ఏప్రిల్ 18, 2020

కరోనాపై కదనం – ఏప్రిల్‌, 16 పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు, కవితాజాలం at 12:59 సా. by వసుంధర

లంకె

ప్రథమ బహుమతి
క్వారంటైన్‌ రెక్కలు
ఊడలై విస్తరించిన నాగరికాభివృద్ధిలో
నన్ను నేను నిరూపించుకోవడంకోసం
రెక్కలొచ్చాయని పరాయిదేశం ఎగిరిపోయాను..!
ఉంటున్న వృక్షానికి కొత్త తెగులేదో పట్టిందని
స్తంభించిన బతుకులన్నీ బెంబేలెత్తి పోతుంటే
అన్ని పక్షుల్లాగే ఆత్రపడి
భయాందోళనలతో ఎగిరొచ్చి
సొంత గడ్డపై వాలాను..!
ఇలా వాలానో లేదో… అలా పట్టుకొని
క్వారంటైన్‌ అంటూ పద్నాలుగు రోజులు
ఖైదు చేశారని ఖేదపడుతుంటే…
అదిగో.. సరిగ్గా అప్పటి నుంచే
కుంచించుకుపోయిన నా రెక్కలు విప్పారినట్లు
విచ్చుకున్న రెక్కలతో
విశాల ప్రపంచాన్ని చుట్టొస్తున్నట్లు
ఏవేవో ఊహలు…!!
కరుణ కురిపించే కళ్లు తప్ప
మరేమీ కనబడని ముసుగులతో
అనుక్షణం కంటిపాపలా కాచిన
తెల్లని బట్టల దేవదూతలను చూసినప్పుడు
మొదటిసారి నా తలపుల రెక్కల్లో చలనం మొదలైంది..
వచ్చిన పని ముగిసిందని
ఇంటికొచ్చిన అతిథిని
సగౌరవంగా సాగనంపినట్లు
ఆదరంగా వీడ్కోలు పలికితే..
భద్రంగా సొంతగూటికి చేర్చిన వాళ్లని చూసి
ఖాకీ దుస్తులంటే కరుకుదనం కాదు
కాపాడే గుణమని తొలిసారి గ్రహించినపుడు
నా ఆలోచనల రెక్కలు మరింత విచ్చుకున్నాయి..
హోమ్‌ క్వారంటైన్‌ అంటూ
మళ్లీ గదిలో బందీని చేసి
బాధనూ బాధ్యతనూ సమానంగా మోసిన
అమ్మానాన్నల ప్రేమ నా రెక్కల్లో బలాన్ని
మరింత పెంచింది..
క్వారంటైన్‌ అంటే ఖైదు కాదు
సామాజిక బాధ్యత అని
గ్రహించిన మనసు..
గతించిన కాలంలోని తప్పొప్పులను
తరాజులో సరిగ్గా తూచుకొని
ఇన్నాళ్ల నా అజ్ఞానాన్ని మాయంచేసి..
నా బాధ్యతలేమిటో నాకు గుర్తు చేస్తుంటే..
కొత్తగా విప్పారిన జ్ఞానోదయపు రెక్కలతో
భవిష్యత్‌ సందర్శనం చేస్తూ..
స్వేచ్ఛగా విహరిస్తున్నా..!!
– చల్లా దేవిక, ఒంగోలు, ప్రకాశం జిల్లా, 9848965188


ద్వితీయ బహుమతి
నిన్నటిలోకి వెళ్లాలనుంది
నిన్నటిదాకా వెలుగనుకొన్నది
కాదు కాదు అది చీకటని
తటాలున సోయి ఏర్పడింది…

నాలుగు గోడల మధ్య బందీనైన నాకు
బయటొక ప్రపంచం ఉందని,
అదిప్పుడు బ్రహ్మాండంగా వెలుగుతోందని
తెలుసుకున్నప్పుడు నాకు నేను ఓ దోషిగా
తలదించుకుంటున్నాను…

పరుగునే నమ్ముకున్న నేను
అరిగిపోతున్న మానవీయ పాదముద్రల్ని
గుర్తించనే లేదు…
ఎదిగిపోతున్న నేను
కదిలిపోతున్న నైతిక విలువల్ని
గమనించనే లేదు …
జీవితం క్లిష్టమైందనుకున్నాను కానీ
అదెంత సంక్లిష్టమో ఇప్పుడే తెలుస్తోంది…

నా మెరుపు కళ్లతో
మనుషుల్ని ప్రేమించిందెప్పుడని..?
కనిపించని పురుగొక్కటి
నన్ను మనిషిగా మార్చేంతవరకు..!

కరోనా వచ్చి కన్నెర్ర చేసేంత దాకా
నేను చూపించిన కరుణ, దయ
నా పుట్టల సంపదకు పెట్టుబడి అనుకున్నాను…
ఇప్పుడిప్పుడే నాలో మొలకెత్తుతున్న మనిషిని చూసి
తప్పుల అంపశయ్యపై తలవంచుకుంటున్నాను…

ఒక్కసారి ఓ కరోనా..!
నిన్నటిలోకి నన్ను తీసుకెళ్లు
జీవితాన్ని సవరించుకుంటాను
నువ్వు రాలేని ప్రపంచాన్ని సృష్టించుకుంటాను..!!
– సంగెవేని రవీంద్ర, ముంబయి, 9987145310


తృతీయ బహుమతి
ఇప్పుడొక ప్రేమకావ్యం రాయాలి 
అవును
మనిషిని మనిషి ప్రేమించగల
మనిషిని మనిషిగా ప్రేమించగల
ఒక ప్రేమకావ్యం రాయాలి

కాలకూటాన్ని నింపుకున్న గతించిన కాలాల
శిథిలపుటల చితాభస్మంలోంచి
ఫీనిక్స్‌ పక్షిలా పునరుత్థానం చెందుతున్న
విషపు రాతల విద్వేషపు విభజన గీతల
రక్తగాయాల అమానవీయ చరితను చెరిపేసి
ప్రపంచ కావ్యానికి సరికొత్త ముఖచిత్రం గీయాలి

ప్రకృతీ మనిషీ మనసుపడి రాసుకున్న
తొలిప్రేమల ఆదిమ ప్రణయ ప్రబంధాన్ని
ఆధునిక పరిభాషలోకి తర్జుమా చేసి
టీకాతాత్పర్య సహిత వ్యాఖ్యానం జతచేసి పునర్ముద్రించాలి

ప్రకృతి చెప్పిన ఊపిరి ఊసులనూ 
మనిషి ఆడి తప్పిన అనాది బాసలనూ
ఇప్పుడే పునస్సమీక్షించుకోవాలి
బ్రేకప్‌ అయి శిశిరమై నిలిచిన బంధాన్ని
వసంతప్రేమతో నవనవోన్మేషంగా మళ్లీ పల్లవించనివ్వాలి

తోడబుట్టిన ప్రాణికోటి చేయినెప్పుడు వదిలాడో 
ప్రియసఖి ప్రకృతి చిటికెనవేలు నెక్కడ విడిచాడో 
ఆధునిక ధ్వంసరచన నెలా ప్రారంభించాడో
అవనీతలాన్నీ అంబుధి గర్భాన్నీ 
అంతరిక్షకోశాన్నీ కలుషితకాసారం చేసి
ప్రేమలు కుసుమించిన పసిడితోటల్లో
విషఫలాలనెలా పండించాడో
ఎప్పుడు ఎక్కడ యెలా వికృతి మొదలయిందో
మళ్లీ అక్కణ్నుంచే ఎత్తుకొని 
వినూత్న ప్రకృతి నిర్మాణ రచననారంభించాలి
ఇప్పటి వరకు విస్మరించిన విపు(మ)ల భావనలే
పతాక శీర్షికలుగా విశ్వకృతిని సృజించాలి 

అవును
పరమ పవిత్ర మతగ్రంథాల నన్నింటినీ మరిపించేలా
ఒక మహోన్నత మానవహిత 
ప్రేమామృత మహేతిహాసాన్ని లిఖించాలి 
రేపటి బాలభానుడికి జాతిగ్రంథంగా ఇప్పుడే బహూకరించాలి
– నూటెంకి రవీంద్ర, లక్సెట్టిపేట, 9491533295


ప్రోత్సాహక బహుమతి (1)
రెక్కలు విరిగిన పక్షి
చెమట చుక్కల్ని లెక్కగట్టి
మెతుకులు పెట్టే నగరం ఇప్పుడు
నల్ల దుప్పటి కప్పుకుంది
గమనం అంతుచిక్కక
ముసిరిన చీకటికి ఎప్పుడు
తెరపడుతుందో తెలియక
నిన్నటి వరకు నగరాన్ని
తమ స్వేద జలంతో
ఆకాశానికి ఎత్తి
ప్రపంచ వీధుల్లో తిప్పినది
ఆ ఆకలి పోరాటాలే కదా
ఇప్పుడు గూడు ప్రశ్నార్థకమైన
పక్షుల రెక్కలు తెగిన రోజులివి
దారి తోచని తీరం వాటిది
అయినా… విధి ఆడిస్తున్న
వింత నాటకమే కదా ఇది
ఇన్నాళ్లూ నగరం కోసం
నీవు చిందించిన చెమట చుక్కలు
ఇంకా ఆవిరి కాలేదు
నీ బతుకు పోరాటంలో
నగరం నీకు మెతుకై తోడుంటుంది
కాసిన్ని రోజులు నిన్ను
భుజాన మోస్తుంది
ఈ చీకటి పొరలు తొలగి
రేపటి ఉషోదయానికి
నీవే కాగడా అయి నిలవాలని
మానవత్వపు చినుకులు వర్షిస్తున్నాయి
కరోనా మన బతుకులను
అతలాకుతలం చేయకుండా ఉండటానికే
ఈ హద్దులూ…కంచెలు
ఈ జీవన పోరాటంలో
ఎన్ని సుడిగుండాలొచ్చినా
దిగదుడుపే కావాలి
నీ స్వచ్ఛ ధైర్యం ముందు
– వైద్య సుజాత, మంచిర్యాల, 8341767197


ప్రోత్సాహక బహుమతి (2)
మాయదారి రోగం
చూరు నుంచి జారిన
వాన చినుకును చూస్తూ
గుడిసెలో ఓ మూల నక్కి ఉన్న
ఆకలి కేకలకు తెలుసా,
మాయదారి రోగమొకటి వచ్చిందని.,
గాజుకళ్లలో మిగిలిన ప్రాణాన్ని
ఏదో పట్టుకు పోతుందని తెలుసా,
ఏమీ తెలియని అజ్ఞానమే కదలని కాళ్లలో
ఇంకా జీవాన్ని మిగిల్చిందేమో 
ఎన్ని సూడలేదు, ఈ బతుకు సుడిగుండాలను.
అలవాటైన ఆకలి పోరాటం 
దేనికీ చలించని కఠిన శిల అయ్యింది.
నారు పోసిన వాడే నీరు పోస్తాడన్న దాహార్తితో 
ఎండిపోయిన పెదవుల కదలిక విడిపోయింది.
రెక్కాడితే కానీ డొక్కాడని చేతికి 
ఆపన్న హస్తం ఆదుకుంటుందని ఆశ. 
బయట ప్రపంచం ఎప్పుడో తలుపులు మూసేసింది.
రోగ భయంతో.
భయమంటూ తెలియని చీకటి నీడలో,
గుడ్డిదీపం మిణుకు మిణుకుమంటూనైనా తోడుంటుందని 
కళ్లలో మరీ వత్తులు వేసుకున్న.జీవచ్ఛవం.
ఈ భుజం మీద ఎన్ని బాధల బరువులు మోయలేదూ,
పనిచేయించుకున్న చేతలే, చేతుల్ని విదిలించి 
తలుపులు మూసేస్తున్నాయి.
గతాన్ని మరచిపోయి చీదరించుకుంటున్నాయి.
వీళ్లు భయపడుతోంది రోగం గురించా,
గుప్పెడు గింజలు కూడా విసరలేని 
స్వార్థమనే మాయదారి రోగం గురించా
తలుపు అవతల
మద, మాత్సర్యాలనే రోగాలు ఎప్పుడో 
చుట్టేశాయన్న విషయం తెలియదా.
రోజూ చచ్చి బతికే ఈ బతుక్కి
రోగమో లెక్కా.
మానవత్వం రిక్తహస్తమయ్యిందని
దానికి తెలియదా
ఏ గాలి అయినా ఉసురు పోనీకుండా 
చూస్తుందేమోనన్న నిట్టూర్పు
చూరు నుంచి జారే చినుకైనా
ఓదార్పు తానవుతుందేమోననే ఎదురుచూపు 
– సముద్రాల శ్రీదేవి, మెదక్, 9949837743


ప్రోత్సాహక బహుమతి (3)
హైదరాబాదు పొమ్మంటున్నది
ఎన్నాళ్ల దుఃఖమో కనురెప్పలు దాటుకొని
చెక్కిళ్లను చేరి వెక్కిరిస్తున్నది.
ఎప్పుడో ఎనకట పొట్టచేతబట్టుకుని
నగరానికి వలసొచ్చినం
తాతలు తండ్రుల నాటి నుంచి
ఇక్కడ్నే పనులు చేసుకున్నం
రెక్కాడితే కాని డొక్కాడని జీవితాల్ని
పణంగా పెట్టి కలోగంజో తాగి బతికినం
చేసుకున్ననాడు కడుపునిండాతిని
పనిలేనినాడు పస్తులున్నం
నగరం నిండా మిద్దెమేడలు కట్టి
ఆ మేడ నీడల కింద గుడిసెలేసుకున్నం
నిండిన సెప్టిక్‌ గలీజునంతా ఎత్తి
డ్రైనేజీ కాలువల పక్కనే కాపురమున్నం
మా రెక్కల కష్టంతోని రేయింబవళ్లు కష్టించి
ఫ్లైఓవర్లు కట్టి నగరానికి కొత్త రూపుతెచ్చినం
పిట్టగూడులాంటి ఇండ్లను కూల్చి
ఆకాశాన్ని తాకే అపార్ట్‌మెంట్లు కట్టినం
ఇప్పుడు నగరం నడిబొడ్డున మీరు
ఎక్కడో శివార్లలో మూసీనది పక్కన మేము
కార్మిక ఉద్యమాలని, ఉపాధి పోరాటమని
చేతికి రంగురంగుల జెండాలిచ్చి తీసుకెళ్తే
లీడర్లంతా మా కోసం జేస్తున్నరని
పనులన్నీ పక్కకు పెట్టి ధర్నాలు చేసి
ఉరికి ఉరికి లాఠీదెబ్బలు తిన్నం
ఎవరేం న్యాయంచేస్తరో అని
ఎవరు పిలిచినా కాదనకుండా పోయి
కాళ్లు కాలంగా, కడుపులు మాడంగా
నాయకులందరికీ జేజేలు కొట్టినం
ఎవరెన్నిసార్లు వాడుకొని వదిలేసినా
గుండెల పెట్టుకుని గుడ్లు నలుపుకున్నం
కడుపులబెట్టుకొని చూసుకునేటందుకు
హైదరాబాదు ఉన్నదన్న భరోసాతోని బతికినం
కానీ పాడు కరోనారోగమొచ్చి పనుల్లేకుండా చేసే
పస్తులుండలేక పసివాళ్లను చంపుకోలేక
పానమంతా పుట్టిన ఊర్లమీదకు మల్లవట్టే
హైదరాబాద్‌ హమారా పేదోళ్ల ఆత్మరా అన్న
నగరం పొమ్మనవట్టే పల్లె రమ్మనవట్టే
– మధుకర్‌ వైద్యుల, హైదరాబాదు, 8096677409


ప్రోత్సాహక బహుమతి (4)
మూడో ప్రపంచ యుద్ధం మూడు నాళ్లే
ఏ రాక్షస బల్లులో, గ్రహాంతర జీవులో
కలిగించలేని భయోత్పాతమిది
ఏక కణ జీవా, అర్ధకణజీవా
పరిశోధకులు తేల్చే లోపలే
ప్రపంచాన్ని వినాశం అంచున 
నిల్చోబెట్టిన విశ్వసంహారిణి.
కనిపించక, వినిపించక విధ్వంసం సృష్టిస్తోన్న మహమ్మారి.

ఇద్దరు నరులు, వానరసైన్యం ఒకవైపు,
అశేష రాక్షస సైన్యం మరోవైపు 
భీకర సంగ్రామం జరిపిన కాలం దాటాం

పదకొండు అక్షౌహిణుల సైన్యం ఒక వైపు
ఏడు అక్షౌహిణుల సైన్యం మరోవైపు
పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని ధరిత్రి చూసింది.

దేశదేశాల సైన్యాలు రెండుగా విడివడి
ఘోరంగా పోరాడిన రెండు ప్రపంచయుద్ధాలూ చూశాం.
నాగసాకి, హిరోషిమాలు మరుభూములైంది నిన్ననే

అడవులు, పొలాలు, జలాశయాలు, కర్మాగారాలు వదిలి
సమస్త మానవ నిర్మితాలను పక్కకుతోసి
మనిషికే గురిపెట్టిన ప్రకృతి భీకర ఉత్పాతం!
రాజైనా, బంటైనా చేతులు కట్టుకుని
నిస్సహాయంగా నిలబడాల్సిందేనంటోన్న త్రాసం ఇది!!

మూడో ప్రపంచ యుద్ధం నీటి కోసమేనన్నది సత్యదూరం
ఇప్పుడు జరుగుతున్నది అదే కదా!
మనం ప్రయోగించాల్సింది నాటి పాశుపతాస్త్రాలు
నేటి హైడ్రోజన్‌ బాంబులూ కావు
మనిషి సమస్త జీవన విన్యాసాల్నీ
నాలుగు గోడల మధ్య కుదించే సంచార నిషేధాస్త్రాలే!

కరచాలనమే మృత్యువవుతున్నప్పుడు
దూరం పాటించడమే హితం
చైతన్యమంటే రోడ్ల మీద తిరగడమే కాదు
బాధ్యతగా మసలుకోవడం కూడా
ఈ విషజీవి స్వైరవిహారం మూడునాళ్లే
మన శాస్త్రవేత్తలు మూడోకన్ను తెరచే వరకే! 
– చీకోలు సుందరయ్య, హైదరాబాదు, 90300 00696


ప్రోత్సాహక బహుమతి (5)
కాలక్షేపం
కాలక్షేపం అనే పదం బతుకు నిఘంటువులో చెరిగిపోయి 
ఎన్నో దశాబ్దాలు అయిపోయింది. 
ఉద్యోగం నుంచి రిటైర్మెంట్‌ అయితేనే గాని 
బతుకులో కాలక్షేపం
కనీసం ఆలోచించే విషయం కాదన్నట్టు ఉండేది. 
నిత్యం సెకండ్ల ముల్లు నాతో సమానంగా పరిగెట్టేది. 
ఇప్పుడు కరోనా చేసిన నిర్బంధంలో 
గంటల తరబడి గంటల ముల్లుతో కాలక్షేపం చేస్తున్నా
విసుగొచ్చిన గంటల ముల్లు మళ్లీ వస్తా అని వెళ్లిపోయింది 
కానీ నేను అక్కడే ఉన్నా !!
కాలక్షేపం వెతుక్కుంటున్నా, ఒక్కోసారి కొనుక్కుంటున్నా 
కాలక్షేపం చేయడం నేర్చుకుంటున్నా 
సెలెబ్రిటీల చిట్కాల వీడియోలు 
మొదటి ఇరవై రోజుల కాలక్షేపం మాకు. 
లాక్‌డౌన్‌ జీవితాన్ని పొడిగించాక 
ఇంటిలో ఘుమఘుమలాడే బంధాల రుచులన్నీ కలుపుకున్నాక 
క్వారంటైన్‌ కూడా కమ్మని కొత్త ఆవకాయలా ఉంది. 
కాలక్షేపానికి కాలక్షేపం అయిపోయాం మేము 
ఇంట్లో వస్తువుల ముఖాలు తళతళా రోజూ మెరుస్తున్నాయి 
స్టీలు గిన్నెలన్నీ గలగలా మాట్లాడుతున్నాయి 
ఉతికిన బట్టలన్నీ మురిపెంగా మడతలు పడి 
ఒకదాని పొత్తిళ్లలో ఒకటి వెచ్చగా జోగుతున్నాయి 
జీవితమంటే పరుగులెత్తడం అనుకున్నాం 
జీవితమంటే పలకరించుకోవటం, 
పగిలిన సందర్భాలని అతికించుకోవటం అనుకుంటున్నాం 
కలయిక అంటే గుండెలు దూరంగా పెట్టుకొని 
చేతులు కౌగిలించుకోవడం కాదు కదా 
గుండెలు పక్కగా వచ్చి కళ్లతో 
ఎదుటి గుండెలోని చెమ్మని స్పర్శించడం.
ఈ లాక్‌డౌన్‌ తర్వాత 
షేక్‌ హాండ్స్‌ ఉండవు…. 
చక్కగా కడుక్కున్న మనసుల కౌగిలింతలు తప్ప.
– బసు పోతన, భీమవరం, 9440878247

Leave a Reply

%d bloggers like this: