జూలై 1, 2020
చలనచిత్ర కళాపద్మం కమలాకర కామేశ్వరరావు
వాట్సాప్ బృందం సౌజన్యంతో

(ఈరోజు కమలాకర వర్ధంతి – 4 అక్టోబర్ 1911 – 29 జూన్ 1998)
వేదాధారమైన మన రామాయణ, భారత, భాగవత పురాణ గ్రంధాలు ప్రముఖంగా ధర్మప్రబోధకాలు. ఈ పురాణ కథలకు రూపకల్పన చేసి సినిమా మాధ్యమంగా ప్రజలకు చేరువ చేయాలని ఎందరో మహనీయులు వందేళ్ల క్రితమే ప్రయత్నం ప్రారంభించారు. చలన చిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే 1912లోనే ‘రాజా హరిచంద్ర’ పురాణ కథనే చిత్రాంశంగా ఎన్నుకొన్నారు. ఫాల్కే నిర్మించిన తొలి చిత్రాలు ‘మోహినీ భస్మాసుర’, ‘సత్యవాస్ సావిత్రి’ కూడా పౌరాణికాలే. తెలుగు చలన చిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య కూడా తొలుత ‘భీష్మ ప్రతిజ్ఞ’ అనే మూకీ చిత్రాన్ని, తర్వాత ‘భక్తప్రహ్లాద’ టాకీ చిత్రాన్ని నిర్మించారు. ఆ పరంపరలో చిత్తజల్లు పుల్లయ్య ‘లవకుశ’, ‘‘సీతాకల్యాణం’ వంటి సినిమాలనే తీశారు. అటువంటి సినిమాలకు ఊపిరులద్దిన అతికొద్ది దర్శకరత్నాలలో కమలాకర కామేశ్వరరావు ప్రథములు. అందుకే కమలాకరను చిత్రసీమ ‘‘పౌరాణిక బ్రహ్మ’’గా గుర్తించి ఆదరించింది. ఈ అద్భుత చలనచిత్ర నిర్దేశకుని చలన చిత్ర ప్రస్థానం గురించి అవలోకిస్తే… ఈరోజు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా విశేషాలు…
మూర్తీభవించిన తెలుగుదనం…
అతనిది పదహారణాల తెలుగుతనం ఉట్టిపడే విగ్రహం. నెరసిన జుట్టు, గ్లాస్గో పంచె, తెల్లని మల్లెపూల వంటి జబ్బా, నుదట కాసంత కుంకుమ బొట్టు… ఇదీ కమలాకర కామేశ్వరరావు ఆహార్యం. 1937లో చిత్ర పరిశ్రమలో చేరిన నాటి నుంచీ అదే వస్త్రాధారణ. 1911 అక్టోబర్ నాలుగున మచిలీపట్నంలో జన్మించిన కామేశ్వరరావు బీఏ పట్టభద్రుడు. మొదటి నుంచి సినిమాలంటే ప్రాణం. పుస్తకాలు బాగా చదివేవారు. సినిమాలను చూసి వాటి మీద సమీక్షలు రాస్తుండేవారు. ఆ రోజుల్లో ‘కృష్ణా పత్రిక’కు చాలా మంచి పేరుండేది. ఆ పత్రికలో కమలాకర సినీ సమీక్షలు అచ్చవుతూ ఉండేవి. ఆ రోజుల్లో బెజవాడ (నేటి విజయవాడ)లో కొత్త సినిమాలన్నీ విడుదలవుతూ ఉండేవి. వాటిపై కమలాకర సమీక్షలు ప్రామాణికంగా ఉండేవి. 1931లో నోబెల్ బహుమతి గ్రహీత పెరల్ బుక్ రాసిన ‘గుడ్ ఎర్త్’ నవలను 1937లో సిడ్నీ ఫ్రాంక్లిన్ దర్శకత్వంలో ఇర్వింగ్ తాల్ బర్గ్ సినిమాగా నిర్మించాడు. ఇందులో పాల్‌ముని, లూసీ రైనర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆస్కార్‌ను గెలుచుకుంది. ఈ సినిమా గురించి కమలాకర నాలుగు వారాలు సమీక్షలు రాశారు. నిశిత దృష్టితో రాసిన ఆ సమీక్షలు పాఠకులను విపరీతంగా ఆకర్షించాయి. ఆ రోజుల్లో బెజవాడ సరస్వతీ టాకీస్ వారు సి.ఎస్.ఆర్, కన్నాంబ నటించగా హెచ్.వి.బాబు దర్శకత్వంలో ‘‘ద్రౌపదీ వస్త్రాపహరణము’’ సినిమాను నిర్మిస్తే, లక్ష్మీఫిలిమ్స్వారు జగన్నాథ స్వామి దర్శకత్వంలో బళ్లారి రాఘవ, బందా కనకలింగేశ్వరరావు, కమలాబాయి నటించిన ‘‘ద్రౌపదీ మాన సంరక్షణము’’ సినిమాను సమాంతరంగా నిర్మించారు. ఇరవై రోజుల తేడాలో ఈ రెండు సినిమాలు 1936 మార్చి నెలలో విడుదలయ్యాయి. ఈ సినిమాల మీద కమలాకర సమీక్షలు వరుసగా నాలుగు వారాలు కృష్ణా పత్రికలో వచ్చాయి. ఆ సినీ సమీక్షలే దర్శకనిర్మాత గూడవల్లి రామబ్రహ్మం దృష్టిని ఆకర్షించాయి. ‘‘ద్రౌపది వస్త్రాపహరణం’’ సినిమా ఆర్థికంగా విజయవంతమై, రెండవ సినిమా పరాజయం పాలైంది. కానీ కమలాకర రెండవ సినిమానే బాగుందని రాశారు.
మద్రాసులో కామేశ్వరం…
కమలాకర సమీక్షలకు ఆకర్షితుడైన రోహిణీ అధిపతి హెచ్.ఎం.రెడ్డి ‘కనకతార’ సినిమా తర్వాత తలపెట్టిన ‘గృహలక్ష్మి’ సినిమాలో పనిచేసే అవకాశం కల్పించారు. అప్పుడే కమలాకర మద్రాసులో అడుగుపెట్టారు. రోహిణీ వాళ్లకు ఒక లాడ్జీ ఉండేది. అందరితోపాటే కమలాకరరావుకు కూడా అక్కడే మకాం. అక్కడే బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, రామనాథ్, శేఖర్, సముద్రాల వంటి పెద్దలతో పరిచయాలు పెరిగి అనుభవం సంతరించుకున్నారు. కె.వి.రెడ్డి అప్పుడు రోహిణీ సంస్థకు క్యాషియర్‌గా ఉండేవారు. గృహలక్ష్మి సినిమా పూర్తయ్యాక ఆ సినిమాకు కమలాకర బెజవాడ, ఏలూరు కేంద్రాల్లో ఫిలిం రిప్రజెంటేటివ్‌గా వ్యవహరించారు. తర్వాత బి.ఎన్., రామనాథ్, శేఖర్ కలిసి వాహిని సంస్థను ఆరంభించారు. వారు నిర్మించిన ‘వందేమాతరం’ చిత్రానికి కమలాకర సహాయదర్శకునిగా పనిచేశారు. ఆ చిత్రానికి బి.ఎన్. దర్శకుడు కాగా, కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరించేవారు. బి.ఎన్. దర్శకత్వంలో ‘సుమంగళి’ సినిమాకు పనిచేశాక, 1941లో వాహినీ వారు ‘దేవత’ సినిమా నిర్మించినపుడు బి.ఎన్‌కు సహకార దర్శకుడిగా కమలాకర వ్యవహరించారు. 1943లో వాహినీ పతాకం మీద కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ‘భక్తపోతన’ సినిమాకి కూడా కమలాకరే సహాయ దర్శకుడు. అప్పుడే సినిమా టైటిల్స్‌లో కె.వి. సరసన కమలాకర పేరు కనిపించడం గొప్ప విషయం. వాహినీ వారి ‘గుణసుందరి కథ’ సినిమా కోసం కథను తయారు చేసినవారిలో కమలాకర కూడా ఒకరు. ‘యోగి వేమన’ తర్వాత వాహినీ సంస్థ విజయాలో విలీనమైనప్పుడు కమలాకర విజయా సంస్థలో నిలదొక్కుకున్నారు. పింగళి నాగేంద్రరావును కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డిలకు పరిచయం చేసింది కామేశ్వరరావే. ‘పాతాళభైరవి’ కథాచర్చలలో కమలాకర పాల్గొని అద్భుతమైన కథను అల్లే పక్రియలో నాగిరెడ్డి – చక్రపాణిల అభిమానం చూరగొన్నారు. అతని ప్రతిభను గుర్తిస్తూ ‘చంద్రహారం’ సినిమాకు దర్శకత్వం నిర్వహించే అవకాశాన్ని విజయవారు కమలాకరకు అప్పగించారు. ‘చందనరాజు కథ’ను చంద్రహారంగా తీర్చిదిద్దగా దురదృష్టవశాత్తు ఆ తొలి అవకాశం కమలాకరకు సత్ఫలితాలను ఇవ్వలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కాయి. ఈ సినిమా టెక్నిక్ కొత్తగా ఉండడంతో కొన్ని దృశ్యాలను విదేశీ టెలివిజన్లు (ఆ రోజుల్లో టి.వి.లు అక్కడ ఉండేవి) ప్రసారం కూడా చేశాయి. తర్వాత వాహినీ సంస్థ వారి ‘పెంకిపెళ్లాం’ సినిమాకు దర్శకత్వం చేపడితే అది కూడా కాసులు రాల్చలేదు.
ప్రతిభకు పట్టం
కమలాకర ప్రతిభను గుర్తించిన ఎన్.టి.రామారావు మాత్రం తన సొంత సినిమా ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమాకు కమలాకరనే దర్శకునిగా ఎన్నుకున్నారు. 1957లో విడుదలైన ఆ సినిమా విజయభేరి మోగించింది. ఆ విజయంతోనే ‘శోభ’, ‘మహాకవి కాళిదాసు’ వంటి విజయవంతమైన సినిమాలకు నిర్దేశకత్వం వహించి కమలాకర మంచి పేరు గడించారు. 1962లోనే వచ్చిన విజయావారి సాంఘిక కామెడీ సినిమా ‘గుండమ్మకథ’, చారిత్రాత్మక చిత్రం ‘మహామంత్రి తిమ్మరుసు’ సూపర్హిట్లు కావడంతో కమలాకరకు జాతీయస్థాయిలో రాష్ట్రపతి రజతం లభించింది. 1963లో లక్ష్మీరాజ్యం, శ్రీధరరావులు నిర్మించిన ‘నర్తనశాల’కు అంతర్జాతీయ కీర్తి లభించింది. ఇక 1965లో మాధవీ ప్రొడక్షన్ పతాకం మీద ఎ.ఎస్.ఆర్ ఆంజనేయులు నిర్మించిన ‘పాండవ వనవాసము’ చిత్రం 13 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని కూడా చేసుకుంది. స్వప్నసుందరి హేమామాలినికి తొలి అవకాశమిచ్చి, ఆమె చేత ఈ సినిమాలో నాట్యం చేయించిన ఘనత కూడా కమలాకరదే. ఇక కమలాకర కామేశ్వరరావు దర్శకత్వానికి తిరుగులేకపోయింది. వరుసగా ‘శ్రీకృష్ణ తులాభారము’, ‘కాంభోజరాజు కథ’, ‘శ్రీకృష్ణావతారం’, ‘వీరాంజనేయ’వంటి పౌరాణిక చిత్రాలు కమలాకర దర్శకత్వంలో వచ్చి ఆయనను ‘‘పౌరాణిక బ్రహ్మ’’గా నిలబెట్టాయి. ‘కలిసిన మనసులు’, ‘మాయని మమత’వంటి సాంఘికాలు కూడా మంచి చిత్రాలుగానే పేరు తెచ్చుకున్నాయి. వీనస్-మహీజా నిర్మాత సి.హెచ్.ప్రకాశరావు రంగుంల్లో నిర్మించిన బాలల చిత్రం ‘బాలభారతం’ని కమలాకర విజయవంతం చేశారు. జానపదాలకు, పౌరాణికాలకు ఆదరణ తగ్గిన రోజుల్లో కూడా అటువంటి సినిమా నిర్మాణంపై ఏదైనా చర్చ వస్తే సినీ జగత్తులో తొలుత వినిపించే పేరు కమలాకరదే. 70వ దశకంలో కూడా కమలాకర కొన్ని పౌరాణిక సినిమాలకు నిర్దేశకత్వం వహించారు. వాటిలో నటుడు కృష్ణ నిర్మించిన ‘కురుక్షేత్రం’ గురించి చెప్పుకోవాలి. సాంకేతికంగానూ, సందేశంగానూ అతి తక్కువ వ్యవధిలో అత్యద్భుతంగా నిర్మించిన చిత్రమది. ఆ రోజుల్లోనే వచ్చిన ‘శ్రీదత్త దర్శనం’, ‘సంతోషిమాత వ్రత మహాత్మ్యం’, ‘అష్టలక్ష్మి వైభవం’ సినిమాలు కూడా ఆ కోవలోనివే. పౌరాణిక సినిమాలు తెరమరుగవడంతో కామేశ్వరరావు చేతికి పనిలేకుండా పోయింది. ఆ సమయంలోనే పౌరాణికాలకు మహర్దశ రాకపోతుందా అనే విశ్వాసంతో ఆయన కొన్ని సినిమా కథలకు స్క్రిప్టు తయారు చేసి పెట్టుకున్నారు. వాటిలో ‘శ్రీకృష్ణకుచేల’, ‘శ్రీరంగనాథ వైభవం’, ‘మహిషాసుర మర్దిని’ సినిమా కథలు కొన్ని. సరైన నిర్మాతలు లేక, ఉన్నా కొందరు ముందుకు రాక ఆ స్క్రిప్టులు రూపకల్పనకు నోచుకోలేకపోయాయి. కమలాకర పారితోషికాల విషయంలో ఏనాడూ ఖచ్చితంగా వ్యవహరించలేదు. అతని మనసెరిగిన వారు ఆదరిస్తే, అతని మనస్తత్వం తెలిసిన నిర్మాతలు వాడుకొని వదిలేశారు. అయినా కమలాకర బాధపడలేదు. ఒక మంచి సినిమాను తీయగలిగాననే తృప్తితోనే కాలం వెళ్లబుచ్చారు. మద్రాసు ఫిలిం ఫ్యాన్స్ సంఘం కామేశ్వరరావును రెండు సార్లు ఉత్తమ దర్శకునిగా ఎన్నుకుంది. ‘‘సినిమాలో అన్ని శాఖలూ, అందరూ కనిపించాలి గాని, దర్శకుడు మాత్రం కనిపించకూడదు. అన్ని శాఖలనూ కనిపింపజేయడమే దర్శకుని ఘనత. మణిహారంలో సూత్రం ఉంటుంది. అది అన్ని మణులను కలిపి హారంగా రూపొందిస్తుంది. కానీ సూత్రం మాత్రం పైకి కనిపించదు. చిత్ర దర్శకుడు కూడా ఆ సూత్రంలాంటివాడే’’ అని దర్శకుని పాత్ర గురించి ఆయన గొప్పగా చేప్పేవారు. ఈ దర్శకరత్న పుంగవుడు మద్రాసు విడిచి తన కుమారుని వద్ద ఉంటూ 1998లో ఇదే రోజు తన 88వ ఏట తనువు చాలించారు.
👉 సౌజన్యం: ఆచారం షణ్ముఖాచారి
Leave a Reply