జూలై 2, 2018
ఎమర్జన్సీ కవితాగానం
ఆర్యుల పదప్రయోగంబులు గ్రాహ్యంబులు అంటుంది తెలుగు వ్యాకరణం.
ఎమర్జన్సీకి ముందూ (1966-74) వెనుకా (1980-1984) కూడా ఇందిరకు, ఆమె మరణానంతరం ఆమె తనయునికి (1984-89) తిరుగులేని విధంగా మద్దతునిచ్చింది మన ప్రజానీకం. ఎమర్జన్సీ సమయంలో వారు ఇందిరకు ఎంతవరకూ వ్యతిరేకులో 1977 ఎన్నికల ఫలితాల్నిబట్టి మాత్రమే నిర్ణయించడం ఎంతవరకూ సబబు?
కవులు ఆర్యులు. ఎమర్జన్సీ కాలంలో వారి స్పందనను తెలుసుకుందుకు ఈ అంతర్జాల వ్యాసం ఉపయోగపడుతుంది. వారిని గర్హించాలా గ్రహించాలా అన్నది మన వీక్షకుల విజ్ఞతకే వదిలిపెడుతూ – ఆసక్తికరమైన ఈ అంతర్జాల వ్యాసాన్నిఇక్కడ అందజేస్తున్నాం. వ్యాసకర్త ఎవరో మాకు తెలియదు.
(మన దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 43 సంవత్సరాలు నిండిన సందర్భంగా)
అత్యవసర పరిస్థితి (ఎమర్జన్సీ) పై తెలుగు కవుల “దీక్ష”
అన్యాయాలు, అక్రమాలపై తెలుగు కవుల తిరుగుబాటు!(ట్యాగ్ లైన్)
అత్యవసర పరిస్థితిని సమర్థిస్తూ కొందరు కవులు చేసిన కవితా గానం..!!
భారతదేశ చరిత్రలో 1975 ఎమర్జన్సీ విధింపు ఓ చీకటి అధ్యాయానికి తెర తీసింది.అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు
ఎమర్జన్సీకి ఊతంగా, ఇందిరకు వెన్నెముకగా నిలిచారు. ఇందులో భాగంగానే అప్పటి రాష్ట్ర సమాచార పౌరసంబంధ శాఖ వారు ఎమర్జన్సీని సమర్థిస్తూ ‘దీక్ష’ పేరుతో 36 పేజీల కవితా సంపుటి వెలువరించారు. దీన్ని అన్యాయాలు, అక్రమాలపై తెలుగుకవుల తిరుగుబాటుగా ప్రకటించారు. అయితే అక్రమాలు, అన్యాయాలేమిటో చెప్పలేదు. అవి ఎవరుచేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలుపలేదు. 1975 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేంద్ర ముద్రణాలయంలో మొత్తం 10000 కాపీలను ముద్రించి ఉచితంగా పంచిపెట్టారు.
ఇందులో ఎమర్జన్సీని సమర్ధిస్తూ..ఇందిరమ్మ భజన చేసిన కవులలో ఈ కింది వారున్నారు.
* డాక్టర్ దాశరథి
* డాక్టర్ సి. నారాయణరెడ్డి
* డాక్టర్ బోయి భీమన్న
* డాక్టర్ దివాకర్ల వేంకటావధాని
* శ్రీ ముదిగొండ వీరభద్రమూర్తి
* శ్రీ ఉత్పల
* శ్రీ జె. బాపురెడ్డి
* శ్రీమతి పరిమళా సోమేశ్వర్
* డాక్టర్ వేటూరి ఆనందమూర్తి
* శ్రీ ఎస్. మునిసుందరం
* శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి
* శ్రీ గుత్తికొండ సుబ్బారావు
* శ్రీమతి జ్యోతిర్మయి
* విహారి & శాలివాహన
* శ్రీ లసూనా
* శ్రీ తల్లాప్రగడ భద్రిరాజు
తదితర మొత్తం 17మంది కవులు – ఎమర్జన్సీ (అత్యవసర పరిస్థితి) గురించి కవితాగానం చేసి అప్పటి ప్రభుత్వానికి తమ వీర విధేయతను చాటుకున్నారు. ఈ కవితా సంపుటి వచ్చేనాటికే ఎమర్జన్సీ నీలినీడలు ప్రజాస్వామ్య వ్యవస్థపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఇందిర తనయుడు సంజయ్ గాంధీ బలవంతపు కుటుంబనియంత్రణ ఆపరేషన్లకు చాలామంది నష్టపోయారు. ఇందులో పెళ్లి కాని బ్రహ్మచారులు కూడా ఉండటం విశేషం. కాగా ఎమర్జన్సీకి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రజాస్వామ్య వాదుల్ని కటకటాలవెనక్కు నెట్టారు. ఈ చీకటి కాలంలో పౌర హక్కులు ప్రభుత్వ పరమయ్యాయి. ఏది చెప్పాలన్నా, ఏదిరాయాలన్నా సెన్సార్ అమల్లో ఉండేది. ప్రభుత్వం కత్తెర పట్టుక్కూర్చునేది. ఏలినవారి దయ, ప్రజల ప్రాప్తం అన్నట్లుండేది నాటి పరిస్థితి. జనం ఎమర్జన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రభుత్వం మాత్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించింది. ఎమర్జన్సీకి మద్దతుగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే చర్యల్లో భాగంగా ‘దీక్ష’ కవితాసంపుటిని వెలువరించింది.
ముందుమాట లోఈ కవితా సంపుటి ఉద్దేశ్యాన్ని వివరిస్తూ ఇలా రాశారు….
“శ్రీమతి ఇందిరాగాంధీ దేశ శ్రేయస్సు దృష్ట్యా అత్యవసర పరిస్థితి ప్రకటించి వంద రోజులు దాటిపోయింది. ప్రజల్లో పేద వర్గాల పరిస్థితులు మెరుగు పరచడానికీ, దేశంలో అన్నిరంగాల్లో క్రమశిక్షణ నెలకొల్పడానికీ – ఉద్దేశించి, ప్రకటించిన 20 సూత్రాల ఆర్థిక ప్రణాళిక దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నది. తెలుగులో ప్రసిధ్ధులైన అనేక మంది కవులు ఈ చర్యలను సమర్ధిస్తూ రాసి పంపిన కవితలను ఈ సంపుటిలో ప్రకటిస్తున్నాం”..
మొదటి కవితగా దాశరథి రచించిన “కుదుపు” కవితను ప్రచురించారు.
* గాఢ నిద్రలో వున్న వారి కళ్లు తెరిపించే కుదుపు
సోమరితనం ప్రబలినవారి శోణితం వేడెక్కించే కుదుపు
అభ్యుదయ శక్తులన్నిటినీ ఐక్యపరిచే కుదుపు
ఈ అనివార్యమైన కుదుపు హేయశక్తులకు అదుపు
కాలాన్ని వెనక్కు తిప్పాలనే వారి యెడ కడు జాగ్రత్తగా వుండమని పిలుపు
మారణహోమాన్ని నిరసించే మహా ప్రజావళికి ఇది గెలుపు
ఎమర్జన్సీని ప్రజావళి గెలుపుగా అభివర్ణించారు దాశరథి. నిజానికి ఎమర్జన్సీ ప్రజల పాలిట మహమ్మారి. ప్రజల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను, రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కుల్ని కబళించే రాబందు. ఒక పక్క జయప్రకాష్ నారాయణ్ ఎమర్జన్సీకి వ్యతిరేకంగా, ప్రారంభించిన ప్రజా హక్కుల పునరుధ్ధరణ ఉద్యమం ఊపందుకున్న దశలో ఎమర్జన్సీని అభ్యుదయ శక్తులన్నిటినీ ఐక్యపరిచే కుదుపుగా దాశరథి భావించడం ఆశ్చర్యమే!
ఈ అనివార్యమైన కుదుపు హేయశక్తులకు కుదుపంటారు దాశరథి. ఇంతకూ ఆ హేయశక్తులెవరంటే – ఎమర్జన్సీని వ్యతిరేకించే ప్రజాస్వామ్య వాదులు. కవులు ఎప్పుడూ ప్రజాపక్షమే వహిస్తారు. వహించాలి కూడా! కానీ దాశరథి ప్రజాహీష్టానికి వ్యతిరేకంగా తన కలాన్ని కత్తిలా ఝళిపించారు. స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను కూడా విడనాడారు. కవితా పయోనిధిగా వుండాల్సిన ఆయన ఎమర్జన్సీ పయోనిధిగా మారారు. దాశరథి గారు తన జీవితంలో చేసిన చారిత్రక తప్పిదంగా దీన్ని భావించాలా? ఏమో? ….ఏమైతేనేమి? ఆ తర్వాత దాశరథికి ఆస్థాన కవి పదవి దక్కింది. చాలాకాలం ఆయన సర్కారు కవిగా చలామణి అయ్యారు. ఎమర్జన్సీని సమర్థించినందుకు ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన నజరానా ఇది.
* ఎమర్జన్సీ సమర్ధింపుకు సి.నా.రె ‘దీక్ష’ –
దేశంలో ఎమర్జన్సీ విధింపుతో మన జాతి చక్కబడ్డదట మన నీతి చిక్కబడ్డదట. ఇది…సి నారాయణ రెడ్డి గారి కవితా ఉవాచ.అంతే కాదు. ఎమర్జన్సీ వల్ల ప్రగతి శక్తుల బలం పెరిగిందట. విషమ శక్తుల నడుం విరిగిందట..!!
కవికి సొంత అభిప్రాయం ఉండకూడదా – అని మీరడగవచ్చు. భేషుగ్గా వుండొచ్చు. కాకపోతే దానివల్ల ప్రజాస్వామ్యానికి, ప్రజాశ్రేయస్సుకు, ముఖ్యంగా ప్రజల హక్కులకు భంగం కలక్కూడదు. ముప్పు వాటిల్లరాదు.
కవి ప్రజల గొంతు. కవి ప్రజల నాడి. కవి ఎప్పుడూ ప్రజల పక్షపాతిగా వుండాలి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కవి నిలదీయాలి. మరి ఎమర్జన్సీ లాంటి చీకటి రోజుల్ని సమర్ధించి సి.నా.రె. తప్పు చేశారా? ఏమో?
చరిత్ర విజ్ఞతకే వదిలేద్దాం!
దీక్ష కవితాసంకలనంలో ‘నేటి పాట’ పేరుతో సినారె రాసిన కవితను చూడండి!!
ప్రగతి శక్తుల బలం పెరిగింది నేడు
విషమ శక్తుల నడుం విరిగింది చూడు
అటునుంచి దిగుతున్న ఆకుపచ్చని నోట్లు
మితవాదులకు దండి మేతగా మారగా
ఇటునుంచి వస్తున్న ఈటెలూ బుల్లెట్లు
అతివాదులకు దొడ్డ అండగా వుండగా
రెండు మూతులు కలిసి గుండెలదరగ అరిచి
పిడికిట్లో దేశాన్ని బిగియించగా తలచి
పడ్డ పాటులు గడ్డి కరిచెరా
వాళ్ల పాచికలు తలకిందులాయెరా…!!
పుర్రెలను కొలిచేటి పూర్ణ భక్తులు వాళ్లు
హత్యలను వలచేటి రక్త రక్తులు వీళ్లు
పుర్రెలను పూజించు వెర్రి నాగన్నా!
పుర్రెలను కాదు పరిపూర్ణ భావాలున్న
బుర్రలను పూజించరా,
నాగేటి కర్రులను పూజించరా!
కత్తులను వలచు రక్కసుల వారసుడా
కత్తులను కాదురా
కార్ఖానాలోని
శ్రమశక్తులను ప్రేమించరా
పలికేటి సుత్తెలను ప్రేమించరా!!
ఈ వినూత్న స్థితికి ఎవరు కారకులు?
ఈ శరీర పురోగతికి ఎవరు సారధులు?
ఎవ్వరైతేనేమి? ఎందుకైతేనేమి?
చక్కబడ్డది జాతి చిక్కబడ్డది నీతి
నడిరేయి వెలిగింది నవచేతనా జ్యోతి
(మనకు 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి పౌరుల స్వాతంత్ర్యాన్ని అపహరించిందీ అర్థరాత్రే కావడం విశేషం)
ప్రజల స్వాతంత్ర్యాన్ని కబళించిన ఆ కాళరాత్రి సి.నా.రె దృష్టిలో నడిరేయి వెలిగిన నవచేతనా జ్యోతి అట. హవ్వ!
ప్రజా హక్కులపై తిరుగు బాటు…. అధికార లాలసతో ఇందిరమ్మ భజన….!!
అన్యాయాలపై, అక్రమాలపై తిరుగుబాటన్నారు కానీ… నిజానికిది ప్రజా హక్కులపై కవుల తిరుగుబాటు. పనిలో పనిగా ఇందిరమ్మ భజన చేసి ప్రభుత్వ మెప్పు పొందాలన్న తాపత్రయం కూడా కనిపిస్తోంది. సినారె, దాశరథి వంటి ఉద్దండ కవులు ఎమర్జన్సీని సమర్థించగా లేనిదీ – మేం సమర్థిస్తే తప్పా అన్నట్లు మిగతా కవులు కూడా తమ కలాలు సవరించి ఓ చారిత్రక దుర్మార్గాన్ని గుడ్డిగా సమర్థించారు.
బోయి భీమన్న గారు, ‘కొక్కు రో కో’ అంటూ కోడి కూత కూశారు.
కొక్కురో… కొక్కురో.. కో..
కోట్ల జనులు మేలుకొనిరో
పూర్వ దిక్కున, పూర్వపుణ్యమే దిక్కుగా
ఉదయేందిరదె వెలిసె
హృదయమర్పించరా
అంటూ భీమన్నగారు ఇందిర భజనలో నిండా మునిగిపోయారు.
బాధ్యతా రహితముగ నోటికి
వచ్చినటు లేదైన వదరుట
కల్ల నిజమెన్నకయ చేతులు
కలవనుచు నేదైనై వ్రాయుట
ఇ క చెల్లదని ‘ఇందిరా షట్పదులు’ శీర్షికన దివాకర్ల వేంకటావధాని గారు వాక్స్వాతంత్ర్యమే కాదు. కలానికి కూడా సంకెళ్లు వేయడం మంచిదైందని కితాబు ఇచ్చారు.
అలాగే అరాజకత్వం ఆట కట్టిందని ఎమర్జన్సీని సమర్ధించారు బాపురెడ్డి.
ఎమర్జెన్సీ రచనకైనా, ఎమర్జింగ్ పొయట్టుకైనా గుండెబలం వుండాలంటారు వేటూరి ఆనంద మూర్తి.
ఈ అత్యవసర పరిస్థితులలో
నిలువుము హిమాద్రి వలెను
సంఘ శక్తులను సమైక్య పరిచిభారతేందిరను రక్షింప –
అని తల్లాప్రగడ భద్రిరాజు ఎమర్జన్సీకి భుజమిచ్చి మోశారు.
‘జాతి పౌరులకు జాగృతి ఎంతో అవసరం, అత్యవసర’మంటూ జ్యోతిర్మయి సమర్ధించారు.
కవులు ప్రజాచైతన్య దీపికలంటారు. మరి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా విధించిన ఎమర్జన్సీని సమర్ధించిన ఈ కవుల నేమనాలి? వారి విజ్ఞతకే వదిలేద్దాం!!
Leave a Reply