డిసెంబర్ 28, 2020

సాహితీ భీష్ములు – డి.వి. నరస రాజు

Posted in వెండి తెర ముచ్చట్లు, సాహితీ సమాచారం at 8:50 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం రచన లోగిలి సౌజన్యంతో

ఎలిజీలు – గొల్లపూడి మారుతి రావు

సాహితీ భీష్ములు – డి.వి. నరస రాజు

సరిగా నెల రోజుల కిందట చెన్నై బీచ్ లో వెళ్తూంటే నరసరాజు గారు
జ్ఞాపకం వచ్చారు. వెంటనే ఫోన్ చేశారు. వయస్సు కారణంగా గొంతు
బలహీనమయింది. కాని పలకరింతలో ఆప్యాయత తగ్గలేదు. “బాగున్నావా మారుతీరావ్!” అన్నారు. ఎప్పుడు ఫోనందుకున్నా ఇదే మొదటి వాక్యం. నన్ను అలా పిలిచేవాళ్ళు క్రమంగా తగ్గిపోతున్నారు. “ఇప్పుడే సాయంకాలం నడక
ముగించి వస్తున్నాను” అన్నారు. ఆరోగ్యం ఎలా ఉందన్నాను. “నాకేం బాగానే ఉన్నాను. కాళ్ళలో పట్టు కొంచెం తగ్గింది. చేతికర్ర పొడుస్తూ’ నడుస్తున్నాను” అన్నారు. దినచర్య అంతా అడగడం నాకలవాటు. మధ్యాహ్నం నిద్ర
మానేశానంటూ వివరంగా చెప్పారు. ‘ఆత్మకథ’ ప్రసక్తి వచ్చింది. “నువ్వు పుస్తకం కొనకు. హైదారబాద్ వచ్చినప్పుడు నన్ను కలిస్తే ఇస్తాను’ అన్నారు.
నరసరాజు గారితో ఎప్పుడు మాట్లాడినా ఓ పెద్దదిక్కు పలకరింత వినిపించేది. నాటకరంగం రోజుల నుంచీ మాకు సీనియర్. ఔత్సాహిక నాటకరంగం వికాసానికి తొలికొమ్ము కాసిన యోధులలో నరసరాజుగారొకరు. కొర్రపాటి, ఆత్రేయ,
పినిశెట్టి,
కొడాలి గోపాలరావు మేమంతా తర్వాతి తరం వాళ్ళం. ఆయన ‘వాపస్’ ఎన్నిసార్లు వేశానో! ఆయన చమత్కారానికి ఆనాటికే అది మచ్చుతునక. అతి మామూలు మాటల్లోంచి – కొత్త వాడినీ, చిక్కటి హాస్యాన్ని పిండగల రచయిత. ఆయన
‘నాటకం’ నాటకం, ఈ ఇల్లు అమ్మబడును, అంతర్వాణి మా తరానికి సుపరిచితాలు.
విషయాన్ని ‘కొత్త’ గా మలిచి – చివ్వున హాస్యాన్ని చిప్పిలేటట్టు చేయడంలో ఆయనకి ఆయనే సాటి. హాస్యాన్ని సరళంగా, గంభీరంగా, పెద్ద మనిషి తరహాలో నిలిపిన రచయిత. చవకబారు వెకిలితనానికి ఆయన హాస్యం స్థాయిని
ఏనాడూ దింపలేదు. ఈనాడు వినోదం వెర్రితలలు వేస్తున్న వెండితెరకి ఆయన అంటరానివాడుగా కనిపించవచ్చు.
ఓసారి ఏదో పెళ్లిలో నేనూ, ఆయనా, మాజీ చీఫ్ సెక్రటరీ ఐ.జె.నాయుడు గారూ అక్షింతలు వేసి వేదిక దిగుతున్నాం. “మీకు 50 వుంటుందా?” అన్నారు నాయుడుగారు నాతో. నవ్వి – ముందున్న నరసరాజుగారితో చెప్పాను – ఈయన
నా వయస్సు 50 వుంటుందా అని అడుగుతున్నారని. నరసరాజు గారు నవ్వి “లాభం లేదయ్యా, నీ వయస్సు తెలియడానికి నీ నల్లజుత్తుకి తెల్లరంగు వెయ్యాలి” అన్నారు. అదీ ఆయన సమయస్పూర్తి, చమత్కారానికి ఉన్న వాడి,
వేడి.
రేడియోకి రాయడానికి విసుగూ, నిర్లక్ష్యం చూపే ఆయనతో “ఇల్లు కట్టిచూడు” అనే నాటిక రాయించాను. నా రేడియో కెరీర్ లో చాలా తృప్తిగా నిర్వహించిన చిన్న
సీరియల్ “బస్తీలో బహుకుటుంబీకుడు” ఆయన రాసినది – సాక్షి, రావి కొండలరావు గారు దానికి ఊపిరిపోశారు. ఎన్టీఆర్ కి ఆ నాటిక వినిపిస్తే సినీమాగా తీయాలని ప్రయత్నాలు చేశారని నరసరాజు గారే అన్నారు.
వృత్తిలో గొప్ప క్రమశిక్షణ, డిగ్నిటీ, నిజాయితీ ఉన్న మనిషి. లాలూచీలూ, లోపాయకారీ వ్యవహారాలూ తెలీని మనిషి పుండరీకాక్షయ్య గారి భాస్కరచిత్రకి –
నేను కడప బదిలీ అయిన కారణంగా – ఎన్టీఆర్ చిత్రం వ్రాయడానికి ఆయన్ని పిలిచారు. ఆయన రేడియో రికార్డింగుకి వచ్చినప్పుడు “నేను భాస్కర చిత్రకి రాస్తున్నాను.
నీకేం బాకీలు లేవు కదా?” అని అడిగారు. నేను ఆశ్చర్యపోయాను. హిందీ మాతృకమీద ఆయనకి నమ్మకం లేక, ఆత్మవంచన చేసుకోలేక తప్పుకున్నారు. మళ్లీ
నేనే రాశాను – “మావారి మంచితనం” ప్రీవ్యూకి వచ్చి చూశాక “నేను బాగుండదను కొన్నానయ్యా – నువ్వే రైటు, బాగా రాశావు” అని భుజం తట్టారు. సినీరంగంలో దుక్కిపాటి, ఆయనా యిస్త్రీ చేసిన మల్లు పంచెలో ఎప్పుడూ
నిత్యనూతనంగా కనిపించేవారు. చాలా మంది రచయితల్లాగ కాకుండా ఆయన నటులు. ప్రసంగంలో కూడా ఆ మాటల విరుపుల్లో నాలాంటి వారికి ‘నటుడు’ కనిపించేవారు.
ఆయన నిండుకుండ. భార్యా వియోగం సంభవించినా దు:ఖాన్ని మనస్సులో దాచుకొని – జీవితం మీద ఆ ఛాయలు పడకుండా జీవయాత్ర సాగించిన వారిద్దరే అంటుంది మా ఆవిడ – సినారె, నరసరాజుగారు.
ఆ మధ్య ఎవరో స్క్రిప్టు వ్రాయమంటే “నేను వ్రాయడం మానేశాను” అని స్పష్టంగా చెప్పారట. అవసరాన్ని నిలవాల్సిన చోట నిలిపి – వృత్తిని ప్రలోభం చేసుకోని ఉదాత్తుడు నరసరాజుగారు.
రచయితల్లో నరసరాజుగారూ, నటుల్లో జగ్గయ్యగారూ నాకెందుకో మార్గదర్శకం. ఒకాయన క్రమశిక్షణకీ, మరొకాయన జ్ఞాన సముపార్జనకీ నిఘంటువులుగా నిలుస్తారు.
వృద్ధాప్యంలో ఆరోగ్యమూ, మనశ్శాంతీ కలిసిరావడం గొప్ప అదృష్టం. చేతికర్ర పొడుస్తూ నాకేం భయంలేదు. ఆరోగ్యం బాగుందన్న నరసరాజుగారు మరికొంతకాలం – అంతే హుందాగా జీవిక సాగిస్తారనుకొన్నాను. ఆయన ఆత్మకథని
ఆయన నోటంటా ఏ కాస్తో విని, ఓ సాయంకాలం గడపాలని ఆశించాను.
రచయిత ఆలోచనల్లో ఏనాటికీ అలసిపోడు. నెల రోజుల కిందటి ఆయన టెలిఫోన్ ప్రసంగమే అందుకు సాక్ష్యం. అయితే శరీరానికి ఆ ఏర్పాటు లేదు. తన చెప్పు చేతల్లో లేని ‘వయస్సుకి’ నరసరాజుగారు హఠాత్తుగా లొంగిపోయారు.
ఈమధ్య నటించిన ఓ సినిమాలో దర్శకుడిని అడిగాను : ఈ సినీమాకి సంభాష ణలు ఎవరు రాశారని. ఆయన నవ్వాడు – సంభాషణలు రాయడం అవసరమా? అన్నట్టు. ఆలోచన, ఓ ప్రణాళిక, నిర్దిష్టమయిన భావస్రవంతి – వెరసి –
నమ్మకమైన బాటలో ప్రేక్షకుడిని చెయ్యి పట్టుకు నడిపించే స్క్రీన్ ప్లే అవసరమున్న రోజులు క్రమంగా దూరమవుతున్నాయి. రేపటి తరానికి నరసరాజు గారు నిన్నటి ‘అవ్యవస్థ’ గా
గోచరిస్తే ఆశ్చర్యం లేదు – అలాంటి అవసరానికే వారు దూరమవుతున్నారు కనుక.
కాని మా తరానికి నరసరాజుగారు నాటకరంగం నుంచి గొప్ప సంప్రదాయాన్ని మోసుకువచ్చిన మార్గదర్శి. రచయితని గంభీరంగా ఎత్తయిన స్థానంలో నిలిపిన యోధుడు. పెద్ద మనుషులు, దొంగరాముడు, యమగోల, రాముడు-భీముడు
వంటి ఉత్తమ కళాఖండాల సృష్టికర్త.
అంతకుమించి రచయితల కులానికి భీష్మాచార్యులు. రేపటితరంలో మాటల రచయితలుండకపోతే ఆశ్చర్యం లేదు. ఆ ఒక్క కారణానికే నరసరాజు గారు రచయితల బాటలో సైన్ పోస్ట్.

Leave a Reply

%d bloggers like this: