వసుంధర అక్షరజాలం

ఇట్ల సుతః కావ్య పరిచయం

రచన లోగిలి టెలిగ్రామ్ బృందం సౌజన్యంతో

Sai Rachana, [24.02.21 13:42]
[Forwarded from Ramana Rao Pingali]
మంధర మాట దశరథుడి మూడవ భార్య కైకేయి విని ఉండకపోతే ఏం జరిగేది? రామాయణం సీతారాముల కల్యాణంతో ఆగిపోయేది. అలాగే కురుక్షేత్ర సంగ్రామం జరిగి ఉండకపోతే అపారజననష్టం కలిగి ఉండేది కాదు. ఆ సంగ్రామం జరగకుండా ఉండి ఉండాలంటే మహాభారతం లోని పాత్రలు లేదా వ్యక్తులు తమ గడులు దాటకుండా ఉండి ఉండాలి. కుంతి దుర్వాసుడు అనుగ్రహించిన వరాన్ని పరీక్షించడం కోసం కన్యగానే సూర్యుణ్ణి ప్రార్థించకుండా ఉండి ఉంటే- భీష్ముడు ప్రతిజ్ఞ చేయకుండా ఉండి ఉంటే- ఇలా ఎన్నో కార్యకారణ సంబంధాల వలన మహాభారతం ఎక్కడికక్కడ ఆగిపోయి ఉండేది. అయితే శ్రీ కృష్ణ రాయబారం విఫలమైన తర్వాత యుద్ధం అనివార్యమైనపుడు, ఏ మార్గం ఎంచుకుంటే యుద్ధం జరగదు అన్న ఆలోచనతో చేసిన ఒక అపురూపమైన రచన తెలంగాణా మాండలికంలో వ్రాయబడిన ‘ఇట్ల సుత’ (ఇలాగే కూడా)
జన్మరహస్యం తెలిపి శ్రీ కృష్ణుడు హితబోధ చేయడంతోనూ, కుంతి అర్థించడంతోనూ కర్ణుడు మనసు మారి పాండవపక్షంలో చేరడంతో, శకుని ‘కర్ణుడు లేని కౌరవసేన పాండవులను జయించడం కష్టమ’ని దుర్యోధనునికి నచ్చచెప్పి ఒప్పిస్తాడు. కురుపాండవులు కలుస్తారు. కర్ణుడికి తూర్పుప్రాంతమైన హస్తినకి, దుర్యోధనునికి పశ్చిమ ప్రాంతానికి అధిపతులుగా ధృతరాష్ట్రుడు నిర్ణయిస్తాడు. అయితే దుశ్శాసనుడికి తన అన్న దుర్యోధనుడు తమ తండ్రి నిర్ణయానికి తలొగ్గడంతో మనసు అంగీకరించక, పాండవులను విరోధించే ఏకలవ్యుడితో రహస్యమంతనాలు జరిపి, ఇటు అన్నకు, అటు ఏకలవ్యునికీ తెలియకుండా ఇద్దరు భిల్లయోధులచేత కర్ణుని హతమారుస్తాడు. విషయం బయటకు పొక్కండంతో కర్ణుని కుమారులు దుశ్శాసనుని వధిస్తారు. క్షణికావేశంలో దుర్యోధనుడు గదాఘాతంతో కర్ణుడి ముగ్గురు కుమారులను వధిస్తాడు. నాల్గవ కుమారుడు మిగులుతాడు. కర్ణుడు మరణించడంతో యుధిష్టిరుడు, హస్తినాధీశుడవుతాడు. కురుక్షేత్ర యుద్ధం జరగకపోవడంవల్ల జనభారం తగ్గనందుకు భూమాత చింతిస్తుంది. కర్ణుని భార్యా, పెంపుడు తల్లీ కృష్ణుని నిందిస్తారు……
ఇలా సాగిన కథనం శాంతి సందేశాన్ని అందిస్తోనే మహాభారతాన్ని కురుక్షేత్ర రణరహిత మహాభారతంగా మలుపు తిప్పుతుంది.
ఈ పుస్తకావిష్కరణ 2017 లో వరంగల్ లో జరిగింది. కొందరు వక్తలు రచనా నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. మరికొందరు దుస్సాహసం అన్నారు.
రచయిత ” మీరు పొగిడినా, తెగడినా దయచేసి పుస్తకాన్ని ఆ మూలాగ్రంగా చదివి మరీ చేయండి,” అని విన్నవించుకోవడం – ఆయన ఆత్మ విశ్వాసానికి ఒక సూచిక.
ఇతరత్రా,తెలంగాణా మాండలికంలో ఒక కావ్యేతిహాసాన్ని రచించడం అపురూపమైన ప్రయత్నం. పరిచయం లేని కొన్ని తెలంగాణా మాండలిక పదాలకు అకారాదిక్రమంలో అర్థాలు ఇవ్వడంతో పఠనం ఆసక్తికరంగా కొనసాగడమే కాకుండా, మాండలికం లోని సొబగులు తెలియవస్తాయి. ప్రయోగాత్మకంగా రాయబడిన ఈ కావ్యేతిహాస రచయిత శ్రీ వరిగొండ కాంతారావు.( విశ్రాంత LIC ఆఫీసరు.)
ఎలక్ట్రాన్.

Exit mobile version