ఏప్రిల్ 10, 2020

కరో’నాదం’

Posted in ఆరోగ్యం, కవితాజాలం, సాంఘికం-రాజకీయాలు at 10:39 ఉద. by వసుంధర

అమ్మతో నాన్నతో గడపాలని నాకుంది వాళ్లకుంది
ఇన్నాళ్ళకు ఆ కోరిక తీరుతుంటే అడిగారు వాళ్లు నన్ను
ఇంత చిన్న కోరికొకటి తీరడానికి
రావాలా కరోనా లాంటిది
నీరు మురుగు గాలి మురుగు నరుల ఆయువంత తరుగు కరుగు
నీరిప్పుడు గాలిప్పుడు మెరుగు మెరుగు ఐనంతనె అనిపించెను
ఇంత మంచి మార్పొక్కటి కలగడానికి
రావాలా కరోనా లాంటిది
మన చుట్టూ మనుగడకై నిరుపేదల నిట్టూర్పులు
మనం మెచ్చు నీరోల్లాంటి హీరోలంతా ఆట పాటలన్ని మాని
జీరోలకు విలువిస్తూ అదుకొనే పూనికకై
రావాలా కరోనా లాంటిది
రోడ్డుమీద ఉమ్మొద్దు మనిషిమీద తుమ్మొద్దు దగ్గొద్దు
చేతులు కలుపుట మాని దూరంగా జరిగి రెండిటి జోడించుట మానొద్దు
అనే సుద్ది ఒద్దికగా పాటించడానికి
రావాలా కరోనా లాంటిది
మతం కులం రంగు జాతి భాషా భేదాలు మరిచి
మనుషులంత ఒక్కటై మమతలనే పంచి పంచి
మహినే మనుటకు మధురము చేయడానికి
రావాలా కరోనా లాంటిది
జనబాహుళ్యము దైవము జయవిజయులది తపము
జనస్వామ్య వ్యవస్థలో తపస్వులకు వరము
హిరణ్యాక్ష రావణులకు బలమగునని తెలియడానికి
రావాలా కరోనా లాంటిది
సాధువులకు పరిత్రాణం దుష్కృతాలకు వినాశనం
ధర్మసంస్థాపనానికి ఆ దేవదేవుడొకడు మనకు
యుగే యుగే సంభవించునని తెలియడానికి
రావాలా కరోనా లాంటిది

Leave a Reply

%d bloggers like this: