Site icon వసుంధర అక్షరజాలం

నివేదికః 11వ అమెరికాతెలుగు సాహితీ సదస్సు

దిగ్విజయంగా జరిగిన 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

2019 నవంబర్ 2, 3.  ఓర్లాండో మహా నగరం, ఫ్లారిడా

ఓర్లాండో మహా నగరం లో 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు విజయవంతంగా ముగిసింది. ముందు చెప్పవలసిన నా మాట ఆఖర్న చెప్తాను….అంత వరకూ ఓపికగా ఈ సదస్సు సమీక్ష చదవండి. ఫొటోలు చూడండి. వీడియోలు వీక్షించండి….

ఇక ఫ్లారిడా లో, అందునా ఓర్లాండో లో జరిగిన మొట్టమొదటి తెలుగు సాహితీ సదస్సు మీద నా పరోక్ష సమీక్ష:

ప్రారంభ సభ:

ప్రధాన సమన్వయ కర్త మధు చెరుకూరి గారి నిర్వహణ లో జరిగిన ప్రారంభ సభలో భారత దేశం నుంచి మొదటి సారిగా అమెరికా ఆహ్వానిత అతిధులుగా విచ్చేసిన ‘శతావధాని” డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ, శ్రీమతి జ్యోతి వలబోజు గారు,  చెరుకూరి రమాదేవి, ఎస్. నారాయణ స్వామి, వంశీ రామరాజు గారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయగా, రాధికా నోరి ప్రార్ధనా గీతంతో సభ శుభారంభం అయింది. ఓర్లాండో మహా నగర తెలుగు సంఘం (TAGO) అధ్యక్షులు నరొత్తమ్ జీడిపల్లి సభికులకి స్వాగతం చెప్పగా, ప్రధాన అతిధుల సముచిత ప్రసంగాలు, ముఖ్యంగా డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ, చెరుకూరి రమా దేవి గారు, జ్యోతి వలబోజు, నారాయణ స్వామిల ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఓర్లాండో మహా నగరం లో బాలబాలికలకి తెలుగు నేర్పుతున్న ఉపాద్యాయులకి (సత్య మంతెన, చంద్రశెఖర్ అయ్యలరాజు, ప్రవీణ పల్లమరెడ్డి, సారిక శ్రీరామ్, ధరణి ఎర్రా) చిరు సత్కారం జరిగింది.

పుస్తకావిష్కరణలు:

మూడు విడతలలో జరిగిన పుస్తకావిష్కరణ వేదికలలో ఈ క్రింది నూతన గ్రంధాలు ఆవిష్కరించబడ్డాయి. సదస్సుకి వచ్చిన ప్రతినిధులకి ఇచ్చిన నమోదు సంచీలో ఇంచుమించు ఈ గ్రంధాలు అన్నీ ఉచితంగా బహూకరించబడ్డాయి.  

వంగూరి సంస్థ ప్రచురణలు: అమెరికా తెలుగు కథానిక -14: అమెరికులాసా కథలు (వంగూరి చిట్టెన్ రాజు); నాట్య  భారతీయం (ఉమా భారతి కోసూరి)కాళీ పదములు & కాకీక కాకికి కాక (పాలపర్తి ఇంద్రాణి); తెన్నేటి సుధ కథలు: “రంగంటే ఇష్టం”(చాగంటి తులసి); చైతన్యం కథలు (సుధేష్ణ సోమ), “కంటి వైద్యం లో ప్రాచీన భారత దేశం విజ్ఞాన సంపద” (డా. వి.కె.రాజు); తెలుగే గొప్ప భాష -కానీ కనుమరుగౌతున్నది (పారుపల్లి కోదండ రామయ్య)  

ఇతర ప్రచురణలు: కొత్త కథలు-2019;  ప్రవాసాంధ్రుని పరి వేదన: డా. జి.వి.ఆర్.కె.శర్మపాలంకి కథలు – డా. శారదా పూర్ణ: “కళల కాణాచి”- డా. ప్రభల జానకి; రాజీవ నేత్రుడా” అయ్యప్ప స్వామి మధుర గీతాల సీడీ

అట్లాంటా నుంచి వచ్చిన పెమ్మరాజు లక్ష్మీ రావు గారు బాపు గారి 36 తిరుప్పావై పంచ రంగుల వర్ణ చిత్రాల అల్లిక ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.  

ప్రసంగ వేదికలు:

ఈ రెండు రోజుల సభలో జరిగిన ప్ర్రసంగ వేదికలు ఎస్. నారాయణ స్వామి సమర్ధవంతమైన నిర్వహణలో జరిగాయి. ఆ వేదికలలో రచయితలు సుమారు 75 మంది సభికుల సమక్షం లో ఎంతో ఉత్సాహంతో ఈ క్రింది సాహిత్య ప్రసంగాలు చేశారు. వీరిలో కనీసం పది, పదిహేను మంది ఫ్లారిడా రాష్త్రం వారే కావడం చెప్పుకోదగ్గ విశేషం.

జ్యోతి వలబోజు: అంతర్జాలంలో తెలుగు ప్రస్థానం

అత్తలూరి విజయ లక్ష్మి: శరత్ నవలలో శ్రీకాంత్

ప్రభల జానకి: కురు వంశ కుల వధువులు……ధర్మ మూర్తులు

పద్మ వల్లి: కథ చెప్పడం ఓ కళ !

సుభద్ర వేదుల:కథల్లో కొత్త వస్తువులు కావాలా? కావలిస్తే అవి ఏమిటి? 

లలితా త్రిపుర సుందరి: బ్లాగెడివి కబుర్లట !:

ఇంద్రాణి పాలపర్తి: ‘కథా రచనలో లోపాలు-కారణాలు

శ్రీనివాస్ నాగులపల్లి: “వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం పై ఒక అవలోకనం”

భాస్కర్ పులికల్: నా సాహిత్య ప్రయాణం
మధిర మూర్తి: ఆంధ్ర సాహిత్య మకుటము – పోతన భాగవతము

రాధిక నోరి: నా కథలు-సామాజిక స్పృహ

శ్రీనివాస్ సత్తిరాజు: ఆధునిక తెలుగు కవిత్వంలో “నేను” పదప్రయోగం.

భూషణ్: కవిత్వం ఎందుకు చదవాలి ??; 

ఎస్.నారాయణ స్వామి: నిడదవోలు మాలతి సాహిత్యం

వంశీ రామరాజు: గుర్తుకొస్తున్నారు: సినారె, రాయప్రోలు;  

ఉమా భారతి: సర్వకళా సారం సాహిత్యం

శారదా పూర్ణ శొంఠి: నేను , నా రచనలు, నా ప్రచురణలు 

అపర్ణ యేలూరిపాటి:సాహిత్యం లో కుటుంబ వ్యవస్థ.

భరద్వాజ కిశోర్: వలస వచ్చిన సంస్కృతి

విన్నకోట రవిశంకర్:  “కవిత్వంలో ఆశావాదం, నిరాశావాదం”

ప్రత్యేక ప్రసంగాలు, స్వీయ కవితలు: ‘శతావధాని’ డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ; శారద కాశీవజ్జుల తదితరులు.

కథాపూరణ:

మా ఆనవాయితీ ప్రకారం నారాయణ స్వామి నిర్వహణలో అతను ఎంపిక చేసిన ఒక కథని సగం తుంచేసి మొదటి రోజున అందరికీ ఇచ్చి, ఆ కథని పూరించమని అడుగుతాం. ఆ మర్నాడు దానికి వచ్చిన సభికుల స్పందనలలో న్యాయ నిర్ణేతలకి నచ్చిన మూడు పూరణలకి బహుమతులు ఇస్తాం. ఈ సారి ఆ పోటీలో ఈ క్రింది వారు బహుమతులు అందుకున్నారు:

ప్రధమ బహుమతి: శారద కాశీవఘ్ఘుల (కాలిఫోర్నియా)

రెండవ బహుమతి; శ్రీనివాస్ నాగులపల్లి (ఓర్లాండో)

మూడవ బహుమతి; జ్యోతి వలబోజు (హైదరాబాద్)  

మొదటి రోజు ప్రసంగ వేదికల అనంతరం పురస్కార సభలో ఈ క్రింది ఆత్మీయ సత్కారాలు జరిగాయి.  

జీవన సాఫల్య పురస్కారం:

అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారిని సగౌర్వంగా గుర్తించి సత్కరించే సాంప్రదాయం లో ఈ 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ప్రముఖ రచయిత సత్యం మందపాటి & విమల దంపతులకి జీవన సాఫల్య పురస్కారం శోభాయమానంగా జరిగింది.

భారత దేశ ఆహ్వానిత అతిధుల పురస్కారం:

మొదటి రోజు సాయంత్రం జరిగిన పురస్కార సభలో భారత దేశ అతిధులైన డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ, జ్యోతి వలబోజు, ప్రభల జానకి, అత్తలూరి విజయ లక్ష్మి గార్లకి ఆత్మీయ జ్ఞాపిక తో చిరు సత్కారం జరిగింది.

నిర్వాహకులకి సభికుల ధన్యవాదాలు:

 ఈ సదస్సు నిర్వహణ లో ప్రధాన సమన్వయ కర్తగా అన్ని ఏర్పాట్లూ చేసి, సభ విజయవంతం గా జరగడానికి ప్రధాన కారకుడైన మధు చెరుకూరి కి కుటుంబ సమేతంగా ఆత్మీయ జ్ఞాపిక తోటీ, టాగో సంస్థ అధ్యక్షులు నరోత్తమ్ జీడిపల్లి, ఇతర అధికారులకీ దుశ్శాలువల తో సత్కరించి సభికులు తమ ధన్యవాదాలు తెలుపుకున్నారు.

ఘంటసాల ఆరాధనోత్సవాలు:  

సాహితీ సదస్సు అనంతరం 12వ ఘంటసాల ఆరాధనోత్సవాలు -9వ బాలూ సంగీతోత్సవ కార్యక్రమం లో ‘అపర ఘంటసాల” బాల కామేశ్వర రావు (హైదరాబాద్), శారద ఆకునూరి (హ్యూస్టన్), రాధిక నోరి (టాలహస్సీ), సత్య కడాలి (కొలంబియా, NC)ల సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. వంశీ రామరాజు గారు హైదరాబాద్ లో గత 31 సంవత్సరాలగా నిర్వహిస్తున్న దివ్యాంగ బాలబాలికల సంక్షేమ సంస్థ వేగేశ్న ఫౌండేషన్ కి విరాళాల సేకరణ కోసం జరిగిన ఈ కార్యక్రమానికి శ్రోతలు ఉదారంగా స్పందించారు.

రెండు రోజుల ఎంతో ఆహ్లాదకరమైన సాహిత్య వాతావరణం లో ఆత్మీయంగా జరిగిన 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు  ఒర్లాండో మహా నగర తెలుగు సంఘం వారి వందన సమర్పణ తో విజయవంతంగా ముగిసి, ప్రతినిధులకి చిరకాల జ్ఞాపకాలని మిగిల్చింది.

కొస మెరుపు:

నమ్మండి, నమ్మక పొండి….ఈ 11వ సాహితీ సదస్సుకి నేను…అవును, నేనే వెళ్ళ లేదు. వెళ్ళలేదు అనే కంటే వెళ్ళలేక పోయాను అనడం నిజం. నిజానికి గత వారం, పది రోజులుగా నాకు ఆరోగ్యం అదోలా ఉంటే బుధ వారం (అక్టోబర్ 29) న వైద్య పరీక్షలు చేయించుకున్నాను. సదస్సుకి రెండు రోజులు ముందే వెళ్ళాలి కదా అని తయారు అయి, గురువారం పొద్దున్నే (అక్టోబర్ 30) న హ్యూస్టన్ లో విమానాశ్రయానికి బయలుదేరుతూ ఉండగా నా ప్లైట్ రద్దు అయినట్టు ఆ ఎయిర్ లైన్ వారు మెసేజ్ పంపించారు. హారినీ అనుకుని ఆ మర్నాడు శుక్రవారం ఓర్లాండో వెళ్ళడానికి మరొక ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. అంతలోనే “మొన్నటి పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. నువ్వు ఫెయిల్ అయ్యావు. అంచేత ఇవాళ సాయంత్రం అర్జంటుగా ఆసుపత్రిలో చేరిపోవాలి. ఏర్పాట్లు అన్నీ చేసేశాను సుమా” అని మా కార్డియాలజిస్ట్ డాక్టరమ్మ ఫోన్ చేసి ఆర్డర్ వేసింది. ఇక తప్పదురా బాబోయ్ అనుకుని ఈ సదస్సు నిర్వహణలో నాకు అన్ని విధాలా సహకరిస్తున్న మధు చెరుకూరి ని పిలిచి అన్ని బాధ్యతలూ అప్పగించి, అలాగే ఆ డిట్రాయిట్ మిత్రుడు నారాయణ స్వామికి కూడా కార్యక్రమ నిర్వహణ లో సహాయం అడిగి, నా ప్రయాణం రద్దు చేసుకుని ఆ రాత్రి ఆసుపత్రిలో చేరిపోయాను. మర్నాడు వాళ్ళు అదెదో ఏంజియో ట…అది చేసి, అక్కడెక్కడో ఓ గొట్టాం లో 80 శాతం అడ్డుగోడ ఉందిట, దానికి విరుగుడుగా అదేదో అదేదో స్టెంట్ ట…అది పెట్టి, ఒక రోజు ఆతిధ్యం ఇచ్చి శనివారం (నవంబర్ 2..సదస్సు మొదటి రొజు) మధ్యాహ్నం ఇంటికి పంపించేశారు సదరు ఆసుపత్రి వారు.

సదస్సు ప్రతీ నిమిషం ప్రణాళికా నాదే చేశాను కాబట్టీ, ఫొటోలూ, వీడియోలూ అనుక్షణమూ నాకు అందాయి కాబట్టీ అంచేత ఓర్లాండో లోనే ఉన్నట్టు అనుకోబట్టీ, అందరూ నాకు ఫోన్లు చేసి విశేషాలు చెప్పబట్టీ ఇప్పుడు ఈ సమీక్ష అంతా వ్రాయగలిగాను. ఇందులో తప్పులు ఉన్నా, ఇవే కాక ఇంకా జరిగిన మరికొన్ని ప్రసంగాలూ, ఇతర విశేషాలూ లేక పోయినా నన్ను మన్నించండి. త్వరలోనే సభా విశేష సంచికలో అన్ని వివరాలూ ప్రచురిస్తాం.

గత పాతికేళ్ళగా, అమెరికాలో మా సంస్థ నిర్వహించిన వాటిల్లో నేను వ్యక్తిగతంగా పాల్గొనని ఏకైక సాహిత్య సమావేశం ఇదే. ఈ సదస్సు ఘన విజయం చూసి నేను ఉన్నప్పటి కంటే, లేనప్పుడే ఈ సమావేశాలు బాగా జరుగుతాయేమో అనే అనుమానం వచ్చేస్తోంది, కానీ అది మంచిదేగా!

ఈ సదస్సు విజయవంతంగా జరగడానికి కారకులైన అందరు ప్రతినిధులకీ, వక్తలకీ, రచయితలకీ, నిర్వాహకులకీ, టాగో సంస్థ వారికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. అభినందనలు. నా ఆరొగ్యం గురించి ఆందోళన పడి సందేశాలు పంపించిన అనేక మంది శ్రేయోభిలాషులకి “ఇప్పుడూ భేషుగ్గానే ఉన్నాను” అని తెలియజేస్తూ వారి అభిమానానికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మధు చెరుకూరి పూనుకోనిదే ఈ సమావేశం జరిగేది కాదు….అతనికీ, అతని కుటుంబానికీ ఆశీస్సులు..ధన్యవాదాలు.

 నాకు అందుబాటులోకి వచ్చిన ఈ సదస్సు తాలూకు కొన్ని ప్రసంగాల వీడియోలు, ఫొటోలు ఇందుతో జతపరుస్తున్నాను. ..మీ కోసం.  

వీడియో లంకెలు:

శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి ప్రారంభ ఉపన్యాసం.

అవధాని గారి సత్కారం: https://www.youtube.com/watch?v=8UpCMJ084eg&feature=youtu.be

 ఎస్. నారాయణ స్వామి: https://www.facebook.com/padmavalli99/videos/10214461060352602/

 భూషణ్: https://www.facebook.com/padmavalli99/videos/10214460825546732/

 లలితా త్రిపుర సుందరి: https://www.facebook.com/nasysan/videos/10217991006099318/

 ఇంద్రాణి పాపపర్తి: https://www.facebook.com/nasysan/videos/10217991100861687/

 పద్మ వల్లి: https://www.facebook.com/nasysan/videos/10217990609769410/
భవదీయుడు, 
వంగూరి చిట్టెన్ రాజు

Exit mobile version