Site icon వసుంధర అక్షరజాలం

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయోత్సవాలు

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయోత్సవాలు విజయవంతం

అక్టోబర్ 10-11, 2020 (శని, ఆది వారాలు) తేదీలలో 36 గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన “7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” దిగ్విజయంగా జరిగిన సందర్భంగా ఆ సదస్సు విజయోత్సవాలని నిర్వాహక సంస్థలైన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (అమెరికా, హైదరాబాద్), శ్రీ సాంస్కృతిక కళా సారధి (సింగపూర్), తెలుగు మల్లి (మెల్ బోర్న్, ఆస్ట్ఱేలియా), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్), సి.పి. బ్రౌన్ తెలుగు సమాఖ్య (లండన్) సంస్థల సంయుక్తంగా నిర్వహించాయి. ఈ విజయోత్సవాలు అక్టోబర్ 31, 2020 నాడు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:00 నుంచి సుమారు ఎనిమిది గంటల సేపు అంతర్జాలం లో విజయవంతంగా జరిగాయి.

ప్రారంభ వేదికలో వంగూరి చిట్టెన్ రాజు స్వాగత వచనాలు పలుకుతూ, విజయోత్సవాల నేపధ్యాన్ని వివరించారు. ప్రముఖ గాయని సురేఖా మూర్తి దివాకర్ల శ్రావ్యంగా ఆలపించిన “మా తెలుగు తల్లికీ” గీతం పాడగా పలు దేశాలలో తెలుగు కుటుంబాలు దీప ప్రజ్వలన చేశారు. ప్రముఖ సినీ నటులు, సాహితీవేత్త శ్రీ కె. బ్రహ్మానందం గారు సుమారు 45 నిముషాల సేపు అనర్గళంగా సాగిన తన ప్రారంభోపన్యాసం లో అలనాటి నన్నయ, పోతన, జాషువా, విశ్వనాథ, గురజాడ, శ్రీశ్రీ మొదలైన కవుల విశిష్టతని అలవోకగా ఉటంకిస్తూ, యువతరం తెలుగు భాషని గౌరవించి, నేర్చుకోడానికి ఆయా కవితలని సరి అయిన పధ్దతిలో విశ్లేశించి వారికి  వివరించడమే సరి అయిన మార్గం అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ కవితల నుండి కొన్ని వాక్యాలని స్పూర్తిగా తీసుకుని తను వేసిన చితాలని బ్రహ్మానందం గారు ప్రదర్శించి, సభికుల మన్ననలు పొందారు.

అనంతరం జరిగిన రెండు ప్రసంగ వేదికలనీ ప్రధాన నిర్వాహకురాలైన ప్రముఖ రచయిత్రి రాధిక మంగిపూడి (సింగపూర్), సుచిత్రా మూర్తి (కాకినాడ) అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు. ఒక్కొక్కటీ రెండున్నర గంటల సేపు సాగిన ఈ వేదికలలో అక్కిరాజు భట్టిప్రోలు, చాగంటి కృష్ణకుమారి, నోరి రాధిక మొదలైన 34 మంది వక్తలు అనేక సాహిత్యాంశాల మీద ప్రసంగించారు. వంగూరి చిట్టెన్ రాజు నిర్వహించిన ముగింపు వేదిక లో 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రధాన నిర్వాహకులలో రత్న కుమార్ (సింగపూర్), డా. జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లండ్), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), వంశీ రామరాజు (హైదరాబాద్), రాధిక మంగిపూడి (సింగపూర్), శాయి రాచకొండ (హ్యూస్టన్), ప్రధాన సాంకేతిక నిపుణులలో రాధాకృష్ణ, సుధాకర్ జొన్నాదుల, భాస్కర్ ఊలపల్లి, శ్రీధర్ భరద్వాజ్, రాము చామిరాజు, పాతూరి రాంబాబు (సింగపూర్), లలిత రాచకొండ, ఇందిర చెరువు (అమెరికా), శేషేంద్ర శేష భట్టార్ (ఇంగ్లండ్), వేదిక నిర్వాహకులు దీప్తి & శ్రీనివాస్ పెండ్యాల, రాధిక నోరి, డా. కె.గీత (అమెరికా), గంగిశెట్టి లక్ష్మీ నారాయణ (తిరుపతి) సుచిత్ర (కాకినాడ) మొదలైన వారు తమ అనుభూతులని పంచుకున్నారు.       

విద్యావ్యాపారం,  ప్రజల నిరాసక్తత, ప్రభుత్వాల వ్యతిరేక విధానాల వలన  తెలుగు భాషాసాహిత్యాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది అనే ఈనాటి నేపధ్యంలో ఈ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కి వేలాది అసంఖ్యాక తెలుగు భాషాభిమానాల నుంచి లభించిన ఆదరణ దృష్ట్యా భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉంది అనీ, త్వరలోనే ప్రస్తుత ప్రతిష్టంభన వైదొలగి మళ్ళీ తెలుగు భాష పునరుజ్జీవితం అవుతుంది అనీ సభికులు అభిప్రాయపడ్డారు.

బహ్మానందం గారి పూర్తి ప్రసంగం తో సహా ఈ విజయోత్సవాలని ఈ క్రింది లింక్ లో యూ ట్యూబ్ లో చూడవచ్చును. Please subscribe to the newly created VFA You Tube Channel.

భవదీయులు,

వంగూరి చిట్టెన్ రాజు

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక సభ్యులు

Exit mobile version