మార్చి 22, 2021

నాంది – కొత్త సినిమా

Posted in వెండి తెర ముచ్చట్లు at 1:14 సా. by వసుంధర

ఈ ఫిబ్రవరి 19 న విడుదలైన నాంది సినిమా – అల్లరి నరేష్‍ని కొత్త గెటప్‍లో చూపిస్తుంది. జనాలకు ఆట్టే పరిచయంలేని సెక్షన్ 211 – ముఖ్యాంశంగా రూపొందించడం ఈ చిత్రం ప్రత్యేకత. అధికార దుర్వినియోగానికి అమ్ముడుపోతున్న వ్యాయంపై – వ్యవస్థను నిలదీసిన అర్థవంతమైన కొత్త తరహా చిత్రమిది. ప్రయోజనాత్మకమైన పరిష్కారాన్ని సూచించడం ప్రశంసనీయం.

సమీక్షకులు మాటల్లో, వ్రాతల్లో – నాలుగు మంచి మాటలు చెప్పిన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ కూడా లభించింది.

ఈ చిత్రం చూడ్డానికి కొన్ని వారాల ముందు మేము మళయాళం నుంచి తెలుగులోకి అనువదించబడిన వ్యూహం (2020) చిత్రాన్ని ఆహా చానెల్లో చూశాం. అదీ ఇంచుమించు ఇదే కథ, ఇదే సందేశం, ఇదే కథనం. ఐతే చిత్రం చాలా హుందాగా, పకడ్బందీగా, ఆసక్తికరంగా నడిచింది. నటీనటులు పాత్రల్లో జీవించెశారు. దర్శకుడు చిత్రాన్ని ఉత్కంఠభరితం చేశాడు.

ఆ చిత్రం చూసేక చూడ్డంవల్లనేమో – నాంది కథ, కథనం, నటీనటుల ప్రదర్శన చాలా పేలవంగా అనిపించాయి.

వ్యూహం చూసేక నాంది చూదకపోయినా ఫరవాలేదు. నాంది చూసేక మాత్రం వ్యూహం ఓసారి చూడ్డం తెలుగులో మంచి సినిమాలు రావాలన్న నిబద్ధత ఉన్నవారికీ, ఔత్సాహికులకూ ఎంతో అవసరం.

రెండు చిత్రాలూ – ఓటీటీలో ఆహా చానెల్లో ఉన్నాయిప్పుడు.

నాంది మంచి చిత్రాలు తియ్యాలన్న ప్రయత్నానికి తగిన నాంది అనీ, మెరుగైన ప్రదర్శనకు ఇంకా ఎంతో కృషి చెయ్యాల్సి ఉందనీ గ్రహిస్తే – ఈ నిర్మాణ సంస్థ, బృందం – తెలుగు సినిమా భవిష్యత్తుకి కూడా గొప్ప ఆసరా కాగలరు. వారికి అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: