జూలై 27, 2020

ప్రవాసి మంచ్ లో జంట తెలుగు రచనలు

Posted in కథాజాలం, సాహితీ సమాచారం at 5:03 సా. by వసుంధర

ఈ జూలై 16న సాహిత్య అకాడమీ నిర్వహణలో – ప్రవాసి మంచ్ అనే వేదిక ద్వారా వినిపించిన రెండు కథల్ని యూట్యూబులో వినే అదృష్టం కలిగింది. ఉత్తమశ్రేణికి చెందిన ఈ రచనల్ని మా అవగాహన మేరకు ఇక్కడ పరిచయం చేస్తూ – మీ అవగాహన కోసం ఆ వేదికకు ఇక్కడ లంకె ఇస్తున్నాం.

కులాంతర వివాహం చేసుకుని, తను నమ్మిన సంప్రదాయానికి విలువిచ్చే తండ్రి నిరసనకు గురై, ఆ కోపంతో ఆయన్ను దూరం పెట్టిన ఓ కొడుకు రామానుజం. పెళ్లి విషయంలో తను నమ్మిన సంప్రదాయాన్ని కాదన్న పురుషగామి (గే) పుత్రుణ్ణి నిరసించి, ఆ కోపంతో అతడికి దూరంగా ఉండాలనుకునే ఓ తండ్రి కూడా రామానుజమే. ఏ విలువలనూ నిరసించకుండా, ఆలోచనల్ని తార్కికంగా మాత్రమే విశ్లేషించిన ఈ కథకు- ఆ రామానుజం మరణానంతరం జరిగే సంచయన కార్యక్రమమే నేపథ్యం కావడం కథన ప్రతిభకూ, పరిణతికీ మెచ్చుతునక. శ్రావ్యమైన గొంతులో నిర్దిష్టమైన శైలిలో రచనలోని హుందాకు న్యాయం చేశారు ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి కల్పనా రెంటాల.

పాదరసంలాంటి అపురూప విశిష్ట మూలకం కథ. వర్గాలతో, వాదాలతో సమ్మేళనమైతే, అది మూలకంతో ఏమాత్రం పోలిక లేని ఓ రసాయనమౌతుంది.  కొన్ని దశాబ్దాలుగా మూలకానికీ, రసాయనానికీ మధ్య నలుగుతోంది ఆధునిక  కథ. ఇలాంటి సందర్భంలో – కథను స్వచ్ఛందంగా ప్రేమించే విశిష్ట రచయిత డాక్టర్ చిర్రావూరి శ్యామ్ (మెడికో శ్యామ్) ఆలోచనల్ని ఆవిష్కరించింది ‘కథకుడి అంతరంగం’. రచయిత నోటి పలుకులు మంత్రం కాగా అస్త్రమైన వ్యంగ్యశస్త్రమిది. ముసిముసిగా నవ్విస్తూనే కసినంతా వెళ్లగక్కిన అపూర్వ పరిణతి, అసహనంతో అపరిపక్వతను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోలేకపోతున్న ఆధునికులకు మార్గనిర్దేశిని. అలోచింపజేసే ఓ కథ కాని కథ. ఇరువురు కథకులకూ, సంచాలకులు శ్రీ ఎస్. రాజమోహన్‍కీ, నిర్వాహకులు సాహిత్య అకాడమీకీ అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: