జూలై 2, 2018

ఒకటినుంచి నాలుగుకి…

Posted in సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం, Uncategorized at 7:18 సా. by వసుంధర

గూగుల్ గ్రూప్ తెలుగు మాట సౌజన్యంతో

telugu 4th

అయ్యా,

ఒకప్పుడు మన దేశంలో ఇతర నుడుల కన్న తెలుగు నుడిని మాటలాడే వారే ఎక్కువ.

ఇంగ్లీష్ వారు పరిపాలించిన రోజుల్లో, టంకశాల నుంచి బయటకు వచ్చిన ఒక అణా బిళ్ళను చూడండి. ఒక వైపు ఆంగ్లంలో ఒక అణా అని రాసి రెండో వైపు తెలుగులో ‘ఒక అణా’ అని రాయడాన్ని గమనించ వచ్చు.

బీహార్ కింద నుంచి కన్యా కుమారి వరకు, పడమర కనుమల నుంచి తూర్పు కనుమల వరకున్న మంది తెలుగును మాట్లాడటాన్ని  గమనించటం వల్లనే ఆంగ్లేయులు అలా చేశారు.

అయితే కొంత మంది తెలుగు వారి కన్నా హిందీ వారు ఎక్కువ వున్నారు కదా అని అనుకోవచ్చు. కాని ఇక్కడ ఒక మందలను [విషయాన్ని] మనం గుర్తుకు తెచ్చుకోవాలి. గాంధీ గారు రాజకీయాలలోకి వచ్చాక, ఆంగ్లేయులను వెళ్ళమని పిలుపు ఇచ్చాక, వారి నుడిని మాత్రం ఎందుకు వుంచుకోవాలి అన్న అడక [ప్రశ్న] వచ్చింది. అప్పటికే ఉత్తరాదిలో వున్న ఎన్నో నుడులను [బ్రజ భాష, ఖడీబోలి, కన్నౌజి, అవధి, భోజపురి, బుందేలి, బఘేలి, మాళవి, నిమడి, గోండి, కట్లో, భిలి, హర్యాన్వీ, దున్దరి, బంగారు, జాటు, రాజస్థాని, ఛత్తీస్ గరి, మార్వారీ, జైపురి, మైధిలి, బ్రజ భాష, భోజపురి, మేవాడి, హరౌతి, కిషన్గిరి, కుమావని, గర్వాలీ, జోహార్, గోర్ఖాలీ, దోత్యాలి, థారు, బొక్ష, భాబార్, అంగిక, బజ్జిక, ఖడీపాయి, మాగహి, సంతాలి, ముండారి, హో, ఖన, భుమ్జి, కుర్మాలి, ఒరాన్, కోర్వ, పహారియా, నాగపురి, సాద్రి, ఖోర్త లాంటి ముఖ్యమైనవే కాక ఎన్నో ఇతర నుడులను] చంపేసి ఒకే నుడిని తీసుక రావాలని హిందీని పైకి తీసుక వచ్చి అందరి నెత్తిన రుద్దుతున్నారు. ఇప్పటికీ బీహార్ ఉత్తరాన వుండే ఒక రైతును, దక్షిణాన వుండే ఒక రైతు దగ్గరకు తీసుకొని వెళ్తే, ఇద్దరూ వేరే నుడి వాడితో మాటాడినట్లు తలపోస్తారు. తల్లి నుడిగ మాటలాడే నుడులను లెక్కేస్తే ఇప్పటికి తెలుగే ముందుంటుంది.

1965 లో దక్షిణాదిన హిందీ వ్యతిరేక ఉద్యమం బాగా ఊపులో వున్నపుడు, మరి హిందీకి బదులు ఏ భాషను అనుసంధాన భాషగా ఉంచాలి అన్న చర్చ వచ్చింది. అప్పడు ఎం. పి. గా వున్న అన్నాదురై, పార్లమెంట్ లో మాట్లాడుతూ ‘తెలుగే దేశానికి సరి అయిన అనుసంధాన భాష’ అని చెప్పడాన్ని మనం గుర్తించాలి.

అయితే ఇప్పుడు పరిస్థితి చాల వడిగా మారుతున్నది. తెలుగు 4వ చోటుకు చేరినట్లు వచ్చిన ఊసును చూడండి. ఇతర రాష్ట్రాల లోని తెలుగు వారికి అమ్మ నుడిని దూరం చేస్తున్నారు; వారిని తెలుగు వారిగ కూడ జనాభ లెక్కలలో చూపటం లేదు.

అందుకని తెలుగు వారు పెద్ద ఎత్తున ఉద్యమించక పోతే మన అమ్మ నుడి మనుగడే ముప్పులో పడేట్లున్నది.

సాహిత్యం కన్న ఉద్యమం మీద ఎక్కువ శ్రద్ధ చూపవలసిన తరుణం వచ్చింది.

తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
పారుపల్లి కోదండ రామయ్య, ఊరట మించు వంచ మరవరి. 9505298565

Leave a Reply

%d bloggers like this: