ప్రథమ బహుమతి
పేద యాత్ర
విల్లు బాణాలు లేకుండా
ఇల్లు కదలని యోధులై
అందరూ యుద్ధం చేస్తుంటే
ముళ్లు దిగిన పనివాళ్ల పాదాలు
ముందుకి కదులుతున్నాయి మునివేళ్లపై
పిడికెడు అన్నమ్ముద్ద కోసమై
పీడకలలు లేని నిద్దుర కోసమై
చంకలోన చంటి చందమామతో చింకిరి తల్లి
బుర్రపైన బట్టల బుట్టతో నెర్రోడిన తండ్రి
పురుగు తరుముకొస్తున్నదని
పరుగుల ఉడుములై ఊరిబాట పట్టారిప్పుడు
నిప్పుకళ్ల చిరుతపులిని డప్పుకొట్టి తరిమినోళ్లే
పడగవిప్పిన నాగుపాముని పంగబుంగతో నాట్యమాడించినోళ్లే
జన కారాగారాల మధ్య ఇమడలేక
జననమిచ్చిన కాననాలకు తరలిపోతున్నారు
కానరాని శత్రువు కరిచేస్తుందని
ఫినాయిలు రొచ్చులో నానిన వేలికొసలు
తాకి మిసమిసలాడిన గచ్చు
ఆమె తడిగుడ్డకి మడికట్టు కడుతోంది
చిట్లిన చేతిగాజుల ఎరుపుతో మెరుపుతేలిన పాత్రల మధ్య
ఆమె తన దాస్య పాత్రని కోల్పోయింది
సిగ్గుల చెక్కిలై నునుపెక్కిన ముగ్గుల వాకిలి
ఆమె చీపురు ఊపిరిని వెలివేసేసింది
మెడలు నొప్పులు పుట్టేటట్టు మోసిన తట్టలతో
మేడలైన గుట్టలు
అతణ్ని గుర్తుపట్టలేని గుత్తేదారులై
గుడ్డముసుగులో దాగున్నాయి
వెన్నెముక మజ్జని వెన్నముద్దలుగా తిని ఎదిగిన మిద్దెలు
అతడి ఎసరుకి బియ్యమడిగితే పొమ్మన్నాయి
గొప్పిళ్ల గుప్పిళ్లకి గొళ్లాలు బిగుసుకుపోయాక
వారు మూతికి గుడ్డ కట్టుకోవడమంటే
పేగుల లోగిలిలో పస్తుల విస్తరి పరచుకోవడమే
బలుసాకుతో ఆశల పులుసు కాచుకొని బతికెయ్యాలనే
అరికాలి గాయాలతో ఆరని ఆకలి దీపాలై సాగుతున్నారు
తారుపూసిన ఆరు పాయల రహదారిపైకి
వన్యప్రాణుల ఆనందవిహారం
అరణ్య కుహరంలో దాగిన అరుదైన మూలికల మూలాల్లోంచి
అతడు తొలిమానవుడి విత్తనం తవ్వి తేవాల్సి ఉంది
నర నారుగా మొలకెత్తి కరోనాతో కరచాలనం చేయడానికి
లాక్డౌన్ ధనస్సుకు ఒంటరి దారాన్ని బిగించి
విజయశరం సంధించడానికి
(సొంత ప్రాంతాలకు కాలినడకన వెళ్తున్న ఆదివాసీ కూలీల కోసం)
– డా।। కనకమేడల దేవేంద్ర, హైదరాబాదు, 9949578070
ద్వితీయ బహుమతి
ముసుగు యంత్రం
పురుగు పారిన తీగోలె
మొగ్గం…
మూగబోయిందేం తాతా…
నువ్వు ఆటేస్తుంటే…
గాసమిచ్చే గాంధర్వ వాద్యమేదో మోగుతున్నట్లుంటది
గుంటలోకి దోపుకున్న కాళ్లు…
రాత్రింబగళ్లు శితికంఠుడి డమరుకం దరువేసుకుని
పేరిణి నాట్యమాడ్తవి
శిక్కువడ్డ పోగుపేగుల్ని
కోడె దూడల్ని దొడ్లెకి అదిలించినట్టే
ముసల్ది ఒడుపుగ సుట్టిన దారం కండెకు
ముద్దిచ్చుకుంట నాడె అటూ యిటూ ఆడిస్తుండటం
చిడ్తలు వాయించినట్లుంటది
సట్టరు ఉయ్యాల లెక్క ఊపుతుంటె
చీర తల్లి పురుడోసుకొని
నీ వొడిల ముత్యాల పందిరేస్కుంటది
యేం పురుగో పాడుగాను…
గుండెల్నిండా గాయిగత్తర
తాతా… జేబుల పైసల్లేని బాధ
ఛాతిలకింకిందా…
పట్టు పురుగుల్లకెల్లి
దారం పుట్టించినట్టు
పరుసవేది విద్దె యేదో జేసి
అందరి సేతుల్ల కట్నంగ బంగారం పెడ్తె బాగుండు
మనుషులందరు పీన్గలైతుర్రని
మొగురం సాటుకు ముడుసుకుంటెట్ల తాతా…
సిగ్గు పూలకి…
ముత్యాల చీర సుట్టినోడివి
అగ్గిపెట్టెల… చీర పట్టిచ్చినోడివి
ఆ గంధకం పుల్లల్ని
యేడ దాశినవో… ఇటు పారెయ్
దిగులు దీపంతలల్ల్ల…
బతుకు పాట ముట్టిస్త
తాతా… తేలియా రుమాళ్లు గాదు
ముసుగు రుమాళ్ల మొగ్గంబెట్టు
మనందరి పానాలకి దట్టి గడుదువు
పన్లెపని…
కరోనా అంచు జరీ చీర నెయ్
మహమ్మారి పాడె మీద గప్పుదాం.
– బాలసుబ్రహ్మణ్యం బోగ, భువనగిరి, 9490012215
తృతీయ బహుమతి
రెడ్‌జోన్
ఆకారం లేని కొత్త అవతారం
అన్నిటినీ మింగేస్తున్న వేళ
కాపాడగలిగే అవతారపురుషుడెవడు?
తరచూ చేతులు కడుక్కోవాలని చెప్పి
సులువుగా చేతులు దులిపేసుకున్నారు
ఎండే గొంతు దప్పిక తీర్చుకోలేనివాడికి
చేయి తడిసేపాటి నీళ్లెక్కడివి?
మొదటి నుంచీ అసింటానే ఉన్నవాళ్లకు
సామాజిక దూరం అసహజమేమీ కాదు
కాళ్లైనా ముడుచుకునే జాగా లేక
వాళ్లకి వాళ్లే దూరమైనవారి మధ్య
హాట్‌స్పాట్ ఎంత హాస్యాస్పదం?
అంతస్తులు కలవారిదెప్పుడూ ఐసోలేషనే
ఆకాశమే ఇల్లైనవారికిప్పుడైనా ఉందా సొల్యూషన్?
ఇంటికేసినట్టు దేశానికే తాళమేస్తే..
నెత్తి మీద లాక్ డౌన్ గుదిబండతో..
పనిలేని చేతులను మోసుకుపోయే కాళ్లకు
ఇప్పుడెవరు ఏ నడక నేర్పగలరు?
చప్పట్లు కొట్టీ, చప్పుళ్లు చేసీ..
దీపాలు పెట్టీ, దివిటీలు వెలిగించి..
రోగం మాటున పాత రాగమే పాడేశాక,
ఇక ముఖానికి మాస్క్ లెందుకు?
చెల్లనితనాన్ని చాటుచేసుకోడానికి కాక?
మానవ ఇతిహాసాన్ని, మనిషి నైజాన్ని
కత్తివాదరపై నిలిపి కరోనా నిలదీస్తున్న వేళ
అక్షరానికీ ఆత్మకీ ఎడం ఎక్కువైతే
పదాలకీ పెదవులకీ అస్పృశ్యత సోకితే
చేతులతో తాకకండి..
వాక్యాలకు వైరస్ సోకుతుందేమో
కవిత్వాన్ని కాసేపు క్వారంటైన్లో ఉంచండి.
– దేశరాజు, హైదరాబాదు, 9948680009
ప్రోత్సాహక బహుమతి (1)
ఎన్నాళ్లయింది!!??
క్షణం తీరిక లేకుండా
గడియారం ముల్లుకి కాలై నడిస్తేనేం
తన మనసుతో తాను మాట్లాడి
ఎన్నిరోజులైంది
తనని తాను చూసుకుని
తన గురించి తాను ఆలోచించి
తనలో తాను మురిసిపోయి
తన జీవితాన్ని తాను ఆస్వాదించి
ఎన్ని యుగాలైందో
అందరి అవసరాలను తీరుస్తూ
అనవసరాలను భరిస్తూ
అలసి, ఓపిక లేని ప్రపంచం చుట్టూ
తిరగడం మాని
నిర్లక్ష్య ప్రపంచాన్ని గదిలో పెట్టి తాళమేసి
తనచుట్టూ తాను తిరుగుతూ
అలజడులు గొడవలు లేని
సంద్రాల సరాగాల్ని వనాల వీచికలని
పక్షుల పలుకుల్ని వింటూ
పులకరించిన క్షణాలు
మరచి ఎన్నేళ్లయిందో
తనలోన తనమీద ఆధారపడి
ఏవీ లేకుండా ఒంటరిగా విసిరేయబడి
భగభగ మండీ
చల్లారి, జీవానికి జీవం పోసిన
అవని ఆస్వాదించిన ఆనాటి రోజులు
మళ్లీ ఇప్పుడు, తిరిగొచ్చినట్లు
భూమండలమంతా తమలోకి తాము
తొంగి చూసుకునేటట్లు
అంటుకున్న ఈ నిశ్శబ్దం
మితిమీరిన పిల్లల అల్లరి
అదుపుచేయడం కోసం
తల్లి చేసే బెదిరింపు లాంటిదైతేనేం
ఆ తల్లి
అమ్మైతేనేం అవనైతేనేం ఎవరైతేనేం!!
తనను తాను మలచుకుని
తనకోసం తాను బతికి
పదిమంది కోసం
తానో యజ్ఞమై
యజ్ఞోపవీతమై
ఎంత కాలమైంది
స్వార్థపు పొరలని వదిలి
మనిషి మనిషిలా బతికి ఎన్నాళ్లయింది!!
– దీక్షిత్ కుమార్ మల్లెల, గడ్కోల్, నిజామాబాదు, 90636 99731
ప్రోత్సాహక బహుమతి (2)
నేను చైతన్యాన్ని!
నేను-
విడివడ్డ అక్షరాన్ని కాదు
నిగూఢ సమూహాన్ని
భిన్నత్వంలో ఏకత్వాన్ని
కరోనాపై యుద్ధాన్ని !
నేను-
ఒంటరి పదాన్ని కాదు
సమస్యల భాస్వరాన్ని
పరిష్కార జీవనవేదాన్ని
ప్రజల ప్రాణహరితాన్ని !
నేను-
ఏకవాక్యాన్ని కానే కాదు
పీడితుల ధిక్కారాన్ని
శ్రమజీవుల నినాదాన్ని
బాధితుల విశ్వాసాన్ని !
నేను-
ఇప్పుడు కవిత్వాన్ని
నిరంతర చైతన్యాన్ని
కటిక నిశి గవాక్షాన్ని
సమస్త ప్రపంచాన్ని !
– అశోక్ అవారి, అనంతగిరి, సిరిసిల్ల, 9000576581
ప్రోత్సాహక బహుమతి (3)
అలసత్వం లేని యుద్ధం చేద్దాం
నిర్లక్ష్యపు అద్దకాన్ని ఒంటికి పూసుకుంటే
ఆకాశం రాల్చే నక్షత్రాలతో నేలనిండక తప్పదు
లాక్డౌన్ గొళ్లెమేసి భూమిని కప్పేసినా
పాజిటివ్ రేఖలు వ్యాపిస్తూనే ఉన్నాయి
నిదురను, నిశిని మరచి రహదారులు నడుస్తూనే ఉన్నాయి
సొంతగూడు వెతుక్కుంటూ కాళ్లీడ్చుకుంటూ
వాలిన పొద్దులు గుక్కెడు గంజికి గతిలేక
శిబి రాకకోసం ఆశ్రమాలలో ఆవురుమంటూ
ఖాళీ సిరలతో తలసేమియా వ్యాధి జీవాలు
ఖట్టికకు దారి పడుతున్నాయి
జన్మకు జన్మనిచ్చే జన్మ రక్తహీనతతో
వైద్యసాయం కోసం వీధులు చుడుతూ
సంపూర్ణ ఫలాల బేరాలు అసంపూర్ణాలై
కొట్టేవాడి కడుపులో ఖాళీని పెంచుతూ
ముసుగు కప్పలేని నిజం ఇజాన్ని చంపేస్తున్నది
గంగలో గరళం కరిగి పరిశుభ్రమయింది
గూటిలో కాయం విషాన్ని మోస్తున్నది
భయం గుప్పిటి నుంచి ఆలోచనను బయటికి తరిమితే
పరిష్కారం లేని సమస్య ఉండదు
నిన్ను నువ్వు నియంత్రించుకుంటూ
నీ రక్తాన్ని దానంగా ఇవ్వు
పసిబిడ్డల ప్రాణాలకు అది సంజీవిని
అడుగు దూరంలోని అనాథలకు ఆసరా ఇవ్వు
ముసలి ప్రాణాలకు అది వరదాయిని
నాలుగు ముద్దలు తినే స్తోమతు ఉంటే
ఒక్క ముద్ద పక్కవాడికి పెట్టు
ఇంటి ముఖం చూడని తెల్లకోటును చూడు
ఎండను లెక్కచేయని ఖాకీ పువ్వును చూడు
విషద్రావణాలు చల్లే పారిశుద్ధ్యాన్ని చూడు
నువ్వు ఆదుకోవాల్సిన వాడెక్కడో లేడు
నీ చుట్టూనే ఉంటాడు
పనివాడో, బిచ్చగాడో, వలసజీవుడో
ఎవరికైతేనేం పిడికెడు గింజలివ్వగలిగితే
కరోనా మరణానికి తోడయే ఆకలిమరణం ఆగుతుంది
వర్తమానం చరిత్రగా మారే దుస్థితి తప్పుతుంది
మదర్ థెరిసా వారసత్వం మనది
జీసస్ కదలాడిన గడ్డ మనది
మహాత్ముని ఆదర్శాల ఊపిరి మనది
అలసత్వం లేని యుద్ధం చేద్దాం
కరోనా లేని దేశాన్ని నిలబెడదాం.
– శింగరాజు శ్రీనివాసరావు, ఒంగోలు, 9052048706
ప్రోత్సాహక బహుమతి (4)
ప్రకృతి లిఖించిన శాసనం
గిల గిలా కొట్టుకుంటున్న జ్ఞాపకాలు ఒక్కొక్కటి
వేకువ పిట్టల్లా పలకరించడం
స్వేచ్ఛగా ఎగురుతున్న రెక్కల పక్షి చేతులు కట్టుకొని
బుద్ధిగా ఇంటిగోడల్లో దాగిన పాఠాలను వినడం
మర్మమేదో తెలియక, మందుఏదో తెలియక
కనీవినీ ఎరుగని సూక్ష్మజీవితో పోరాడటం
అమ్మ చేతి ఆవకాయ పచ్చడో, రాగిసంకటో లేక దద్దోజనమో.,
ఏదో ఒకటి కడుపునిండితే చాలు అనే ఆలోచన మెదలడం
ఉదయరాగం, మళ్లీ ఊపిరి తీసుకుంటున్న
ప్రకృతి కువకువల్లో,
రంగులు వేస్తున్న చిత్రకారుడిలా కనిపించడం
భయం, ఆనందం, బెరుకుదనం అన్నీ కలగలిపిన
షడ్రుచుల్లా రోజులు గడవడం
గంపెడు ఆశలు, నిచ్చెన వేసుకున్న ఆశలసౌధాలు
తరుముకొస్తోన్న యుద్ధ మేఘాల తాకిడికి నిలబడతాయో,
లేదో అనే సంకటం
సమాజం కోసం తానూ స్వప్నం కనాలి
నవ సమాజం కోసం తానూ సామాజిక న్యాయం చేయాలి
అని సమాజపు బడిలో అక్షరాలు దిద్దుకుంటున్నాడు మనిషి
జనన మరణాల లెక్కల్లో ఆరడుగుల ఆంతర్యమేంటో
అడుగడుక్కూ ఉన్న విలువేంటో తెలుసుకోవడం చిత్రమే
బాధను పోగొట్టడం కోసం భుజస్కంధాలపై బాధ్యత మోస్తున్న
మనిషి, నీకూ నాకూ ఏమీ కాడు;
కానీ నీ పెదాలపై చిరునవ్వు కోసం
శ్రమిస్తున్న శ్రామికునికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో
ప్రకృతి ఒక శిల్పకారుడిలా శాసనాన్ని రాస్తోంది
ప్రకృతితో స్నేహం చేయి, కానీ ప్రకృతిని మోసం చేయకు
కొత్త పాఠాలనెప్పుడూ ప్రకృతి నేర్పిస్తూనే ఉంటుంది అని..
– జ్యోతి నండూరి, హైదరాబాదు, 8978639692
ప్రోత్సాహక బహుమతి (5)
నాణేనికి మరోవైపు
ఈ సమయం మనల్ని టైం మిషన్‌లో చుట్టి
పూర్వకాలానికి నెట్టింది
ఉరుకుల పరుగుల యంత్రాలకు కళ్లెం వేసి
జీవిత వాస్తవాన్ని చూపింది
ఎరుపు దీపాల విసుగు లేదు రద్దీ లేదు
రణగొణ ధ్వనులు అసలే లేవు
దారిపక్కన మసిబారిన చెట్లు పొగగొట్టాల నుంచి
తప్పించుకుని ఊపిరి పీల్చుకుంటున్నాయి
రహదారి విధుల్లో రక్షకభటులు వీధికెక్కిన ఆకతాయిలకు చిన్ననాటి గురువులను గుర్తు చేస్తున్నారు
దండోపాయాన్ని రుచి చూపిస్తున్నారు
ప్రతి ఇల్లిపుడు సంబురాల పందిరేసుకుంది
కాలికి బలపం కట్టుకుని తిరిగే కొడుకిప్పుడు
నాన్నతో కూర్చుని చదరంగం నేర్చుకుంటున్నాడు
అమ్మ పనుల్లో చేయందిస్తున్నాడు
కష్టం తెలియకుండా పెంచిన కూతురికి
ఇప్పుడు ఇంటినెలా దిద్దుకోవాలో తెలుస్తోంది
తాజా కూరగాయల రుచి ముందు
మాంసాహారం మొహం వేలాడేస్తోంది
షడ్రుచుల వేడి భోజనాలు ఘుమఘుమలాడుతుండగా
రోజుల తరబడి ఫ్రిజ్‌లో మురిగే పిజ్జాల అవసరం లేదిప్పుడు
సంక్రాంతికి మాత్రమే పొయ్యెక్కే మూకుడు
ఇప్పుడు రోజూ పనిచేస్తోంది
పిండివంటలతో చిరు ఆకళ్లను తీరుస్తోంది
యూట్యూబ్ వంటపాఠాలతో కొత్తతరం
ఇంటివారందరినీ కొంగొత్త రుచులతో ముంచెత్తుతోంది
జోకుల్లో మగాళ్లు.. అప్పడాల కర్రతో ఆడాళ్లు
పిల్లలకు టికెట్ లేని సినిమా
ఎప్పుడో సీమంతం నాడు గరిట తిప్పిన శ్రీవారు
మళ్లీ ఇన్నాళ్లకు పాకశాస్త్ర ప్రవీణులయ్యారు
ఇల్లే ఇలలో స్వర్గమనీ ఇల్లాలే ఇంటికి దేవతనీ
ఆడుతూ పాడుతూ ఇంటిపనిలో ఆలుమగలు
సరాగాలను పలికిస్తున్నారు
రామాయణ భారతాల ముందు ధారావాహికలేపాటి అని మురుస్తున్న బామ్మలు
పాదులు కొత్త మొక్కలతో పెరటికి కళ తెస్తున్న అత్తయ్యలు
బూజు దులిపిన పొత్తాలతో చదువరులు
నిబిడీకృత సృజనకు పదును పెట్టుకుంటున్న పిల్లాపాపా
తమవారితో సమయం గడపాలనే కోరిక తీరిన వృద్ధులు
చాటింగ్‌కి చోటే లేదని గదుల చాటున ఈడువాళ్లు
బలవంతపు పాఠాలతో ఆన్లైన్లో పాపం
అటు టీచర్లూ ఇటు పిల్లలు
అలసిన దేహాలకు సాంత్వన మాత్రమే అయిన ఇల్లిప్పుడు
ఆత్మీయతలు అల్లుకున్న పూల పొదరిల్లయింది
నాణేనికి ఒకవైపు మృత్యు గీతాలాపనం
మరోవైపు అనుబంధాల లేపనం
– డా।। సరోజ వింజామర, హైదరాబాదు, 8099721928