Site icon వసుంధర అక్షరజాలం

కథామంజరి – ప్రారంభ సంచిక

కథల్ని ఆహ్వానిస్తూ కథామంజరి – రచయితలకు పంపిన ఆహ్వానాన్ని గతంలో అక్షరజాలంలో అందజేసిఉన్నాము.

కథామంజరి ప్రారంభ సంచిక కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కథామంజరి ప్రారంభ సంచికలో ప్రచురించిన కథలన్నీ – చందమామ పత్రికలో లాగా – ఇంచుమించు ఒకే చక్కని శైలిలో ఉండడం విశేషం. చదివించే గుణమున్న ఈ కథల్ని ఎంపిక చేసినవారికి, వ్రాసినవారికి అభినందనలు. ఈ పత్రిక ఇలాగే మరింత కాలం కొనసాగాలనీ, ఇలాంటి మరిన్ని పత్రికల ఆవిర్భావానికి ప్రేరణ కావాలనీ ఆశిస్తున్నాం.
ఇందులోని కథలపై అక్షరజాలం అభిప్రాయాల్ని క్లుప్తంగా ఇక్కడ పొందుపరుస్తున్నాం. ఇవి కేవలం అక్షరజాలం అభిప్రాయాలే తప్ప కథలపై తీర్పు కాదని గ్రహించగలరు.
తనలో తాను- అతనిలో తాను
కథనం, మనోవిశ్లేషణ గొప్పగా ఉన్నాయి. ముగింపు ఆ స్థాయిలో లేకపోవడం వల్ల రొటీన్ అనిపించినా ఇది చక్కని కథ.
వైద్యో నారాయణో హరిః
మానవతా దృక్పథమున్న ఓ డాక్టరు దినచర్య ప్రబోధాత్మకంగా ఉంది. సందేశం రొటీన్ అయినా, కథనం బలంగా ఉంది. ముగింపు సందేశాత్మకం. కొత్తదనం లేకపోయినా మంచి కథ.
మనోవైకల్యం
వాస్తవానికి అద్దం పడుతూ మనసుని కుదిపే కథ. కథనం, ముగింపు బాగున్నాయి.
దిద్దుకోలేని తప్పు
ఉపేక్షాభావాన్ని మనోవిశ్లేషణలో ప్రదర్శించిన తీరు బాగుంది. కథకు పెట్టిన పేరు బాగుంది. ముగింపు మనలో ఎందరినో గుమ్మడికాయల దొంగల్ని చేస్తుంది.
బొమ్మలాట
కథనంతో సొగసులద్దుకుని కొత్తదనాన్ని సంతరించుకున్న కథాంశం. ముగింపు హృద్యం.
ఆదర్శగ్రామం
ముగింపు పేలవం అనిపించినా కథాంశం ఆలోచనాత్మకం. దత్తపుత్రుణ్ణీ, దత్తగ్రామాన్నీ పోల్చడం గొప్పగా ఉంది. వాగ్దానాల్ని ప్రచారం కోసం మాత్రమే అనుకునే ప్రముఖులు చట్టరీత్యా శిక్షార్హులు అన్న పాయింటు ఎందరికో స్ఫూరి కాగలదని ఆశిద్దాం.
ఆత్మతృప్తి
లంచగొడుల్ని, తాగుబోతుల్ని నిరసించే కథాంశాలతో నడిచిన ఈ కథలో నిర్దుష్టమైన సందేశం లేదు. సన్నివేశాల్లో కొత్తదనం లేదు. ఆసక్తికరమైన ముగింపు లేదు. భాష, శైలి లోని పరిణతి వల్ల చదివించే గుణమున్న కథ.
తెలుగు పలుకు
మాతృభాష ప్రాధాన్యాన్ని వివరించిన సందేశం మెచ్చుకోతగ్గది. సందేశమే కథ కాకుండా ఉంటే భాషకు, శైలికి, సందేశానికి కూడా ప్రయోజనం పెరిగేది.
కనువిప్పు
నమ్మకద్రోహానికి ఉండే అవకాశాల్ని ప్రస్తావిస్తూ, మానవతా వాదుల్ని హెచ్చరించే ప్రయోజనాత్మక కథ. విశేషమేమంటే, ఇందులో స్వార్థపరులుగా కనిపించే వ్యక్తులంతా, మంచితనానికి శ్రేయోభిలాషులు కావడం. ఆహ్లాదకరంగా ముగిసిన ఈ కథలో సన్నివేశాల్ని బలంగా చిత్రీకరిస్తే – ఇంకా రాణించేది. రచయితకు మంచి భవిష్యత్తుందనిపిస్తుంది.
మబ్బులో నీళ్లు చూసి…
మధ్యతరగతి జనం దురాశకు పోరాదని హెచ్చరించే కథ. షేర్ మార్కెట్టుని నిరసిస్తూ, సర్కారు వారి సేవింగ్సు స్కీములకు ప్రోత్సహించే ఈ కథలో ఊహకందని మలుపులు లేవు. కొత్తదనమూ లేదు. ఇది సేవింగ్సు స్కీములకు ప్రచారంగా ఉపయోగపడొచ్చు. కథకు పెట్టిన శీర్షిక చాలా బాగుంది. ఈ కథాంశాన్ని ఆ శీర్షికతో వచనకవితగా మలిస్తే బాగుంటుందనిపించింది.

Exit mobile version