జూన్ 19, 2020

కాకినాడనుంచి హ్యూస్టన్ దాకా

Posted in భాషానందం, మన కథకులు, సాహితీ సమాచారం at 10:25 ఉద. by వసుంధర

మిత్రులారా, 

మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వార్త చదువుతున్నందుకు ముందుగా మీకు నా ధన్యవాదాలు. 

అసలు విషయం ఏమిటంటే…

దక్షిణ ఆసియా దేశాల గురించి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి భారత దేశం తో సహా సమీప దేశాల భాషలూ, సాహిత్యం, కళా రూపాలు, సాంస్కృతిక విషయాల మీద అవగాహన, పరిశోధన చేస్తున్న అతి కొద్ది విశ్వవిద్యాలయాలలో ఫిలడెల్ఫియా లో ఉన్న యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా (UPENN) అతి ప్రాచీనమైనది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ స్పూర్తితో 1750 ప్రాంతాలలో ప్రారంభం అయిన ఈ విశ్వవిద్యాలయం లో 1890 ల నుంచీ సంస్కృత భాషా బోధన జరుగుతున్నప్పటికీ 1947 లో అక్కడ మొదలయిన దక్షిణ ఆసియా విభాగం (South Asia Studies) యావత్ అమెరికాలోనే మొట్టమొదటిది. కాలక్రమేణా అక్కడ తెలుగు భాషాబోధన, పరిశోధనలు కూడా మొదలయి, మిత్రులు ఆచార్య ఆర్వీయస్ సుందరం గారూ, ఇతర విద్యావేత్తల అవిశ్రాంత కృషి, తపనా ప్రధాన కారణంగా అక్కడ తెలుగు విభాగం బాగా నిలదొక్కుకుంది.

ఇంకా చెప్పాలంటే…ప్రముఖ తెలుగు భాషాశాస్త్ర వేత్త స్వర్గీయ భద్రిరాజు కృష్ణ మూర్తి గారు తెలుగు భాష మౌలిక స్వరూపం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా సాధించినది ఆ విశ్వవిద్యాలయం లోనే….ఇవాళ (జూన్ 19) ఆ మహామనీషి భద్రిరాజు కృష్ణ మూర్తి గారి 92వ జయంతి. ఆయనని చాలా సార్లు కలుసుకునే అదృష్టం నాకు కలిగింది.

గత రెండు, మూడేళ్ళగా పగ్గాలు చేతబట్టి, ఆ ఆ విశ్వవిద్యాలయం లో తెలుగు భాషా బోధనా, పురోగతికి అహర్నిశలూ కృషి చేస్తున్న కవి,  కథకుడు, పరిశోధకుడు అయిన ప్రముఖ సాహితీవేత్త అఫ్సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే!.

ఇప్పుడేం జరిగిందీ అంటే….

నాకెంతో ఆత్మీయుడయిన అఫ్సర్ అప్పుడెప్పుడో నన్ను పిలిచి “మా దక్షిణ ఆసియా విభాగం వారు భారత దేశం నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన కొందరు కళాకారులు, రచయితలు మొదలైన వారి మీద కొన్ని విడియోలు వారి, వారి భాషలోనే తయారు చేద్దాం అనుకుంటున్నారు. దానికి మిమ్మల్ని ఒక స్పూర్తి ప్రదాత గా ఎంపిక చేశారు. మీరు అంగీకరిస్తే మా యూనివర్శిటీ (UPENN) తరఫున మీతో ఒక ముఖాముఖీ వీడియో రికార్డ్ చేస్తాం.” అన్నాడు అని ఆసక్తికరమైన ఆ ప్రాజెక్ట్ వివరాలు చెప్పాడు.

“బావుంది కానీ అమెరికాలో ఇంకెవరూ దొరక లేదా?” అని నేను కాస్త మారాం చేసినా అడిగింది అఫ్సర్ లాంటి గొప్ప సాహితీవేత్త, అడిగించింది అత్యంత ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వారూ కావడంతో తప్పుకో లేక ఒప్పుకున్నాను….. సంతోషం గానే….

ఇహ మిగిలిన ఏర్పాట్లు చక చకా జరిగిపోయాయి. నాతో ముఖాముఖీ నిర్వహించడానికి సంగీత, సాహిత్య సమలంకృతులైన దీప్తి & శ్రీనివాస్ పెండ్యాల దంపతులు అంగీకరించారు. స్వయంగా రచయితలు. సాహిత్య విశ్లేషణ లో పట్టు సాధించిన వారిద్దరూ దృశ్య, శ్రవణ మాధ్యమాల సాంకేతిక పరిజ్ఞానం లో కూడా నిష్ణాతులు. మా హ్యూస్టన్ నివాసులు. చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఈ ముఖాముఖీ చిత్రీకరణకి ముందు అసలు వారు నన్ను ఏం ప్రశ్నలు అడుగుతారో, ఇదంతా వ్యక్తిగతమా, లేక సాహిత్య పరమైన చర్చా….అవేమీ నాకు తెలియదు. ఎక్కడా ‘మేచ్ ఫిక్సింగ్’ లేకుండా, వారిద్దరూ అడిగిన ప్రశ్నలకి అప్పటికప్పుడు నాకు తోచిన సమాధానాలు చెప్పాను.

నా సతీమణి గిరిజ కూడా ఈ ముఖాముఖీలో పాల్గొనడం కొస మెరుపు, కానీ మనం ఆవిడని మాట్లాడనిస్తేగా!. వీడియో చిత్రీకరణ అయ్యాక, నా దగ్గర కొన్ని ఫోటోలు కూడా జోడించి శ్రీనివాస్ పెండ్యాల తయారు చేసిన ఈ వీడియో ని యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వారికి అందజేశారు. వారు తలపెట్టిన ఇతర వీడియో లు కూడా పూర్తి అయాక, అన్నీ కలిపి వారి వెబ్ సైట్ లో పెడతారు అని సమాచారం వచ్చింది. అదంతా ఎప్పుడు అవుతుందో తెలియదు. బహుశా ఈ కరోనా ఉదంతం ముగిశాక జరగ వచ్చును. 

ఈ లోగా కాల దోషం పట్టకుండా సారంగ పక్ష పత్రిక సంపాదకుడైన అఫ్సర్ ఎంతో సహృదయంతో నా ముఖా ముఖీ వీడియో ని సారంగ చానెల్ లో ఈ నెల ..జూన్ 15, 2020 సంచికలో నిక్షేపించి, ప్రపంచవ్యాప్తంగా అందుబాటు లోకి తెచ్చారు.

గత అనేక వత్సరాలగా నా “వంగూరి జీవిత కాలమ్” ని ప్రచురిస్తున్న సారంగ సంపాదకులు అఫ్సర్, కల్పన, రాజ్ కారంచేడు లకి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు.

ఆసక్తి, సమయం ఉన్నవారు ఈ క్రింది లంకె లో యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా (UPENN) వారి కోసం రూపొందించబడిన ఆ ముఖాముఖీ చూడండి….సారంగ చానెల్ లో…

నన్నూ, మా అర్దాంగినీ వారి ఇంటికి ఆహ్వానించి, ఈ ముఖా ముఖీ లో ఆసక్తికరమైన ప్రశ్నలు  అడిగి మమ్మల్ని ఆదరించి, ఎంతో శ్రమ పడి ఈ వీడియో ని రూపొందించిన దీప్తి & శ్రీనివాస్ పెండ్యాల దంపతులకి, వారిద్దరి ఇద్దరు చిన్నారులకీ మా శుభాశీస్సులు., అభినందనలు. ధన్యవాదాలు.

ఈ ముఖాముఖీ లో నా అభిప్రాయాలతో ఏకీభవించే వారు, వించని వారూ నిర్మొహమాటంగా సారంగ లో కానీ, ముఖ పుస్తకం లో కానీ,  నాతో కానీ, మరెక్కడైనా కానీ తమ అభిప్రాయాలని పంచుకోవచ్చును.

మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మరొక సారి ధన్యవాదాలతో…

భవదీయుడు,

వంగూరి చిట్టెన్ రాజు

Leave a Reply

%d bloggers like this: