జూన్ 27, 2020

ఓ పాట కథ

Posted in సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 12:53 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సౌజన్యంతో

ఘంటసాల (Ghantasala) గారి పాట
“ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా ” విశ్లేషణ 🙏

గానం గంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ స్వఛ్చం, అనుభూతి చర్విత చర్వణం.

 ఏడుకొండల సామి! ఎక్కడున్నావయ్య! – రెండు రీతుల పాడిన ఘంటసాల

“ఏడుకొండలవాడా! వెంకటరమణా! గోవిందా! గోవిందా!” అని భక్తి పారవశ్యంతో ఘంటసాల మాస్టారు పాడిన ఈ పాట వినని తెలుగువారు అరుదు. నా చిన్నతనంలోని అనుభవం ఏంటంటే భక్తికి, రక్తికి కూడ ఈ పాట ప్రారంభం. ఎందుకంటే, ఉదయం గుడిలో దైవకార్యక్రమాలు ప్రారంభం అయ్యాయనిగాని, సాయంత్రం సినిమా థియేటరులో టిక్కెట్ల కౌంటర్ తెరిచారని గాని తెలియడానికి గాని ఈ పాట ఒక సంకేతం. అయితే ఈ పాట పుట్టు పూర్వోత్తరాలు కొద్దిగా తెలుసుకుందాం. 
ఈ పాట రచించినది తూర్పు గోదావరిలో పుట్టిన ప్రముఖ కవి, చిత్రకారులు అయిన శ్రీ రావులపర్తి భద్రిరాజు గారు. ఈయన ప్రముఖకవి శ్రీ అడవి బాపిరాజు గారి మేనల్లుడు. భద్రిరాజు ఈయన ఎన్నో పాటలు, నాటకాలు వ్రాసారు.  ఘంటసాల మాస్టారు ఈ పాటను మొదట ఆకాశవాణిలో పాడారు.  అది విని ఆకర్షితులైన HMV Recording Manager మంగపతి గారు ఈ పాటకు చాల పబ్లిక్ డిమాండు వున్నదని గ్రహించి రేడియోవారి అనుమతితో రికార్డుగా విడుదలచేయ సంకల్పించారు. రేడియోలో పాడినపుడు అసలు సాహిత్యం ప్రకారం “ఏమిటో నీ జాడ” తెలియాకున్నామయ్య అని పాడారట మాస్టారు. అయితే HMV వారు రికార్డు చేసినపుడు భద్రిరాజు గారు దీనిని “ఏమిటో నీ మాయ” అని మార్చారట. అదే మనమంతా వింటున్నాము. రికార్డింగ్ ముందు జరిగిన మరొక చిన్న మార్పు ఏమిటంటే, పాట ప్రారంభంలో “ఏడుకొండలవాడా! వెంకటరమణా! గోవిందా! గోవిందా!” అని భక్తులు ఎలా అయితే తిరుమల కొండ యెక్కేటపుడు భక్తి పారవశ్యం నిండిన భావోద్వేగంతో ఎలుగెత్తి పలుకుతారో ఆ స్ఫూర్తిని ఘంటసాల మాస్టారు చేర్చమని సూచించడం వలన ఆ పాటకు మరింత జీవం పోసింది. మరి మాస్టారి ఇష్టదైవం ఆ వేంకటేశ్వరుడే కదా!  ఇక్కడ ఘంటసాల పాడిన పాటలోని రెండు వైవిధ్యాలను, అంటే రేడియోలో పాడినది, HMV రికార్డింగ్ కోసం పాడినది వినగలరు. 
ఈ గీతం గుఱించి వివరణ ఇలా వుంది. ఈ గీతం పల్లవిలో – “స్వామి” బదులు సామి అని అనడంలో సామాన్యుల ఉచ్చారణ సౌందర్యం కనిపిస్తుంది. మెట్లెక్కి వెళ్తున్న భక్తుని ఆర్తి, ఆవేదన ఈ పాటలోని ప్రతి అక్షరంలో ద్వనిస్తుంది. “సర్వం విష్ణుమయం జగత్” అనే పురాణవాక్యాన్ని తలపిస్తూ అది సామాన్యుని నోట “ఏ చోటగాంచిన నీవుందువందురే” అనే పంక్తిని కవి వ్రాసారనిపిస్తుంది. పల్లవిని, చరణాలను రేడియోలాగ కాక, ఖచ్చితమైన సంగతులతో రూపొందించుకుని ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ పాటను ఆలపించారు.  “ఈ అడవి దారిలో చేయూత నీయవా” దగ్గర ఒక మనోహరమైన ఆలాపనను సంగ్రహంగా చేర్చారు. ఏడు కొండలసామి భక్తిగీతాన్ని శుద్ధధన్యాసి రాగంలో ఘంటసాల మాస్టారు స్వరపరచారు. ఇది 22వ మేళకర్త రాగమైన ఖరహరప్రియకు జన్యరాగం. 

మాస్టారు ఆకాశవాణిలో పాడిన పాట
  
మాస్టారు HMV రికార్డులో పాడిన పాట

సాకీ:ఏడుకొండలవాడా! వెంకటరమణా!
గోవిందా! గోవిందా!
పల్లవి:ఏడుకొండలసామీ! ఎక్కడున్నావయ్యా
ఎన్ని మెట్లెక్కినా కనరావేమయ్యా| ఏడు ।
అనుపల్లవి:ఆకాశమంటూ యీ కొండ శిఖరమ్ముపై -2
మనుషులకు దూరంగా మసలుతున్నావా -2

ఏడుకొండలసామీ!  ఏడుకొండలసామీ! 
చరణం:ఏచోట గాంచిన నీవుందువందురే

ఏమిటో నీ మాయ (జాడ) తెలియకున్నామయ్య| ఏచోట ।

ఈ అడవి దారిలో చేయూతనీయవా.. ఆ… -2

నీ పాద సన్నిధికి మము జేరనీయవా -2| ఏడు ।

ఏడుకొండలసామీ! ఎక్కడున్నావయ్యా

ఎన్ని మెట్లెక్కినా కనరావేమయ్యా ఆ ఆ

ఏడుకొండలసామీ!  ఏడుకొండలసామీ! 

సేకరణ : జి వి రామయ్య 🙏

1 వ్యాఖ్య »

  1. చాల చక్కగా వివరించారు
    ధన్యవాదాలు !!!!


Leave a Reply

%d bloggers like this: