ఆగస్ట్ 23, 2018

రచనలకు ఆహ్వానం – ఈమాట

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 7:35 సా. by వసుంధర

ప్రత్యేక సంచిక కోసం ప్రత్యేక ఆహ్వానం

నమస్కారం,
మీలో ఏ ఒకరిద్దరికో తప్ప మిగతావారికి నానుంచి ఇలా ఆహ్వానాలు (విసిగింపులు) ఇలా అప్పుడప్పుడూ రావడం కాస్త అలవాటే అయినా, ఈసారి ఈ ఆహ్వానానికి కాస్త ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఇంకో రెండు నెలలలో, అంటే నవంబర్ 1న వచ్చే సంచిక ఈమాట  20వ జన్మదిన ప్రత్యేక సంచిక. టీనేజ్ దాటి యుక్తవయసులోకొస్తున్నది కాబట్టి పెద్దగా కేకులూ క్రాకర్లూ బానర్లూ బాకాలూ వంటి ఆర్భాటాలేమీ లేవు కాని, ఆ సంచికను వీలైనంతగా వాసితో తీర్చిదిద్దుదామని కోరిక మాది.
మీలో కొందరు ఈమాటకు తరచుగా రాసేవారు. అతి కొందరు అరుదుగా రాసినవారు, ఏ ఇద్దరో ముగ్గురో ఇప్పటిదాకా ఏమీ రాయనివారు. కాని, మీరు రచయితలుగా మాకు బాగా తెలిసినవారు, మీరు ఏది రాసినా చక్కగా రాస్తారు. చదివించేలా రాస్తారు. అందువల్లనే ఈ ఆహ్వానం ఇలా చాలా కొద్దిమందికే పంపుతున్నాను, గంపెడాశతో.
కేవలం ఆ సంచిక కోసం ఒక కథ, కవిత, వ్యాసం అనే కాదు. మీలో కొందరు ధారావాహికలు రాసినవారున్నారు. కథలు, కవితలు అనేకాక శీర్షికలుగా ఎన్నో విషయాలపై వరుసగా రాసినవారూ ఉన్నారు. అలా నవంబర్ సంచికనుండీ ఒక కొత్త శీర్షిక మొదలు పెట్టగలిగినా సరే. తెలుగు పాఠకులకు సాహిత్యంలో, సంగీతంలో, చిత్రకళలో కొత్త రుచులు ఏవి చూపించదలచుకున్నా, కొత్త ఆలోచనలు ఏవి రేకెత్తించదలచుకున్నా సరే, మీకు మా హార్దిక స్వాగతం.
ఒక పత్రికను స్వచ్ఛందంగా ఇలా ఇరవై యేళ్ళనుంచి నడపగలిగేం అంటే అందులో మా కృషి కన్నానూ మీ సహాయసహకారాలదే పెద్ద పాత్ర. ఇకనుంచీ కూడానూ మీనుంచి మాకు అదే ఆశ, మానుంచి మీకు అదే విన్నపం. తరచుగా రాసేవారు రాస్తూనే ఉండాలని, అరుదుగా రాసేవారు, ఇకనుంచీ రాసేవారూ మరింత తరచుగా రాయాలని.  మీలో కొందరు రాద్దామనుకొని పనుల ఒత్తిడి వల్ల రాయలేకపోయినవారున్నారు. కాని, ఎలానోలా వీలు చేసుకొని ఒక్కసారి మొదలు పెట్టండి, అదే సాగిపోతుంది.
నవంబర్ సంచిక ఇంకా రెండు నెలలు ఉన్నా ముందే అడగడం మీకు సరిపోయినంత సమయం ఉంటుందని. జన్మదిన సంచికను (ఆపైన ప్రతీ సంచికనూ కూడా),  మీ ప్రోత్సాహంతో, మీ రచనలతో, మీ సృజనతో కలకాలం చదువుకునే ప్రత్యేక సంచికగా మలచడంలో సహాయపడతారని ఆశిస్తూ…
మాధవ్ మాచవరం
(ఈమాట సంపాదకుల బృందం)
కొత్తరచయితలకోసం: రచయితలకు సూచనలు.

Leave a Reply

%d bloggers like this: