మార్చి 3, 2021

చీకటి వెనుకా వెన్నెల రాదా…..

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం at 7:18 సా. by వసుంధర


తెలుగునాట పత్రికలు కొని చదివే పాఠకులు తక్కువ. తమ రచనలు ఉన్నప్పుడే పత్రికలు కొనాలనుకునే రచయితలూ తక్కువ కాదు. అంతర్జాల సదుపాయం వచ్చేక, కొని చదివేవారు కూడా కొనడం మానేసి పిడిఎఫ్ ఫైల్సు కోసం చూస్తున్నారు. రచయితలు కూడా పత్రిక మార్కెట్లో ఉండగానే తమ రచనల్ని పిడిఎఫ్ చేసి అభిమానులకు సరఫరా చేస్తున్నారు. అలా కొనేవారి సంఖ్య మరింత పడిపోతుంటే- కరోనా పిడుగు పడింది.
2017 చివర్లో రచన మాసపత్రిక ఆగిపోయింది. సంపాదకుడు శాయి దాన్ని సంస్థగా కాక వ్యక్తిగా నడిపారు. ఆయనకున్న వనరులు సాధారణం. ఐనా తన అభిరుచికి అనుగుణంగా పత్రికను నెలకొల్పి, ప్రకటనలపట్ల ఆసక్తి చూపకుండా, తన ఆశయాలతో రాజీ పడకుండా, వ్యాపారదృష్టి లేకుండా, పాఠకుల్నే నమ్ముకుని- 26 ఏళ్లు పత్రికను నడిపారు. అప్పుడైనా పత్రికను నిలిపివేయడానికి కారణం పాఠకుల కొరత కాదు. మీదపడుతున్న వయసుని గౌరవించడం ఒక కారణం, తన తదనంతరం తన అభిరుచికి, ఆశయాలకు తగినట్లుండి- పాఠకుల అపేక్షకు భంగం కలిగించరనిపించే- నిర్వాహకులు దొరక్కపోవడం. మాసపత్రికని నిలిపివేసినా, సాహితీవిలువలున్న రచనల్నిఅడపాతడపా అపూర్వ సంపుటాలు, సంకలనాలుగా విడుదల చెయ్యడానికి నిరంతరకృషి చేస్తూ సాహిత్యసేవ కొనసాగిస్తున్నారు శాయి.
2020లో సంస్థాగతమైన ఆంధ్రభూమి, నవ్య వారపత్రికలు నిలిచిపోయాయి. మొదటిది ఆర్థిక వ్యాజ్యాల్లో చిక్కుకుంటే, రెండవది సంస్థాగతమైన నిర్ణయాలకు లోబడింది.
తాజాగా వచ్చే నెలనుంచి ఈనాడు సంస్థనుంచి వస్తున్న విపుల, చతుర. తెలుగువెలుగు, బాలభారతం పత్రికలు కనుమరుగు కానున్నాయి.

ఈ పత్రికలన్నీ సాహిత్యంలో ఉత్తమ అభిరుచికి వివిధ కోణాలు. పాఠకులకు అరుదైన హస్తభూషణాలు. వాటి మనుగడకు కారణమైన వారికి, వారి బృందాలకు అభివందనాలు.
తెలుగు నాట పత్రికానిర్వహణ – నష్టపోతూ ప్రతిఫలాన్నిచ్చే అపూర్వ సాహిత్యసేవ. అది నిలచిపోతే, అందుకు కారణం ఆ నష్టాన్ని అవధులు దాటించిన పాఠకుల అలక్ష్య ధోరణి. ఆపైన ఇప్పుడు కరోనా అశనిపాతం,
అందుకు తెలుగువారందరూ సిగ్గుపడాలి. మేమెందుకు సిగ్గు పడాలీ అనుకునేవారు, అలా అనుకుంటోన్నందుకు సిగ్గు పడాలి.

మంచి పత్రికల్ని నిలబెట్టుకునేందుకు, ‘ఇంటింటికీ ఓ చందాదారు’ ఉద్యమాన్ని ఆరంభించగల సమర్థులైన నాయకుల అవసరం తెలుగువారికి ఉందిప్పుడు. కానీ కులం, మతం, ప్రాంతం, భాష, యాస వగైరాలని స్మరిస్తూ- సంస్కారాన్ని విస్మరిస్తూ, ఎందరిగానో విడిపోయి నడివీధిలో జుట్టూ జుట్టూ పట్టుకోవడమే ప్రజాస్వామ్యపు స్వేచ్ఛ అని భ్రమిస్తున్న మనకి- సాహిత్యాన్ని పట్టించుకునే సమయమెక్కడ?
ఏకత్వంలో బిన్నత్వాన్ని చూస్తున్న మనని భిన్నత్వంలో ఏకత్వం వైపు మళ్లించగల మహత్తరశక్తి, సంస్కారం సాహిత్యానికున్నాయి. బహుశా అది తెలిసే- మనం సాహిత్యానికి దూరంగా ఉంటున్నామేమో!
తెలుగు పత్రికలకి కృష్ణపక్షం నడుస్తోంది. ఒకటొక్కటిగా చీకట్లోకి వెళ్లిపోతున్నాయి. అమావాస్య ఇంకా దగ్గర్లో ఉన్నట్లు లేదు.
కరోనాకి టీకా వచ్చింది. దాని ప్రయోజనం మీద భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
తెలుగు పత్రికలకి శుక్లపక్షయోగం ఉందా?
అంతా వారి (పాఠకుల) లీల!

Leave a Reply

%d bloggers like this: