మీ ఆలోచనల్ని మాటల్లో పలికితే – వాటిని అక్షరాలుగా మార్చొచ్చు.
మీ దగ్గర వ్రాతప్రతి ఉంటే చదవడమే టైపింగు కావచ్చు.
ఇది voice typing సదుపాయం. అదీ తెలుగులో.
అందుకోసం – మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చెయ్యండి. docs.google.com అనే సైటుకి వెళ్లండి. కొన్ని డాక్యుమెంట్లు కనిపిస్తాయి. వాటిలో blank ఎంచుకుని క్లిక్ చెయ్యండి. కొంచెం పైన వరుసగా file, edit, view, insert వగైరాలు కనిపిస్తాయి. అక్కడ Tools మీద క్లిక్ చెయ్యండి. కనబడిన బ్లాకులో voice typing మీద క్లిక్ చెయ్యండి.
అప్పుడు ఎడంపక్క నల్లగా మైక్రోఫోన్ బొమ్మ కనబడుతుంది. దానికి పైన English అని వ్రాసి ఉంటుంది. దాని పక్కన ఉన్న యారో మార్కుమీద క్లిక్ చేస్తే ఒక పెద్ద బ్లాకు వస్తుంది. అందులో బోలెడు భాషల పేర్లు ఉంటాయి. బాగా క్రిందన తెలుగు కనబడుతుంది. దానిమీద క్లిక్ చెయ్యండి. తర్వాత మైక్రొఫోను కింద click to speak అని వ్రాసి ఉన్న బటనుపై క్లిక్ చెయ్యండి. మైక్రోఫోను ఎర్రబడుతుంది.
ఇక మాట్లాడ్డం మొదలుపెట్టండి. మీ మాటలు తెలుగు లిపిలో టైపవుతూ కనిపిస్తాయి.
ఎడిటింగు వగైరా మిగతా సదుపాయాలు కూడా అక్కడే ఉన్నాయి.
కీబోర్డుమీద వేళ్లు పెట్టనవసరం లేకుండా, నోటిమాటలతో తెలుగులో టైపింగు చేసుకునే – ఈ గొప్ప సదుపాయాన్ని అందించిన గూగు ల్ క్రోమ్‌ని మనసులో అభినందించుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వాయిస్ టైపింగుని ఎంజాయ్ చేద్దాం.
ఇదంతా చదువుతుంటే గజిబిజిగా అనిపించిందా? మీరీ సదుపాయాన్ని వాడుతున్నప్పుడు – అబ్బా, ఇంత సులభమా అనిపిస్తుంది.
ఇంత చక్కని సదుపాయాన్ని అమెరికానుంచి విడియో ద్వారా మాకు పరిచయం చేసిన శ్రీ రాయవరపు ఆదినారాయణరావుకి ధన్యవాదాలు.