ఏప్రిల్ 8, 2020

క‌రోనాపై క‌ద‌నం – ఏప్రిల్, 5 ఫ‌లితాలు

Posted in కథల పోటీలు, కవితాజాలం, సాహితీ సమాచారం at 12:57 సా. by వసుంధర

లంకె

ప్ర‌థ‌మ బహుమతి 
మనిషితనం మొలకెత్తాలిప్పుడు 
వివక్షలేవీ చెప్పనక్కరలేదు
అన్ని దేశాల సరిహద్దులు బెదిరిపోయాక
మనం యిప్పుడు మనిషి వాసన వేస్తే చాలు
విశ్వవేదికపై ఒక మహమ్మారి
మరణ మృదంగం మోగిస్తూ
కరోనా నామ కరాళ తాండవం చేస్తూ
మనిషిని సమూహం నుంచి వేరుచేసి
ఏకాంతవాసపు ఏకాకిని చేసింది
శతాబ్దపు మానవ తప్పిదాల జాబితా
శతాధికం అయ్యాక…
పువ్వు పరిమళం కోల్పోయిందనీ
మట్టివాసన మసిబారిందనీ
మనిషితనం దారితప్పిందనీ
పసుపు నీళ్లలో ముంచిన కొరడా ఝుళిపించింది…
పచ్చని పొలాల గుండెలు కోసి
రంగుల జెండాలు పాతినప్పుడే
కొండలాంటి మనసు పిడికెడు గుండెగా మారింది
ఉమ్మడితనం నుంచి ఎప్పుడో
మనసుల్ని నిర్బంధించుకున్నవాళ్లం కదా
స్వీయ నిర్బంధ యిబ్బంది ఏముంటుంది?
గీసుకున్న లక్ష్మణ రేఖల మధ్య
మూసుకున్న గ‌ది త‌లుపుల నిశ్శ‌బ్దాల మధ్య‌
మానవత్వాన్ని సమీక్షించుకోవాలిప్పుడు
రెండుచేతులు జోడించి నమస్కారంచేసి
మనలోని సంస్కారాల్ని మేల్కొల్పాలి
ప్రతి రెండు గంటలకి చేతులు కడగటమే కాదు
మనిషికి అగ్నిస్నానం చేయించాలిప్పుడు
అదే ఆకాశం కింద
అదే ఋతువుల నీడలో
నిత్య స్ఫూర్తినిచ్చే జాతీయగీతం సాక్షిగా
మనిషితనం మళ్లీ మొలకెత్తాలిప్పుడు…!!
– డాక్టర్‌ పెరుగు రామకృష్ణ, నెల్లూరు, 98492 30443
ఈ కవితను వినాలనుకుంటే…


ద్వితీమ బహుమతి
ఐసోలేషన్‌
నేనెప్పుడు ఒంటరినే కదా?
కొత్తగా ఈ ‘ఐసోలేషన్‌’ ఏంటి?
మనిషిని మనిషి చంపుకోవడం మొదలుపెట్టినప్పుడే
ఎప్పుడో నేనొంటరయ్యాను…!!
ఆర్థిక అసమానతలు, ఆడపిల్లలపై అత్యాచారాలు
అన్నం పెట్టని చదువులు
అర్థం లేని బతుకులు
ఏవీ నాకంటనప్పుడే…
ఎప్పుడో నేనొంటరయ్యాను…!!
నా మనుగడ కోసం
మరో ఏ జీవిని లెక్కచేయనప్పుడే…
నా ఆశల కోసం
కూర్చున్న చెట్టును నరికినప్పుడే…
ఎప్పుడో నేనొంటరయ్యాను…!!
సామాజిక మాధ్యమాల సముద్రంలో
స్టేటస్‌లు, షేర్‌లతో
కాలం గడుపుతున్నపుడే…
ఇంట్లో ఉన్న సహచరికి
విషెస్‌ మెసేజ్‌ చేసినప్పుడే…
ఎప్పుడో నేనొంటరయ్యాను…!!
సామ్యవాదం, జాతీయవాదం
సామ్రాజ్యవాదం, ప్రజాస్వామ్యవాదం
అని ‘మానవీయీకరణ’ మరిచినప్పుడే
ఎప్పుడో నేనొంటరయ్యాను…!!
స్వేచ్ఛ అనే పదం అక్షరాలకే పరిమితమైనప్పుడే
మనిషికి మనిషికి మధ్యనున్న మనస్సును 
అర్థం చేసుకోలేక
విడిపోయినప్పుడే
ఎప్పుడో నేనొంటరయ్యాను…!!
మరి…?
ఇన్ని ఒంటరితనాలు అలవాటయ్యాక
కొత్తగా ఈ ‘ఐసోలేషన్‌’ ఏంటి?
‘కరోనా’ అనే రూపుమార్చుకున్నదే
కానీ…
ఇది మనిషికెప్పుడో అలవాటయ్యిందే…!!
– శ్రీపతి మారుతి, రాయికల్, 91542 38058
ఈ కవితను వినాలనుకుంటే…


తృతీయ బహుమతి 
ఆవంత భయం.. అనంత స్థైర్యం..
కరోనా ఘరానా శాకిని ఢకాఢకి ఢాకిని
ఇంద్రజిత్తు పుర్రెపర్రల్లోంచి పుట్టుకొచ్చిన జిత్తులమారి
రావణ… కాదు మైరావణ మహారావణ మహమ్మారి
భూమాత శ్వాసకోశాన్ని మూసేయాలని చూసే బొమ్మాళి
ఒక్క లక్ష్మణుడు ఒక్క ఆంజనేయుడు సరిపోరు
ఎవరికివారు కొత్త అవతారమెత్తాలి
శతసహస్రకోటి సౌమిత్రీ సామీరులు కదలి రావాలి
ఇల్లిల్లూ కుంభించి విజృంభించాలి
ఇది ఎలా సాధ్యం?
పద్నాలుగేళ్లు నిద్రాహారాలు మానేయాలా?
భానుడితో పరుగెత్తి శిష్యరికం చేయాలా?
మహాసముద్రాన్ని లంఘించాలా?
సంజీవనీ పర్వతాన్ని పెకలించి తీసుకురావాలా?
అంత అక్కర్లేదు!
ఒక్క పొడిపొడ చాలు శని ప్రవేశించడానికి
కాళ్లు శుభ్రంగా కడుక్కో!
నాన్నమ్మ మాటలు గుర్తుకు రావాలి
పాణి పాద వదన క్షణక్షణ ప్రక్షాళన ప్రప్రథమం
తాతయ్య సుద్దులు అర్థం చేసుకోవాలి
వీలుచేసుకుని ఇంటిపట్టున ఉంటేచాలు
నిపుణుల సూచనలు ఒంటపట్టించుకుంటే చాలు
మనమే వీరాధివీరులం విజయ సారథులం
మనకోసం మనం ఈపాటి చేసుకోలేమా?
నరకుని కరకు కంఠాన్ని ఉత్తరించిన మత్తకాశిని ఎవరు?
మహిషుని మర్దించిన రమ్యకపర్దిని ఎవరు?
మన వీరగడ్డమీద పుట్టిన సబలలు!
మనలోనే ఉన్నారని మరచిపోవద్దు
మహోపకారమిదం శరీరశాస్త్ర సేవలే అస్త్రశస్తాల్రు
వైద్యవిధాన వ్రాతమ్ములే కరోనా మరణ శాసన విధాత శాతమ్ములు
యుద్ధభేరి ఇంకా మారుమోగుతూనే ఉంది
విజయ శంఖారావం సేతువు వద్ద పుట్టాలని
హిమగిరులు ప్రతిధ్వనించాలని దేశం తహతహలాడుతోంది
మన నిర్భీతి మన నిర్లక్ష్యం శత్రువుకు సహస్రబాహుబలం బహుపరాక్‌
భయం! భయం! భయం!
అంత వద్దు ఆవంతచాలు! అదే అనంత స్థైర్యం
అదే శ్రేయం! అదే మనందరికీ అభయం!
– ఎర్రాప్రగడ రామమూర్తి, పినపాక, 94905 20986
ఈ కవితను వినాలనుకుంటే…


ప్రోత్సాహక బహుమతి (1) 
స్వీయ నియంత్రణ
అందరం ఇంట్లనే
కూసోని తింటే కరగని కొండలుంటయా
పిల్లలకు పాలు కూరగాయలు
మూడు పూటల సంసారం సాగేదెట్లా 
పనిలేక పన్నెండు దినాలాయే
పొద్దునపోతే రాత్రికొచ్చే పని
పండగ పూట షాపులనే
పండగనాడన్న ఇంటికాడుండవని 
మా అమ్మది ఒకటే గోసుండే
చిలుక్కొయ్యకు తగిలిచ్చిన తాళాలడుగుతున్నవి
నన్ను మర్చిపోయినవా ఏందని!
తాళాలకు కూడ యాష్టకొచ్చిందేమో!
పచ్చీసు, క్యారం, వామనగుంతలు ఎనుకటి
ఆటలన్నీ ముందల కుప్పేసుకొని కూకున్నా
ఏ ఆట ఒడుస్తలేదు పందాలట్లే మిగిలే ఉన్నవి
గడియారం ముల్లు జరుగుతున్నదిగాని
పొద్దు జరగడం లేదు
పిల్లలను ఇంట్ల ఉంచటమంటే
చిరుత పులితో సవారే
రోజంతా కాలు కడప దాటకుండా ఉండటం
ఎంతకష్టమో ఇప్పడు తెలిసింది
ఊరు చుట్టూ రంగుల రాట్నంలా
తిన్న నోరు తిరిగిన కాలేడుంటది
తపస్సుతో సమాధిలో కూసున్నట్లుంది
మహా విషాదమే గాని
రంగురంగుల పూలలా
మనుషులనందరిని ఒకే దారంలో దండల్లిన కరోన!
సినిమా పాటలు, జానపదాలు, అన్నమయ్య కీర్తనలు మూలనున్న పాటలన్ని
గోడల నుంచి చీమల బారులా టీవీలో, సోషల్‌ మీడియాలో..
కరోనా పాటల మీదనే మనసుపీక్కపోతున్నది
గుండెధైర్యమిచ్చే పాటల్ని పదేపదే వెతికెతికి వింటున్నం
నిన్నమన్న ఇల్లు నలుగురికే ఇరుకిరుకు అనిపిచ్చేది
ఇయ్యలెంత దూరందూరమున్నా ఇల్లు
విశాలంగా ఎలాస్టిక్‌లా సాగుతున్నది
మనుషులకే గాదు గోడలకూ భయమే!
ఎవరన్న తుమ్మి దగ్గినా
గుండె ఊసి కిందపడినట్లైతున్నది
దూరందూరమే ఉన్నా మాస్కులే మాట్లాడుతున్నయి
పక్కింటాయనకు పాజిటివ్‌ ఇంటెన్కాయనకు నెగెటివ్‌
మర్కజ్‌ నిజామొద్దీన్‌ వార్త దేశం కుతికే పిస్కేసినట్లైంది 
గాయాలు లేకుండా గేయాలెక్కడివి
ఎన్నో మైళ్లు నడిచిన నేలకు విపత్తులు కొత్తనా
మోడువారిన చెట్టు మొయిపెట్టినట్లు
వసంతం చిగురించి పందిరల్లుకుంటది
నాకోసం నేను గాకుండా
నలుగురికోసం నిలబడాలి
చేతులు కలపకుండా
ఎవరింట్ల వాళ్లమే ఒంటరిగా ధైర్యంగా బతకాలి 
కొత్త అనుబంధాన్ని నాటడానికి
మొక్కను అంటుగడ్తున్న 
అంటురోగం అంతుచూస్తా!
ఇప్పుడు
క్రీస్తు పూర్వం క్రీస్తు శకం గాదు
కరోనా పూర్వం కరోనా శకం!
– వనపట్ల సుబ్బయ్య, నాగర్‌ కర్నూలు, 94927 65358


ప్రోత్సాహ‌క బ‌హుమ‌తి (2)
కాంతి సంతకం
అఖండ భారతావని 
ఆత్మజ్యోతి వెలిగిందివాళ 
ప్రపంచ పటంపై అందమైన 
కాంతి సంతకం చేసింది 
కాంక్రీటు వనాలు ఒక్కసారిగా 
కాంతి పుష్పాలను ప్రసవించాయి 
పూరిపాక నుంచి ఘనభవనందాకా 
ప్రకాశ దీప్తులను ప్రసరించాయి
దిగులు తెగులును తగులబెట్టిన 
దివ్య జ్యోతులు దేశమంతా పూశాయి 
మహమ్మారికి మంట పెట్టి మట్టుపెట్టే 
క్షేమ కాంక్షలు
ప్రతి మానవ దేహమంతా పాకాయి 
ఆకాశానికి కోట్ల కాంతి పుంజాలను 
అవని బహూకరించింది 
కరోనా రక్కసి చీకట్లకు సవాలుగా 
ఆత్మ విశ్వాసపు వెలుగు హూంకరించింది 
దీపమంటే చమురూ వత్తీ వెలుగేనా?
శతకోటి హృదయాల ఐక్యతా ద్యుతి 
లక్షల కన్నుల దేదీప్యమాన ఆశాజ్యోతి 
కష్ట సమయంలో గుండెల్ని గట్టిపరచిన విశ్వాస ఖ్యాతి 
– నెల్లుట్ల రమాదేవి, వరంగల్, 94406 22781


ప్రోత్సాహ‌క బ‌హుమ‌తి (3)
‘కరోనా’ భయానికో విజ్ఞప్తి
ఇంతకుముందు
భయమేస్తే
నలుగురం ఒక చోట చేరేవాళ్లం
ఒంటరిగా లేమన్న ‘ధీమా’ కోసం
నలుగురమున్నామన్న భరోసా కోసం
సామూహిక ‘బృందగానం’తో
భయాన్ని బద్దలు కొట్టేవాళ్లం
ఇదేమిటీ కొత్త భయం
కొత్త పేరు
గుండెలనే కాదు
సమాజాన్నీ బద్దలుకొడుతోంది
అందరూ ఎవరికి వారు
ఇళ్లల్లో గోడలక్కొట్టిన శిలక్కొయ్యలకు
వేలాడుతున్నారు
నిజమే కొత్త భయం దెబ్బకు
‘ప్రపంచమంతా మా గుప్పిట్లో’
అన్న మాటలన్నీ ఆవిరై
ఇంటి కప్పే రక్షా కవచమంటున్నారు
నాలుగు గోడలే ప్రపంచమంటున్నారు
‘వసుధైక కుటుంబం’ అన్న మాట పోయి
కుటుంబమే ప్రపంచమయిపోయింది
అత్తా మామా, కొడుకూ, కోడలూ, అన్నా, చెల్లీ,
అక్కా, తమ్ముడూ అంతా
కోపాల్నీ, తాపాల్నీ
అలకల్నీ ఆవేశాల్నీ
చుట్టచుట్టి కట్టకట్టి
పాత సామాన్ల గదిలో పడేశారు
వెలిగించుకున్న చిరునవ్వుల వెలుగులో
భయాన్ని ఇంటిబయటి వాకిట్లో నిలబెడుతున్నారు
సరే సరే
సమాజంలోనూ
మనుషుల నడుమా ఉన్న దూరాలని
చెరిపేస్తున్న భయమా
నీకు సెహబాష్‌
అయితే భయమా
దయచేసి మరింత పెరిగి
మనుషుల్లోని మనసుల మధ్య
దూరాల్నీ చేరిపేయవూ
మేమంతా మనసుల్ని విచ్చుకుని
చేతుల్ని కలుపుకుని
ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తాం
భూగోళానికి చుట్టూరా బారికేడ్లు కడతాం
భయాన్ని బద్దలుకొడతాం
ఆకాశంలో పాతరేస్తాం
– వారాల ఆనంద్, కరీంనగర్, 94405 01281


ప్రోత్సాహ‌క బ‌హుమ‌తి (4)
మన గమనం మన లక్ష్యం
గవాక్షం నుంచి బయటపడ్డ చూపులు
పాములా పాకి పాకి తోవలపై చేరాయి 
పక్షిలా ఎగిరి ఎగిరి రోడ్లను చూశాయి
పిల్లలు లేని ఇల్లులా సందడి లేని దారులు
లాక్‌డౌన్‌ మంత్రాన్ని పారాయణం చేస్తూ
పాత రోజులను తలచుకుంటూ, 
తారాడే జ్ఞాపకాలను తోడుకుంటున్నాయి
దూరం దూరంగా ఉన్నప్పుడు 
అవసరాలు మరింత లోతుగా కనబడతాయి 
జీవన బతుకు పత్రంపై అపరిచిత వైరస్‌ ఫలితం
మార్పునకు పురుడు పోయగా
జగతి ప్రగతికి జ్ఞానోదయంగా మారనుంది
సైన్సు మేధోసంపత్తికి కొత్త వైరస్‌ సవాలు విసిరింది
కొత్త మురిపెం పొద్దెరగదన్నట్లు 
ఎన్నో చూశాం ఎన్నో గెలిశాం
యుద్ధమంటే ఇప్పుడు అణుబాంబుల సన్నద్ధత కాదు
ఆయుధాల మెహరింపు కానే కాదు, 
యుక్తితో కూడిన జాగ్రత్త
గెలవడమంటే రక్తానికి సహనం నేర్పి,
సంయమనంతో గడపదాటకుండటం
యుద్ధవ్యూహాలను అనుసరించడమంటే 
భౌతిక దూరం గురితో గొలుసుకట్టు చర్యలను తెంపడం
తడవ తడవకు చేతులు కడిగి
కరోనా చేతలను దూరంచేసినట్లు
తిరిగి ఇంటికొచ్చిన చూపులు,
స్వీయ నిర్బంధాన్ని నెమరేసుకొని
తడిమి తడిమి తన అహంకారాల్ని, 
శుభ్రంగా చెరిపేసుకుంటున్నాయి ఎరేజర్‌ లా
నిర్మలత్వాన్ని నింపుకున్న అంతరంగం
వినిన కనిన ప్రతిదానికి మానవీయ కుంచెతో
విలువల పరిమళాన్ని అద్దుకుంటుండగా
ఒకవైపు వలసజీవుల ఆకలి గమనం
వెతలు తప్ప ఏమీ మిగుల్చుకోలేని, 
చౌకధరల దుకాణం ముందు నిలిచిన పేద జనం 
చూపులు మోసుకొచ్చిన కొన్ని దృశ్యాలు
హృదయాన్ని అర్థవంతంగా తడుముతున్నాయి
మరోవైపు గణాంకాల మరకలు మాట్లాడుతున్నాయి 
గాయాలతో తడిసి వర్తమానం పచ్చి పచ్చిగా ఉంది
అయినా, దాతృత్వం పురివిప్పింది నెమలిలా
మహా సంకల్పమే దీక్షగా
వైద్యుల సేవలు, పరిశోధనలు వర్ధిల్లగా 
ఊపిరినాపి ఆయువును ఊడబెరికే
కల్లోల కరోనాని కట్టడి చేద్దాం, 
ఆకలి కరోనాను తరిమికొడదాం
పుడమితల్లి పుణ్యభూమి పులకరించదా!
– టేకులపల్లి నర్సయ్య, నిర్మల్, 91820 17249


ప్రోత్సాహ‌క బ‌హుమ‌తి (5)
ఏం ఫర్వాలేదులే నాన్నా!
ఏం ఫర్వాలేదులే తల్లీ
నువ్విప్పుడేమీ ఆగమేఘాలమీద
విదేశీ సరిహద్దులు దాటి పక్షిలా వాలొద్దు
మేమిక్కడ స్వదేశంలో ఇంటిపని చేస్తున్నాం
నువ్వక్కడ ఇంటినుంచి పని చేస్తున్నావు
ఇంటి పట్టునుండటమే తేనెపట్టు మనకిపుడు
బూచి ఇక్కడ కూడా తిరుగుతోంది
వీధుల్లోకి ప్రవేశిస్తే చాలు
విదేశీయులనైనా స్వదేశీయులనైనా
అప్పనంగా నమిలేద్దామని పొంచి చూస్తోంది
ఏం కాదులే రోజుకెన్నిసార్లయినా
వర్చువల్‌గా మనల్ని కలిపే సాంకేతికతేదో
మన మధ్య పూలవంతెనై పరుచుకునే వుందిగా
భౌతిక దూరమే మనకిప్పుడు రక్షా కవచం
ఏం కాదులే నాన్నా అక్కడే వుండు
వున్న చోటే నేనూ వుండిపోతాను
నీ గుండెలో వున్నంత ప్రేమగానే
గూడు లోపలే భద్రంగా ముడుచుకుంటాను
రోజూ కొన్ని మాటల దారాలతో
మనల్ని మనం కలిపి కుట్టుకుంటూనే వున్నాంగా
మన ఒంటరితనాల గాజు కుప్పెల్ని
చేతిలోని మన రంగుల గాజు తెరలతో
ఎప్పటికపుడు బద్దలుచేసుకుంటూనే వున్నాంగా
మనం దగ్గరవటం కన్నా క్రిమికి దూరంగా
మసలటమే ఇప్పటి మన తక్షణ కర్తవ్యం
పొట్టకూటి కోసం
ప్రపంచమంతా ఎగిరిన వలస పక్షులం
తండ్రయినా, తల్లయినా, బిడ్డయినా, కొడుకైనా,
స్నేహితుడైనా, శ్రేయోభిలాషయినా
ఇప్పుడు అందరి అభిలాష గృహ నిర్బంధమే
జీవిత కాలం కలిసుండేందుకైనా
కొన్నాళ్లు పాటించాల్సింది ఈ భౌతిక దూరమే
అయినా ఇంకెంతకాలంలే తల్లీ
అయినా ఇంకెన్ని రోజుల్లే నాన్నా
కరోనా చీకటిని అంతమొందించాలనే
మన మహా దీప సంకల్పం ముందు
ఈ తాత్కాలిక దూరాలేపాటి
వైద్యులూ, పోలీసులూ,
పారిశుద్ధ్య కార్మికులూ, మీడియా మిత్రులూ
కుటుంబాలకు దూరంగా బయటే వుండి చేసే
ఆ మహా త్యాగం ముందు
మన దూర తీరాల ఈ నిర్భంధ యుద్ధమేపాటి?
– చిత్తలూరి, ముషీరాబాదు, హైదరాబాదు, 82474 32521

Leave a Reply

%d bloggers like this: