మార్చి 3, 2020

బాలసాహిత్యానికి మాడభూషి పురస్కారం

Posted in కథల పోటీలు, బాల బండారం, రచనాజాలం, సాహితీ సమాచారం at 7:51 సా. by వసుంధర

ఆబాలగోపాలాన్నీ రంజింపజెయ్యడం బాలసాహిత్యం ప్రత్యేకత. రామాయణ భారత భాగవతాలతో సహా – ప్రసిద్ధ రచనలన్నింటికీ మూలకథ బాలసాహిత్యమే!

తెలుగునాట బాలసాహిత్యంలో చందమామ మాసపత్రికది ఓ ప్రత్యేక స్థానం. బాలసాహితీపరుల్లో చందమామ రచయితలది మూసకు అందని అద్భుత కల్పనా ప్రతిభ. సమకాలీన సాంఘిక, రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతూ, ప్రపంచతంత్రం పట్ల అవగాహన కలిగిస్తూ, వినోదానికీ, మానసిక వికాసానికీ దోహదం చేసే ఆ కథలు నాణ్యతలో పంచతంత్రానికి దీటైనవి.

చందమామ రచయితల్లో విశిష్టులైనవారిలో మాచిరాజు కామేశ్వరరావు ఒకరు. పిశాచాల పాత్రలతో – బాలలను ఆకర్షించే ఆసక్తికరమైన అపూర్వ కల్పనతో – ఆయన అల్లిన కథలు బాలసాహిత్యానికి కలికితురాయిగా నిలిచిపోతాయి. వారు రంగాచార్య స్మారక బాలసాహిత్య పురస్కార గ్రహీత కావడం ఎంతో సంతోషంగా ఉంది.

బాలసాహిత్యపు విశిష్టతను గుర్తించి, ఇటు బాలల్లో సాహితీ ప్రతిభను వెలికి తియ్యడానికి పోటీలు నిర్వహిస్తూ, అటు బాలసాహితీపరులను సత్కరించాలనుకున్న శ్రీమతి మాడభూషి లలితాదేవి ఆశయం ఎందరికో ఆదర్శం. ఆమెకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.

Leave a Reply

%d bloggers like this: