ఏప్రిల్ 11, 2020

కరోనాపై కదనం – ఏప్రిల్‌, 9 పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు, కవితాజాలం, సాహితీ సమాచారం at 4:20 సా. by వసుంధర

ప్రథమ బహుమతి
అరుదైన సమయం
గతం గోతాములో నేను కూరేసిన పచ్చని స్వప్నాలేవో
కన్నీటి చినుకులకు తడిసి మారాకు తొడిగాయి!
పోగులు తెగిన గుండె సంచిలోంచి 
తొంగి తొంగి చూసి నన్ను మరీ మరీ పలకరించాయి
రంగులు వెలిసిన గోడలపై
మసకబారిన బంధపు చిత్రాలు
రెప్పలు తెరచిన నా కంటి ఆకాశంలో నక్షత్రాలై మెరిశాయి!
గుప్పెడు ఆర్ద్రతావస్త్రంతో తుడవగానే హరివిల్లై అల్లుకున్నాయి!
చేతులు చాచి ఎదురొచ్చే చందమామల్ని 
సందిట చేర్చుకుని ముద్దాడలేని అలసిన చేతుల్ని 
మోచేతి గుండెలదాకా శుభ్రపర్చుకోగానే
నవ్వుల నెలవంకలు నాన్నా అంటూ ఆలింగనం చేసుకున్నాయి
వీధుల్లో ఇన్నాళ్లూ పారేసుకున్న సాయంత్రపు పూలను 
కబుర్ల పొట్లంలో చుట్టి ఒడిలో వేయగానే
వెన్నెలై విచ్చుకున్న ఆమె
సంతోషం నన్ను నిలువునా తడిపేస్తోంది
మూలన చుట్టబెట్టిన పెద్దరికపు పుస్తకాల కట్టనువిప్పి
ప్రేమతో నాలుగు అనుభవాల కథల్ని చదవగానే…
ఆనందంతో రెపరెపలాడిన ఆ పుటల్లో దాగున్న 
ఆప్యాయతా పరిమళం నా శ్వాసల్లో చేరిపోయింది
ఇన్నాళ్లకు ఒక అదృశ్య క్రిమి నన్ను భయపెడితేనే గాని
ఎదుట ఉన్న అపురూప దృశ్యం నా కళ్లకు కనపడలేదు!
నా స్వేచ్ఛకు సంకెళ్లేస్తేనే కానీ…
స్వచ్ఛమైన కౌగిళ్లను స్పృశించలేకపోయాను
ఇప్పుడు… కాలుష్యాన్ని గుమ్మం బైటే విడిచి…
ఎద ఇంట్లో బందీనౌతాను!
తలుపు తడుతున్న వైరస్సును
నిశ్శబ్ద యుద్ధంతో తరిమికొడతాను!
ఇప్పుడు నా ఇల్లే దేశం! దేశం క్షేమమే నా ఆశయం
కొన్నాళ్లు రాదారులు మౌనాన్ని మోస్తాయి!
మాటల మబ్బులు ఇంటి ప్రహరీలోనే కురుస్తాయి అంతేగా
ఒకవైపు.. సఫాయిల స్వేదం రాస్తాలను కడిగేస్తోంది!
వైద్య సిపాయిల త్యాగం ప్రాణాలను వెలిగిస్తోంది!
రక్షకభటుల నెత్తురు దేశానికి కావలి కాస్తోంది
నేను.. నాదైన లోకంలోకి హాయిగా ఇమడలేనా..!
మడమ తిప్పుకుని గడపకీవల
నా కోసం బతకలేనా…
కొన్నాళ్లకు.. 
కరోనాకీటకం వాలేందుకు ఏ ఊపిరి పూలూ కనబడక…
ఓడానని వెడలదా
ఇప్పుడు నేను చేయాల్సింది…
నా నట్టింట్లో నేనో ఆకుపచ్చ వాక్యమై మొలవడం!
వాకిట్లో ముడుచుకున్న అభాగ్య ఒంటరి 
పేగులకింత ఆహారమవ్వడం
ఒకే విషాద ఆకాశాన్ని కప్పుకున్న వాళ్లం….!
ఒకరికొకరు వెలుగవ్వడమే మానవతా ధర్మం!
ఏ కరోనాలూ ఖతం చెయ్యలేని మనిషితనం
ఇది! చేతుల్నీ.. చేతల్నీ కూడా 
శుభ్రం చేసుకోవాల్సిన అరుదైన సమయం
– దొండపాటి నాగజ్యోతిశేఖర్, 
మురమళ్ల, తూర్పుగోదావరి జిల్లా, 94921 64193

ఈ కవితను వినాలనుకుంటే…


ద్వితీయ బహుమతి
మనిషినై మళ్లీ మొలకెత్తుతా
నేనోడిపోతున్నా
నేను నిద్రలేవకముందే తెల్లారగట్టా గుమ్మంముందు మోకరిల్లి
పాలపేకట్టయి పలకరించిన ధైర్యానికి నేనోడిపోతున్నా
తాజావార్తల్ని వీధిలోంచే విసిరేసి 
ఏ అంటురోగం నన్ను అంటుకోలేదంటూ
జాగ్రత్తగా ఇంటింటికీ తిరుగుతున్న 
చాకచక్యానికి నేనోడిపోతున్నా
ఏకంగా పొలాన్నే గంపలో గుత్తంగా పెట్టుకొని
మా వాకిట్లో కాయగూరలుగా దించిన 
సైకిల్‌ పెడలుకున్న పిక్కబలానికి నేనోడిపోతున్నా 
ఒక్క ఫోను కాలుతో టాబ్లెట్లను ఇంటికే తెచ్చి
మా ఇంట్లో బీపీ షుగర్లను అదుపులోపెట్టిన 
సాయానికి నే నోడిపోతున్నా
ఎంతవద్దన్నా నేలచెక్కిలిని లైజాల్‌ పూసి మెరిపిస్తానంటూ
వెంటబడే పనితనానికి నేనోడిపోతున్నా
ఫోనుకాకితో సరుకుల కబురంపితే
మా ఇంటిలో వంట ఖాతా తెరిపించిన 
హోమ్‌ డెలివరీకి నేనోడిపోతున్నా
చెత్తను బంగారంలా గుండెలకు అద్దుకునే
సూర్యుణ్ని మించిన లోకబాంధవులకి నేనోడిపోతున్నా
తెల్లకోటు వెనుక ఇన్నాళ్లూ కనిపించకుండా
దాచేసుకున్న తెల్లని మనసులకి నేనోడిపోతున్నా
ఖాకీకొండలు పెంచుతున్న
మానవత్వపు అభయారణ్యాలకి నేనోడిపోతున్నా
జీతం కన్నా జీవితం మిన్న అంటూ నెలజీతంలో
ఒక చెక్కను నిలువునా కోసి ఇచ్చిన 
సహాయానికి నేనోడిపోతున్నా
ఆదుకొనే హస్తాల సంచులతో 
కోట్లు కుమ్మరిస్తున్న ఎముకలేని చేతులకే కాదు
సర్కారువారిచ్చిన నాలుగుగింజల్లో
రెండు దానం చేస్తున్న దొడ్డమనసులకి నేనోడిపోతున్నా
కంటికీ కునుక్కీ మధ్య తెరకట్టుకుని
ప్రజల్ని రోజులబిడ్డల్లా కాపు కాస్తున్న
మంత్రాంగ యంత్రాంగాల తల్లితనానికి నేనోడిపోతున్నా
ప్రమాదపు పుటల్లో తమ బతుకులపై 
తామే కథనాలు రాసుకుంటూ లైవ్‌ టెలికాస్ట్‌లు చేసుకుంటున్న
కలాలకీ గళాలకీ నేనోడిపోతున్నా
అన్నమో రామచంద్రా అంటే పులిహోర పొట్లమైన హృదయపరిమళానికి నేనోడిపోతున్నా
నాలా ఎందరో కాళ్లు కట్టుకుని చేతులు ముడుచుకొని కూర్చున్నా
దేశాన్ని నడిపే ఇంధనమై స్థాణువైన జనజీవననాదానికి వేణువై
శబ్దం రాని యుద్ధం చేస్తూ మృత్యువుతో కరచాలనం చేస్తూ
ఆందోళనా ఆర్భాటాలు లేని ప్రజావసరాల 
ఆసరా వసారానే రంగస్థలం చేసుకొని
గుక్కతిప్పుకోని డైలాగులు చెప్తున పాత్రలకి  
నేను పూర్తిగా ఓడిపోయి
చెమర్చిన కన్నీటి కుండనై ఇంటి చలివేంద్రంలోనే ఉండిపోయా
కానీ చిత్తడి మనసులో విత్తుకున్న సంకల్పం నుంచి 
మారిన మనిషినై మళ్లీ మొలకెత్తుతా
చెట్టాపట్టాలు పట్టుకొని తిరిగే జనారణ్యమై ఎదుగుతా..
– డా।। అద్దంకి శ్రీనివాస్, హైదరాబాదు, 98488 81838

ఈ కవితను వినాలనుకుంటే…


తృతీయ బహుమతి
కొన్ని పరీక్షా సమయాలుంటాయి
ఔను! కొన్ని పరీక్షా సమయాలుంటాయి!
మనం ఏంటో మనం తెలుసుకోవాల్సిన సందర్భాలుంటాయి
సకల సృష్టీ నాకోసమేననుకునే అహంభావం నుంచీ
ఉనికి కోసం అంగలార్చాల్సిన అత్యవసర సమయాలూ వస్తాయి.
ఆకాశం భూమీ రెండు డొప్పలుగా 
బ్రహ్మాండం నుంచీ ప్రభవించిన మానవుడా!
నువ్వు విశ్వ విజేతవే….
నిన్ను నువ్వు తెలుసుకోలేని పరాజితుడివి కూడా!
గతాన్ని మరచిన ప్రతిసారీ మహమ్మారి 
ఒక్కోపేరుతో నీతో తలపడుతూనే వుంది.
అభివృద్ధి పేరుతో కాలుష్య కాసారాలుగా 
జీవనదుల్ని మార్చినప్పుడూ…
పరిశుద్ధమైన వాయువుల్ని సైతం విషమయం చేసినప్పుడూ….
నిర్దాక్షిణ్యంగా అడవుల శరీరాల్ని చీల్చి 
వన్యప్రాణుల ప్రాణాల్ని గాలిదీపాలుగా మార్చినప్పుడూ..
నీ విలాసాలకు తుడిచి పెట్టుకుపోయిన 
జాతిలోని చివరి పిచ్చుక సాక్షిగా…
ప్రకృతిలో భాగంగా కాక 
ప్రకృతిపై ఆధిపత్యాన్ని నెరపిన ప్రతిసారీ 
ఓ మర్త్యుడా!
ఒక్కో మహమ్మారి ఒక్కో పేరుతో నీతో తలపడుతూనే ఉంది.
ఒక చిన్న క్రిమి కంటికి కనబడని మృత్యునీడై
భయమై తరుముతోంది
తోటి మనిషిని చూస్తే భయం…
అత్యంత ప్రియమైన డబ్బును తాకాలంటే భయం
దగ్గాలంటే భయం… తుమ్మాలంటే భయం 
గట్టిగా గాలి పీల్చాలంటే భయం
ఎన్ని నోరులేని ప్రాణుల నిశ్శబ్ద భయన్నినాదం 
నిన్ను వెంటాడుతోందో!
కడుగు… బాగా కడుగు
పాపాల మురికి వదలిపోయేలా కడుగు
పచ్చని చెట్లని అదాటుగా నరికి బహుళ అంతస్తుల
కీకారణ్యాలను సృష్టించిన కాంక్రీటు చేతులు…
విశ్వమానవ ప్రేమను వెలివేసి 
జాతులుగా కులాలుగా మతాలుగా అంతస్తులుగా 
హద్దుల గీతలు గీసుకున్న స్వార్థపు చేతులు
పదే పదే కడగాల్సిందే!
ఇప్పుడు ఒంటరిగా నిస్సహాయంగా తన చుట్టూ 
తాను గిరిగీసుకుని చేతులను మనసును శుభ్రం చేసుకోవాల్సిందే!
ఔను కొన్ని పరీక్షా సమయాలుంటాయి!
తప్పిదాలను దిద్దుకొనే అవకాశమిస్తూనే వుంటుంది తల్లి ప్రకృతి.
ఎన్నో జయించిన మానవుడా!…
కరోనాను ముందు ముందు జయించగలవులే!
కానీ అంతకన్నా ముందు ఒక్కసారి… 
నిన్ను నువ్వు సరిదిద్దుకోవూ!
ప్రకృతి పలకపై మానవతా అక్షరాలను దిద్దుకోవూ!
నిన్నువలెనే నీ పొరుగు ప్రాణిని ప్రేమించలేవూ!
– డా।। ఎం.బి.డి.శ్యామల, 
తాడికొండ, గుంటూరు జిల్లా 99497 74818

ఈ కవితను వినాలనుకుంటే…


ప్రోత్సాహక బహుమతి (1)
మనిషి తప్త కాంచనమవ్వాలి
ఇప్పుడు ప్రపంచమంతా ఒక్కచోట జేరి
బిక్కు బిక్కుమంటూ జీవన్మరణ పరీక్ష రాస్తోంది
చదవని పాఠాల్లోంచి వచ్చిన సూక్ష్మ ప్రశ్న
కొత్త ఆల్జీబ్రా లెక్కలా గజిబిజి చేస్తోంది
సమయం గడిచేకొద్దీ సమాధానం తట్టక
వణికే శరీరంతో బేలగా వలవల ఏడుస్తోంది
అంపశయ్యపై అవసాన దశలో మనుగడ
ఆఖరి చూపు ఇదేనా అని అవని కలవర పడుతోంది
విశ్వాన్ని పుక్కిటపట్టి పుక్కిలించేస్తానన్న ప్రతిభ
సూర్యుని ముందు మిణుగురులా వెలవెలబోతోంది
చేనంతా చీడపట్టి దిక్కుతోచని రైతులా… ప్రపంచం
చేవలేని మందు గొంతులో జారి మెలిబెట్టి ఉరిబెట్టినట్టుంది
లెక్కలేనన్ని పరీక్షలు రాసి పాసయిన ప్రపంచం
ఎక్కడో తప్పులో కాలేసి లెక్క తప్పినట్టుంది
పరీక్షా ఫలితం సెంట్‌ పర్సెంటో.. డిస్టింక్షనో అవసరం లేదు
పాసయితే చాలు బతుకు జెండా ఊపిరాడి రెపరెపలాడుతుంది
కొంచెం మిగిలిన ప్రాణం కొంచెపు బుద్ధిని ఇకనైనా వదలి
కొత్త పాఠం నేర్చుకొని కొత్త జీవితం మొదలుపెట్టాలి
చావుతప్పి కన్ను లొట్టబోయిన పాట
కొత్త బాణీ కూర్చుకొని మెదళ్ల మొదళ్లను తట్టాలి
చదవడం మరచిన పాఠాలను అటకమీంచి దించి
అహంకరించడం మాని ఆత్మీయ రాగమాలపించాలి
మనసు నేల మూలలో జేరిన స్వార్థమే అసలైన వైరస్‌
మానవత్వ పైరును కొరికే ఆ పురుగును ఏరెయ్యాలి
వ్యాపారం మాయలో ఆరోగ్యాన్ని అపాయానికొదిలే
నెలతక్కువ వెధవ బుద్ధిని ముందు శుద్ధి చేయాలి
శుద్ధి చేసిన బుద్ధి సుక్షేత్రమవ్వాలి
జాలీ దయా కరుణా విత్తనాలు జల్లాలి
మనిషితనం పరిమళించే కొత్తపూలు పూయించాలి
మనుగడ కొనసాగేలా మానవత్వం పండించాలి
తప్పులెంచి చూపి తన్నుకోవడం కాదు ..ఇకనైనా
తప్పు తెలుసుకున్న మనిషి తప్త కాంచనమవ్వాలి
– దాసరి వెంకట రమణ, హైదరాబాదు, 90005 72573


ప్రోత్సాహక బహుమతి (2)
క్వారంటైన్‌ ఖైదు
చిన్నిచిన్ని అదృష్టవెలుగు రేఖల్ని
భారీగా కమ్ముకున్న దురదృష్ట నీలిమబ్బులు
ఆరోగ్యాన్ని ఒంటరిగాచేసి
చుట్టూ ఆక్టోపస్‌ చేతుల్లా
అల్లుకున్న అనారోగ్య పరిస్థితులు..
రాత్రింబవళ్లు ఏకాంతమందిరంలోనే
శయనమిక్కడే, జీవన పయనమిక్కడే
పరిసరాల్ని ఆక్రమించిన ఏకాకితనం
చెట్టుకొమ్మ కదలట్లేదు, పిట్ట కూడా ఎగరట్లేదు
తీగలాగితే డొంకంతా కదిలినట్టు
సర్కారుతుమ్మ ఊరంతా వ్యాపించినట్టు
ఒకరి నిర్లక్ష్యానికి మరొకరు బలైతే
ఎవడో చేసిన తప్పుకు ఇంకెవడో
భారీ మూల్యం చెల్లిస్తుంటే..
జీవితంలో ఊహించని చిక్కటి చీకటిరోజులకు తోడు
దూరతీరాలకు మరలిపోయిన ఆశావహ వెలుగురేఖలు
అడుగడుగునా వ్యాపించిన నిస్పృహలకు
సహాయంగా నైరాశ్య రుతుపవనాలు..
చెమ్మగిల్లిన కళ్ల లోగిళ్లలోని తడిని
కమ్ముకున్న అలసట మబ్బుల్ని
సొమ్మసిల్లిన గుండెకొమ్మకు అంటుకున్న చెమ్మను
నిరాశల నిర్వేదాల వేదనకు మరమత్తులు
చేసేదెవరో…?
సమాజపు వింతపోకడల్ని సహనంతో భరిస్తూ
నైరాశ్యాల పూచికపుల్లల్ని విరిచేస్తూ
ఒక్కొక్క ఆత్మస్థైర్యపు కణాన్ని జమచేస్తూ
భయాందోళనలకే భంగం కలిగిస్తూ..
ఒంటరితనాన్ని మెల్లిమెల్లిగా ఉరేసి
నైరాశ్యపు వైరాగ్యాన్ని ఒలిచేసి
శిథిల ఆశల్ని శ్రద్ధగా పోగుచేసుకొని
ఆత్మవిశ్వాసపు ఆనవాళ్లను కూడేసుకుని..
దైన్య పరిస్థితులపై ధైర్యంతో దండెత్తుతూ
ఒంటరితనాన్ని ఒంటరిగాచేసి ఆడేస్తూ
నా మూలాల్లో చిగురాశల్ని పూయిస్తూ
నా తోటి కొమ్మల్లో పచ్చదనాన్ని నింపుతూ
క్వారంటైన్‌ ఖైదును అమూల్య క్వార్ట్జ్‌ గనిలా భావిస్తూ
జ్ఞాపకాల వ్యాపకాల్ని తవ్వుకుంటూ
వెయ్యివోల్టుల వెలుగురేఖల్ని విరబూయించడానికి
మనోధైర్యంతో అడుగులేస్తున్నాను..
– సర్ఫరాజ్‌ అన్వర్, హైదరాబాదు, 94409 81198


ప్రోత్సాహక బహుమతి (3)
ఆత్మజ్యోతిర్నమోస్తుతే
ఎవరో పిలిచినట్లు పరిగెత్తే దేహం
దేహాన్ని విడిచి పాకులాడే మనసు
నిశ్చల స్థితిలోకి రాసాగాయి
పూర్వాపరాల తరాజులో సూచికలా నేను
ప్రాపంచిక మోహాలకు దూరంగా
మనస్సు మేధస్సుల మధ్య అంతర్మథనం
కొన్ని విషాద విషపు ఛాయలు
కొన్ని ఆశావహ అమృత బిందువులు
మనసు అద్దంపై భూత భవిష్యత్‌ చిత్రడోలికలు
సుఖ ప్రయాణానికై సమాధులైన వృక్షరాజాలు
కాల్చిన అడవి దేహంపై మిగిలిన పచ్చబొట్లు
పాతాళానికి జారిన ఇసుక తిన్నెలు
అక్కడక్కడా లేపనంలా మిగిలిన నదుల మరకలు
బిక్కు బిక్కుమంటూ ముడుచుకున్న 
రెక్కల్లో దాచుకున్న పక్షి జాడలు
మృగ్యమైన మృగ సంపదలు
భూతలంపై కప్పిన నల్లని కాలుష్య వస్త్రం వెక్కిరిస్తోంది
ముసుగేసిన చుక్కల ఆకాశం నిలదీస్తోంది
ఈ దేహం కోసం ఎన్నెన్ని మాయాజాల పాచికలు
ఈ జీవం కోసం స్వార్థపూరిత కాలకూటాలు
కంటి ముందు తారసపడిన మరణం 
మనిషిని మనిషిని చేస్తోంది
నన్ను నేను లాక్‌ చేసుకున్నాక 
అంతర్ముఖీనమైన మనసు తపిస్తోంది 
దేహం ఇప్పుడొక దేవాలయం
లాక్‌డౌన్‌ తపస్సులో దేహం మనసు ప్రకృతి
పులకాంకుర శుభ్రతారకలు
కాలుష్య గ్రహణం వీడిన పర్యావరణంలో
నిర్మలమైన గలగలలు, కిలకిలారవాలు
దేహ దేవాలయంలో నేనొక జ్యోతినై ప్రకాశిస్తున్నా.
– డా।। శారదా హన్మాండ్లు, నిజామాబాదు, 99122 75801


ప్రోత్సాహక బహుమతి (4)
మరక మంచిదే
కరోనా వొక మరక !
చేతులకీ, ఇంటికీ, దేశానికీ
ప్రపంచానికీ పట్టిన పెద్ద మరక !
మరక కడిగే పనిలోనే ఇప్పుడు
భూగోళం యావత్తూ..నేను సైతం అంటూ….. 
చిన్న నాడు నాన్న భుజమెక్కి ఆడటం
చిటికెన వేలు పట్టి ఊరంతా తిరగడం
పొలమంతా సాగు చేసిన నాన్నతో కలిసి
మట్టి స్నానం చేయడం
కష్టాలూ కన్నీళ్లు కుటుంబమంతా
కలిసే పంచుకోవడం
అన్నీ గతమై చాన్నాళ్లయింది 
యిన్నాల్టికి మళ్లీ గతించిన కాలం కథలన్నీ
తీ…రిగ్గా నాన్నతో కలిసి పంచుకోవడం…
నాన్న భుజమెక్కి
ఊరంతా తిరిగినంత సంబరం 
మడతపడిన జ్ఞాపకాల ముడివిప్పింది కరోనా
మరక మంచిదే…
నలుగురికీ నాలుగు కప్పుల అన్నం
అందులోకేవో రెండు రుచులు
కాలక్షేపానికి కొద్దిగా కరకరలు
రోజూ వంటింట్లో మూడు పూటలా సాగే పోరాటంలో…
చాకచక్యంగా యుద్ధం చేసి గెలిచిన చేతులకీ
ఓ మెచ్చుకోలివ్వడం కుదిరింది.. కరోనావల్లే
నట్టింట్లో అనురాగాలపూలు గుబాళించాయి
మరక మంచిదే…
అమ్మ ఒళ్లో తలపెట్టుకు పడుకుని
మళ్లీ… బాల్యం కాల్వలోకి దూకడం
అమ్మ చేతి స్పర్శననుభవిస్తూ…
రెక్కలు కట్టుకు వెనక్కి పరిగెత్తడం…
అనుభూతుల ఊయలూగింది మనసు
కరోనావల్లే…
మరక మంచిదే…
అమ్మఒడి, అమ్మమ్మ ఒడి బేబీకేర్‌ ఒడి
పాఠశాల ఒడిలో.. ఎదిగిన బాల్యం
ఇప్పుడు కన్నవాళ్ల ఒళ్లో పక్షిలా
కువకువలాడింది
చిట్టిబుర్రల్లోని సమస్యలెన్నో తెలిశాయి
చిన్నారి గుండెల్లో వెతలూ కనిపించాయి
బాధ్యతే కాదు బంధాలూ బలపడ్డాయి
కరోనావల్లే…
మరక మంచిదే…
ఇప్పుడు ఇంటిచుట్టూ…
నవ్వుల పరిమళాలు తిరుగుతున్నాయి
వీధి కుక్కల కళ్లల్లో… విశ్వాసం కనపడుతోంది
నీతి కథల్లోని మానవత్వం
ఆహారమై అన్నార్తుల చేతుల్లోకి చేరుతోంది
మోడువారిన మనిషితనం మళ్లీ చిగురించింది
మరక మంచిదే…
చీపురు విలువ తెలిసింది !
మట్టిలోనే కాదు మనిషిలోని
మలినాలూ తుడిచేసుకుంటున్నాం 
మరచిపోకు కరోనా…
మరకని తుడిచేందుకు మేమంతా
సిద్ధంగా ఉన్నాం !
గెలుపుకోసం భిన్నత్వాన్ని ఏకత్వం చేసి
మహా సంకల్పంతో
స్వీయ నియంత్రణలో ఉన్నాం
– చెళ్లపిళ్ల శ్యామల, విజయనగరం, 99498 31146


ప్రోత్సాహక బహుమతి (5)
నాన్నను కొత్తగా చూస్తున్నా
నాన్నని ఎప్పుడూ ఇలా చూడలేదు
గడియారం ముల్లులా తిరిగే నాన్న ఇప్పుడు
గోడగడియారం అయ్యాడు.
నాన్నకు కథలు ఇన్నాళ్లకు దొరికాయి
ముచ్చటైన కథలతో
మమ్మల్ని ఏడు గుర్రాల రథంపై ఉరేగిస్తున్నాడు
నలుడు భీముడు వంటల్లో మేటి అనేది
నాన్న వంట రుచి చూస్తే కానీ అర్థం కాలేదు.
గోముగా పెడుతున్న ఆయన గోరుముద్దల్లో ఎంతటి కమ్మదనం!
పొద్దుతిరుగుడు పువ్వులా పనిచేసే అమ్మ
ఇప్పుడు పడమటి సూర్యుడిలా విశ్రాంతి తీసుకుంటోంది
చరవాణిలోనే ప్రపంచమంతా అంటూ చరించే మాకు
అష్టాచెమ్మ, పచ్చీసు, పరమపద సోపానాల్లో విజ్ఞానాన్ని చవిచూపిస్తున్నాడు.
ఇంద్రధనుస్సులా ఇప్పుడెన్ని రంగులో నాన్నలో
మట్టి ముద్దలకు నాన్న ప్రాణం పోస్తుంటే
మేం బొమ్మలమై చూస్తుండిపోయాం
సైకిల్‌ నేర్పమని అడిగిన ప్రతిసారీ
నీటి బుడగలాంటి ఆదివారం వాయిదా ఉండేది
ఇప్పుడు బడికి సైకిల్‌పై వెళ్లగల నమ్మకం
ఎన్నేళ్లుగా మూగబోయింది గిటార్‌
నాన్న వేలి కొసలతో ప్రాణం పోసుకొని
ఇంటిని బృందావనం చేసింది
వేసవిలో మల్లెల కోసం అమ్మ తహతహ
మల్లె పాదు ఇప్పటికి బాగుపడింది 
పనిదనంలో తన జీవితాన్ని మరిగించిన నాన్న 
ఇప్పుడు
అమృతమై అమ్మతనాన్నీ అందిస్తున్నాడు
బీడువారిన పొలం కాదు నాన్న
మట్టి పొరల్లో దాగిన అనురాగాల
మొలకల మాగాణి
మండే సూర్యుడే అనుకున్నా
చల్లని చంద్రుడు కూడా అని ఇప్పుడు తెలుసుకున్నా
నాన్నను సరికొత్తగా చూస్తున్నా
నెలకు రెండు రోజుల జనతా కర్ఫ్యూ కోరుకుంటున్నా 
ఎందుకంటే నాన్నతో ఎప్పటికీ ఇలా ఆడుకోవాలని ఉంది.
– ముదిగొండ సంతోష్, హైదరాబాదు, 79813 52713

1 వ్యాఖ్య »

  1. ఈరోజు కరోనా పై కథనం లో భాగంగా ఎంపికైన కవితలన్నీ బావున్నాయి.మరిచిపోయిన జ్ఞాపకాలను గుర్తుచేస్తూ సాగిన కవితలు..ప్రకృతిని ప్రేమించాల్సిన అవసరాలు..పక్కవారిని పట్టించుకొనే సమయాలు..మనకోసం శ్రమిస్తున్న వారిని మనసారా అభినందిస్తూ .. చక్కగా వ్యక్తీకరించిన అందరికీ అభినందనలు..వేల గళాలను వెలికితీసి కవన సేద్యం చేస్తున్న తెలుగు వెలుగు నిర్వాహకులకు వందనం..


Leave a Reply

%d bloggers like this: