టచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే కథనశిల్పం తళుక్కుమంటుంది. ఇక్కడే, రెండు పేరాలు దాటాక- పత్రికా విలేకరుల్లో కొద్దిమంది భక్తులూ వున్నారు. వారూ కప్పస్తంభాన్ని కౌగిలించుకుని కోర్కెలు చెప్పుకునే అలవాటున్న వారే. వారంతా ఇప్పుడు గుళ్లో తామెవర్ని లేదా ఏ రాయిని కౌగలించుకోవాలో చెప్పి తీరాలని ఎగ్జుక్యూటివ్‌ ఆఫీసర్‌ని నిలదీసినట్టుగా అడుగుతున్నారు. వారి ఆందోళన పసిగట్టిన ఆలయంలోని మహిళా సిబ్బంది, ఎందుకయినా మంచిదని కొంగులు కప్పుకుని వారున్న చోటునించి దూరంగా పోతున్నారు’- అంటూ విడమర్చారు. ఇక్కడ వ్యంగ్యం వుంది. స్వజాతి మీద విసురుంది. ఇంతటి విపత్తు వేళలోనూ కొంటెతనం వుంది. చక్రపొంగలిలో జీడిపలుకుల్లాగ యిలాంటి పలుకులు కథ రుచిని పెంచుతాయి. ఇంతకీ కప్పస్తంభం ఆచూకీ దొరికిందా? తిరిగి సర్వశక్తులతో ఆ దివ్యస్తంభం యథాస్థానానికి వచ్చి చేరిందా? ఈ వైష్ణవ మాయను ఛేదించాలంటే ‘కప్పస్తంభం’ కథ కొసంటా చదవాల్సిందే!
‘లండనోడు’ కథ ఊహాతీతంగా వుంది. మూడు తరాల కథ. మనదేశ చరిత్రతోనూ ఆనాటి పేరు మోసిన దొరలతోనూ ఇతివృత్తం ముడిపడి వుంది. అల్లూరి సీతారామరాజు, మన్నెం పితూరీ, అక్కడి పరగణాలు వినవస్తాయి. లండనోడి ధైర్యం వల్ల, దయవల్ల ఆ ఊరు ప్రాణాలతో నిలిచింది. ఆ పాత్ర చదువరుల మనసుల్లో నిలిచి వుంటుంది. ఇలాంటి కథల్ని అల్లడం కష్టం. చెప్పడమూ కష్టమే. ‘బుక్కావీధి’ చదువరులకు వ్యక్తిగతంగా తోస్తుంది. ఒకనాటి వ్యవస్థ, సంస్కారవంతులు, సంస్కర్తలు నిరసించిన వ్యవస్థ అది. బుక్కావీధిలో సంచరిస్తూ కథకుడు తాతగారిని పరిశోధించాడు. కళావంతుల వెలుగురేఖయిన నాగరత్నమ్మ నాయనమ్మగా శోధనలో తేలింది. మామ్మ కాలం చేసింది. తెగించి, ఇష్టంతో నానమ్మ పాడెకు భుజం కలుపుతాడు. అంతా రుణానుబంధం అనుకున్నాడు. ఆమె ఆఖరి మజిలీలో చేయి కలిపి, రుణం తీర్చుకోవడంతో పాటు, ఆ సంప్రదాయపు జ్ఞాపకాలకు ముగింపు పలికాడనుకోవచ్చు.
వృత్తిధర్మంగా ఎందరో కళింగాంధ్ర కథకుల్ని దగ్గరగా పరిశీలించే భాగ్యం కలిగింది. కారా మాష్టారు, రావిశాస్త్రి, పతంజలి, భమిడిపాటి రామగోపాలం, చాసో యింకా శ్రీ శ్రీ, ఆరుద్ర సరేసరి. అందరికీ ప్రాంతీయాభిమానం మహాలావు. డాక్టర్‌ గూటాల కృష్ణమూర్తి విజీనగరం తెలుగు యాసతో వెళ్లి యూరప్‌ని ఆక్రమించారు. ఎయిటీన్‌ నైంటీస్‌ క్లబ్‌ స్థాపించి, ప్రపంచంలో చాలామంది గొప్పవాళ్లు ఈ దశకంలోనే పుట్టారని పేద్ద జాబితా తయారుచేశారు. శ్రీశ్రీని, పురిపండాని లండన్‌లో నెలల తరబడి భరించి, మహాప్రస్థానం చేరాత ప్రతిని (ఫాసిమైల్‌ ఎడిషన్‌) రూపొందింప చేశారు. వీళ్లందరికీ పరమ లోకల్‌ ఫీలింగ్‌! ఇదిగో చింతకింది శ్రీనివాసరావు కూడా ఇందుకు మినహాయింపు కాదు. భూషణం నించి ఇక్కడి వాగ్భూషణాలన్నీ అసమాన్య ప్రతిభామూర్తులు. నివురు గప్పిన నిప్పులు. కనకనే కదా ఉగ్రాన్ని నిత్యం గంధపు పూతలతో సాంత్వన పరుస్తారు! ఉత్తరాంధ్ర అంటేనే అంత. ఓ కథలో ‘ముఖం సిగ్గు బిళ్లంత అయింది’ అనే ఉపమానం వాడారు చింతకింది. పరమ సంతోషమైంది! పైగా ఉపమానం పోలీసు మీద పడడంతో మరింత రక్తికట్టింది. ‘పాపం పాకావిలాస్‌’ ఒక స్కెచ్‌. వాళ్ల ప్రాంతం, వాళ్ల వూరు లోకల్‌ రుచుల్ని పోగొట్టుకున్న తీరు చెప్పి బాధపడ్డారు శ్రీనివాసరావు. ‘సన్నటి మిణుగురు’ ఒక అబ్జర్వేషన్‌. ఒక ఆవేదన. కాని ఏ ఒక్కర్నీ తప్పుపట్టలేం. కళ్లజోడు, కాళ్లజోడు లేకుండానైనా చరించగలరు గాని, సెల్‌ఫోన్‌ లేకుండా మనజాలరు. డాక్టర్లు, లాయర్లు నిమిషం పాటు క్లయింటు గోడు పట్టించుకోలేకపోతున్నారు. బైకుల మీద వెళ్లేవారు మెడమీద తలవాల్చి వెళ్తున్నారు. ‘ఈ దరిద్రం వచ్చాక యీ కాలం పిల్లలు కొసాకి శోభనం మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నారని’ ఆ మధ్య అరవపల్లి అప్పల్నాయుడు తెగ రోసిపోయాడు. ‘పుంజీడు’ మాటవిని ప్రాణం లేచొచ్చింది. పుంజీడంటే నాలుగు. మిరపకాయల్లాంటి చేబదుళ్లు పుంజీల్లెఖ్ఖన తీసుకుంటారు. చింతగింజలాటలో పుంజీలు బాగా వినిపించేవి.
‘మాట్లు’ కథలో జీవం వుంది. వాళ్లు వూళ్లోకి వస్తే సందడే సందడి. మూల పారేసిన ఇత్తడి, రాగి జర్మన్‌ సిల్వర్‌ శాల్తీలన్నీ ఒక్కసారి వెలుగులోకి వచ్చేవి. మాట్ల కార్ఖానా వూరికి మంచి కాలక్షేపంగా మారేది. వాళ్లు వెళ్లగానే వూరు బావురుమనేది. స్టెయిన్‌స్టీల్‌ దాడితో మాట్ల వాళ్లు డీలా పడ్డారు. ప్లాస్టిక్‌ వచ్చాక ఆ వృత్తే పోయింది. నిజంగా జరిగిన సంఘటనలా తోస్తుంది. ‘రికాడ్డేన్స్‌’లో వాతావరణం కళ్లకు కట్టినట్టుంది. కథ చదువుతుంటే అలనాటి సురభి ట్రూపులు, కూచిపూడి భాగవతుల సంప్రదాయాలు గుర్తొస్తాయి. అశ్లీలం, అసభ్యమెరగని ఒక డ్యాన్స్‌ ట్రూపు పోలీసు దాష్టీకాలకు ఎలా బలైపోయిందో సహజ సుందరంగా చెప్పారు. సీతమ్మ తల్లి లంకలో ఖండవస్త్రగా అనేక ఇడుములు అనుభవించిందని ప్రవచనకారుడు తెగ బాధ పడుతుంటే, గుడిమెట్ల మీది ముష్ఠి నీలమ్మ తీవ్రంగా విభేదించింది. అదేమంత శోకం కాదని వాదిస్తుంది. ఔను, పాపం నీలమ్మ జీవితమంతా ఖండవస్త్రగానే గడిచింది. ఈ కథలో రచయిత నీలమ్మలో చేరిపోయాడు. ‘మా నరస కనిపించిందా!’ కరుణ రసార్ద్రంగా సాగింది. ఎందుకిలాంటి కథల్రాసి మనశ్శాంతి పోగొడతారని రైటర్‌ని కోప్పడాలనిపిస్తుంది.
బంగారం వుండాలే గాని స్వర్ణశిల్పి ఏ నగనైనా చెక్కి అందించగలడు. ఊహ, పలుకుబడి పుష్కలంగా వున్న శ్రీనివాసరావు కథ, కవిత్వం, నాటకం, వ్యాసం ఏది రాసినా వాటిలో పనితనం వుండే తీరుతుంది. వాక్య నిర్మాణంలో, నేతలో ఉత్తరాంధ్రత్వం గుబాళిస్తుంది. తన వూరిని తన వారిని ప్రేమించేవాడు మాత్రమే తన దేశాన్ని ప్రేమించగలడు. చింతకింది శ్రీనివాసరావు వృత్తి నిష్ఠ కలిగిన పాత్రికేయుడు. సద్యస్ఫూర్తిగల కవి. మంచి కథకుడు, నాటకకర్త, వక్త, మాటకారి. కళింగాంధ్ర మాండలికాన్ని పల్లకీ ఎక్కించి వూరేగిస్తున్న బోయీ. శ్రీనివాసరావు నించి మరెన్నో మంచి రచనలు రావాలని ఆకాంక్షిస్తున్నా.

– శ్రీరమణ
(డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావు ‘కప్పస్తంభం’ కథల సంపుటి ముందుమాటలో కొంత భాగం)

Leave a Reply

%d bloggers like this: