జూన్ 27, 2018

ఓహో తెలుగు పద్యమా!

Posted in కవితా చమత్కృతులు, Uncategorized at 4:19 సా. by వసుంధర

నక్షత్రయుక్తం చమత్కారం చూ( చదవండి )డండి :-

నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేతబట్టి నక్షత్రప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైనవేసి నాథుని పిలిచెన్

ఇందులో నాలుగు నక్షత్రాలు దాగి ఉన్నాయి. పదే పదే చదివితేనే కానీ అంతసులువుగా అర్థమయేవికావు. ఇటువంటి ప్రహేళికలను’ప్రముషితా’ ప్రహేళికలని అంటారని కవి దండి తన’కావ్యాదర్శం’ లో చెప్పాడు.

ఇప్పుడు వివరణ చూద్దాం!
మహాభారతంలో విరాటపర్వం చదువనివారుండరు. విరాటరాజు కుమార్తె “ఉత్తర” (నక్షత్రం పేరు ) ఆమె అభిమన్యుని భార్య. నక్షత్రము చేతబట్టి అంటే కుంకుమ పాత్ర “భరణిని” ( నక్షత్రం పేరు ) చేతిలో పట్టుకొని ; నక్షత్రప్రభున్ నక్షత్రాలకు ప్రభువైన చంద్రుని వంశపు ( చంద్రవంశము ) అభిమన్యుని; నక్షత్రమునకు రమ్మని అంటే ఒక “మూల” ( నక్షత్రం పేరు) కు రమ్మని పిలిచి; నక్షత్రము పైనవేసి అంటే “హస్త” (నక్షత్రం పేరు ) మును అతని మీదవేసి; నాథుని పిలిచెన్ అంటే పతియైన అభిమన్యుని ప్రేమగా పిలిచిందట.

అమ్మో! ఈ పద్యం అర్థంకాకుంటే మీకు నిజంగానే నక్షత్రాలు కనిపించేవి కదూ! అదీ మరి కవి చమత్కారమంటే!

Leave a Reply

%d bloggers like this: