జూలై 8, 2018

ఎందరో మహానుభావులు….

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 7:34 సా. by వసుంధర

మన సాహితీపరుల్లో అరుదైన ప్రక్రియలు చేపట్టిన మహానుభావుల్లో శ్రీ కాట్రగడ్డ లక్ష్మీనరసింహారావు ఒకరు. జూన్ 2018 చతుర మాసపత్రికలో వచ్చిన మా నవల పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ వారు చదివి తమ గొంతులో ఆడియో రికార్డు చేసి – ఆ సిడిని కొరియర్లో మాకు పంపేదాకా వారెవరో మాకు తెలియదు.  ఆ కొరియర్లో మాకు మరెందరివో అద్భుత రచనలు ఆడియో సిడిలుగా అందడం అనూహ్యమైన ఆనందానుభూతి. ఈ అపూర్వ కానుకకు వసుంధర స్పందననూ, కొరియర్లో వారిని ‘కొండను అద్దంలో’ విధంగా పరిచయంచేసిన కరపత్రాల విశేషాలనూ ఇక్కడ అందజేస్తున్నాం.

వసుంధర స్పందన:

శ్రీ లక్ష్మీనరసింహారావు గారికి,

నమస్కారం.

మీ స్థాయి సాహితీపరుల్లో – సాహితీ ప్రియత్వానికి మీకు మీరే సాటి. నచ్చిన సాహిత్యాన్ని – ఖంగుమనే గొంతుతో పలికి, డిజిటల్‍గా రికార్డు చేసి – ఇతరులతో పంచుకునేందుకు మీరు వెచ్చిస్తున్న సమయం, ధనంతో – కృష్ణ తులాభారం సమయంలో రుక్మిణి వాడిన తులసి దళం కూడా తేలిపోతుంది.

ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంతో సహా – ఎన్నో మహత్తర గ్రంథాలను మీ గొంతులో పలికించి, వాటి సరసన మా ‘చతుర’ నవలను కూడా చేర్చి, సిడిలలో ఇమిడ్చి మాకు అందజేశారు. మా నవల ధన్యమైంది. మీకు కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు.

సాహితీపరంగా ఎన్నో పాత్రలను చిత్రించి, వివిధ వ్యక్తిత్వాలను విశ్లేషించిన మాకు ఇంతవరకూ అందని విలక్షణ మహోన్నతులు మీరు. ఎందరో మహానుభావుల్లో కూడా అరుదైన మహానుభావులు మీరు. మీరు చేపట్టిన ప్రక్రియ అపూర్వం, అనితరసాధ్యం. మీకు మా అభివందనాలు.

నోటి మాటకు (రికార్డు చెయ్యనప్పుడు) అక్షరరూపమిచ్చినప్పుడే విలువ. అందుకే ఫోనుకి బదులుగా ఈ ఉత్తరం.

శుభాకాంక్షలతో

వసుంధర

కరపత్రాలు:

katragadda 1 a katragadda 1 b katragadda 2 a  katragadda 2 b

 

Leave a Reply

%d bloggers like this: