జూలై 11, 2020
ఆకాశవాణికి వాణిగా….
వాట్సాప్ బృందం సౌజన్యంతో

సుమారు 60 లేక 50 సంవఆత్సరాల క్రిందటి మాట.
అప్పటి మన అందమైన రేడియో. ఉదయం గం. 06:00లకు చక్కని సంస్కృత శ్లోకంతో మనకు మేలుకొలుపు పలికేది…
భక్తి రంజనితో ప్రారంభమై, పాడి పంటలు, కథానికలు, బాలానందం, పాటలు, సంక్షిప్త శబ్ద చలన చిత్రాలు, నాటకాలు, ప్రముఖులతో పరిచయాలు, పొలం పనులు, లలిత గీతాలు, ప్రముఖుల శాస్త్రీయ సంగీతం, గాత్రం, వాయిద్యాలు, క్రికెట్ కామెంట్రీ, ఒకటేమిటీ, అవి, ఇవి, అన్నింటితో అలరిస్తూ ఉండేది.
అయితే, ఈ కార్యక్రమాలతో బాటు, ఉదయం గం.7:00 లకు , మధ్యాహ్నం గం.01:00లకు, తిరిగి సాయంత్రం గం.07:00 లకు, మరలా రాత్రి గం08:45 లకు తప్పకుండా రేడియో వినేవారం…
ఈ సమయాలలో తెలుగులో వార్తలు ప్రసారమయ్యేవి.. వార్తల కన్నా, నాడు వార్తలు చదివే ఆ మహానుభావులందరి స్వరం వినడం కోసం ఎదురు చూసేవాళ్ళం. అబ్బా!!! ఎంత చక్కటి భాషా పరిజ్ఞానమో వారిది.. ఇవాళ ఎందుకో వాళ్ళందరూ గుర్తుకొస్తున్నారు…
ఆ మహానుభావులందరికి అనేక నమస్సులు తెలియచేయాలి మనము. తెలుగు భాష వారి గళంలో పలికినట్లు ఈరోజులలో ఎవరూ పలకలేరు. తెలుగు వారి నోటంట విని పరవశించిన వారిలో నేను ఒకడిని.
రేడియో మాత్రమే సమాచార సాధనంగా ఉన్న అద్భుతమైన రోజులు అవి. ప్రజలకు వార్తలు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ప్రజల అభిమానం చూరగొన్నవారు నాటి వార్తలు చదివేవారు. రేడియో మనుషులుగా ఎంతగానో ప్రాచుర్యం పొందినవారిలో వార్తలు చదివేవారిది ప్రధమ స్తానం.
ప్రాంతీయ కేంద్రాలైన విజయవాడ, హైద్రాబాదు నుండి వచ్హే ప్రాంతీయ వార్తలే కాక దేశ రాజధాని అయిన ఢిల్లీ నుండి వచ్హే జాతీయ వార్తలు ప్రజలకు కావలిసిన విశేషాలను తెలియ జేసేవారు.
ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివే వారిది, ఒక్కొక్కరిదీ ఒక్కొక్క బాణీ. ఎవరి శైలి వారిదే. దుగ్గిరాల పూర్ణయ్య, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, జోలిపాళ్యం మంగమ్మ, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి , తిరుమలశెట్టి శ్రీరాములు ఇలా ఎందరో మహానుభావులు. ఎవరికి ఎవరు తీసిపోరు. వార్తలు మధ్యనుంచి విన్నా, ఎవరు వార్తలు చదువుతున్నది చెప్పగలిగేలా తమదయిన తరహాలో వార్తలు చదివేవాళ్ళు. ఆ వార్తలు చదివిన వారి గురించి సేకరించిన కొద్ది సమాచారం, ఫొటోలు మీతో పంచుకుంటాను .
- శ్రీ అద్దంకి మన్నార్:
పుట్టింది:1943. విజయవాడలో వీరు అనౌన్సరుగా చేరినది 1959 లో . 1977-79 మధ్య కాలంలో రెండు సంవత్సరాలు మాస్కోలో కూడా తెలుగు వార్తలు చదివారు. - శ్రీ కోత్తపల్లి సుబ్రహ్మణ్యం :
వీరు రేడియో లో చేరింది 1954 ఫిబ్రవరి 24. 1956 నుండి 13 సంవత్షరాలు ఢిల్లీలో వార్తలు చదివేవారు. 1966 లో హైదరాబాదుకు బదిలీ అయినారు…… - పన్యాల రంగనాధరావు:
రేడియోలో చేరింది 1943 నవంబర్ లో .వీరు కూడా ఢిల్లీలో తెలుగు వార్తలు చదువుతూ, 1962 లో హైద్రాబాద్ ఏ.ఎస్.ఇ.గా బదిలీ అయి వచ్చారు. 1987లో వీరు స్వర్గవాసులైనారు. - శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య:
పుట్టినది 1936లో ఏప్రిల్ లో . 1964లో వార్తలు చదివేవారుగా ఢిల్లీ లో చేరారు. 1994 ఏప్రిల్ లో పదవీ విరమణ జరిగింది. - శ్రీ కందుకూరి సూర్యనారాయణ :
జననం: 29 జులై 1936. 1962 లో డిల్లీ వార్తా విభాగంలో చేరారు. వీరుకూడా మాస్కోలో చేసారు. ఈయన ప్రముఖ కవి కందుకూరి రామభద్రరావు గా రి కుమారుడు. - శ్రీ డి.వెంకట్రామయ్య:
హైదరాబాద్ ప్రాంతీయ విభాగంలో ప్రముఖ న్యూస్ రీడర్. 1963 నవంబర్ లో మొదట అనౌన్సర్. ఈయన ప్రముఖ కధకులు, నాటకరచయిత. 2010 రావిశాస్త్రి పురస్కార గ్రహీత. పంతులమ్మ సినిమా మాటల రచయిత. వార్తా పఠనానికి పేరుపొందారు. - శ్రీ ఏడిద గోపాలరావు
1966 నుండి 1996 వరకు డిల్లీలో వార్తలు చదివారు. మాస్కోలో 4 సంవత్షరాలు తెలుగు వార్తలు చదివారు. మంచి నటులు. గాంధీ వేషానికి పెట్టింది పేరు. - మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి:
డిల్లీ న్యూస్ రీడర్ గా పనిచేసి రిటైరు అయ్యారు. అటుపిమ్మట మద్రాసులో స్థిరపడ్డారు. . - జోలి పాళ్యం మంగమ్మ:
డిల్లీలో తొలి మహిళా న్యూస్ రీడర్ గా ప్రసిద్దులు. రిటైరు అయ్యారు . - కీర్తిశేషులు తిరుమలశెట్టి శ్రీరాములు :
రేడియోలో వినబడే ఆ స్వరం తప్ప శ్రీరాములు గారు యెలా వుంటారో తెలియని వాళ్ళే యెక్కువ .ఆయితే ఆయన పేరు తెలియని తెలుగు వాళ్లు అంటూ ఎవ్వరు వుండరు.
చాలా మందికి, మా తరం వారికి, వీరి గురించి తెలుసు. కొంత మంది వీరి వార్తలు రికార్డుకూడా చేసి దాచుకున్నారని వినికిడి.. ఇప్పటికీ, రేడియో కేంద్రాలలో బధ్రపరచే ఉండి ఉంటాయి.. ఈ తరం వారికి వీరిని పరిచయం చేయాలనిపించింది…
Leave a Reply