సెప్టెంబర్ 26, 2020

భువినుండి దివికి

Posted in కళారంగం, బుల్లితెర-వెండితెర, సంగీత సమాచారం at 2:06 సా. by వసుంధర

ఎంత ప్రతిభ ఉన్నా రాణించడానికి అవకాశాలు ముఖ్యం. అవి కొందర్ని వెతుక్కుంటూ వస్తాయి. కొందరికి ప్రయత్నిస్తే వస్తాయి. ఎలా వచ్చినా రాణించడానికి మాత్రం ప్రతిభ అవసరం. అలా రాణించిన కొందరి ప్రతిభ ఏ స్థాయిలో ఉంటుందంటే – అవకాశాలే గర్వపడతాయి. అందుకు సినీ గాయకుడు, సంగీతజ్ఞుడు, బహుముఖప్రజ్ఞాశాలి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యానికి మించిన ఉదాహరణ ఉండదు.
సంగీతపరంగా శాస్త్రీయపరమైన శిక్షణ పొందలేదట. కానీ పాటలోని అక్షరాల్ని హృథయంలో మధించి, భావోద్వేగంతో రంగరించి, పరవశంతో గళం విప్పినప్పుడు – హాలాహలాన్ని కూడా అమృతమంత ఆహ్లాదకరం చెయ్యగల అసాధారణ ప్రతిభ ఆయనది!
సినీ సంగీత ప్రపంచంతో మమేకం. సాధించిన అవార్డులు, రివార్డులు, రికార్డులు, అభిమానులు, ఆరాధకులు, అనుచరులు, శిష్యులు అనేకం.
వివాదాలకు దూరంగా ఉండే మృదుభాషి. ఎందరికో నేర్పే దశలో ఉండీ, తాను నేర్చుకోవడం కోసం తాపత్రయపడే జిజ్ఞాసువు. సందర్భానుసారంగా కొత్త పాత సంగీతజ్ఞుల్ని విధిగా స్మరించే వినయశీలి. కొత్త గళాల్ని శ్రుతి చేస్తూ, తన తప్పతడుగుల రోజుల్ని ప్రస్తావించే ప్రభావశీలి. చదువు మధ్యలో ఆపి సంగీతంవైపు మళ్లినా, ఎందరి చదువో మధ్యలో ఆగిపోకుండా ఆదుకున్న దానశీలి. తనపై వచ్చే అర్థం లేని విమర్శలను కూడా సహృదయంతో స్వీకరించే సహనశీలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మహాశీలి.
సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించి మన తెలుగు చిత్రసీమ ‘చిత్ర’సీమగా మారిపోయింది. భాషలో పుట్టీ, భాషోచ్చారణలో తడబడేవారు మన హీరోలు. మన భాషకే చెందని వారు మన హీరోయిన్లు. పాశ్చాత్యబాణీల తరహాలో తెలుగుతనం స్ఫురించని పాటల్ని అందిస్తున్నారు కొంతమంది మన సంగీత దర్శకులు. తెలుగుతనం నింపుకున్న పాటలున్న ‘ఫిదా’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్ని ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. ఐనా మన యువతకి తెలుగుతనంపట్ల ఆసక్తి లేదన్న దురభిప్రాయానికి కట్టుబడింది సినీ సంగీత ప్రపంచం. అందుకే 15-20 సంవత్సరాలుగా చిత్రసీమ ఆయన్ని పక్కన పెట్టింది. వందల కోట్ల పెట్టుబడితో తీస్తున్న చిత్రాల్లో కూడా ఆయన పాట లేకపోవడం ఒక లోటని గుర్తించలేని అభిరుచి తెలుగు ‘చిత్ర’సీమది. ఆయన మన మధ్య లేకపోవడం చిత్ర పరిశ్రమకు ఒక లోటు అనే సినీప్రముఖులు – ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గాత్రమాధుర్యాన్నీ, గానప్రతిభనీ ఈ వయసులోనూ చెక్కుచెదరనివ్వని గానగంధర్వుడాయన.
ఆయనకు సినిమాల్లో పాడే అవకాశాలు బాగా తగ్గడం చిత్రసీమకు శాపం కావచ్చు కానీ, తెలుగు భాషకు గొప్ప వరమైంది. ఆయన వ్యక్తినుంచి సంస్థగా మారిపోయారు. ఆయన నిర్వహణలో – ఈటివి సమర్పిస్తున్న ‘పాడుతా తీయగా’ కార్యక్రమం లలితసంగీత కళాకారులకు గురుకులం. (అక్షరజాలంలో ఈ కార్యక్రమాన్ని పలుమార్లు విశ్లేషించడం జరిగింది: లంకె 1 లంకె 2 లంకె 3). అందులో పాటకు సంబంధించిన మెలకువలే కాదు. ఒక పాట సృజన వెనుక – కవి, వరస కట్టిన సంగీత దర్శకుడు/దర్శకురాలు, వాద్యబృందం, గాయకుడు/గాయని – వగైరాల సమిష్టి కృషిని జనం ముందుకు సవివరంగా తెచ్చే అపూర్వ విశేషాలున్నాయి. సరదాగా వినే పాటల్లోని అక్షరాల పొందిక పరమార్థం, పాటకు ఎంచుకునే రాగపు టౌచిత్యం, వాద్య ప్రయోగాల అంతరార్థం – వీటికి సంబంధించిన అవగాహన కలిగించే అలరింపు అనుభవైకవేద్యం. ఇక భాషోచ్చారణ పాఠాలు గాయకులకే కాదు – శ్రోతలందరికీ. వస్త్రధారణ విషయంలోనూ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యమున్న పవిత్రమైన వేదిక అది.
అందుకే అంతా బాలు అనే ఆయన్ని మాకు మాత్రం బాసు అనడం సబబు అనిపిస్తుంది.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా, మహాపురుషుడిగా అంతెత్తున ఉన్న మన బాసుకి గాయకుడిగా తాను ఉన్నత శిఖరాల్ని చేరుకున్నానన్న భావన లేదు. తాను నేర్వాల్సింది ఇంకా చాలా ఉన్నదన్న భావనతో, అందుకు సమర్థులు అమరలోకంలోనే ఉన్నారని భావించినట్లున్నారాయన. ఇహంలో తాను చేయాల్సిందీ, చేయగలిగిందీ ఇంకా చాలా ఉందని తెలిసినా, జ్ఞానతృష్ణతో ఆయన దృష్టి అమరలోకంవైపు మళ్లినట్లుంది.
లేకుంటే ‘పాడుతా తీయగా’ వేదికలో – నిత్యజీవితానికి సంబంధించి ఎన్ని విషయాలపై ఆయన సామాన్య ప్రజానీకాన్ని హెచ్చరించలేదు! కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయనకు తెలియకనా! జూలై 30న ఓ సంగీత కార్యక్రమంలో పలువురితో కలిసి పాల్గొనేవారా? పాల్గొన్నా కరోనా టెస్టు చేయించుకుందుకు ఆగస్టు 5న కొద్దిగా అస్వస్థత కలిగేదాకా ఆగేవారా?
అవతార సమాప్తికోసం – ఒక బోయవాడి బాణాన్ని కాలి మడమకు తగులనిచ్చాడు శ్రీకృష్ణుడు. ఆయన అప్పగించిన స్త్రీజన రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడంలో సామాన్యులైన ఆటవికులముందు నిర్వీర్య్డయ్యాడు మహావీరుడు అర్జునుడు.
ఈ ఆగస్టు 5నుంచి సెప్టెంబరు 25 వరకూ అహరహాలు కృషి చేసిన దేశ విదేశ వైద్యబృందం ఆ అర్జునుణ్ణి తలపించారు.
శివునాజ్ఞ అయింది. మన బాసుని కరోనా కుట్టింది!
ఎన్నో నెలలుగా కరోనా యావత్ప్రపంచాన్నీకుదిపేస్తూండవచ్చు. కానీ తన ఖాతాలో ఇంతటి అసామాన్యుడు చేరడం ఇదే ప్రథమం.

మహాప్రస్థానంలోనూ ప్రత్యర్థికి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి ఘనత నాపాదించిన – ఆ మహా పురుషుడికి –

గమ్యంలో లక్ష్యసాధన జరిగి, ఆత్మతృప్తి కలగాలని – అక్షరజాలం కోరుకుంటోంది.

Leave a Reply

%d bloggers like this: