జూలై 11, 2020

మన మహానటుడు గుమ్మడికి – ఓ వాట్‍సాప్ నివాళి

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:43 సా. by వసుంధర

‘బలరాముడంటే ఎవరు?’ అడిగాడు మా చిన్నాడు.

‘కృష్ణుడికి అన్నయ్య’ అని చెప్పాలని అనుకున్నవాణ్ణే ‘గుమ్మడి!’ అనేశాను. అనుకోకుండా అన్నాగానీ నిజానికి నేననుకునేది అదే! నేనేవిఁటీ, యావత్ తెలుగు ప్రజా అదే అపోహలో ఉన్నారు.

సూటిగా చూపు, ధీటైన ముక్కు, సరిసమానంగా పెరిగిన గెడ్డంతో హుందాగా నడిచొచ్చే ఆ పెద్దమనిషిని చూస్తే రారాజుకే కాదు, మనకూ చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. దుర్యోధనుడంటే ఏదో ప్రయోజనం ఆశించి కాళ్లూ, కాకాలూ పట్టాడనుకుందాం. మనకు మాత్రం ఆ ఠీవి, దర్పం చూసినా, ఆ గొంతులోంచి జాలువారే సుస్పష్టమైన తెలుగు పదాలు విన్నా ఇంకాసేపు ఆయన అలాగే తెరమీద కనబడితే బావుండుననే అనిపిస్తుంది.

శకుని ముందుగానే చెబుతాడు. ఆ బలరాముడు ముఖస్తుతికి పడిపోతాడని! అన్నట్టుగానే దుష్టచతుష్టయం చేసిన దొంగ మర్యాదలకు మిక్కిలి సంతోషంతో ఉప్పొంగిపోతాడు. ఆ ఉప్పొంగడాన్ని ఇంతవరకూ తెరమీద అంతలా ఎవరూ ఆవిష్కరించలేదని నా అభిప్రాయం.

తనకంతటి సత్కారం లభించిందన్న ఆనందం నరనరానా పాకుతోంటే ఆపుకోలేని భావోద్వేగాన్ని ముఖమంతా పరచుకుని మనందరికీ అర్ధమయ్యేలా చూపిస్తాడు. అంతలా ఒక దృశ్యం పండాలంటే ఆ పాత్రలో ఎంతలా మమేకమవ్వాలి? ఎంత తాదాత్మ్యత కావాలి? అదీ కేవలం ముప్ఫయ్యేళ్ల వయసున్న నటుడికి ఎంత సాధ్యం?

తనకంటే వయసులో పెద్దవారైన హీరోలకు అనేక చిత్రాల్లో తండ్రిగాను, మావగారిగాను నటించి, ఒక ముద్ర వేయించేసుకున్నాడు. నిజానికి ఆయన నటించిన ఏ చిత్రంలోనూ తన శరీరాకృతిని కోల్పోలేదన్న విషయాన్ని మనం చూడొచ్చు.

చక్కని రూపంతో, కనీసం గుప్పెడు పొట్ట కూడా కనబడని అంత అందమైన తండ్రికి ఎక్కడికక్కడ వేలాడిపోయే కొవ్వెక్కిన హీరోలు కొడుకులుగా నటిస్తూ ‘డాడీ..డాడీ!’ అంటూంటే ఈ కళ్లతోనే చూసి, ఈ చెవులతోనే విని ఇంకా బతికే ఉన్నాం.

‘జీవితరంగము’ అనే సినిమా చూశారా? కథాపరంగా అదొక టిపికల్ బాలచందర్ సినిమా. తెలుగులో వేరే దర్శకుడు పనిచేశారు. అందులో గుమ్మడి ఒక పేద పురోహితుడు. అధిక సంతానం, కటిక దరిద్రం. భార్యగా సావిత్రి నటించింది. తినడానికి తిండిగింజలు కూడా నిండుకుంటాయి. ఊళ్లో ఎవరూ ఆచారవ్యవహారాలు పాటించట్లేదని వాపోయే పాతకాలపు సంప్రదాయ బాపడు. తద్దినాలు, అపరకర్మలు నిష్టగా చెయ్యనివారితో గొడవపడి, చేసే కార్యక్రమం మధ్యలోనే ఆపేసి, సంభావన కూడా తీసుకోకుండా ఇంటికొచ్చేస్తూ ఉంటాడు.

పెద్ద కూతురు ప్రమీల ఉద్యోగం కోసం వెళ్లి, అనుకోని పరిస్థితుల్లో మోసగించబడుతుంది. ఒకరోజు తనకు మొదటిజీతం వచ్చిందంటూ నూటయాభై రూపాయలు తీసుకొచ్చి తండ్రి చేతిలోపెట్టి, పాదాలపై పడుతుంది. ‘నోరారా ఆశీర్వదించలేవా నాన్నా నన్ను?’ అనడుగుతుంది. కూతురిచ్చిన నోట్లను రెండుచేతుల్లోనూ ఆశ్చర్యంతో చూసుకుని ‘అర్ధరూపాయికీ, రూపాయికీ ఆనందపడిపోయి ఆశీర్వదించే పురోహితుణ్ణమ్మా నేను! ఏవిఁటో, ఇంత డబ్బు చూసేటప్పటికి నోటమాట రావడం లేదు నాకు!’ అంటూ ఉద్వేగపడిపోతాడు.

చాలు.

ఈ సినిమా నా ఖర్మకాలి ఓరాత్రివేళ ఒక్కణ్ణీ చూశాను. సరిగ్గా ఈ సన్నివేశం చూసిన మరుక్షణం నాకు దుఃఖం పెల్లుబికి వచ్చేసింది. అంతలా కదిలించేసిన బాలచందర్ మీద కోపమూ, అంత హృదయవిదారకంగా నటించిన గుమ్మడి మీద ఆగ్రహమూ కలిగాయి.

సినిమా మాధ్యమానికి ఇంత శక్తి ఉంటుందా? ఇలా ఏడిపించగల ప్రతిభావంతమైన నటనను ఆయనకు ఏ దేవుడు ప్రసాదించాడు? ఇదంతా రాస్తోంటే కూడా ఆ దృశ్యం కళ్లముందు కదలాడి కనులు తడిబారుతున్నాయి.

ఇక ‘సంపూర్ణ రామాయణం’లో విశ్వామిత్రుడు వచ్చి, యాగసంరక్షణకై రాముణ్ణి తనతో పంపమని కోరినప్పుడు, పట్టాభిషేకాన్ని ఆపి, రాముణ్ణి అడవులపాలు చెయ్యమని కైక వరమడిగినప్పుడు దశరథుడి ఆక్రోశం, ఆవేదన చూస్తే గుమ్మడితో పాటుగా మనకూ గుండె పట్టేస్తుంది.

ఆ తండ్రిమనసు ఎంత తల్లడిల్లిపోయిందో, ఎంత వేదన అనుభవించాడో స్వయంగా తనకుతానే దశరథుడిగా మారిపోయి, తన స్వంత కుమారుణ్ణే వదులుకుంటున్నంత విషాదాన్ని అణువణువునా శరీరమంతా నింపుకుని అద్వితీయమైన నటనతో మనందరినీ ఏడిపించేస్తాడు గుమ్మడి.

అదంతా దర్శకత్వ ప్రతిభ ఒక్కటే కాదు. ఆ పాత్రలన్నీ గుమ్మడి కోసమే ఉద్భవించాయి. అదే గుమ్మడి భృగుమహర్షిలా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ ‘వెంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రంలో మనందరినీ ఆశ్చర్యపరుస్తాడు.

ఇక దురదృష్టవశాత్తు గుండెపోటుకీ, గుమ్మడికీ లంకె పెట్టి, అనేక చిత్రాల్లో ఆయన్ని మంచాన పడెయ్యడమో, పాత్రకు మంగళం పాడయ్యడమో చేశారు మన రచయితలు, దర్శకులు. అదంతా నాకస్సలు నచ్చని వ్యవహారం.

ఒక్కసారి బ్లాక్ కలర్ సూటులో, చేతిలో పైపుతో గుమ్మడిని ఊహించుకోండి. ఎంత అందం, ఠీవి గోచరిస్తాయి ఆ నిండైన విగ్రహంలో? ఆకారమొకటే చాలనుకుంటే మనకు చాలామందే ఉన్నారు అందమైన నటులు. కానీ ఎన్ని సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నా ఇప్పటికీ గట్టిగా నాలుగు సంభాషణల్ని కూడా తప్పుల్లేకుండానో, భావం కోల్పోకుండానో పలకగలిగే సామర్ధ్యం మాత్రం శూన్యం.

కేవలం ఆకారమొకటే కాకుండా నవరసాలనూ అవలీలగా పోషించగల సహజనటుడు మాత్రం గుమ్మడి ఒక్కడే!

కొందరు దర్శకులు కాస్త పక్కదారి పట్టి గుమ్మడి చేత ప్రతినాయక పాత్రల్లో నటింపజేశారు. అయితే ఆయన ఎంత కాఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నా అందులో కూడా కొంత ఆత్మీయతే కనబడుతుంది మనకు. అది ఆ మహానుభావుడి ముఖారవిందం వల్లనే! కనుల నిండా కరుణతో, ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన పిచ్చితండ్రి మన గుమ్మడి.

పశ్చాత్తాపంతో కుమిలిపోయే దృశ్యాల్లో గుమ్మడి ఏడుస్తోంటే మనమూ ఏడుస్తాం. అదంతా ఆయనతో మనకున్న బాంధవ్యపు భావన! మన మేనమామే ఎదురుగా కూర్చున్నాడని అనిపించేలా మనందరినీ కాసేపు భ్రాంతిలోకి నెట్టేస్తాడు. ఆ సన్నివేశం పూర్తయిపోయిన తరవాత తెలుస్తుంది మనం హాల్లో కూర్చుని అదంతా చూస్తున్నామన్న సంగతి.

అప్పాజీగా గుమ్మడి, కృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్..

ఇంత కన్నులపంటకు ఏ భాషా ప్రేక్షకులూ నోచుకుని ఉండరేమో? అద్వితీయమైన నటన, భాషాసౌందర్యం, ఉచ్చారణాపరంగా చెవులకు హాయిగొలిపే ఆ ఇద్దరి సంభాషణలు, మూడుగంటల పాటు విజయనగర సామ్రాజ్యంలో విహరించి వచ్చేస్తాం మనందరం.

నిజానిజాలు, చరిత్రను వక్రీకరించడాలు, ఒకరిని ఎక్కువ చెయ్యడాలు.. ఇటువంటి వ్యర్ధవాదనలన్నీ పక్కనబడేసి చూస్తే ఇంతటి మహత్తరమైన చారిత్రాత్మక చిత్రాలు మన చిత్రపరిశ్రమ మనకందించిన స్వర్ణాభరణాలనే చెప్పొచ్చు.

గుమ్మడి లాంటి నటుణ్ణి చూసిన తరంగా మనందరం చాలా అదృష్టవంతులం. అటువంటి మహానటునికి సన్మాన సత్కారాలు సరైన రీతిలో జరిగాయని నేననుకోను.

ఆయన నటించిన విభిన్నమైన పాత్రలతో కూర్చిన దృశ్యాలన్నీ ఒక నెలరోజుల పాటు అధ్యయనం చేస్తే ఒక గ్రంథమే రూపొందించవచ్చు.

ఈ జన్మదినవేళ నాకెంతో ఇష్టమైన మనింటి మావయ్యకు మనఃపూర్వకంగా అక్షర నివాళులు!

…….కొచ్చెర్లకోట జగదీశ్

Leave a Reply

%d bloggers like this: