ఏప్రిల్ 6, 2020

కరోనాపై కదనం – ఏప్రిల్‌, 4 ఫలితాలు

Posted in కథల పోటీలు, కవితాజాలం, సాహితీ సమాచారం at 4:31 సా. by వసుంధర

లంకె

ప్రథమ బహుమతి
నర తోటలోన మనిషి కాలు మోపాల!
మాకోసం బాధ పడకండి
మీకోసం మీ పిల్లల కోసం ఆలోసించండి!!
ఇంటవతల కంటికి కానరాని పాము పాకుతోంది!
ఇప్పుడిప్పుడే రెక్కలాడుతున్న పిల్ల పిచ్చుకలను 
ఇంటి గూటిలోనే ఎగరనివ్వండి !
పాడు గాలికి రాలిపోకుండా పండుటాకుల్ని
పదిలంగా సూసుకోండి !
ఇల్లు దాటి ఎక్కడికీ ఎళ్లకండి !

మాకోసం బాధపడకండి
మీకోసం మీ పిల్లల కోసం ఆలోసించండి !
మేము ఇల్లు దాటినప్పుడు 
మా పిల్లల గోస పట్టకూడదు పగోడికైనా !
అయినా మీరందరూ బతికి బట్టకట్టాల కదండీ
ఆద మరిసిపోకండి! ఆపదలో పడకండి!
మా సేతుల్లో సీపుర్లున్నాయి ఫరవాలేదండీ
మీరు మాత్రం మాటి మాటికీ 
మోసేతుల వరకు సబ్బుతో కడుక్కోవడం మానకండి!
ఇల్లు దాటి ఎక్కడికీ ఎళ్లకండి!

మాకోసం బాధపడకండి
మీకోసం మీ పిల్లల కోసం ఆలోసించండి!
కాసేపు వంటింటి కాసి కాలు కదపండి
బియ్యపు గింజలు బువ్వ పువ్వులై
పొయి మీద ఎలా పూస్తాయో సూడండి!
మీ ఆవిడి సేతిలో పడి పాసి గిన్నెలు
పంచదార సిలకల్లా ఎలా కనబడతాయో
కాసింత సాయపడి సంతోషాలను 
తలో పిడికెడు పంచుకోండి!
ఇల్లు దాటి మాత్రం ఎటూ ఎళ్లకండి !

మాకోసం బాధపడకండి
మీకోసం మీ పిల్లల కోసం ఆలోసించండి!
ఎంత కాలమయ్యిందో ఇంటి స్వర్గంలో
చంటి పిల్లలతో కలిసి సరదాలు ఒంటికి రాసుకోవడం!
కట్టుకున్న ఇల్లాలితో కష్టసుఖాలు కలబోసుకోవడం
పది నెలలు కడుపున మోసి 
యవ్వనం వెలిసిపోయి ఏళ్లు మింగిన మునీశ్వరులు
ఇంటిలో ఉన్నారని ఎరుక తెచ్చుకోవడం !
మనసులో దాగివున్న మాటల్ని చెవిలోకి ఒంపుకోవడం!
అందుకే ఇల్లు దాటి ఎటూ ఎళ్లకండి !

మాకోసం బాధ పడకండి
మీకోసం మీ పిల్లల కోసం ఆలోసించండి!
కలిసిపోయిన పేణాలు గాల్లో కలిసిపోయినా
నర తోటలోన మనిషి మళ్లీ కాలు మోపాల
నవ్వుల పువ్వుల పంట పండించడానికి
నలు దిక్కులా కమ్ముకున్న చీకట్లను చిమ్మడానికి
సీపుర్లను సిచ్చుబుడ్డీల్లా ఎలిగించుతాం
ఇల్లు దాటి ఎటూ ఎళ్లకండి!
(పారిశుద్ధ్య కార్మికుల పాదాలకు నమస్కరించి)
– చింతా అప్పల నాయుడు, విజయనగరం, 94417 13185

ఈ కవితను వినాలనుకుంటే…


ద్వితీయ బహుమతి
అక్కడ వాళ్లు
మనమంతా 
స్వయం ఖైదీలమై భద్రమైన గదుల్లో ఉన్నామంటే
భౌతిక దూరాలమై 
ఇంత కునుకైనా తీస్తున్నామంటే
అక్కడ వాళ్లు
రాత్రీ పగళ్లని 
కంటి రెప్పల మీంచి తుడిచేస్తూ
వైరస్‌ను స్టెతస్కోప్‌తో
జుట్టు పట్టి ఈడ్చేస్తూ చావును రద్దు చేస్తున్నారు.
మనమంతా తెగిన బంధాలను పేనుకుంటూ
సరదాలు పంచుకుంటుంటే
అక్కడ వాళ్లు
తమని తాము కరిగించుకుంటూ
వృత్తిని కొవ్వొత్తిలా హరించుకుంటూ
ఇంటింటికి కరోనాను గాలిస్తున్నారు
ఆరోగ్యదాతలు నర్సులు ఆయాలు.
మనమంతా
కనీసాలతో కులాసాగా
కాలం వంతెనను దాటుతుంటే
వాళ్లక్కడ
ఇండ్లే రోడ్లై రోడ్లే ఇండ్లయి
ఊపిరి సంచులే మాస్కులై
నగరాల మురికిని కడిగేస్తున్నారు
కాంతి లేని చూపులు కళ లేని రూపాలు
స్వచ్ఛ భారతీయ సఫాయికారులు.
మనమంతా
గంప కింద పిల్లల కోళ్లమై సేదదీరుతుంటే
అక్కడ వాళ్లు
ఇంటికి సెల్యూట్‌ కొట్టి
పిల్లల చిరునవ్వుల్ని చూపులతో ముద్దాడి
చెమటలో ఈదుతున్నారు సంఘ రక్షకులు.
మనమంతా
గూట్లోనే ఒకరినొకరు ధైర్యాన్ని నింపుకుంటుంటే
అక్కడ వాళ్లు
నిద్రని ఇంట్లో తగలేసి
సమాచార సేకరణలోనే
కుటుంబానికి కొత్త ముఖాలవుతున్న విలేకరులు.
వీళ్లూ మనుషులే
మనసులు మాత్రం మహోన్నతం
వీళ్లూ మనలాంటి వాళ్లే
హృదయాలు మాత్రం మానవీయం
వీళ్లే మన నిర్భయ జీవితాలకు ఆయువులు
వీళ్లే మన ఇప్పటి యుద్ధ వీరులు.
– డా।। ఉదారి నారాయణ, ఆదిలాబాద్, 94414 13666

ఈ కవితను వినాలనుకుంటే…


తృతీయ బహుమతి
బృందగానమై
బుగులు పడుతున్న వీధిలో నిశ్శబ్దం 
జరజరా పాకుతూ వచ్చి రాకాసి వాయులీనగీతమై 
చీలిక చీలికలుగా చుట్టేస్తూ ఉంటుంది 
ఇప్పుడు యుద్ధం అంటే… 
పౌరుషాల నడుమ నిన్ను నువ్వు చాటుకోవడం కాదు .
కత్తుల మొనలకు శత్రువులను వేళ్లాడేయడం కాదు. 
రక్తపు ఏరులలో నిట్టనిలువుగా నిలవడం కాదు. 
కుట్రల కుతంత్రాల కుళ్లు వలయాలు కాదు 
పగ కాదు..ప్రతీకారం కాదు 
నీ సమస్త వికారాల వికృత బతుకును 
ఒక్క పరాన్న జీవి వెక్కిరిస్తున్నది 
గాలి విషపు పుప్పొడిని నింపుకుని 
అగ్గి లేకుండా ప్రతి మనసులో కొలిమిని రాజేసింది 
నిన్ను నువ్వు స్పర్శించలేని నిస్సహాయతలోకి తోసి 
నువ్వేమిటో తేల్చమని సవాలు విసిరింది 
నీ కనుపాపలను మనసారా 
రెక్కలలో పొదువుకోలేనితనాన్ని రుచి చూడటం. 
రాత్రి పగలు తేడా లేకుండా శత్రువు 
నీకై అణువణువూ నిండుకొని ఉండటం 
వాడిని గెలవాలంటే.. గుండెలో ఒదిగిన కవాటంలా 
ఇంటిగూటిలో దీపం వెలిగించాలి 
ధైర్యపు ఒడ్డున నిలచి బతుకు గానం చేయాలి 
ఇప్పుడు నీది ఒంటరి నిశ్శబ్ద గానమే కావచ్చు. 
అది రేపటికి…. 
ఒక తాడుపై నిలబడిన ఒరుసపిట్టల 
బృందగానాన్ని వినిపిస్తుంది. 
ఇప్పుడు నీది స్వీయ నిర్భంధ బతుకే కావచ్చు 
అది రేపటి లోకపు 
స్వేచ్ఛాయుత బతుకు చిత్రమై 
వీధుల దారుల్లో పచ్చని లతలై పెనవేస్తుంది.
– సీహెచ్‌ ఉషారాణి, హైదరాబాదు, 94412 28142

ఈ కవితను వినాలనుకుంటే…


ప్రోత్సాహక బహుమతి (1)
ఇలాగే ఉందాం
ప్రతి మనిషిలో ఒక నిశ్శబ్దం
ప్రతి మనసులో ఒక నిస్తేజం
ప్రతి గుండెలో ఒక అలజడి

నేను నా
నాది నేనే
అనే సంకుచిత
పదాల సంకెళ్లు తెగిపడి
నా ఇల్లు
నా ఊరు
నా రాష్ట్రం
నా దేశమనే
హద్దుల్ని చెరిపేసి
నింగిని నేలని
ఏకం చేసిన ప్రపంచమా

ఇప్పుడు
నీ పెదాల వెనుక
ఒక మౌన ఉద్యమం
ఇంకో మూగ రోదన
మౌన ప్రార్థన

ప్రాణం విలువ నేర్పిన పాఠం
ప్రపంచమంతా బాగుండాలనే
విశ్వ మానవ ఘోష
కరుడుగట్టిన భూగోళపు
కంటి చెమ్మ చాటున
కనబడని ఆర్ద్రతలో
తడబడిపోతున్న
ప్రతి మనిషిని
తట్టి కాదు
కోరలు చాచిన కరోనా 
కొరడాతో కొట్టి మరీ లేపుతున్న
మానవత్వపు మట్టి వాసన
మనిషి నిజమైన 
మహా విశ్వరూపం
విశ్వ మానవ సౌభ్రాతృత్వం
భిన్నత్వంలో ఏకత్వం

అదే నేను
అదే నువ్వు
అదే మనం
ఇలాగే ఉందాము

చిమ్మ చీకట్లు చీలుస్తూ
తొలి వెలుగై
ప్రపంచాన్ని ఏకం చేస్తున్న
మానవత్వానికి
చేతులెత్తి మొక్కుదాము
అరచేతులు అడ్డుపెట్టి
ఆర్తిగా కాపాడుకుందాం
– డి.శిరీష, అనంతపురం, 99666 18242


ప్రోత్సాహక బహుమతి (2)
బచ్చగాకుంట బయటవడాలే
గత్తర ఇన్నం
గావర ఇన్నం
అడిసిపడ్తల ఊడిపడ్డ
అంటురోగంకు బిత్తరవోతున్నం
ఊర్లకూర్లను ఉక్కిరిబిక్కిరి సేత్తుంది
ఇన్నూరు దేశాలను
కన్నీరు పెట్టిస్తుంది
మునుపెన్నడూ తెలని
జడుపు పుట్టిస్తుంది
గాలి మోటార్లకెల్లి
రాలి కూసున్నది
జోలికచ్చినోని
తోలు తీస్తున్నది

పెద్దోడు లేడు సిన్నోడు లేడు
ఉన్నోడు లేడు లేనోడు లేడు
పట్నం లేదు పల్లె లేదు
అందరికంద్రం ఒట్టేసుకుందాం
నాలుగ్గోడల నడ్మిట్లకు నెట్టేసుకుందాం
కర్మగాలి రాలిపడ్డ కరోనాను
ఇకమాతు తోటే ఖతం జెయ్యాలే
అవుతలికి ఎల్లకుంట ఓల్లింట్ల గాల్లమే వుండి
కరోనా మీదికి కర్వల్‌ గురి పెట్టాలే
గుంపులొద్దు గుమిగూడుడు వద్దు
సొంపులు వెట్టుడు వద్దు
మనకు మనమే ఒచ్చొరకుండి
కరోనా ఆటల బచ్చగాకుంట బయటవడుదం
ముక్కుకు మూతికి బట్టను గట్టి
కరోనా కత్తికి డాలును అడ్డం పెడదాం
సబ్బుతోటి సక్కగ కడిగిన సేతుల్తోటి
కరోనా పురుగుకు టాటా సెపుదాం
బాంబులేసేది గాదు
భరోసా యుద్ధమిది
కత్తులు పట్టేది గాదు
మెత్తటి యుద్ధమిది
అందరు కలుసుడు మాని
గెలుసుడు ఖాయం జెయ్యాలే
కరోనాకు దొరుకకుంట
దాగుడుమూతాడాలే
యాష్టకచ్చి యాష్టకచ్చి
జెష్టపురుగు తోకముడాలే
యాడికెల్లైనా మల్ల రాకుంట
ఎనుగులు నాటి పన్గడి వెట్టాలే..
– అల్లాడి శ్రీనివాస్, మంచిర్యాల, 83416 63982


ప్రోత్సాహక బహుమతి (3)
భిన్నత్వ భారతం – ఏకత్వ పోరాటం
దేశం అడుగడుగూ భిన్నత్వం
ఆపదలో అణువణువూ ఏకత్వం
ఇది భారతీయ సౌందర్య సందర్భం

లక్షల తోపెలలు అల్లంతదూరం ఇసిరి
గృహనిర్బంధాల ఎరలు వేసి
కరోనాను ఒడుపుగా పట్టేద్దామని
బెస్తోల్ల రంగయ్యమామ ఇకమతు

ఇంటిమడిలో శుభ్రత ఇత్తులలికి
సానిటైజర్ల ఎరువుల్లో
ప్రపంచారోగ్యాన్ని దిగుబడి చేద్దామని
కాపురాజయ్య తాత ఆరాటం

మూలకేసిన పెద్దబాడిశెను
వడ్లముత్తయ్య కాక దుమ్ముదులిపిండు
మరల్లో ఇరికిన మనుషుల వంకరబుద్ధులు చెక్కి
ఆరోగ్యవ్రతం పీటను పొందిస్తండు

లాక్డౌన్‌ క్వారంటైన్ల సరిపేకలపై
ఇక్కతు ముగ్గుల ఇగురంబన్నిండు
పురుగుల నుండి చిలుకల చీరెలకోసం
శాలోల్ల మల్లేశంది శాన్నాల్ల తిప్పలు

మనిషి మనిషినీ ఇటుకలుగా పేర్చి
అనురాగాప్యాయతల సిమెంటు కూర్చి
బంధాల గోడలతో ఆరోగ్యాల కోటలు
ఉప్పరి మల్లయ్యది ఉడుంపట్టు

మోకుముత్తాదులతో గండాలను గట్టెక్కడం
కుటుంబ గెలలకు కట్టడి కుండలు
కత్తుల వంతెనలపై కరోనా దాటేయడం
గౌండ్లోల్ల ఎంకన్నది గట్టి గడుసుతనం

దాగెరలో పిల్లల్నిబెట్టి కాపుగాయడం
సాంఘికదూరాల సల్లకవ్వంతో
కష్టాలను చిలికి నవ్వుల మీగడ తీయడం
గొల్లోల్ల రాజకొమరుది కొండంతధీమ

వాముశకలో క్రిమిశకలాలను కాలబెట్టి
ఇంటింటా ఆరబోసిన మనుషుల మట్టితో
విశ్వంనిండా నవ్వుల దొంతరలు పేర్చగ
సారెను గిరగిర తిప్పుతున్న కుమ్మరి కొండన్న

చెరిగిపోయిన సరిహద్దుగీతలు
లక్ష్యం గీసుకున్న లక్ష్మణరేఖలు
అంతర్థానమైన అంటరానితనాలు
ఆవాసాల్లో మొలిచిన అనాది ఆచారాలు
కరోనా సమరంలో సాగుతున్న సబ్బండవర్గాలు
ఏకత్వపోరాటంలో సజీవం భిన్నత్వ భారతం.
– దాసరి శ్రీధర్, కరీంనగర్, 70133 50993


ప్రోత్సాహక బహుమతి (4)
రేపటికోసం
ఇంటి దర్వాజల్ని బంద్‌ చేశాను, 
గవాక్షాలకు గడియలు వేసేశాను.
అంతరంగానికి రెప్పలు తొడిగి అంతర్నేత్రాన్ని తెరిచాను.
రేపు వేయాలనుకునే కోటానుకోట్ల అడుగుల కోసం
ఇప్పుడే, ఇక్కడే లక్ష్మణరేఖ దాటి
ముందుకు అడుగులు వెయ్యడం ఆపేశాను.
ప్రతి క్షణం నన్ను నియంత్రించాలనుకొనే 
కాలం పొగరుకు కళ్లెం వేసి
నన్ను నేను కట్టడి చేసుకుని 
స్వీయ నిర్బంధపు తాళంతో బిగించాను.
నా రెప్పల మధ్య పుట్టుకొచ్చే 
స్వప్నాల్ని సాకారం చేసుకునేందుకు
ఈ రోజు యోగనిద్రలో కాసేపు ధ్యానిస్తున్నాను.
స్వచ్ఛమైన పల్లెగాలి గుండెల నిండా నింపుకోవాలంటే,
ఈ నాలుగు గదుల మధ్య కొట్టుకుంటున్న గాలిని 
అయిష్టంగానే కావలసినంతే, కొంచెంగానైనా పీల్చుకోవాలి.
రేపటి దీపాల వెలుగు లోకానికి పంచడం కోసం
ఈ రోజు చీకట్లో మగ్గడానికైనా సిద్ధపడుతున్నాను.
నిన్న నాటిన సంతోషం విత్తనాలు 
రేపు మొక్కలుగా మొలకెత్తటానికి
ఈనాడు కొన్ని కన్నీటి చుక్కలు 
ఆ మొక్కల మొదట్లో పోయాలి.
రేపటిమీద ఆశ చిగురించడానికి
ఈ రోజు నిరాశ నిలువెత్తున కమ్మినా నిభాయించుకుంటున్నాను.
రేపటి కోసం ఈ రోజు క్షణక్షణాన్ని
అగ్నికణంలా నాలో నేనే రాజేసుకుంటున్నాను.
రేపు జీవితంలో శిఖరాల్ని అధిరోహించేందుకు
ఈ రోజు అలసిపోకుండా శక్తిని 
పొదివి పట్టుకుని పొదుపు చేసుకుంటున్నాను.
రేపు పదాల్ని గులాబీ గుచ్చి గీతాలుగా మార్చేందుకు
ఈ రోజు మాటల్ని పోగు చేసుకుని 
నా మనసులో పదిలపరుస్తున్నాను
ఇప్పటి నా మౌనం కాసేపే, కొన్నాళ్లే.
ఇప్పటి నా నిశ్శబ్దం కొన్ని క్షణాలే.
రేపటి జయకేతనం జెండాగా చేసి ఎగరేసేందుకే.
రేపు బతకడం కోసం, రేపట్ని బతికించడం కోసం
ఈనాడు మృత్యువుతో యుద్ధం చేస్తున్నాను.
రేపటి శాశ్వత గెలుపుకోసం, 
తాత్కాలికంగా ఓటమికి ఓటేస్తున్నాను.
రేపుని రక్షించుకోవడం కోసం,
ఈ రోజు ఆంక్షల కంచెని చుట్టూ అల్లేసుకుంటున్నాను.
ఓ నాలుగు రోజులు గడిస్తే నేను, నేను కాదు
నేను మామూలు మనిషిని కాదు,
చావుని చీకటి రేవు దాటించి
తూర్పున బతుకు కిరణాల్ని ప్రసరింపజేసే మృత్యుంజయ సూర్యుణ్ని
– పెమ్మరాజు విజయరామచంద్ర, హైదరాబాదు, 98497 44161


ప్రోత్సాహక బహుమతి (5)
మనిషి నుంచి మనుషులకు
నా ఊపిరిని నేను నమ్మకూడదు
పచ్చని కొమ్మలలాంటి చేతులతో
సూర్యుడో లేదా చంద్రుడో లేదా 
నక్షత్ర కూటమి లాంటి ముఖాన్ని తడుముకోకూడదు
మట్టినో, నీటినో, విచ్చుకున్న ప్రకృతినో సృజించినట్లు
మనిషిని స్పర్శించకూడదు.
ఒక గుడ్డ పేలికలో ప్రాణాన్ని మూటకట్టుకొని
రాలిపోతున్న చేతులను నిర్మించుకుంటూ
ముఖాలలోకి తొంగి చూడకుండా
అడవి బాట పట్టాలి.
అనుమానపు చూపులను మోసుకుంటూ
అభద్రతా తీగలపై నడుచుకుంటూ
మనుషుల మధ్య కాసిన్ని నిప్పులు రాజేసుకొని
దూర దూరంగా
నాలోకి నేను ఇమిడిపోవాలి లేదా
నాలుగు గోడల మధ్య మోడైపోవాలి
ఇప్పుడు
మనుషులు రాతి శిల్పాలవ్వాలి
ఒకటి: నిన్ను నువ్వు కోల్పోకుండా ఉండటానికి
రెండు: రాలుతున్న శరీరాలను దయ లేకుండా చూడటానికి
మరి చలనం!
మర మనుషులు ఉన్నారుగా….
అక్కడో విశాలమైన చెట్టు.
వేళ్లు, కొమ్మలు, ఆకులు, ఆకుల కింద నీడలు, 
నీడల్లో ఊగిన ప్రపంచాన్ని కోల్పోతోంది.
భగ్గుమన్న భీతి;
మరణం మరణం మరణం
నదుల్లాంటి కన్నుల్లోనో, తలుపుల్లాంటి కనురెప్పల్లోనో 
శూన్యం లాంటి చూపుల్లోనో, భూమి లాంటి నోటిలోనో, 
రహదారుల్లాంటి హస్త రేఖల్లోనో, 
రెండు వేళ్ల సందుల్లోనో, పాములు పాకుతున్నాయి.
పాముని పెంచిందెవరు?
పామును చూపి భయపెడుతోందెవరు?
పాముని చూసి భయపడుతున్నదెవరు?
పాముని నిందించి ఏం లాభం
కరోన కోరలను పెంచింది-
మనిషే
నేటి విధ్వంసం వెనుక
నిన్నటి ధర్మాగ్రహం
జాలి, దయ, కరుణ
మనుషులపై మనుషులకు ఉండకూడదు 
అదే దాని కర్తవ్యం.
మరి పరిష్కారం!
సంఘటితంగా ఎదుర్కోవడమే.
– జాని తక్కెడశిల, బెంగళూరు, 72595 11956 

Leave a Reply

%d bloggers like this: