నవంబర్ 9, 2020
గడువు తేదీ పెంపుః కథా విజయం 2020
తెలుగు కథకు నీరాజనం… కథా విజయం 2020
తెలుగువెలుగు, బాలభారతం, విపుల, చతుర మాసపత్రికల ద్వారా మన అమ్మ భాషకు, సాహిత్యానికి పట్టం కడుతున్న రామోజీ ఫౌండేషన్, రచయితల్ని ప్రోత్సహించేందుకు కథావిజయం పేరుతో పోటీలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. 2019లో మొదలైన ఈ పోటీలకు అనూహ్య స్పందన వచ్చింది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ ‘కథా విజయం 2020’ పోటీలకు రచనలను ఆహ్వానిస్తున్నాము. ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్, ఈ.ఎఫ్.ఎం, ఉషాకిరణ్ మూవీస్ సంస్థలు ఈ యజ్ఞంలో భాగస్వాములుగా వ్యవహరిస్తాయి.
బహుమతులు:
* ప్రథమ: ఒక అత్యుత్తమ కథకు: రూ.25,000
* ద్వితీయ: 2 ఉత్తమ కథలకు ఒక్కోదానికి రూ.15 వేలు
* తృతీయ: రూ.10 వేల చొప్పున 3 బహుమతులు
* ప్రత్యేకం: రూ.5 వేల చొప్పున 5 బహుమతులు
* ప్రోత్సాహక: రూ.3 వేల చొప్పున 20 బహుమతులు
* కథల సమర్పణకు తుది గడువు: డిసెంబరు 31, 2020
* మీ కథను kathavijayam@ramojifoundation.org కు మెయిల్ చేయవచ్చు. లేదా..
నిబంధనలు:
* కథ 2500 పదాలకు మించకూడదు. తెలుగువెలుగు.ఇన్లో నిర్దేశించిన లింక్ ద్వారా కథ పంపవచ్చు. లేదా నిర్దేశిత అంగీకారపత్రం జోడించిన కథను kathavijayam@ramojifoundation.org కు మెయిల్ చేయవచ్చు. డీటీపీ చేసిన లేదా యూనీకోడ్ లో కంపోజ్ చేసిన కథలను మాత్రమే మెయిల్ చేయాలి. రాసి స్కాన్ చేసిన/ ఫొటో తీసి పంపే కథలను (చేతి రాత కథలను) పోటీకి స్వీకరించడం సాధ్యం కాదు. తపాలా, వాట్సప్ ల్లో పంపే కథలనూ పరిశీలించడం సాధ్యం కాదు.
* కథ మీద రచయిత పేరు, వివరాలు ఉండకూడదు. తెలుగువెలుగు.ఇన్ ద్వారా కథను పంపేటప్పుడు అక్కడే మీ పేరు, ఇతర వివరాలు నమోదు చేయడానికి విడివిడిగా నిర్దేశిత ప్రదేశాలుంటాయి. వాటిలో మీ కథ పేరు, ఇతర వివరాలు నింపాలి. అక్కడే అంగీకారపత్రమూ ఉంటుంది. దాన్ని టిక్ చేయాలి. మెయిల్ ద్వారా కథ పంపేవారు పైన పీడీఎఫ్/ యూనికోడ్ లలోఅందుబాటులో ఉన్న అంగీకార పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని నింపి కథతో పాటు పంపాలి. ఈ అంగీకారపత్రంలో తప్ప కథ లో రచయిత పేరు, వివరాలు ఉండకూడదు.
* రచనలో తెలుగు నుడికారం ఉట్టిపడాలి. కథలు మూసపద్ధతిలో ఉండకూడదు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా వస్తువు నవ్యంగా ఉండాలి. కథ పాఠకుల మీద గాఢమైన ముద్రవేయాలి. కులం, మతం, ప్రాంతం, స్త్రీలు, వైకల్యాలను కించపరిచే పదజాలం, భావాలు ఉండకూడదు.
* ఒకరు రెండు కథలకు మించి పంపకూడదు.
* గతంలో ఎక్కడైనా, ఏ రూపంలో అయినా ప్రచురితమైనవి, చోరీ కథలను పంపకూడదు. ఇలాంటి కథను పంపిన రచయితల పేర్లు, వివరాలను మా పత్రికల్లో ప్రకటిస్తాము. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది ఈ పోటీలో పాల్గొనకూడదు.
* పోటీ ఫలితాలను ఈనాడు దినపత్రిక, ఈటీవీ, ఈటీవీ భారత్, ఈనాడు.నెట్, ఈనాడు ఎఫ్.ఎంలలో వెల్లడిస్తాము. ఎంపికైన కథలను ఈనాడు ఆదివారం అనుబంధం, తెలుగువెలుగు, విపుల, చతుర పత్రికల్లో ఎందులోనైనా వీలువెంబడి ప్రచురిస్తాము.
* పోటీకి సంబంధించి ఎలాంటి విచారణలు, ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
* నియమ నిబంధనలను ముందుగా తెలియజేయకుండా మార్చే, లేదా పోటీలను రద్దు చేసే అధికారం నిర్వాహకులకు ఉంటుంది.
తాడిగడప శ్యామల రావు said,
నవంబర్ 16, 2020 at 7:49 సా.
సమస్య అన్నివైపులా ఉన్నదండీ. ఎవరి ఆత్రుత వారిది. రచయితలు గుర్తింపు కోసం ఆరాటపడటం నిజమే. కథాసంకలనకారులు కూడా తమతమ గుర్తింపు కోసం ఆరాటపడుతున్నారా లేదా?
సమాజప్రయోజనం ఒకకోణం. గుర్తింపు ఒకకోణం. ఇంకా వేరే కోణాలూ ఉండవచ్చును – ఉంటాయి కూడా. అందరి వద్దా యివన్నీ ఉన్నాయి.
నిజం చెప్పాలంటే ఒకదశలో నేనూ గుర్తింపుకోసం ఆరాటపడ్డాను. కాని గుర్తింపుకోసం ఎవరుచెప్పినట్లో వ్రాయటానికి ఏమాత్రమూ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆదశ లేదు. నాకు రాముడు తప్ప సమస్తమూ నిమిత్తమాత్రం అయ్యాక శాంతంగా నావ్రాతలు నేను వ్రాసుకుంటున్నాను. విలువ ఉన్నవి నిలుస్తాయి. విలువ లేనివీ, జనం గ్రహించనివీ నిలువవు. నా కెందుకు ఆరాటం?
రచయితలు శాంతులై యున్నప్పుడు ఆరాటాలూ పోరాటాలూ అవసరం లేదు వారికి. కాని లౌకికులై యుండగా వారికి గుర్తింపూ కావాలి, న్యాయమూ కావాలి. అదీ సంగతి.
U.SURYACHANDRARAO said,
నవంబర్ 15, 2020 at 8:30 సా.
కథల పోటీ పెట్టడం, ఫలితాల ప్రకటనలో ‘మొదటి బహుమతికి అర్హమైన కథ రానందున ఆ బహుమతిని రద్దు చేశా’మని పోటీలో పాల్గొన్న యావత్తు కథా రచయితల్నీ అవమానించడం ఓ దురాచారంగా మారిపోయింది. దీని మీద నేను గతంలోనే కొన్ని పోటీల సందర్భంగా నిరసన తెలిపాను. కథల స్థాయిని బహుమతి సొమ్మును బట్టి తూకం వేసి నిర్ధారిస్తారా అనీ, ఒక వేళ తెలు కథా సాహిత్యంలోనే గొప్ప కథల సరసన నిలిచే కథ పోటీకి వస్తే.. ముందుగా నిర్ణయించిన బహుమతి మొత్తం కన్నా ఎక్కువ ఇస్తారా అనీ ప్రశ్నించాను. పోటీకి వచ్చిన కథలపై జడ్జీల అభిప్రాయాన్ని ప్రకటిస్తూనే వాటిలోనే ఉత్తమమైనదనుకున్న దానికి మొదటి ఇవ్వడం నిర్వాహకుల విధి అనీ చెప్పాను. ఆ దురాచారం కొనసాగుతూనే ఉండగా.. గత సంవత్సరం తొలి పోటీలలో ‘కథా విజయం’ నిర్వాహకులు దాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో ‘చెత్త పుంతలు’ తొక్కారు. మొదటి బహుమతికే కాదు.. రెండో బహుమతికి అర్హమైన కథలు కూడా రాలేదని బండగా ప్రకటించారు. ‘ఆ రెండు బహుమతుల మొత్తానికీ ఒకింత చేర్చి సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలకు పారితోషికాన్ని పెంచాం కదా!’ అని కథా విజయం నిర్వాహకులు ఉద్ధరింపు ఫోజు పెట్టొచ్చు. కానీ వాళ్ళు పోటీలో పాల్గొన్న రచయితలను అవమానించడంలో కొందరితో పోటీ పడి విజేతలయ్యారనే అంటాను.
వసుంధర said,
నవంబర్ 16, 2020 at 11:22 ఉద.
కథకులు మేధావి వర్గానికి చెందినవారు. వారి కథలు అందరికీ అర్థం కావాలని లేదు. ఈ విషయం గ్రహించిన తొలి సంపాదకులు విజయ మాసపత్రిక సంపాదకులు శ్రీ విజయ బాపినీడు. వారు ప్రచురణకు స్వీకరించని కథల్ని ఆలస్యం లేకుండా వెంటనే తిప్పి పంపుతూ, ‘ఇంత వేగంగా తిప్పి పంపేమని మీ రచన బాగోలేదని కాదు. మా అభిరుచి మేరకు మీనుంచి మరొ కథ అందుకోవాలనే మా ఆశ’ అని ఉత్తరం పెట్టేవారు. ఆదిలో వరుసగా పది పదిహేను కథల్ని తిప్పి పంపినా మేమా పత్రికకు కథలు పంపుతూండడానికి ఆ ఉత్తరంలోని మర్యాదే కారణం. వారు తిప్పి పంపిన కథలు ఇతర పత్రికల్లో బహుమతులు గెల్చినా మేమా విషయం వారికి తెలియబర్చలేదు. విజయలో మా మొదటి కథ ప్రచురితమయ్యేక – ఆ పత్రికలో మా రచనలు ఎంత విరివిగా వచ్చేయంటే చాలామంది మమ్మల్ని విజయకు ఆస్థాన రచయితలు అనేవారు. కథకునికి తన రచనపై నమ్మకముండాలి. అలాగే ఇతరుల రచనలపై గౌరవం ఉండాలి. మేము కథలపై అభిప్రాయం చెప్పినా, పోటీల్లో కథల్ని ఎంపిక చేసినా – ‘ఇది కేవలం మా అభిప్రాయమే తప్ప, ఆ కథలపై తీర్పు కాదు’ అని స్పష్టం చేస్తూంటాం. ఐతే పలు పోటీల్లో మన న్యాయనిర్ణేతలు – కథలపై తీర్పులు ఇవ్వడం ఇటీవల ఇంచుమించు రివాజుగా మారింది. అది అహంకారం కిందే పరిగణించాలి. అహంకారం అపరిపక్వతకు నిదర్శనం. ఆ విషయం గమనించి వారు ముందు తమను తాము అంచనా వేసుకోవాలి. ఏదేమైనా కథకుల్ని ఈ తరహా అవమానానికి గురి చెయ్యడంపై గళం విప్పిన మీకు మా అభినందనలు. ఇక్కడ మరో విషయం – ఆమధ్య ఒక న్యాయనిర్ణేత – తిరిగొచ్చిన కథను మరో పత్రికకో, పోటీకో పంపడాన్ని హేళన చేశారు. వారు తిరస్కరించిన కథ మరో చోట సత్కారాన్ని పొందితే – ఆ హేళన ఇంతై అంతింతై వారికి తగుల్కోదా? ప్రస్తుతానికి మనం చెయ్యగలిగిందొక్కటే – అపరిపక్వ రాజకీయనేతలని భరిస్తున్నట్లే అపరిపక్వ న్యాయనిర్ణేతల్నీ మనసులో నవ్వుకుంటూ భరించడం.
పి. రాజేంద్రప్రసాద్ said,
నవంబర్ 16, 2020 at 11:41 ఉద.
చాలా చాలా కరెక్టండీ. మీలాంటి పెద్దలు ఇలాంటి వాటిని గర్హిస్తూ అప్పుడప్పుడూ స్పందిస్తేనైనా వారి ధోరణి మారుతుందేమో.
వసుంధర said,
నవంబర్ 16, 2020 at 12:20 సా.
‘చేరి మూర్ఖుని మనము రంజింపరాదు’, ‘తెలిసియు తెలియనినరున్ తెల్ప బ్రహ్మదేవుని వశమే!’ – అన్నది అలాంటివారికి వర్తిస్తుంది.
U.SURYACHANDRARAO said,
నవంబర్ 16, 2020 at 8:44 సా.
..‘ఇది కేవలం మా అభిప్రాయమే తప్ప, ఆ కథలపై తీర్పు కాదు..’ ఇదీ న్యాయ నిర్ణేతలు తమకిచ్చిన స్థాయికీ, బాధ్యతకూ న్యాయం చెయ్యడం! అయిదారు పత్రికలు సాధారణ ప్రచురణకు సైతం తిరస్కరించిన కథలు బహుమతులు తెచ్చి పెట్టిన అనుభవం నాకుంది. అపరిపక్వ న్యాయ నిర్ణేతల్ని నవ్వుకుంటూ భరించడమే కాదు.. సందర్భం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళను నవ్వులపాలు కూడా చెయ్యాల్సిందే! ఏం.. కాంటెంప్ట్ ఆఫ్ లిటరరీ కోర్ట్ అంటారా?
పి. రాజేంద్రప్రసాద్ said,
నవంబర్ 16, 2020 at 11:36 ఉద.
నూటికి నూరు శాతం మీతో ఏకీభవిస్తున్నాను. పోటీలో ప్రధమ బహుమతికి వారు నిర్ణయించుకున్న ప్రమాణాలేమిటో వారు తెలియచేయగలరా? నా లాంటి ఒక అనామక రచయిత రాసిన కథ రెండు పత్రికలలో సాధారణ ప్రచురణకు తిరస్కరింపబడి ఇంకొక చోట బహుమతికి అర్హత పొందింది. దీనిని మనం ఏ విధంగా వ్యాఖ్యానించగలం? రచనలకు కొన్ని ప్రమాణాలుంటాయి, ఉండాలి కూడా. కానీ ఎవరికి వారే ప్రమాణాలు నిర్ణయించే స్థాయిలో ఉన్నామనుకోవడం చాలా తప్పు. మీరన్నట్టు ప్రథమ బహుమతికి, ద్వితీయ బహుమతికి ఏ కథా అర్హత సాధించలేదనడం వారి పొగరు బోతు తనాన్ని సూచిస్తుంది. ఇలాంటి పోకడలు పోయే వారి పత్రికలకు/సంస్థలకు తమ రచనలు పంపకుండా రచయితలందరూ బహిష్కరించాలి. ఇందుకోసం ఇజాల జోలికి పోకుండా రచయితలందరూ ఒకే సంఘంగా ఏర్పడడం మంచిది.
వసుంధర said,
నవంబర్ 16, 2020 at 6:29 సా.
అసలు సమస్య రచయితల్లోనే ఉంది. రచనలు చేసేది మానసికతృప్తికోసం, మన భావాల్ని పదిమందితో పంచుకోవడం కోసం – అనుకునేవారికంటే – రచయితగా గుర్తింపే జీవితపరమార్థం అనుకునేవారి సంఖ్య ఇప్పుడు ఎక్కువగా ఉంది. అసూయా ద్వేషాలు, ప్రగల్బాలు, అసహనం, స్వార్థం – వీటిని వదులుకోవడం అవసరమని రచయితలందరూ గుర్తించేదాకా – వారికి దక్కాల్సిన గౌరవం దక్కదు. దక్కినా అది తాత్కాలికం.