జూన్ 30, 2020

పాతాళ్ లోక్ – అమెజాన్ వెబ్ సిరీస్

Posted in టీవీ సీరియల్స్, బుల్లితెర-వెండితెర at 3:48 సా. by వసుంధర

కుళ్లు కంపు కొడుతున్న కులవ్యవస్థ, చట్టాలకు లొంగని నేరప్రపంచం, ఉచ్ఛనీచాలు పట్టించుకోని రాజకీయరంగం, అబద్ధాల ప్రచారమే బ్రతుకుతెరువుగా మీడియా, పదవిలో ఉన్నవారికి సహకరించడానికే తామున్నది అన్నట్లు వ్యవహరించే పోలీసు సంస్థ – ఇవీ పాతాళ్ లోక్ అనే 9 భాగాల వెబ్ సిరీస్‍కి ప్రేరణగా ఉన్న అంశాలు.

నటీనటులు ఆ పాత్రలకోసమే పుట్టారా అన్నట్లున్నారు. చిత్రీకరణ – ఆయా సన్నివేశాల్ని సిసిటివి కెమేరాల్లో చూపుతున్నారా అన్నంత సహజంగా ఉంది. ఒకొక్కటి 40-50 నిముషాలు ఉండే ఈ సిరీస్ – మొత్తం 9 భాగాల్నీ ఒక్కసారి చూసేయాలనిపించేటంత ఆసక్తికరంగా ఉంది.

దేశంలో ఇలాంటి అంశాల్ని ఇంత బాగా ప్రదర్శించగలవారున్నారా అనిపించే ప్రతిభ, తీస్తే ఇలాగే తియ్యాలనిపించేటంత సామర్థ్యం – ఉన్నప్పటికీ – ఇందులో మింగుడు పడనివి కొన్ని ఉన్నాయి.

భరించలేనంత కుళ్లు కంపు కొట్టేలా అత్యాచారాన్నీ, వెగటు పుట్టించేటంత అసహ్యంగా స్త్రీపురుషులమధ్య అక్రమ సంబంధాల్నీ – చిత్రీకరించడం ఈ వెబ్ సీరీస్‍ మొత్తానికి కేవలం పది పన్నెండు నిముషాలు దాటకపోయినా – అది అనవసరంగా అంటించుకున్న మచ్చ అనిపిస్తుంది. ఆ ఒక్క కారణంగా ఇంత మంచి సిరీసుని కుటుంబసమేతంగా చూడ్డం ఇబ్బంది ఔతుంది.

అలాంటి సన్నివేశాల్ని సభ్యసమాజానికి ఎలా చూపాలో తెలుసుకుందుకు శంకరాభరణం చిత్రంలో – 39 నిముషాల తర్వాత వచ్చే 2-3 నిముషాల దృశ్యం చాలు.

సహజత్వం కోసం – భాషా సంస్కారాన్ని పూర్తిగా మర్చిపోవడం ఈ సిరీసులో మరో ఇబ్బంది. హిందీలో ఉన్న ఈ వెబ్ సిరీసుకు – వ్రాతల్లో మాటలు – తెలుగులో కూడా ఉండడంవల్ల – కథ చక్కగా అర్థమౌతుంది. ఐతే హిందీ పదాలకి అచ్చ తెలుగు పచ్చిబూతుల్ని – తెరపై అక్షరాలుగా చదవడం – అదో భయంకర అనుభవం. సకుటుంబంగా ఈ సిరీస్ చూడ్డానికి ఆ భాష కూడా పెద్ద ఇబ్బంది.

బుల్లితెర కోసం చిత్రాలు నిర్మించేవాళ్లు – పై విషయాల్లో జాగ్రత్త పడితే – ఇలాంటి అద్భుతమైన సిరీస్ విశేషాల్ని పదిమందితో పంచుకోగలుగుతాం.

ఏదిఏమైనా పాతాళ లోక్ వెబ్ సిరీస్‍లో 96% అద్భుత సృజనాత్మకతకు అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: