మే 19, 2020

పురుషాహంకారానికి ‘తప్పడ్’

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:56 సా. by వసుంధర

లంకె

మధ్యతరగతి ఆత్మాభిమానానికి ప్రతీక అమృత. ఆమెకి సంప్రదాయ పద్ధతిలో విక్రమ్ అనే ధనిక వర్గపు యువకుడితో పెళ్లయింది. విక్రమ్ తండ్రికి స్వంతంగా కంపెనీ ఉన్నా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం వేరే కంపెనీలో పని చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అతడి కలలే తన కలలుగా చేసుకుని, కార్యేషు దాసీ అన్న శ్లోకానికి నిర్వచనంలా మసలుతోంది అమృత. ఆ అంకిత భావంలో ఆమె తన అభిరుచుల్ని కూడా మర్చిపోయి, అతడి అభిరుచులే తన అభిరుచులుగా భ్రమపడే స్థాయికి చేరుకుంది. అలా వారి అన్యోన్య దాంపత్యం కొన్నేళ్లు కొనసాగేక విక్రమ్ కి ప్రమోషనొచ్చి లండన్ వెళ్లబోతున్న సందర్భంలో వాళ్లింట్లో ఒక పార్టీ జరిగింది. పార్టీ జరుగుతుండగా ప్రమోషన్ విక్రమ్ కి బదులు వేరొకరికి వచ్చిన చావుకబురు చల్లగా చెబుతాడు అతడి పై అధికారి. నిరాశని తట్టుకోలేని విక్రమ్ ఉక్రోషం పట్టలేక తన పై అధికారిని నిలదీస్తాడు. ఆ గొడవ ముదిరి ఒకరి కాలరు ఒకరు పట్టుకునే దశకు చేరుకునేసరికి అమృత వాళ్లని విడదీసే ప్రయత్నం చేస్తుంది. ఆవేశం పట్టలేని విక్రమ్ అమృతని సాచి లెంపకాయ కొడతాడు. అంతే! ఒక్కసారి ఆ పార్టీలో నిశ్శబ్దం.

అలాంటి పరిస్థితిలో భర్తని అవగాహన చేసుకోవాలని మధ్యతరగతి సంప్రదాయం చెబుతంది. కానీ ఆత్మాభిమానమున్న మహిళ అంతమందిలో భర్త తనమీద చేయి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఆ తర్వాత విక్రమ్ కూడా తనవల్ల ఏదో ఘోరం జరిగిందన్న భావనలో లేడు. ఏదో ఆవేశంలో పొరపాటైపోయింది కాబట్టి భార్యని మంచి మాటలనేస్తే సరిపోతుందనుకుంటాడు. ఒకటి రెండు రోజులకంటే అతడినామె భరించలేక పుట్టింటికి వెళ్లిపోతుంది. అక్కడ తల్లి, అన్న కూడా ఆమె సద్దుకుపోవాలనే అంటారు. తండ్రి మాత్రం ఆమెకు మద్దతుగా ఉంటాడు. విక్రమ్ ఆమెకోసం అత్తారింటికి వెడతాడు. ఆమె కోపం తగ్గించడానికి తననీ చెంపదెబ్బ కొట్టమంటాడు. ఐతే జరిగింది చాలా చిన్న విషయమన్న అతడి భావన ఆమెకు పడదు. ‘నిన్ను మనసారా ప్రేమించడంవల్ల మ్క్ణంీ ఇంట్నుంల్చో సంతోషంగా నీకు సేవలు చేస్తున్నాన్ను. కానీ ఆరోజు అలా జరిగేక నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను. ప్రేమ లేకుండా నీతో ఎలా కలిసుండను’ అంటూ ఆమె విడాకుల దాకా వెళ్లిపోతుంది.

భర్త భార్యను చెంపదెబ్బ కొట్టడం చాలా మామూలు విషయం అన్న భావననుంచి అతడు బయటపడేసరికి వాళ్లకి విడాకులు కూడా మంజూరవుతాయి.

ఇది తప్పడ్ హిందీ సినిమా. ఇందులో విలన్ విక్రమ్. కానీ అతడు చెడ్డవాడని ఎక్కడా అనిపించదు. పురుషాహంకారానికి ప్రతినిధిగా ఉన్న అతడివల్ల తప్పు జరిగింది అనుకునే వరకూ ఏ పురుషుడూ మంచివాడు అనిపించుకునేందుకు అర్హుడు కాడు – అనిపించేలా దర్శకుడు కథని నడిపించాడు. అమృత మొండిది అనుకోవచ్చు కానీ, ఆమె తన కోపానీ, అసంతృప్తినీ, ఉక్రోషాన్నీ మాటల్లో చూపదు. కేవలం చూపుల్లో ప్రకటిస్తుంది. నిశ్శబ్దంగా నడుస్తూ మనసుల్ని కుదిపేసే ప్రతిభ ఈ సినిమాకు హైలైట్.

ఇందులో ఇంకా అనేక వాస్తవ పాత్రలున్నాయి. అమృత అత్తగారు. ఆమె వంటలు అద్భుతంగా చేస్తుంది. కానీ ఎప్పుడూ భర్త, పిల్లల మెప్పు పొందలేదు ఆ విషయంలో. ఆరోగ్యం విషయంలో కూడా కోడలు ఆమెపై చూపిన శ్రద్ధ ఇంట్లో మిగతావాళ్లు చూపరు. కొడుకు, కోడలు కలిసుండాలని తల్లిగా కోరుకున్నా, ‘ఆడవాళ్లని గౌరవించే విషయంలో తల్లిగా తన పెంపకంలో పొరపాటు జరిగిందని’ కోడలివద్ద ఒప్పుకునే సహృదయత, నిజాయితీ ఆమెకున్నాయి.

అమృతకు విడాకులిప్పించిన లాయరు. ఆమె భర్తనుంచి విడాకులు తీసుకున్న మహిళ. సద్దుకుపొమ్మని ముందు అమృతకు సలహా ఇచ్చినా, అమృత పట్టుదల చూసేక ఆమె ఆలోచనల్లోనూ మార్పులొస్తాయి.

విక్రమ్ ఇంట్లో ఓ పనిమనిషి ఉంటుంది. ఆమెను భర్త రోజూ కొడుతూనే ఉంటాడు. ప్రతిఘటిస్తూనే భరిస్తూంటుందామె. అమృత స్పందన ఆమెలో క్రమంగా ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందీ అన్నది చాలా వాస్తవికంగా అనిపిస్తుంది.

చిత్రంలో ప్రతి దృశ్యం, ప్రతి పాత్ర వాస్తవంగానూ, గొప్పగానూ మలచబడింది. సంగీతం, ఫొటోగ్రఫీ అదనపు బలం.

ఇక నటీనటుల విషయానికొస్తే – అందరూ వాస్తవ పాత్రలే అనిపించారు. విక్రమ్ గా పవైల్ గులాటీ ఆ పాత్రలో జీవించాడు. మన సమాజంలో అనేకమంది పురుషులు అతడిలో తమ ప్రతిబింబాన్ని చూడొచ్చు. అమృతగా తాప్సీ పన్ను ఆత్మాభిమానపు హావభావాలు అపూర్వం. చిన్నదే ఐనా అత్త పాత్రలో తన్వీ ఆజ్మీని మర్చిపోలేం.

పురుషాహంకారాన్ని నిరసిస్తూ, దాంపత్య జీవితానికి సంబంధించిన ఆవశ్యక సందేశాన్ని ఇచ్చిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగానూ, ఏకబిగిని చూసేలాగానూ రూపొందించిన దర్శకుడు అనుభవ్ సిన్హాకి అభివందనాలు.

ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఈ చిత్రం ఇప్పుడు అంతర్జాలంలో అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.

వికీ సమాచారం

Leave a Reply

%d bloggers like this: