మార్చి 7, 2021

సంస్మరణ: గోఖలే

Posted in చిత్రజాలం, మన కథకులు, రచనాజాలం, సాహితీ సమాచారం at 10:37 ఉద. by వసుంధర

వాట్సాప్ బృందం బాలసాహితీ శిల్పులు సౌజన్యంతో

మా గోఖలే అసలు పేరు మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే! గోఖలే తండ్రి లక్ష్మీ నరసయ్యగారు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న యోధులు. బహుశా ఆ ప్రభావంతోనేమో మహాత్మా గాంధీ సైతం తన గురువుగా భావించిన గోపాలకృష్ణ గోఖలే పేరుని తన కుమారుడికి పెట్టారు. స్వతంత్ర సంగ్రామపు పోరులో లక్ష్మీ నరసయ్యగారి ఆస్తులన్నీ హరించుకుపోయాయి. కానీ తన కుమారుడికి పెట్టిన పేరు, అతనికి అందించిన సంస్కారం మాత్రం శాశ్వతంగా మిగిలిపోయాయి. 1917 మార్చి 07న గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణకోడూరులో జన్మించిన ‘మా గోఖలే’ మనసు ఎందుకనో చిత్రలేఖనం వైపు మొగ్గుచూపింది. చిత్రలేఖనానికి సంబంధించిన తొలిపాఠాలను బందరులో నేర్చుకున్నారు. ఆ తరువాత మద్రాసులోని ఆర్ట్స్ కళాశాలలో దేవీప్రసాద్‌రాయ్‌ చౌదరి వంటి ఉద్దండుల దగ్గర చిత్రలేఖనంలోని సులువులన్నీ ఔపోసన పట్టారు.

చిత్రకారునిగా, రాజకీయ కార్టూనిస్టుగా జీవనం సాగిస్తూనే అరుదైన కథలను రాయడం మొదలుపెట్టారు గోఖలే. వృత్తిరీత్యా మద్రాసులో ఉంటున్నా, ఆయన కథలన్నీ తను పుట్టిన బ్రాహ్మణకోడూరులోనిజీవితాలే!

గోఖలే రాసిన కథలన్నీ కలిపి నూరులోపే ఉంటాయి. కోటయకొండకు, కిష్టమ్మగారి పెద్దజీతగాడు, శివరాత్రి తిరణాళకు, పాలెంలో దీపాలమాశ, పులిస్త్రాకులు, గూడెం పోకడ, మార్నాల పండుగ, దొంగవాళ్లు, బండరాముడి పెళ్లాం, ఆరికేం మారాజులు, చీకటి మనుషులు, రత్తి కోకకట్టింది, పాళెంలో బొమ్మలాట… ఇలా గోఖలే కథల పేర్లన్నీ ఒక్కమారు చదివితే చాలు అవన్నీ కూడా అట్టడుగు వర్గాలవారి గురించి రాసినవే అని గ్రహించేయవచ్చు. చిత్రం ఏమిటంటే వీటిలో ఇంచుమించుగా ప్రతి కథలోనూ బడుగు జీవులు మాట్లాడుకునే భాషలోనే సంభాషణలు సాగుతాయి. చాలాసార్లు కథనం కూడా వారి యాసలోనే ఉంటుంది. ఒక యాభై ఏళ్ల క్రితం ఇలాంటి కథలు రాయడం అంటే ఎంత సాహసమో ఊహించుకోవచ్చు. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా ప్రతి కథలోనూ అదే సాహసం చేశారు గోఖలే.

గోఖలే కథల్లో చాలా కథలు తెలుగు సాహిత్యంలో భాగంగా మారిపోయాయి. ముఖ్యంగా గోఖలే అన్న పేరు వినబడగానే ‘బల్లకట్టు పాపన్న’ వంటి కథల పేర్లు గుర్తుకురాక మానవు. కృష్ణానది వాగు మీదుగా అటూఇటూ ఉన్న రేవులకి చేర్చేందుకు బల్లకట్టుని నడిపే పాపన్న కథే ఇది. ఇలాంటివాడు పొద్దున లేచిందగ్గర్నుంచి ఎలాంటి ప్రయాణికులను చూస్తుంటాడు, వారితో జరిగే సంభాషణలు ఎలా సాగుతాయి… వంటి విషయాలతో రేవు దగ్గర మనుషులందరినీ పరిచయం చేస్తారు గోఖలే! చివరికి పాపన్న నిరంతరం బల్లకట్టు మీదే గడపాల్సి రావడంతో, తన సంసారం దారి తప్పిపోయిందని తెలుస్తుంది. కానీ ఏం చేయగలడు! ఇంట్లో ఉంటే సంసారం చక్కబడుతుందేమో కానీ పూట గడవదు కదా! అందుకని మనసు చంపుకుని మళ్లీ తన బల్లకట్టుని సాగించవలసి వస్తుంది.

బల్లకట్టు పాపన్నకు భిన్నమైన మరో కథ ‘అడుక్కుదినక సేసేదేంది!’. ఊరి చివర ఇద్దరు బిచ్చగాళ్లు చేరి సాగించే సంభాషణతో ఈ కథ సాగిపోతుంది. సాదాసీదాగా సాగిపోయే జీవితం అప్పుల ఊబిలో పడటం వల్లనో, అనారోగ్యం పాలవ్వడం వల్లనో ఎలా చిన్నాభిన్నమైపోతుందో ఈ కథ కళ్లకు కడుతుంది. ‘కూతురి పెళ్లి’ అనే మరో కథలో వ్యసనపరుడు, వయసు దాటిపోయినవాడు అయిన ఓ రెండో పెళ్లివాడికిచ్చి పెళ్లి చేసే తల్లిదండ్రుల సంభాషణ కనిపిస్తుంది. సంబంధం మంచిది కాదనీ, తమ కూతురు గొంతుకోస్తున్నామనీ ఎక్కడా వారు బటయపడకపోయినా… ఆ భావాన్ని తొక్కిపెట్టేందుకు వారు చేసే ప్రయత్నం పాఠకుడు గ్రహించేస్తాడు.

గోఖలే కేవలం ఒక రచయిత, చిత్రకారుడే కాదు… గొప్ప కళాదర్శకుడు కూడా! తెలుగు చిత్రాలలో ఆణిముత్యాలనదగిన ప్రతి చిత్రం వెనుకా ఆయన కళా దర్శకత్వం కనిపించేంది. పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్‌, అప్పుచేసిపప్పుకూడు, గుండమ్మకథ, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాలెన్నింటికో ఆయన కళాదర్శకత్వం వహించారు. ఆయన కళతో ఆ చిత్రాలు ఎంత చిరస్మరణీయంగా నిలిచిపోయాయో, ఆయన కలంతో వెలువడిన కథలు కూడా తెలుగు సాహిత్యంలో అంతే సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న గోఖలే 1981అక్టోబరు 04న కన్నుమూశారు,
కూర్పు@డా: అమ్మిన

Leave a Reply

%d bloggers like this: