జూన్ 18, 2019

పరిచయంః కుప్పం రెడ్డెమ్మ సాహిత్య ట్రస్ట్

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 4:18 సా. by వసుంధర

(వాట్‍సాప్ బృందం బాలసాహితీ శిల్పులు సౌజన్యంతో)

చిత్తూరు జిల్లాలో “కుప్పం రెడ్డెమ్మ సాహిత్య ట్రస్ట్” ఒక ప్రముఖమైన మరియు ప్రతిష్టాత్మకమైన సాహిత్య సంస్థ.
ఈ సంస్థ వ్యవస్థాపకులు చిత్తూరులోని ప్రముఖ ఆసుపత్రి ” రామలక్ష్మి నర్సింగ్ హోం ” యజమాని ,ప్రముఖ వైద్యులు డా. కె.రామలక్ష్మి మేడమ్ గారు.వీరి తల్లి గారి పేరు ” కుప్పం రెడ్డెమ్మ “.
రెడ్డెమ్మ గారు ఎక్కువగా చదువుకోకపోయినా సాహిత్యం అంటే చాలా ప్రీతి.
ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ ఆమె అభిమాన రచయిత్రి.
అందుకే కూతురు రామలక్ష్మికి కూడా చిన్నప్పటి నుండి సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదివించి, సాహిత్యం అంటే ఇష్టం ఏర్పడేలా చేసింది.
50 ఏళ్ల క్రితమే, కూతురు రామలక్ష్మిగారిని M.B.B.S .చదివించి డాక్టర్ ను చేసింది.
తన తల్లి మరణానంతరం,ఆమె జ్ఞాపకార్థంగా, ఆమెకు ఇష్టమైన సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలని డా.రామలక్ష్మి గారు తలపెట్టారు.
అందుకే ప్రతి సంవత్సరం ఆమె పేరు మీద చిత్తూరు జిల్లాలోని కవులు, రచయితలకు ” కుప్పం రెడ్డెమ్మ సాహిత్య అవార్డు ” లు ప్రదానం చేస్తున్నారు.
వీరి అల్లుడు డా.నిరంజన్ రెడ్డి, కుమార్తె డా.రోజా ప్రియ కూడా వైద్యులే. వీరిద్దరి సహకారంతో
వీరు ట్రస్టులో కొన్ని లక్షల రూపాయలు డిపాజిట్ చేసి, దానిపై వచ్చే ఆదాయంతో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం , అంతకు ముందు సంవత్సరం ప్రచురింపబడిన పుస్తకాలను 1).పద్య సాహిత్యం 2).వచన కవిత్వం 3).కథా సంపుటాలు ,ఈ మూడు విభాగాల క్రింద పోటీలకు ఆహ్వానించి,ప్రముఖ సీనియర్ కవులు/రచయితలు న్యాయనిర్ణేతలుగా , మూడు విభాగాలలో ముగ్గురు కవులు -కవయిత్రులు ,రచయితలు – రచయిత్రులను విజేతలుగా ప్రకటించి వారికి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ” కుప్పం రెడ్డెమ్మ సాహిత్య అవార్డులు ” ప్రదానం చేయుచున్నారు.
అవార్డుతోపాటు రూ.5000/- ల నగదు బహుమతిని కూడా అందజేయుచున్నారు.
మరో ప్రత్యేకత ఏమంటే,పోటీ విజేతను ముందుగా ప్రకటించరు. ఆరోజు సభలోనే ప్రకటిస్తారు. పోటీకి ఎంట్రీలు పంపిన రచయితలనందరినీ ఆరోజు జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి ఆహ్వానించి,అందరికీ సన్మానంతోపాటు రూ.1000/-లు నగదును కూడా బహూకరిస్తున్నారు.
అంటే విజేతకు అందరితోపాటు రూ.1000/- లు , అవార్డు కింద రూ.5000/- లు మొత్తం రూ.6000/- లు
చిత్తూరు జిల్లాలోని కవులు, రచయితలు ఈ అవార్డును పొందడం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు.

గత రెండు దశాబ్దాలుగా, చిత్తూరు జిల్లాలోని ప్రముఖ కవులందరూ ఈ అవార్డును పొందిన వారే.
ఒక విభాగంలో ఒకసారి అవార్డు పొందిన వారికి,అదే విభాగంలో రెండోసారి అవార్డు ఇవ్వరు.
ఇంతేకాక ప్రతి సంవత్సరం శ్రీమతి కుప్పం రెడ్డెమ్మ వర్ధంతి రోజైన జూన్ -12 వ తేదీన జిల్లాలోని కవులకు ” కథల పోటీలు ” నిర్వహించి,ముగ్గురు రచయితలు/రచయిత్రులకు ” కథా పురస్కారాలు ” ప్రదానం చేయుచున్నారు.
నగదుగా మొదటిబహుమతికి రూ.5000/-
రెండవ బహుమతికి రూ.3000/-
మూడవ బహుమతికి రూ.2000/- లు బహూకరించుచున్నారు.
ఈ అవార్డు పొందడం కోసమే ప్రతి సంవత్సరం జిల్లాలో కొత్త, కొత్త కవులు/కవయిత్రులు, రచయితలు/రచయిత్రులు తమ రచనలతో ముందుకొస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
డా.కె.రామలక్ష్మి మేడమ్ గారు ఈ సాహిత్య కార్యక్రమాలకు ప్రతి సంవత్సరం లక్షలు ఖర్చు పెడుతున్నారు.
వీరు చేస్తున్న ఈ గొప్ప కార్యం వలన కవులు అనేక సామాజిక సమస్యలు, రుగ్మతలపై రచనలు చేసి, వాటికి పరిష్కారాలు చూపుతున్నారు.
కేవలం సాహిత్య కార్యక్రమాల కోసమే అంత పెద్ద మొత్తంలో సొంత డబ్బులు డిపాజిట్ చేసి, ఖర్చు పెడుతున్న వారిని నేను ఈ ప్రాంతంలో చూడలేదు.
ఇందులో నుండి కొంత మొత్తాన్ని తండ్రి లేని ఆడపిల్లల చదువులకు ఖర్చు పెడుతున్నారు.
ఈరోజుల్లో ఇలాంటి సేవాభావం ఉన్న వారు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు.
నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, తెలుగు భాషను బతికించడానికి డా.రామలక్ష్మి మేడమ్ లాంటి వారు జిల్లాకు ఒకరు ఉంటే చాలు అనీ !
కవులందరూ ఆమెకు చేతులెత్తి నమస్కరించడం తప్ప, బదులుగా ఆమెకు ఏమి ఇవ్వగలం ?
వీరు చేస్తున్న ఈ సాహిత్య సేవ బయటి ప్రపంచానికి తెలియాలనే నేను ఇదంతా రాశాను. కాస్త ఎక్కవైనందుకు కవులు/కవయిత్రులు మన్నించాలి ! !
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
— పఠాన్ ఖాదర్ వలి
వ్యవస్థాపకులు
మదనపల్లె సాహితీ కళావేదిక

Leave a Reply

%d bloggers like this: