జూన్ 26, 2020
విక్టరీ మధుసూదనరావు
తెలుగు సినిమాలకి కొత్త దిశను నిర్దేశిస్తూనే – విజయాలని సాధించిన అపూర్వ దర్శకుడు మధుసూదనరావు.
వాట్సాప్ బృందం సౌజన్యంతో – ఓ నివాళి!

విక్టరీల దర్శకుడు!
ఈ రోజు వి.మధుసూదన రావు జయంతి — 14 జులై 1917 – 11 జనవరి 2012)
ఓ తరం ప్రేక్షకులకి వీరమాచనేని మధుసూదనరావు అని చెప్తే అర్థమయ్యేది కాదు! ‘విక్టరీ’ మధుసూదనరావు అనాలి! ‘‘ఇంకేం సినిమా, గ్యారంటీగా హిట్టవుతుంది’’ అనే వారు! ప్రేక్షకులు ‘‘ఔను’’ అనుకునేలా ఆయన సినిమా తీసేవాడు! వాళ్లన్నట్టుగానే ‘దర్శకత్వం: వి.మధుసూదనరావు’ అని వాల్‌పోస్టర్ మీద రాసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టయ్యేవి! చాలా వరకు నూర్రోజులాడేయి. ఆయన మాత్రం నూటికి పదకొండేళ్ల దూరంలో ‘ప్యాకప్’ చెప్పి, వెళ్లిపోయారు! అప్పటి వరకు పౌరాణికాలంటే కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావులే ప్రామాణికం. పౌరాణికాలు తీయాలంటే వాళ్లే తీయాలి. మరో వ్యక్తి ప్రయత్నించినా- వాళ్లలాగే తీయాలి. తేడా వస్తే జనం ఒప్పుకోరు. 1965 జులై 12 వరకు పౌరాణికాలకు సంబంధించినంత వరకు ఇదే ప్రేక్షకుల మైండ్‌సెట్.
కానీ ఆ రోజు పౌరాణికాల్ని ఇలాక్కూడా తీయొచ్చునని వి.మధుసూదనరావు ‘వీరాభిమన్యు’ చిత్రం ద్వారా నిరూపించారు. ప్రేక్షకులు ఔనన్నారు. ‘దర్శకత్వం: వి.మధుసూదనరావు’ అంటే మాటలా అననుకొన్నారు. ‘వీరాభిమన్యు’ స్క్రీన్‌ప్లేలో ఆ పట్టు కనిపిస్తుంది. చిత్రీకరణలో వైవిధ్యం కనిపిస్తుంది. ఉత్తర అభిమన్యుల ప్రణయం.. నడి మధ్యలో ఘటోత్కచుడి పాత్ర… యుద్ధ సన్నివేశాలు.. విశ్వరూపం. చిలా విస్తారమైన ఇతివృత్తాన్ని, కొలతల్లో తేడా రాకుండా, మోతాదుల్లో హెచ్చుతగ్గులు లేకుండా మధుసూదనరావు మలచిన తీరు అద్భుతం. అలాగే పాటలు కూడా! జాగ్రత్తగా గమనిస్తే అంతకు ముందు వచ్చిన పౌరాణిక చిత్రాల్లోని పాటలకూ ‘వీరాభిమన్యు’లోని పాటలకూ మధ్య అంతరం కనిపిస్తుంది. వీటిలో ప్రేక్షకులు కొత్తదనం చూశారు. సన్నివేశాలకు తగ్గట్లు రాయించుకున్న పాటల్లోనూ, వాటికి కట్టిన బాణీల్లోనూ తాజాదనం, ఆహ్లాదం కనిపించాయి. మహదేవన్ సంగీతం వీరాభిమన్యుకి పెద్ద పెట్టుబడే అయ్యింది. పౌరాణిక చిత్రాల్లో మహదేవన్ సంగీతం తాలూకు ప్రతిభను ప్రేక్షకులకు తొలిసారిగా రుచి చూపించింది వి.మధుసూదనరావే! (బాపు-రమణల ‘సంపూర్ణ రామాయణం’ ద్వారా మహదేవన్ సామర్థ్యం మరోమారు రుజువయింది). అప్పటికి వి.మధుసూదనరావు సాంఘికి చిత్రాల ద్వారా తానేంటో నిరూపించుకున్నారు. ‘టాక్సీ రాముడు’, ‘పదండి ముందుకు’, ‘రక్తసంబంధం’, ‘ఆరాధన’, ‘లక్షాధికారి’, ‘గుడిగంటలు’, ‘జమీందారు’, ‘అంతస్తులు’లాంటి సాంఘిక చిత్రాలు ఆయనకో స్థాయిని, స్థానాన్ని తెచ్చిపెట్టాయి. ‘వీరాభిమన్యు’ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఉంది. సాంఘిక చిత్రాల్ని నడిపించడంలో మధుసూదనరావు అనుసరించిన ఒడుపులు, క్లుప్తత, సమతౌల్యం ‘వీరాభిమన్యు’ కథనంలో కనిపిస్తాయి. కె.వి.రెడ్డి, కమాలాకర కామేశ్వరరావుల శైలికి భిన్నమైన తీరుతెన్నుల్ని ఇందులో ప్రేక్షకులు చూశారు. వైవిధ్యంగా ఉందని ఆమోదించారు. అలాగని వి.మధుసూదనరావుకి పౌరాణికాలు కొత్తా? అంటే అదీకాదు. ఆయన దర్శకత్వం చేపట్టిన తొలి చిత్రమే ‘సతీ తులసి’ (1959) పౌరాణికం. కొత్త దర్శకుడిగా ఆయనకు మంచి మార్కులేపడ్డా, సాంఘికాల్లో తలమునకలైన సమయంలో పౌరాణికాన్ని తీసి మెప్పించడం ఆయన ప్రతిభకు తార్కాణం. క్రికెట్లోని కొందరు బౌలర్లు, బ్యాట్మెన్స్ల కాంబినేషన్లు క్లిక్ అయినట్టుగా మధుసూదనరావు-ఏయన్నార్ల జోడీకి మంచి పేరొచ్చింది. జగపతివారి తొలి విడద చిత్రావళి ‘ఆరాధన’ నుంచి ‘అదృష్టవంతులు’ వరకు అన్నీ విజయాలే. వాణిజ్య సూత్రాల్ని ఆకలింపు చేసుకున్నా భారీతనానికే ఆయన పరిమితం కాలేదు. ‘మనుషులు మారాలి’, ‘కల్యాణ మంటపం’ (ఇది మధుసూదనరావు సొంత చిత్రం) ‘అంగడిబొమ్మ’ లాంటి సినిమాలే ఇందుకు రుజువు. హీరోగా వెండితెరపై పరిచయమయ్యే సందర్భంలో అది వి.మధుసూదనరావు చేతలు మీదుగా జరిగితే మంచిదన్న సెంటిమెంటు కూడా ఉండేది. నటీనటుల్ని తయారుచేయాలన్న సంకల్పంతో ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను కూడా నెలకొల్పారు. అందులో శిక్షణ పొందినవారు సినీరంగంలో స్థిరపడ్డారు కూడా.
★ ఇతివృత్తాన్ని అనుసరించి కథనంలో ఉత్కంఠతనీ, ఆశ్చర్యాన్ని కలిగించే అంశాన్నీ అవసరం మేరకు ఆయన జొప్పించేవారు. ‘లక్షాధికారి’లో కెవిఎస్ శర్మ పాత్రని విభన్నంగా చూపిస్తూ, గుమ్మడి పాత్రని సస్పెన్స్‌లో ఉంచడం ఓ టెక్నిక్. ‘జమీందార్’లో ఏయన్నార్ పాత్రను చివరివరకు డిటెక్టివ్ ఆఫీసర్ అని తెలియనివ్వకుండా కథ నడిపించడం మరో తార్కాణం. ‘అంతస్తులు’లో గుమ్మడి పాత్రలోని చీకటి కోణాలు చూపించిన విధానం మరువలేనిదే. ఇవన్నీ మధుసూదనరావు ‘మార్కు’లే. ఆయన చూపించిన ‘స్పార్క్’లే. సెంటిమెంట్స్‌తో కూడిన కుటుంబ కథల్ని వి.మధుసూదనరావు తెరకెక్కించిన విధానంలో ఆదుర్తి పోకడలు, ‘అన్నపూర్ణ’ చిత్రాల తరహా ట్రీట్మెంట్ లీలగా కనిపిస్తాయి.
★ అభ్యుదయ, వామపక్ష ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన వి.మధుసూదనరావు, ఇతివృత్తంలో ఏ మాత్రం ఆస్కారం ఉన్నా ఆ ఛాయల్ని ప్రతిబింబించేవారు. ‘పదండి ముందుకు’, ‘మనుషులు మారాలి’, ప్రజా నాయకుడు’లాంటి చిత్రాల్లో ఎర్రజెండా రెపరెపలు కనిపిస్తాయి. ‘భక్తతుకారాం’లోని కొన్ని దృశ్యాల్లో తుకారాం చేత సామ్యవాద సిద్ధాంతాన్ని వల్లె వేయించారన్న విమర్శలూ వచ్చాయి. అలాగే ‘భక్త కన్నప్ప’ చిత్రానికి నిర్మాత మొదట మధుసూదనరావునే దర్శకుడిగా అనుకొన్నారట. స్క్రిప్టు కూడా సిద్ధమైందట. కారణాంతారాలవల్ల బాపు – రమణలు ‘భక్త కన్నప్ప’కు పనిచేయాల్సి వచ్చింది. మొదట తయారైన స్క్రిప్టులో ‘కమ్యూనిస్టు కన్నప్ప’ ఉన్నందున మొత్తాన్ని తిరగరాయల్సి వచ్చిందని ముళ్లపూడి తన ‘కోతి కొమ్మచ్చి’లో పేర్కొన్నారు’’.
👉 సౌజన్యం: ఓలేటి శ్రీనివాస భాను
Leave a Reply