ఏప్రిల్ 2, 2019

అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం

Posted in సాహితీ సమాచారం at 6:35 సా. by వసుంధర

అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో ఉన్న ఆర్.సి.ఎం. బాలికోన్నత పాఠశాలలో ‘నారంశెట్టి బాల సాహిత్య పీఠం, ఉత్తరాంధ్ర రచయితల వేదిక’ కలసి బాల సాహిత్య పుస్తక ప్రదర్శన, పుస్తక పఠనం – ప్రయోజనాలు’ అనే అంశంపై సభ నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత , ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడు శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిధిగా విచ్చేసి బాల సాహిత్య ప్రయోజనాల గురించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని సిస్టర్ ప్రశాంత, ప్రముఖ బాల సాహితీవేత్త శ్రీ బెహరా ఉమామహేశ్వరరావు , ప్రముఖ చిత్రకారుడు తుంబలి శివాజీ, రచయిత్రి గుడ్ల అమ్మాజీ గార్లు పాల్గొని పుస్తక పఠనం , బాల సాహిత్య ప్రయోజనాల గురించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఇటీవల తానా నవలల పోటీలో బొమ్మల విభాగంలో బహుమతి పొందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీ తుంబలి శివాజీని, పాఠశాల ప్రధానోపాధ్యాయిని సిస్టర్ ప్రశాంతిని నారంశెట్టి బాల సాహిత్య పీఠం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
నారంశెట్టి బాల సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి, రచయిత్రి గుడ్ల అమ్మాజీ సభకు స్వాగతం పలికి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు , వందమందికి పైగా పిల్లలు పాల్గొన్నారు.విద్యార్థులకు శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వర్రారావు గారు రచించిన కథల పుస్తకాలతో బాటు ఇతర రచయితల పుస్తకాలను బహూకరించారు.

ఇట్లు
గుడ్ల అమ్మాజీ, ప్రధాన కార్యదర్శి, నారంశెట్టి బాల సాహిత్య పీఠం, పార్వతీపురం.

Leave a Reply

%d bloggers like this: