ఆగస్ట్ 3, 2020

సంస్మరణః బాపు-రమణ

Posted in కళారంగం, బుల్లితెర-వెండితెర, మన కథకులు, రచనాజాలం, సాహితీ సమాచారం at 4:16 సా. by వసుంధర

ప్రస్తుతం ‘బాపు-రమణల కబుర్లు’ పేరిట వారి అభిమానులు, పరిచయస్థులు వాట్‍సాప్ బృందంగా ఏర్పడ్డారు. అందులోని ఓ ముచ్చటః

‘స్నేహితుల దినోత్సవం’, గోదావరి గట్టున ‘బాపురమణల విగ్రహాలు’ వగైరా పోస్ట్ లు చూశాక కొన్ని నాకు తెలిసిన కొన్ని పూర్వాపరాలు పంచుకోవాలనిపించింది.

ఆగస్ట్ 31, 2014. ఆనాడు పెద్దదెబ్బే తగిలింది. ( బాపుగారి నిర్యాణం). తేరుకోడానికి చాలారోజులు పట్టింది. బాపుగారికి నివాళిగా ఏదైనా కార్యక్రమంలో పంచుకోవాలని తపన.
మిత్రులు, అప్పటి రాజమండ్రి నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు అయిన మురళీమోహన్ గారి దగ్గర నా బాధ పంచుకుంటూ అభ్యర్ధించాను. “గోదావరి అన్నా, గోదావరిప్రాతం అన్నా బాపురమణలకి వున్న అభిమానం, అనుబంధం మీకు తెలియనివి కావు. ఇంకో మూడునెలల్లో బాపుగారి పుట్టినరోజు వస్తోంది. అప్పటికి వారి విగ్రహాలు గోదారిగట్టున పెట్టేలా మీరు పూనుకోవాలి. ప్లీజ్. ఇది మీ నియోజకవర్గం కూడా“ అన్నాను.
ఆయన చాలా సంతోషించారు. “మంచి ఆలోచన. నాకూ వారితో ప్రత్యేక అనుబంధం. ‘మనవూరి పాండవులు’ సమయం నుంచీ మరీ ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది. త్వరలో సి.యం గారితో మాట్లాడతాను” అన్నారు.

నేను మళ్లీ కల్పించుకుని “మరో మాట. వారిది అవిభక్తజంట కదా. విడివిడిగా కాకుండా ఇద్దరి విగ్రహాలూ ‘ఒకే వేదిక’మీద పెడితే బాగుంటుంది. ఇంకా వీలైతే, వాళ్ళు సృష్టించిన ‘బుడుగు’ని ఇద్దరిమధ్యా నిలబెడితే ఇంకా బాగుంటుంది” అన్నాను.

“ఇదీ బాగుంది. ప్రయత్నిద్దాం” అన్నారు.
తర్వాత కొన్నాళ్ళకి ఆయన సి.యం చంద్రబాబుగారితో ప్రస్తావించగానే “ప్లీజ్ ప్రొసీడ్” అన్నారట.

పట్టువదలని విక్రమార్కుడిలా ఈ ప్రయత్నం వెనుక పడుతూనే ఉన్నాను.
సాంకేతిక కారణాలవల్ల ‘బుడుగు’కి చోటు కుదరదన్నారు శిల్పులు.

కొందరు మిత్రులు, బాపూగారి కుటుంబ సభ్యుల సహకారం (ముఖ్యంగా వారి అల్లుడు రంగాగారు), ఇంకా internet ద్వారా చాలా ఫొటోలు సేకరించాను.
కానీ అనుకున్న డిసెంబర్ 15th దాటాక కూడా అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వ శాఖలతోనూ, తదితరులతోనూ పనులు తెమలలేదు. నేను ప్రత్యక్షంగా కల్పించుకోనూలేను. గోదావరి గట్టున కాబట్టి, లక్షలాదిమంది చూసే అవకాశం ఉంది కాబట్టి పుష్కరాలలోపైనా (జూలై 2015) పని జరగాలని కోరుకున్నాను. మురళీమోహన్ గారి దృష్టికి ఆ విషయం తీసుకువెళ్లాను.

అలాగ బాపుగారి ప్రధమ వర్ధంతిలోపు ఆవిష్కరణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుగారు పుష్కరాల సమీక్షకు వచ్చిన సందర్భంగా ఆయన చేతులమీదుగా ఒక్కరోజు వ్యవధిలో జరిగింది కార్యక్రమం. అందువల్ల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కలేదు. ప్రాప్తం వుండాలిగా.

విగ్రహాల్లో రూపాలు నేను కోరుకున్నట్టు రాలేదు అనే భావన ఉన్నా, ‘విడదీయలేని జంట’ అన్నదానికి సాక్ష్యంగా ఇద్దరి విగ్రహలూ ఒకే వేదికమీద నిలపాలన్న అభిమతం నెరవేరింది.

మురళీమోహన్ గారి చొరవా, సహకారం, బాపు-రమణగార్ల కొన్ని ఫొటోలు పంపిన రంగాగారి సహాయం ఈ కల నెరవేరడానికి కారణాలు. వారికి కృతజ్ఞతలు.


భావరాజు శ్రీనివాసరావు::

Leave a Reply

%d bloggers like this: