ఏప్రిల్ 16, 2020

క‌రోనాపై క‌ద‌నం – ఏప్రిల్‌, 14 పోటీ ఫ‌లితాలు

Posted in కథల పోటీలు, కవితాజాలం at 4:31 సా. by వసుంధర

లంకె

ప్రథమ బహుమతి
మార్పు మొదలైంది..  
చేతులే శుభ్రంగా కడుగుతున్నానేమో అనుకున్నా.. 
ఇప్పుడు మనసు కూడా తనను తాను 
కడగడం మొదలు పెట్టింది 
మూతికి ముసుగు తొడుగుతున్నా అనుకున్నా 
ముసుగు మాటు గుండెచప్పుడు తెరలు 
తెంచుకోవడం మొదలుపెట్టింది.. 
అవును.. నాలో మార్పు మొదలైంది… 
నాలుగు గోడల మధ్య నిలబడిన రోజు 
నిర్బంధం అనిపించింది.. 
తరువాత అదృశ్యశక్తితో పోరాటంలా పిడికిలి బిగుసుకుంది 
కానీ, ఇప్పుడు మాత్రం ప్రక్షాళనకి ప్రారంభమైన 
గొప్ప అంకంలా గోచరిస్తోంది 
ఆప్యాయతతో వడ్డించిన ఇంటిరుచుల ముందు 
అమృతమైనా దిగదుడుపే అనిపిస్తోంది.. 
అటకెక్కించిన పుస్తకాల్లో నిక్షిప్తమైన 
విజ్ఞానరాశులను నిమరడం మొదలెట్టాక 
నేనెంత సంపన్నుడినో స్పృహలోకి వచ్చింది.. 
కాలంతో పరిగెడుతూ కాయానికే కాదు 
కంటిచూపునకి కూడా అనుభూతి 
ఆస్వాదనలను అందించలేకపోయిన 
గతం గట్టిగా వెక్కిరిస్తోంది.. 
పక్కవాడి పలకరింపుల నుంచి కూడా 
తప్పించుకు పారిపోయిన 
తత్త్వం కంటి ముందు కదలాడుతోంది.. 
అవును.. నాలో మార్పు మొదలైంది.. 
నిన్నటి దాకా స్నేహితులమే
నేడు అంటరాని వారిగా బతుకుతుంటే 
మృత్యులోగిలిలో కాళ్లు పెట్టి 
తెగించి వైద్యం చేస్తున్న తెల్లకోటు సిపాయిలను 
చూస్తుంటే సన్నని బాధ 
పొరలు చీల్చుకుంటూ మెలిపెడుతోంది.. 
తిండి, నీరును కూడా అనుమానంగా చూస్తోంటే 
చెత్తను, కుళ్లును మోసుకెళ్తున్న కర్మయోగులను 
చూసి గడ్డలా పేరుకుపోయిన స్వార్థం
నిలువునా కరుగుతున్న కమురుకంపు 
ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది 
పేదవాడి ఆకలి కోసం కోట్లు కుమ్మరిస్తున్న 
ఎముక లేని చేతులను చూస్తోంటే  
మానవత్వం భరోసాగా భుజం తడుతున్నట్లే ఉంది.. 
నా స్వేచ్ఛని నాకందించడానికి 
రేయింబవళ్లు కష్టపడుతున్న 
ఇంతమంది సైనికులను చూస్తోంటే
వీరి కోసం నేనేమీ చేయలేనా అనిపిస్తోంది.. 
అవును.. నాలో మార్పు మొదలైంది.. 
గడపదాటే క్షణం కోసం నిరీక్షిస్తున్నా… 
స్వేచ్ఛ కోసం కాదు.
బాధ్యతను మోయడానికి.. 
మారిన నా మనసుతో 
నా సమాజాన్ని పునర్నిర్మించుకోవడానికి.
– పి.వి.పద్మావతి, దర్శి, 98489 15117
 


ద్వితీయ బహుమతి
తలుపులు ముయ్యకండయ్యా
పొద్దెక్కే ముందే లేచి పనులన్నీ ఆదరా బాదరా ముగించి
ఇంత ఉడకేసి ఆ వార పెట్టి కొంత డబ్బాలో కుక్కి
చాకి బండతో యుద్ధంలో మురికిని చంపేసి 
గెలిచిన తెల్ల బట్టలతో
సంచిలో ఓ జాబితాతో బయటపడతారు వాళ్లు
వాళ్లని చూసి ఆలస్యమైపోయిందంటూ అనూరుణ్ని కేకేసి
రథమెక్కి హడావుడిగా బయల్దేరతాడు సూరీడు
పెను ముప్పు పొంచుందంటూ వేసిన ఎర్ర కంచెలు చూసి
బెంబేలెత్తి గుంపులన్నీ వెనక్కి పోతుంటే
ప్రశాంతంగా గీతదాటి వెళ్తారు వాళ్లు
ఆ కాళ్లు ఇంటింటా ఆగుతాయి
ఆ కళ్లు ప్రమాదం పసిగడతాయి
ఓ ఇల్లాలి నుదుటి చిట్లింపు 
తమ పెదవిపై నవ్వుని విరిచేస్తున్నా
మరో ఇంట ఛీత్కారం మనసుని మెలిపెడుతున్నా
నీకెందుకు చెప్పాలన్న ఓ యజమాని అహంకారం
గుండెని పిండేసి ధైర్యాన్ని ముక్కలు చేస్తున్నా
అలా.. ముందుకు వెళ్తూనే ఉంటారు వాళ్లు
ఏప్పుడో బయల్దేరిన సూరీడు నడినెత్తినెక్కేశాడు
కరకరమని ఆకలి అరచి మరీ పిలుస్తోంది
మొన్నెప్పుడో చెప్పుకు పెట్టిన పిన్నుకి రక్తం చిప్పిల్లుతోంది
ఏ మలుపులో ఏ పీడ అంటుతుందోనని భయం
తమతో పాటు తనవాళ్లనీ కబళిస్తుందనే భయం
ఇవేవీ గెలవలేని వారి కన్నీళ్లని భళ్లుమన్న 
మీ ఇంటి తలుపు గెలిచింది
జలజలమని కురిసి అడుగులు వెనక్కి వేస్తున్నారు వాళ్లు
ఎక్కడ చెయ్యాలో తెలీక యుద్ధం అలసిపోతోంది
మన కోసం అలుపు లేక తిరిగే ‘ఆశా’ దీపాలు వాళ్లు
మీ బాగు కోసం తలుపు తట్టే సేవకులు వాళ్లు
తలుపులు ముయ్యకండయ్యా… మనుషుల్లా మారండయ్యా…
మాటలు విసరకండమ్మా… మర్మం విడిచి చెప్పండమ్మా..
ముసిరిన చీకట్లలో ఆశల దివ్వెల్ని వెలిగించండయ్యా…
తలుపులు ముయ్యకండయ్యా…
– ఆచాళ్ళ శ్రీనివాసరావు, వెల్లూరు, తమిళనాడు. 97869 91947


తృతీయ బహుమతి
కాల ప్రబోధం
ఇన్నాళ్లు జలపాతంలా దూకిన కాలం
నిశ్చల సరస్సులా మారింది.
ఐఫోను, పెద్ద తెర టీవీల
ఆటవిడుపు వినోద రాగం
పలుగు పారల ఇరుకు గదుల నిట్టూర్పుల తాళం
ఒకే విషాద గీతానికి
రెండు భిన్న నేపథ్య సంగీతాల్లా కలిసిపోయాయి.
గది చుట్టూ చక్కర్లు కొడుతున్న తీరుబడి చూపులు
జ్ఞాపకాల పుటకి చిక్కుకొని నిలిచిపోయాయి…
బాల్యపు వర్ణచిత్రం నుంచి ఉబికి వచ్చిన
సెలయేటి గలగలల మా బడి నవ్వులు కళ్లను తడిపాయి
ఏనాడో మరచిపోయిన మా ఊరి గుడి గంట చప్పుడు
గుండెను పలకరించింది.
చరిత్రను తవ్వుతున్న బద్ధకపు క్షణాలకు
విలువైన రత్నాల్లాంటి పాఠాలు దొరుకుతున్నాయి
శతాబ్దాలుగా మనుగడకు అత్యంత అమూల్యమనుకున్నవి
ఎంత నిష్ప్రయోజనమో విడమర్చి ప్రబోధిస్తున్నాయి
ఖండాంతర అణుక్షిపణులు
నీటిలో నానిన కట్టెల మూటలా ఎంతలా నిరుపయోగమయ్యాయి
జీవన్మరణ తరాజులో నిలుచున్నప్పుడు 
వెంటిలేటర్‌ జీవన రేఖ
పెంచి పోషించిన పెను సైన్యాలు ఎంతగా చేష్టలుడిగాయి
అమ్మకు పురుడు పోసే వైద్యులు
తల్లి పుడమికి పునర్జన్మనిచ్చేందుకు 
ప్రాణప్రమిదలు అవుతున్నారు.
అగ్రరాజ్యాలు జీవ ఔషధాలకు వెంపర్లాడుతున్న జాలిగాథలు …
సింహాసనాలను అధిష్ఠించిన రాచరికాలు
ఆసుపత్రి పడకకై ప్రాధేయపడే సంఘటనలు…
ధరణి ఎద పిండటానికి
ప్రకృతి గుండెకు మేకులు కొట్టుకున్న 
మనిషి అవివేకానికి పర్యవసానాలేమో!
స్వేచ్ఛ అంటారా
ప్రపంచానికి తాళం వేస్తేనేమి
మనసును విశాల విశ్వం చేసి విహరించొచ్చు
కరోనా కారాగారం విస్తరిస్తున్న వేళ
ఇల్లు మరింత హృదయ వైశాల్యంతో ఆదరిస్తుంది.
పెరటిలోని చెట్టు నడవకపోతేనేమి… ప్రాణవాయువుల గుట్ట
నిర్బంధంలో చెట్టులా తపస్విగా ఎదగాలి
తపస్సు చలన రాహిత్యం కాదు
ఉషస్సును అంతరంగంలోకి ప్రసరించుకోవడం
వసారాలోని దీపం కదలిక పోతేనేమీ… వెలుగు రేఖల బుట్ట
నిశీధిలో ఆత్మదీపాన్ని వెలిగిస్తే
మార్గనిర్దేశనం దేదీప్యమానమవుతుంది.
– సతీష్‌ గొల్లపూడి, క్రైస్ట్‌ చర్చ్, న్యూజిలాండ్,  gskumar3107@gmail.com


ప్రోత్సాహక బహుమతి (1)
పేమతో.. పెండ్లానికి
పేనాలకే పెమాదమంట పెండ్లామా జాగర్త
మనోల్లంతా సేమమే కదా.. సెప్పరాని బెంగగా ఉంది
ఎక్కడోల్లు అక్కడే అంటూ ఆపేత్తే
ఇక్కడెక్కడో ఇరుక్కుపోయాను
బస్సులు తిరగడం నేదు.. రైళ్లు నడవడం నేదు
పిక్కలబలం సూపి నడిసొచ్చేద్దామంటే ఒప్పట్నేదు
గాలికి కొట్టుకొంటున్న గుడిసె తలుపునాగా మనసు కిర్రుకిర్రులాడతా గింజుకుంటాంది
పనీ నేదు పాటు నేదుగాని ఏలకింత బువ్వెట్టి 
తలదాసుకునే సోటిచ్చారు.
కూలికి పోకుండా కూసుని తినడం కుసింత.. 
అలవాటు లేని పని గదా.. సచ్చేంత సిగ్గుగా ఉంది 
ముక్కుకి గుడ్డ సుట్టుకుని మూలన కూసునుండగానే బద్దకంగా పొద్దెట్టా గడిసిపోయిందో ఇప్పుడే సీకటి పడింది 
ఏ దిక్కూ నేక సుక్కలవైపు సూత్తూ మాట్టాడుతున్నా..
ఒక్కటైనా నీకు ఈ ముచ్చట్లు సెప్పకుంటదా.. అని
ఏకువ జామునే ముసల్దానికి ఏడి ఏడి అంబలిపట్టు 
ఆయమ్మ ఆకలి కాగనేదు
సంటిదానికి పొద్దున్నే సద్దన్నం ఎట్టు
సింతసెట్టు కింద కూకుని సదూకుంటాదిలే
తానానికి వోడే సబ్బు బిళ్ల అరిగిపోకుండా దాసుకుని 
బయటికెల్లొచ్చినప్పుడల్లా.. సేతులు కడుక్కో 
సంతలోకొన్న మట్టి డిబ్బిలో సిల్లర డబ్బులుంటాయి తీసుకో 
ఆపదలో కాపు కాత్తాయని  
తుప్పు పెట్టెలో పాతబట్టల మడతల మద్దెన 
నాలుగు నోట్లు దాసిపెట్టుంచా.. ఎతుక్కో
సరుకులు నిండుకుంటే సావుకారుని బతిమిలాడు
అరువిచ్చి ఆదుకుంటే పెనిమిటి వచ్చాక పైసలిచ్చేత్తాడని
తాకట్టు తప్పదనుకుంటే సత్తుబడని ఇత్తడి బిందె ఉంది కదా
అవసరమైతే పుస్తులన్నా అమ్మేసుకో గానీ…
పస్తులుండి తిప్పలు పడకు పెండ్లామా
కనిపించని రోగమేదో కబలిస్తోందని
గతుకుల్లో పడి అదుపు తప్పినట్టుంది బతుకు బండి
దారిలో పడితే తిరిగి జోరందుకుంటాదిలే
పొట్ట సేత పట్టుకు ఊర్లంట తిరిగేవాణ్ని…
నేనెక్కడుంటే.. నీకేటిగానీ..
కోట గుమ్మంలాంటి నా తాటాకు ఇంటికి
రాణివీ నువ్వే.. రాజువీ నువ్వే 
మెతుకుని ఎతుకుతూ నేనెక్కడ తిరుగుతున్నా..
కంటికి రెప్పలా ఇంటిని కాపుకాసే 
ధైర్యమూ నువ్వే.. దైవమూ నువ్వే 
నేనింటి కొచ్చేలోగా పేమతో ఓ మాట పెండ్లామా 
పైసల్దేముంది గానీ.. పానాలు జాగర్త!
– గరిమెళ్ల వి.ఎస్‌.నాగేశ్వరరావు, విశాఖపట్నం, 93816 52097


ప్రోత్సాహక బహుమతి (2)
కరోనా కాలంలో నగరం…
రెక్కలు తెగిన పక్షుల్లా
కదలని దారుల్లో….
రెప్ప వాల్చిన కాంక్రీటు కోనల్లో….
సునామీలా
కబళించే కరోనా విన్యాసంలో నగరం …
కుహూ కుహూ
స్వరాలకై తపిస్తూ
వెన్నెల స్నానాలు
మల్లెల సరాగాలు కోల్పోయి
రసస్వాదన ఆవిరైన ఏసీ గదుల్లో
కలలు లేని కళ్లతో
నిద్రిస్తున్న గీతంలా నగరం…
చేతికి చిక్కని కాలం
సోమరిగా పరుగులాపింది
ఎండా వానతో పనేముందని
మెత్తని రాగమేదో ఆగింది..
అలజడి లేని నగరం
మనసు మాత్రం అల్లకల్లోలం
ఊపిరాడని ఇరుకు గదుల్లో
కళ కోల్పోయిన నగర జీవితం
నేడు కరోనా కోరల్తో పోరాడుతుంది…
మూలకు చేరిన మనసుకు ఒంటరితనం
ఊపిరాడనప్పుడల్లా
కలల రోజులకై కను కొలను
కాన్వాసుపై
ఏవో కొన్ని చిత్రాలు గీస్తూ
భారంగా సాగే జీవితాన్ని
మోస్తుంది నగరం…
ట్రాఫిక్‌ జాముల్లేని
మనుషుల జాడలేని
రోడ్లన్నీ
పక్షుల కువకువలతో
జాతర్లు చేస్తుంటే
ఇల్లే పంజరమైన నగరం…
చిరు గూటి కిటికీల గుండా
ప్రవహించే నగరానికి
ఏ ఆస్వాదనలేక
పల్లె పరిమళాన్ని చేరలేక
అనుదినం పొందిన అనుభూతిని
స్వీయ నియంత్రణలో
భద్రంగా పొదుపుగా
వాడుతోంది…
సహజ సిద్ధ శ్వాసతో
నాలుగు గోడల మధ్య
బతికుంటే చాలనుకుంటూ
నగరం జీవిస్తోంది…
– భానుశ్రీ కొత్వాల్, నల్గొండ, 98668 63913


ప్రోత్సాహక బహుమతి (3)
పరమాణువు
నిశ్శబ్దపు దుప్పటి కప్పుకుని నిద్రిస్తుంది నగరం
ఎవరి జోల పాటలోనో
వాహనాల అలికిడి తెలియని గాఢనిద్దుర…
విచ్చుకుపోయిన పరమాణువులై ప్రపంచం…
విరబోసుకుని
వేలాడుతూ
ఏకాకులైన దారులు…
పొడిబారిన దేహంపై తడారిన గీతలు…
వెలుగు చొరబడని నిశిరంగుల్లో కాలం!
ఏం కలగంటుందో ఆమె…
జ్వరాన పడ్డ గాలికి
చికిత్స చేస్తూ
తన దేహం నిండా పాకుతున్న ప్రాణులకు
కంచె వేసుకొస్తుంది!
నరాల్లో రక్తం గడ్డకట్టేలోపే
వ్యాయామానికి సిద్ధమైంది
స్తబ్దత ఎరుగని తన శ్వాసను 
సోహంలోకి నెట్టి
సుషుమ్నమై కూర్చుంది
సలపరింపుల్లో నిద్ర పట్టని రేణువులకు 
ఒంటరితనాన్ని చుట్టి
మనోనివాసాన్ని విధించింది!
చింతనలకందని చితిని సిద్ధం చేసి…
దహనానికి సెగనంటిస్తుంది
ఎంత నొప్పి కలుగుతుందో…
ఎందుకు ఊపిరి ఆడకుందో…
ఒళ్లు విరుచుకుని తూలుతుంది…
రుధిరాన్ని గక్కుతున్న కంటిచారల నిండా
శవాలకుప్పలు!
నిదురిస్తున్న ప్రపంచం నిండా
ఆమె ఒక్కతే పహారా కాస్తుంది
ఆకాశపు అరచేతిలో
ఎగురుతున్న బంతిపై 
ఊగిసలాడుతూ
అర్ధరాత్రి బాల్కనీలో ఒంటరిగా నేను…
ఒక్కో పరమాణువునూ లెక్కబెడుతూ!!
– అరుణ నారదభట్ల, హైదరాబాదు, 97050 15207


ప్రోత్సాహక బహుమతి (4)
పరుగులెత్తింది చాలు…
కారుణ్యసీమల వైపు నెమ్మదిగా నడిచి చూడండి!
కలలు చెదిరిన కళ్లతో కొన్ని తేనెపూలు తారసపడతాయి.
వాటికి ముళ్లగాయాల కథలుంటాయి.
వైరస్‌ తొలిచిన వ్యధలుంటాయి.
మనసు పెట్టి వినండి.
మానవతా పరిమళాన్ని అద్ది
ఆపదకాలంలో అభయహస్తం అందించండి.
విరిగిన పనిశకలాల క్రింద నలిగిన వలస పక్షులకు
నాలుగు భరోసాగింజలు వేసి వదాన్యత ప్రదర్శించండి.
రెక్కల లోపలి దుఃఖపుమరకలు తుడిచి
ప్రేమ సంజీవనితో వాటి వ్రణాల్ని మాన్పండి.
బతుకుదారుల్లో పరుగులెత్తింది చాలు! కాస్త నిమ్మళించండి.
స్మృతి పద సారస్వతాన్ని విప్పిచూస్తే..
నడవాల్సిన తోవ నిగూఢంగా దర్శనమిస్తుంది.
రహదారికిరువైపులా లేత మొక్కలు..
కొమ్మల తలలూపుతూ ఆహ్వానిస్తాయి.
ముడుచుకుపోతున్న ఆకుల అరచేతులు విప్పి
మహమ్మారి సోకిందేమో చూడండి.
వ్యాధి భయంతో ఒరిగిపోతున్న కాండానికి
నిలువెత్తు ధైర్యాన్ని అంటుకట్టండి.
ఇరుకుదారుల్లో పరుగులెత్తింది చాలు! కాస్త విశాలమవ్వండి.
ఇంటి ఆకాశపు అంతరంగాన్ని శోధించండి.
అపర సృష్టికర్తలుంటారు.
లోకాన్ని పసిపాపను చేసి పాలిచ్చే మాతృమూర్తులుంటారు.
వంతెనలు నిర్మించి ఎన్నో విపత్తులను దాటే వుంటారు.
మంచిముత్యాల్లాంటి అనుభవపాఠాల్ని శ్రద్ధగా వినండి.
మీ పోలికలతో పోతపోసిన ఆటబొమ్మలుంటాయి.
మీ ఖాళీ సమయాన్ని ధారపోసి వాటికి ప్రాణం పోయండి.
కాసులదారుల్లో పరుగులెత్తింది చాలు! కాస్త నిమ్మళించండి.
లోకమిప్పుడు కన్నీటి భాషలో సంభాషిస్తోంది.
ఏ కష్టమూ శాశ్వతం కాదని సంభాళించండి.
ఆకలి ఆకాశాలకు మెతుకుచుక్కలు పొదిగి
అనంత ప్రకాశాన్ని వెలిగించండి.
ఆశలదీవుల్లో పరుగులెత్తింది చాలు!
సంతృప్తి శిఖరాల చలువ నీడలో కాస్త నిమ్మళించండి.
నేలబావిలా నిలబడి నరలోకం గొంతు తడపండి.
– చొక్కాపు లక్ష్ము నాయుడు, విజయనగరం, 95732 50528


ప్రోత్సాహక బహుమతి (5)
మనిషికి మాత్రమే తెలుసు
అందరూ ఇళ్లలో ఉండిపోవటం
భయం కాదు అభయం
బలహీనత కాదు బలం
ప్రపంచమంతా ఒకే తాటిపై నడవటం
ఎంత సంఘటితం
ఇది ఒక నమ్మకం
ఒక విశ్వాసం ఒక కోరిక
మనసూ మాటా చేతా
కలిసికట్టుగా చేసే మహాకార్యం
లాక్‌డౌన్‌లు కాలే కడుపులకు కాదు
సామాజిక దూరం అన్నార్తులను
ఆదుకోవటానికి కాదు
నిప్పు కనిపెట్టినవాడు
ఒక్కోసారి దానిలోనే కమిలిపోవచ్చు
చక్రం కనిపెట్టినవాడు
అప్పుడప్పుడూ దాని కిందే నలిగిపోవచ్చు
అంత మాత్రాన కనిపెట్టటం తప్పా?
అపజయాలు కూడా ఉంటాయని
అడుగు వేయటం ఆపేస్తామా?
అణువులో అనంతాన్ని నిర్మించిన మనిషి
దాసుడయింది స్వార్థానికి
అది మితిమీరినప్పుడు
నియంత్రించటం ప్రకృతి ధర్మం
విపత్తు సరిచేసుకోమనే సంకేతమే తప్ప
అంతానికి ఆరంభం కాదు
ఇలాంటి ఆపదలు మనిషికి కొత్తకాదు
కాకపోతే ఆనాడు
అవి మొదలైన చోటే అంతమయ్యేవి
ఇప్పుడు ఎక్కడ పుట్టినా
ప్రపంచమంతా చుట్టిగానీ ముగియటంలేదు
అందుకే ఈ భయాలు
పుట్టుకలోనే మరణం కలిసి ఉండటాన్ని
ఎప్పటికప్పుడు మనిషి మరచిపోవటమే
కల్లోలానికి అసలు కారణం
జంతువు నుండీ జెనెటిక్‌ ఇంజనీరుగా
మారిన మనిషికి
కరోనాను కనుమరుగుచేయటం
కష్టం కావచ్చు
అసాధ్యం మాత్రం కాదు
ఎవరేమనుకున్నా…
ఓటమిలో జీవించటం
మరణంలో గెలవటం
మనిషికి మాత్రమే తెలుసు
– కళ్లేపల్లి తిరుమలరావు, మచిలీపట్నం, 91770 74280

Leave a Reply

%d bloggers like this: