ఆగస్ట్ 29, 2018

మన ‘గిడుగు’

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 11:01 ఉద. by వసుంధర

గూగుల్ గ్రూప్ తెలుగు మాట శ్రీ శ్రీనివాస్ సౌజన్యంతో

వ్యవహార భాషోద్యమ పిడుగు గిడుగు

ప్రజాశక్తి దినపత్రిక

                       

తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల భాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది.
గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి ఔత్సాహికులు అందరికీ వీలైంది. అందుకే ఆయన పుట్టినరోజు ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం అయింది.
గిడుగు వెంకట రామమూర్తి 1863లో శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేటలో జన్మించాడు. తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట దివాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి) గా పనిచేస్తుండేవాడు. 1877 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రి చోడవరం బదిలీ అయి అక్కడే విషజ్వరంతో 1875లోనే చనిపోయాడు. మేనమామ గారింట్లో ఉంటూ విజయనగరంలో మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో చదువుకున్నాడు. 1875 నుంచి 1880 వరకూ విజయనగరంలో గడిపాడు. 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. గురజాడ అప్పారావు, రామమూర్తి కలిసి సహాధ్యాయులు. 1880లో రూ.30ల జీతం మీద పర్లాకిమిడి రాజావారి స్కూల్లో ఫస్టుఫారంలో చరిత్ర బోధించే అధ్యాపకుడిగా చేరాడు. సంసార బాధ్యత (తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు) రామమూర్తిపై బడింది. ప్రైవేటుగా చదివి 1886 లో ఎఫ్‌ఏ., 1894 లో బి.ఏ. మొదటి రెండు భాగాలు (చరిత్ర తప్ప) ప్యాసయ్యాడు. 1896లో మూడోభాగం ప్యాసై పట్టా పుచ్చుకున్నాడు. ఇంగ్లీషు, సంస్క ృతాలు గాక, ప్రధాన పాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని రాష్ట్రంలో మొదటి తరగతిలో, రెండో ర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. రాజా వారి ఉన్నత పాఠశాల కళాశాల అయ్యాక అక్కడ కూడా పాఠాలు చెప్పారు.
సవర భాషలో చదువు
ఆ రోజుల్లోనే ఆయనకు అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వారికి చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవర భాషలు రెండూ వచ్చిన ఒక వ్యక్తిని ఇంట్లో పెట్టుకొని ఆ భాష నేర్చుకున్నాడు. తరువాత సవరభాషలో పుస్తకాలు రాసి, సొంత డబ్బుతో స్కూళ్ళు పెట్టి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాసు ప్రభుత్వం ఈ కృషికి మెచ్చి 1913లో ‘రావు బహదూర్‌’ బిరుదు ఇచ్చింది. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నాడు. 35 ఏళ్ల కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించాడు.
హైస్కూల్లో చరిత్ర పాఠాలు చెప్పే రోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివాడు. విషయ పరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగ వంశీయులను గురించి ఇంగ్లీషులో ప్రామాణిక వ్యాసాలు రాశాడు. 1911లో 30 ఏళ్ళ సర్వీసు పూర్తి కాగానే అధ్యాపక పదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయ్యాడు. అంతకు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్ర భాషాసంస్కరణ వైపు ఆయన దృష్టి మళ్ళింది.
రామమూర్తికి చిన్నప్పటినుంచి విద్యాసక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణ ప్రధాన లక్షణాలు. సవరలు, దళితులు అంటరాని జనాలని భావించే కాలంలోనే ఆయన తన ఇంట సవర విద్యార్థులకు బస ఏర్పరచి, భోజనం పెట్టేవాడు. 1930లలో పర్లాకిమిడి రాజా పర్లాకిమిడి తాలూకా అంతటిని ఒడిషాలో చేర్పించడానికి ప్రయత్నించినపుడు, తెలుగువారి నాయకునిగా రామమూర్తి నిలిచి ప్రతిఘటించాడు. బ్రిటీషు వారి ముందు తన వాదనలు బలంగా వినిపించాడు. అయితే, ఆయన ప్రయత్నం ఫలించలేదు. తాలూకాలో చాలా భాగాన్ని, పర్లాకిమిడి పట్టణాన్ని ప్రభుత్వం ఒడిషాలో చేర్చడం వల్ల, తెలుగువారికి అన్యాయం జరిగిందని తెలియజేస్తూ 1936లో ఒడిషా రాష్ట్ర ప్రారంభోత్సవం జరిగే రోజున ఉదయమే పర్లాకిమిడి వదిలి, రాజమండ్రి వచ్చేశారు. తన శేషజీవితం ఇక్కడే గడిపాడు.
వాడుక భాషోద్యమం
ః1907లో ఏట్సు అనే ఇంగ్లీషుదొర ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ళ ఇన్‌స్పెక్టరుగా వచ్చాడు. చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆయనకు అర్థం కాలేదు. ప్రజలు మాట్లాడే భాషకు, పుస్తకాల భాషకు మధ్య తేడా ఎందుకని ఆయన ప్రశ్న. విశాఖపట్నం ఎవిఎన్‌ కళాశాల ప్రిన్సిపాలుగా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారిని అడిగితే- దానికి గురజాడ, గిడుగు సమాధానం చెబుతారని అన్నాడు. అలా వారందరి మధ్య చర్చకు, కార్యాచరణకు అవకాశం ఏర్పడింది. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు – ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది. అప్పటికే ఇంగ్లీషులో భాషాశాస్త్ర గ్రంథాలు చదివిన గిడుగు ఏటా జరిగే అధ్యాపక సదస్సుల్లో జీవద్భాష ప్రాధాన్యతను గురించి ఉపన్యాసాలిచ్చాడు.
1906 నుంచి 1940 వరకూ గిడుగు రామమూర్తి కృషి అంతా తెలుగు భాష సేవకే. యేట్స్‌ ప్రోత్సాహంతో వ్యావహారిక తెలుగు భాషను గ్రంథరచనకు గ్రాహ్యమైందిగా చేయడానికికృషి చేసి కృతకృత్యుడయ్యాడు. 1919-20ల మధ్య భాషోద్యమ ప్రచారం కోసం ‘తెలుగు’ అనే మాసపత్రిక నడిపాడు. వ్యావహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో (1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించాడు. తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేశాడు.
ఉద్యమాల ఫలితంగా 1912-13లో స్కూలు ఫైనల్‌ లో వ్యాసరచన కావ్యభాషలో గాని, ఆధునిక భాషలో గాని రాయవచ్చునని స్కూలు ఫైనల్‌ బోర్డు ఉత్తర్వు ఇచ్చింది. ఆధునిక భాషకు లక్ష్యంగా బ్రౌన్‌ తెలుగు రీడర్‌ను, ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రను ఉదహరించాడు. ఈ మార్పుల వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరింది. వ్యాసరచన పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్దఎత్తున ఉద్యమం లేవదీశారు.
గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించాడు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావఝ్జుల శివశంకరశాస్త్రి, వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, చినసీతారామశాస్త్రి వంటి కవులు, పండితులు వ్యావహారిక భాషావాదం వైపు మొగ్గు చూపారు. 1936లో నవ్య సాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి, సృజనాత్మక రచనల్లో వ్యవహారిక భాషను ప్రోత్సహించారు. 1937లో తాపీ ధర్మారావు సంపాదకుడుగా ‘జనవాణి’ పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది. గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన తన తుదివిన్నపంలో… వ్యావహారికభాషా వ్యాప్తికి చాలా సంతృప్తి పొందాడు. కాని, ప్రభుత్వ విద్యాశాఖలు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటంపై బాధపడ్డాడు. ఆయన జనవరి 22, 1940న కన్నుమూశాడు. వాడుకభాషకు పట్టం ఆయన ప్రసాదించిన వరం, గౌరవం! అయితే, ఇప్పుడు తెలుగు భాష వాడుకకే ప్రమాదం ముంచుకొచ్చింది. పాలనలో, బోధనలో, వ్యవహారంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది. దానిని నిలువరించి తెలుగును కాపాడుకోవటమే గిడుగుకు నివాళి.
‘గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు
వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు
తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు
కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు

(ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం)
– శాంతిమిత్ర

Leave a Reply

%d bloggers like this: