ఏప్రిల్ 15, 2020
కరోనాపై కదనం – ఏప్రిల్, 13 పోటీ ఫలితాలు
ప్రథమ బహుమతి
క్వారంటైన్ ఒక బాధ్యత
భూమిని చూసి ఆకాశం నివ్వెరపోతోంది
భయం భయంగానే ప్రపంచం
మూడడుగుల దూరంలో
రంగు రంగుల ముసుగులు
అక్కడక్కడ నిలబడ్డాయ్
డేగ కళ్లతో డ్రోన్ల కాపలా
నిరంతర గస్తీలో నిలబడుతున్న లాఠీలు
ఫ్లో తగ్గని ఫౌంటెన్ల నుంచి ఫ్లాష్ న్యూస్‌లు
పాజిటివ్ అనే పదం చాలా నెగటివ్ ఇప్పుడు
అధికారం ఆలోచనల సముద్రంలో
ఈదుతూనే ఉంది
మునిగిపోతున్న నావను కాపాడుకోవాలనే ప్రయత్నం
ప్రాణాలను పణంగా పెట్టి
స్టెతస్కోపు తెల్ల టోపీ పోరాడుతూనే ఉన్నాయి
విధులు ముగించుకుని ఇంటికి రాని
తల్లిదండ్రులను చూసి కన్నీరు కారుతూనే ఉంది
గుడిసెల ఆకలి తీర్చడానికి
పులిహోర పొట్లాలు సిద్ధమవుతున్నాయ్
కూలీల కడుపులు నింపుతున్న
చేతులకు చేతులెత్తి మొక్కాల్సిందే
మతాలకతీతంగా మానవత్వం
పురుడోసుకోవడం మంచి పరిణామమే
విశ్వం నిప్పుకణికలపై
నడుస్తున్న పాదమిప్పుడు
స్వేచ్ఛగా ఎగరలేని విహంగమిప్పుడు
ఏమరుపాటుగా ఉంటే
కప్పెట్టడానికి నేల చాలదేమో
కాల్చేయడానికి కట్టెలు దొరకవేమో
యుద్ధం మొదలైనాక వెనుదీయడం పిరికితనమే
నీవే జవానువి నీవే కమాండరువి
అక్కడ బైటికెళ్లి రణం చేస్తాం
ఇక్కడ ఇంట్లో ఉండే పోరాడతాం
అంతే తేడా
క్రిమిసంహారక మందు గొంతు దిగేదాక
వ్యాక్సినేషన్ సూది గుచ్చేదాకా
కాస్త జాగ్రత్త
హోమ్ క్వారంటైన్లో ఉండటం
ఇప్పుడొక సామాజిక బాధ్యత
తరతరాలను కాపాడే గొప్ప ధన్యత
– డా।। శంకర్‌బాబు, సంగారెడ్డి, 98664 36426
ద్వితీయ బహుమతి
రంగస్థలంపై సీన్లు మారుతున్నాయి
ఇప్పుడు రంగస్థలంపై సీన్లు మారాయి
స్క్రిప్ట్‌లో లేనిది ప్రదర్శితమవుతోంది
వినోదమంతా విషాదమైంది
కథ పూర్తికాకుండానే పాత్ర కనుమరుగైంది
బాధ్యతలన్నీ అర్ధంతరంగా ఆపేసి
ఎవరో పిలిచినట్టు వెళ్లిపోతున్నారు
ఒక్కొక్కరుగా కాదు సమూహాలుగా
రంగస్థలం కళతప్పుతుంది
యంత్రాల మోతలాగిన చోట
కార్మికుల ఆకలి కేకలు
వలస పక్షులన్నీ వరుసకడుతున్నాయి
ఆకురాలే కొమ్మపై నిలవలేక
లాక్డౌన్లో పైకంతా ప్రశాంతతే
బంకర్లలో దాగిన ఉన్మాదిలా
వంటగదుల్లో యుద్ధ విన్యాసం
డైనింగ్ టేబుల్ ఒక నృత్య రూపకం
కాస్త కాఫీ అంటే అమ్మో కరోనా అంటూ
వీధి గుమ్మంలో ఆగిన సోపతి
నక్షత్రంలా మెరిసి మురిపిస్తూ విరాళం
వెలుగులు సోకేదెవరికో
అభివృద్ధి మంత్రమిప్పుడు కరోనా జపమైంది
వృద్ధి వ్యూహాలిప్పుడు
లేబొరేటరీల్లో పరీక్షకు నిలబడ్డాయి
క్షీణోపాంత ప్రయోజన సూత్రం
అనుభవంలోకి వస్తోంది
అంగట్లో అన్నీ ఉన్నా
అల్లుడి నోట్లో శని చందం
అగ్ర రాజ్యాల అందమిప్పుడు
కరెన్సీల వేటలో కరోనా చిక్కింది
ప్రజలు లేనిదే ప్రగతెక్కడుంది
ఇంతకాలం త్రేతాయుగపు రాతిదైవం
మొక్కులు ముడుపులు రక్షించాయా
ఇప్పుడిక
కలియుగ దేవుళ్లకి మొక్కాలి
ఇప్పుడిక
ఆసుపత్రులే గాలిగోపురాలు
డాక్టర్, పోలీస్, రైతు, పారిశుద్ధ్య కార్మికులు-
నాలుగు దిక్కులా దేవుళ్లు
ఆంక్షలు పాటించడమే యజ్ఞం
నియంత్రణలు యాగాలు
కదలాడే కలియుగ దేవుళ్లారా
నమో నమః
– బి.అంజనీదేవి, హనుమకొండ, 98498 75052
తృతీయ బహుమతి
వంటిల్లు- వన్ బై టూ
నిజం…
వంట పూర్తయ్యేసరికి ఒంటి గంట.
ఒక్క ఉల్లిపాయ కోస్తే
ఇన్ని కన్నీళ్లా?
నా శ్రీ ఎన్ని కోసుంటుంది?
ఇన్నేళ్లూ తనిచ్చిన టీకి
ఆ రుచి రావడానికి కారణం మిరియాలా?
ఆ కిటుకు ఇప్పుడే తెలిసింది.
స్టౌ మీద పాలొలకకుండా
ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో
ఈ రోజే తెలిసింది
కాకరకాయల్ని పులుసుకో రకంగానూ
వేపుడుకొక రకంగానూ కొయ్యాలట
చిన్నోడు అయిదు నిమిషాలకోసారి
కబోర్డులన్నీ వెతుకుతుంటే
తెలిసింది ఏ తినుబండారాలు ఎక్కడున్నాయో!
పెద్దది చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని
ఆన్లైన్లో పాఠం రాసుకుంటున్నప్పుడు
టిఫిన్ తినేయమ్మా అని అమ్మ బతిమాలుతూంటే
ఇల్లెంత అలికిడిగా ఉందో!
టీవీలో చూసిన సినిమాలు చూసీ చూసీ అలసిపోయాడేమో
చిన్నోడు నానమ్మ ఒళ్లో తలపెట్టుకుని
కథ చెప్పమని అడిగాడు
మెరిసిన కళ్లతో… బోసి బుగ్గల్తో
వాడిని గుండెలకు హత్తుకుని అడిగింది
‘వూ’ కొడతావా మరి అని!
నిజం చెప్పొద్దూ!
చిన్నప్పుడు నాకు చెప్పిన కథ
నేను గోరుముద్దలు నంజుకున్న కథ
ఇప్పుడు చిన్నోడు రుచిచూస్తున్నాడు
వంటిల్లుని వన్ బై టూ చేస్తే
ఎంత హాయో చూశారా అని నా శ్రీ ఎదురొచ్చింది
నా వంటకి చప్పట్లు కొడుతూ
లొట్టలేసుకుని తిన్నారు పిల్లలు
ఉరుకుల పరుగుల వేగానికి
కరోనా కళ్లెం వేయకపోయుంటే
లాక్డౌన్ లేకపోయుంటే
మా ఇల్లు ఇంత అందంగా ఉంటుందని తెలిసేదా నాకు?
‘రెక్కల గుర్రంపై అడవిలోకెళ్లిన రాకుమారుడు
దారి తప్పిపోయాడట…’ అమ్మ కథ చెబుతూనే ఉంది
ఆనవాళ్లెరగని అరణ్యంలో తప్పిపోయిన నాకు
దారేదో స్పష్టమౌతున్నట్టు
కునుకు పిట్ట వాలింది నా కనుల కొమ్మల మీద.
అప్పుడు సమయం సరిగ్గా ఒంటి గంట..
పక్కింటి సుబ్బారావు జండూబామ్ కోసం
కుంటుకుంటూ వచ్చి తలుపు కొడితే
మెలకువొచ్చింది.
ఏం జరిగిందని అడిగితే
‘రోడ్డు మీద రక్షక భటులు…
భలే రక్షిస్తున్నారండి కరోనా నుంచి’ అన్నాడు.
అతనెప్పుడు మేలుకుంటాడో!?
– మల్లిపురం, పార్వతీపురం, 94401 04737
ప్రోత్సాహక బహుమతి (1)
మనసు గవాక్షాలు తెరచి చూడు
ఇప్పటికైనా మనసు గవాక్షాలు తెరచి చూడు
ఆకాశాన్నంటిన చెట్లేకాదు నేలపై పచ్చగా పరచుకున్న
గడ్డిపోచ బతుకులూ కనిపిస్తాయి
నువ్వు అలవోకగా మెట్లెక్కుతున్నప్పుడు
వాళ్ల కళ్లు ఆశగా నీ వెనక తడుముతుంటాయి
ఒక్కసారన్నా వెనక్కి చూసి చేయందిస్తావని
నువ్వు వేదికలెక్కినప్పుడల్లా
వాళ్ల చేతులు చప్పట్లు కొట్టి మురిసిపోతుంటాయి..
దిగినప్పుడు తమలో కలిసిపోతావని,
చేతుల లతలు పెనవేస్తావని
నీ ఆవిష్కరణలు వ్యాపారం రంగు పులుముకొని
అమ్ముడుబోతూ కాసులు కురిపిస్తుంటే
వాళ్ల హృదయాలు విరిసిన గులాబీలవుతాయి
సంపాదించిన దాంట్లో కొంతైనా తీసి బాధలు గట్టెక్కిస్తావని
రోజులు గడచిపోతున్నా నీలోనూ,
వాళ్ల ఆకాంక్షలోనూ మార్పులేదు
ఇప్పటికైనా మనసు గవాక్షాలు తెరచి చూడు
ఇల్లంటే ఇటుకా సిమెంట్ల కట్టడం కాదు
ఆప్యాయతలు కలబోసుకున్న స్వర్గధామమని అనుభవమౌతుంది
దారులు చీలిపోయి నువ్వు ఆఫీసుకు,
బాబు స్కూలుకు వెళ్తుంటే
వాడి చిన్న మనసు నిన్నంటిపెట్టుకునే ఉందని నీకు తెలియదు
సాయంత్రం తొందరగా వచ్చి తనతో ఆడుకొని,
కథలతో కడుపునింపుతావనుకొంటాడు
రోజూ యాంత్రిక జీవితమే..
ఆదివారమన్నా నాలుగు కబుర్లు చెప్పి
సరదాగా గడుపుతావని ఆర్రోజుల ఎండిన పూలను
చకచక రాల్చేసుకుంటుంది నీ భార్య
నెలకోసారి జీతమిచ్చి కడుపునింపడమే కాదు
ఏదో ఒకరోజు తాము చేసే పనికి.. తృప్తితో
చిరునవ్వు మాటల రత్నాలు
రువ్వుతావనుకొంటారు పనివాళ్లు //రోజులు… తెరచి చూడు//
క్యాబిన్, క్యూబికల్ పరిధుల నుంచి బయటికొచ్చి
ప్రోగ్రామ్‌లో బగ్ వస్తే ఫైర్ అవడమే కాదు..
పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు
అప్రిషియేషన్ పూలవాననూ కురిపిస్తావనుకొంటారు ఉద్యోగులు
మంచినీళ్లిచ్చే బాయ్ నుంచి కార్ డ్రైవర్దాకా
నీలో యంత్రాన్ని కాకుండా
పరిమళాల పారిజాతాన్ని చూడాలనుకొంటారు
ఆజమాయిషీ చేసే బాస్‌ను కాదు
జీవితాలను చక్కదిద్ది కల్పవృక్షంగా మార్చే
నాయకుణ్ని చూడాలనుకొంటారు //రోజులు… తెరచి చూడు//
నువ్వనుభవించే ప్రతి సౌకర్యం వెనుకా
నలిగిన జీవితాలున్నాయి..
కాలుష్యం పులుముకొన్న ప్రకృతి ఉంది
కరోనా వల్ల కాలం చేతికొచ్చింది,
ఆత్మపరిశీలనకు అవకాశమొచ్చింది
లాక్డౌన్ తర్వాత నీలో తథాగతుడు ఉదయించాలి
ప్రకృతితో స్నేహిస్తూ, మానవత్వం సంపూర్ణంగా వికసించినప్పుడు
మరో మహమ్మారి మనలోకి చొచ్చుకొచ్చే అవకాశమే ఉండదు!
– పి.వి.సుబ్బారాయుడు, సికింద్రాబాదు 93939 81918
ప్రోత్సాహక బహుమతి (2)
బోధివృక్షం
ఇంకాస్త సమయముంది
తోకచుక్కల్లా విశ్వ వీధిలో విహరించడానికి
అప్పటివరకు, మరిన్ని స్మృతులను పోగేసుకోండి
ఈ కొత్త పూలవనం మళ్లీ పూయునో, పూయదో
వేగ నియంత్రణ లేని మనసును ఇంకొంచెం కుదుటపడనీయండి
ఈ విరామ పాఠాల పరీక్షలో కొత్తసత్యాల జవాబులు రాసి
పశ్చాత్తాప ఫలితాల్లో డిస్టింక్షన్లో ఉండటానికి.
పునర్ ముద్రించుకున్న, అనుబంధాల లోగిళ్ల నుంచి
మరిన్ని జ్ఞాపకాలను, ఒక మొక్కలా నాటుకోండి.
వీలైతే ఒక మొక్కనూ నాటండి
కరోనా కల్లోల కాలానికి చిహ్నంగా
కాంక్రీటు వనవాసానికి పునశ్చరణగా,
బయటికి అడుగేయని బాధ్యతకు బాధ్యుడిలా
తాత్కాలిక సామాజిక దూరాలలో
శాశ్వత అనురాగతత్వాలకు దగ్గరైన వైనానికి కానుకగా
ఒక మొక్క నాటండి.
రేపటి తరానికి అనుభవాల పూసలదండలా
ఒక చావిడి అయ్యేటట్లు,
ఉదయం, సాయంత్రం ఎన్నడూ చూడని
నిశ్శబ్దాన్ని పరిచయం చేసిన మీ బాల్కనీ తొట్లలో
అయినా సరే, ఒక విత్తు నాటండి.
మహా విపత్తునెదుర్కొని, మహత్తరంగా ఎలా నిల్చున్నామో,
ఇల్లు అనే శంఖం నుంచి విజయ నాదాలు ఎలా మోగించామో,
నిన్ను నాటిన ఈ చేతుల్తోనే,
మేం ఎలా రక్షించబడ్డామో చెప్పుకోవడానికి,
వంటిల్లు, అలమర, పుస్తకాల షెల్ఫ్, పడగ్గది,
మిద్దె, బాల్కనీ, అరుగు, వాకిళ్లు
నీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న సంగతులు
మననం చేసుకునే ధ్యానస్థలిలా ఆ చోటుకోసం నాటండి.
విషపుక్రిమి సోకి లక్షలశవాల్ని తనలోదాస్తున్న ఆ ధరణి నుంచే
మానవ అస్తిత్వాన్ని అమ్మలా సాకిన ఆ పుడమి నుంచే
విజయ పత్రాల చిగురింతల కోసం
ఒక మొక్కకు ప్రాణం పోయండి.
దాని నీడలో ఆడే నూతన ప్రాయాలకు
తానిచ్చే చల్లనిగాలితో సేదదీరే భవిష్యత్తుకు
దాన్ని చూసినప్పుడల్లా నాటిన మీకు
బోధివృక్షంలా, జ్ఞానోదయానికి జ్ఞాపికలా
నిత్యజాగరూకతా ఫలాలనిచ్చేలా
ఒక మొక్క నాటండి.
చరిత్రలో నాటుకుని పోయేలా.
– జగదీశ్వర్ మడుపతు, నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా, 94948 17919
ప్రోత్సాహక బహుమతి (3)
అంతా మన చేతుల్లోనే ఉంది
అదృష్టరేఖలన్నీ
మన అరచేతుల్లోనే ఉన్నాయి
దురదృష్టం ఇంకెక్కడ?
మానవ పరిణామక్రమంలో
శ్రమ చెక్కిన గీతలవి.
జంతువు నుంచి మనిషిని మలచింది
అంతరిక్షానికి నిచ్చెనలేసింది
మట్టిని చెమటతో తడిపి
మెత్తగా పిసికి
భూగోళాన్ని బువ్వముద్ద చేసింది
మన ఈ చేతులే
నిజంగా, మన హస్తవాసి మంచిది కాకపోతే
ప్రగతి పరుగు ఇంత వేగం అందుకుంటుందా?
ఇప్పుడీ చేతులే
రోగవాహకాలుగా నిర్ధారితమవటం
కరచాలనాలు కంటగింపవటం
భరించలేని విషాదం.
ఎక్కడో పుట్టపగిలినట్టు
ఈ మహమ్మారి క్రిమి ముసురుకుంది
ఆకు తినే పురుగులాగ
అదృశ్యంగా అరచేతుల్లోకి దూరి
మన రాతల్ని మార్చే పనిలోపడింది
మనల్ని గొంగళి పురుగుల్నిజేసి
గూట్లోనే ముడుచుకునేలా చేసింది.
ఇక ఏదేమైనా
అంతా మన చేతుల్లోనే ఉంది
బతుకైనా, చావైనా
మంచైనా, చెడైనా
గెలుపైనా, ఓటమైనా.
రెండుచేతులు పైకెత్తి లొంగిపోదామా?
ఒక్కచేత్తోనైనా పిడికిలెత్తి పోరాడదామా?
భయం వద్దు పారిపోవద్దు
కరోనాదేముంది? ప్రాణంలేని ప్రొటీను కణం
మనమే దాన్ని భయంగా
గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నాం
శుభ్రంగా కడిగేస్తే పోయేదానికి.
– పెద్దిపాగ పున్నారావు, పాలపర్రు, గుంటూరు జిల్లా 89191 30533
ప్రోత్సాహక బహుమతి (4)
మట్టి మీద మనిషి ఆశ బతకాలి…
భూమి ఒక చిత్రకారిణి
కాలాన్ని బట్టి రంగులు చిత్రిస్తుంది
కుంచె కళ్లతో లోకాన్ని చిత్రికపట్టి
ప్రకృతి మనసుని చదువుతుంది
గుప్పెట పట్టిన ఆకాశాన్ని
గుండెలో కొలువుదీరిన స్నేహతత్వాన్నీ
చూపులతో తల పాపిట దువ్వి
తూరుపు కిరణాల వెలుతుర్లో ఆరబెడుతుంది
లోకానికేం స్తబ్దుగా తపస్సు చేస్తుంది
నవ్వగలిగితే నవ్వి, ఏడ్వగలిగితే ఏడ్చి
కాసిన్ని మౌన క్షణాల్ని నిశ్శబ్దంపై చిలకరిస్తుంది
ఇదెక్కడి అంతుబట్టని రోగమో
క్రిమి రూపంలో మొగ్గ తొడిగి
దేశ దేహాల్నీ కబళిస్తోంది
తీస్తే ప్రాణాల్ని, వీస్తే విషపుగాలుల్ని
ఊరి పొలిమేరల్నుండి, ఊపిరి తీగెల దాకా
ఒకటే కలకలం
అయినా ఉండదులే సమస్య కలకాలం
చంటి పిల్లల్నుంచి ముసలివాళ్లదాకా
జోలపాటల్ని ఒదిలి, నీరసపు మూలుగుల్ని విడిచి
ఇంటా బయటా ఎండుటాకుల్లా వొణికిపోతూ
పండుటాకుల్లా రాలిపోతూ
కాలం భయ కంపితమవుతుంటే
సైనికుల్ని మించి పోరాడే దేశభక్తి
అటు వైద్యుల్లోనూ, ఇటు రక్షకభటుల్లోనూ
ఇతర సేవా సిబ్బంది సమూహంలోనూ
అంకిత భావ దీక్ష
మానవత్వ రూపంలో ప్రవహిస్తూనే ఉంది
పరిగెత్తే కాలానికి కాపలా కాయడమంటే మాటలు కాదు
సమూహంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ
సామాజిక సేవా లక్ష్యమే కర్తవ్యం
ఓ తండ్రో మరోబిడ్డో ఒకచెల్లో
వేరొకరి భార్యో, ఇంకో ఆడకూతురో
తల్లి రూపాన్ని పోలిన ఎవరైతేనేం
దేశాన్ని కాపాడుకునే ప్రయత్నంలో
కుటుంబ రక్షణ బాధ్యతల్ని ఉమ్మడిగా మోసుకొస్తున్నారు
వీటిని మనసు కుంచెతో భూమిపత్రంపై చిత్రిస్తూనే ఉంది
చరిత్ర పునరావృతమవుతున్నా కాలవేగంలో మార్పు లేదు
సందర్భాన్ని బట్టి చిత్రించిన సమస్యని నివారించడమే
ఇప్పటి ముఖచిత్రం
రేపటి బతుకు మీద
మనిషి ఆశ సజీవంగా నిలదొక్కుకునేంత వరకూ…!
– మానాపురం రాజా చంద్రశేఖర్, విజయనగరం, 94405 93910
ప్రోత్సాహక బహుమతి (5)
మనిషిజం
రణమైనా, కారణమైనా ‘కరోనా’తోనే
కరుణలేని కరోనా కర్కశ వేషాన
కలిమిలేముల జగాన ఈ నయా రూపాన
పెట్టింది ప్రపంచాన్ని భయాన
మెరికల్లాంటి అమెరికన్లను
చేయి తిరిగిన చైనీయులను
రవి అస్తమించని సమస్త జగతిని
ఇప్పటి వరకు సాధించిన పురోగతిని
శాసనాలని.. శాస్త్రాలని
అందరినీ అన్నింటినీ ఒక్కటి చేసింది..
తానొక్కటే శత్రువై నిలిచింది
కనిపించకుండానే తాను
వినిపించిన మరణమృదంగం
ఖండాంతరాలు దాటింది
ప్రపంచాన్ని కుగ్రామం చేసింది
సాధించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని సవాల్ చేస్తూ
మనిషిపై ప్రకృతి తన పెత్తనాన్ని ప్రకటించింది
సకల చరాచర జీవరాశిపై
అధికారం చెలాయిస్తున్న
మనిషి అహంపై మెత్తగా మొత్తింది
ఇంత జరిగినా.. తీరుమారని మనిషి
ఒక ప్రాంతంపై, ఒక వర్గంపై, ఒక సమూహంపై
విషం కక్కుతూనే ఉన్నాడు
దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాడు
శత్రువెవరో తెలిసినా
తన భావదారిద్య్రంతో
సంకుచిత ఆలోచనలతో
లక్షిత శత్రువు కోసం వెతుకుతూనే ఉన్నాడు.
‘కరోనా’ కారణంగానైనా
మనిషికి మంచి నేర్పాలనుకున్న ప్రకృతి
తన ప్రయత్నంలో మరోసారి ఓడిపోయింది.
– కె.సత్యనారాయణ, హైదరాబాదు, ksnp73@gmail.com
Leave a Reply