డిసెంబర్ 29, 2018

నివాళిః నోముల సత్యనారాయణ

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 9:21 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచార కలశం సౌజన్యంతో

(ఆచార్య చెన్నకేశవరెడ్డి గారు మెయిల్ చేసిన లఘు పరిచయ వ్యాసం)
బహు భాషావేత్త, బహు గ్రంథ పఠిత నోముల సత్యనారాయణ
————————–
— ప్రొ. చెన్నకేశవరెడ్డి

నోముల సత్యనారాయణ అనగానే అందరి నోటికొచ్చే పదం ‘బహుభాషావేత్త ‘. నోముల ముఖ్యంగా తెలుగు,ఇంగ్లీష్, ఉర్దూ,హింది భాషలలో నిష్ణాతుడు. కేవలం ఆ భాషల పరిజ్ఞామే కాదు, ఆ భాషా సాహిత్యాలను క్షుణ్ణంగా చదువుకొన్న వ్యక్తి. ఆయనంత పుస్తక ప్రియుడు మరొకరు లేరేమో,!
నిత్య పఠన శీలి. పుస్తకం ఆయనకు హస్తభూషణం కాదు,మస్తకభరణం. హైదరాబాదు నగరంలో ఏ సాహిత్యసభ జరిగినా వక్తగానో, శ్రోత గానో హాజరై ఆ హాలు ముందు అమ్మకానికి ఉంచిన పుస్తకాలలో ఏరికోరి కొనేవారు. ఆదివారాల్లో పేవ్ మెంట్ మీది పుస్తకాల వేట సాగించేవారు. ఆయనమీద గౌరవం కొద్దీ కవులు,రచయితలు ఇచ్చిన, తాను కొన్న పుస్తకాలను,వెంటనే చదివేవారు. తన అభిప్రాయాన్ని
తెలిపేవారు. పుస్తకావిష్కరణ సభలో వక్తగా ప్రసంగించవలసి వస్తే , ఆ పుస్తకంలోని మెరుగైన అంశాలను ఎత్తిచూపుతూ ఇతర భాషా గ్రంథాలలోని సమాన ,సమాంతర విషయాలను అనుసంధించి మాట్లాడటం ఆయన అలవాటు. ఎంతో లోతైన ,గంభీరమైన ఉపన్యాసం ఆయనది.
ఎందరి రచయితలనో ,కవులనో తయారు చేసిన వ్యక్తి. తాను మాత్రం ‘ రాయని భాస్కరుడు.’ ‘నల్లగొండ రోణంకి ‘ , ‘నల్లగొండ వెన్నెల ‘ , ‘నడిచే విజ్ఞాన సర్వస్వం ‘ అని ఆయన సన్నిహితులు
చెప్పుకొనేవారు.
ఎప్పుడూ ఇన్ షర్ట్ వేసుకొని ,నల్లటిబూట్లు ,తలపై హాట్ ధరించి, చంకలో పుస్తకాల జోలె,చేతిలో ఒకటి,రెండు పుస్తకాలు, మరో చేతి పిడికిట సిగరెట్టుతో కనిపించేవారు. ఎవరైనా మిత్రుడు ఎదురైతే సిగరెట్టున్న పిడికిటి చేయెత్తి ‘జయహో’ అని అభివాదం చేసేవారు.
వృత్తిరీత్యా ఆంగ్లోపన్యాసకులు. ‘ New Morality in Indian English Novel with Special reference toAnand ,R.K.Narayan and Arun Joshi’ అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టం పుచ్చుకొన్నారు. ఎవరిలో ఏ కాస్త మెరుగు కనపడ్డా ప్రోత్సహించే సహృదయుడు. గొప్ప గురువు. అపార శిష్య సంపన్నుడు . రావిశాస్త్రి, శ్రీ శ్రీ లతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తి.P.U.C. లో
వరవర రావు సహాధ్యాయి.
గంటల కొద్దీ సాహిత్యం గురించి విసుగు లేకుండా మాట్లాడే వ్యక్తి, గంటం మాత్రం చేత బట్టి రాయడానికి పూనుకొనేవారు కారు. అయినా ఆయన అప్పుడప్పుడూ వరవరరావు ‘ సృజన ‘ లో రాసిన వ్యాసాల సంపుటి అయిన ‘ సామ్యవాద వాస్తవికత -మరికొన్ని వ్యాసాలు ‘ అనే పుస్తకం ,’ Untold Stories’ అనే గ్రంథం చాలా ప్రసిద్ధమైనవి. టాద్ చెంగ్ రాసిన చైనీస్ నవలను ‘ నా కుటుంబం ‘ అనే పేరుతో అనువదించినారు.
నోములను గురించి ‘ ఆయన పుస్తకాల పుట్ట , ఉపన్యాసంలో దిట్ట, స్నేహ సంభాషణంలో నిట్ట, అయితే రాయడం లో ఆయన మెట్ట తాబేలే.’ అని ఒక వ్యాసంలో రాశాను.
అనువాదం, విమర్శ ,కథ, కవిత్వం, నాటకం,చిత్రలేఖనం, చాయాచిత్రణం , సంగీతం, ప్రయాణం
వంటి విషయాలలో అమితాసక్తి, నైపుణ్యమూ ఉన్న వ్యక్తి. ఆయన జననం 1940 ఆగస్ట్ ,మరణం
26 డిసెంబర్ 2018.

Leave a Reply

%d bloggers like this: