ఏప్రిల్ 12, 2021

సార్థక నామ ఉగాది

Posted in సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం at 10:39 ఉద. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

(శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో.. 12.04.2021..ఈనాడు లో నా ప్రత్యేక వ్యాసం.. ఎర్రాప్రగడ రామకృష్ణ.. రాజమండ్రి)

శ్రీ ప్లవనామ వత్సరానికి స్వాగతాంజలి సమర్పించే సమయం వచ్చేసింది. వేదం సూచించినట్లుగా మనసుకు భద్రంకరమైన స్థితిని (భద్రం మనః క్రుణుష్వ) అనుగ్రహించమని సర్వేశ్వరుణ్ని ప్రార్థించే సందర్భమిది.

విత్తనంలోని లక్షణమే వృక్షానికి సంక్రమించినట్లుగా, పేరులోనే వికృత రూపాన్ని ఇముడ్చుకొన్న వికారినామ సంవత్సరం(2019) చివరిలో కరోనా మహమ్మారి లోకాన్ని ఆవరించింది. సమస్త భూమండలాన్ని ఒక కుదుపు కుదిపింది. అటు ప్రకృతిలోని తీవ్ర వికృత స్వభావాన్నీ, ఇటు మానవ ప్రవృత్తిలోని సమస్త వికారాలను కరోనా- విశ్వయవనికపై నగ్నంగా ప్రదర్శిస్తూ కరాళ నృత్యం చేసింది. విశాల విశ్వమంతటా తన వికారాన్ని భూతద్దం పెట్టి మరీ చూపించింది. కనీవినీ ఎరుగని విపరీత స్వభావాలను వెలుగులోకి తెచ్చింది. పెద్ద మనిషి (మిస్టర్‌ జెకిల్‌) ముసుగును నిస్సంకోచంగా తొలగించి, లోపలి మనిషి (మిస్టర్‌ హైడ్‌)ని లోకానికి పరిచయం చేసింది. ‘మీ తల్లిదండ్రులు కరోనా కోరల్లోంచి బతికి బట్టకట్టారు, వారిని మీ ఇళ్లకు తీసుకుపోవచ్చు’ అని వైద్యులు కబురు చేస్తే- సంతోషంతో సంబరాలు చేసుకోవలసింది పోయి, ‘మాకూ అంటిస్తారేమో’ అన్న భయంతో పత్తాలేకుండా పోయిన సంతానాన్ని కరోనా మనకు పరిచయం చేసింది. కరోనా కబళిస్తే ‘ఆ పార్థివ దేహాన్ని ‘మా’ వీధిలోకి రానివ్వం, ‘మా’ శ్మశానంలో చోటివ్వం’ అంటూ అమానుషంగా ప్రవర్తించిన పాషాణ ప్రవృత్తిని కరోనా మన కళ్లముందు ఆవిష్కరించింది. ఒకటేమిటి… వికారి తన పేరుకు తగ్గట్లే- ప్రకృతికి సంబంధించిన, మానవ ప్రవృత్తికి సంబంధించిన సకల వికారాలను విశృంఖలంగా ప్రదర్శించింది. లోకాన్ని కల్లోలపరచింది. మనిషిని భయభ్రాంతులకు గురిచేసింది. జగత్తును తమస్సులో ముంచెత్తింది. కాలగమనంలో ‘శార్వరి’(2020)ని ముందుకు తెచ్చింది.

శార్వరి అంటే చీకటి. అంధకారం. భయంతో అయోమయంతో ఆందోళనతో సందేహాలతో శంకలతో లేనిపోని అనుమానాలతో, వాటికి తోడు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాలతో… రకరకాల కారణాలతో మనిషి గుండెల్లో గడ్డకట్టిన చిమ్మచీకటికి ప్రతీకాత్మక స్వరూపమే- శార్వరి! శార్వరిలో ఎవరు స్థిమితంగా ఉన్నారు కనుక! ఏ వెలుగులు తోచాయి కనుక! ఎవరు నిశ్చింతగా నిర్భయంగా జీవించారు కనుక! విలువలు పతనమయ్యాయి… వ్యవస్థలు కుదేలయ్యాయి… బంధాలు చీలిపోయాయి… ఉపాధులు దూరమయ్యాయి. బతుకులు తలకిందులయ్యాయి… లోకాన్ని గాఢాంధకారం కమ్మేసింది. గుండెను పెనుదుఃఖం కుమ్మేసింది. నడి వయసు వారిని సైతం మానసికంగా వృద్ధులుగా (మెంటల్లీ ఓల్డ్‌) మార్చింది. వృద్ధుల్ని మృత్యు భయకంపితుల్ని చేసింది. శార్వరి తన పేరును ఘనంగా నిలబెట్టుకుంది.

ఇప్పుడు వస్తున్న తెలుగు సంవత్సరాది పేరు ‘ప్లవ!’. ప్లవం అనే మాటకు దాటడమని అర్థం. ప్లవ అంటే దాటించునది. వరాహసంహితప్లవ నామసంవత్సర ప్రత్యేకతను విశ్లేషిస్తూ- ‘దుర్భిక్షాయ ప్లవ ఇతి తతశ్శోభనే భూరితోయం… దుర్భరమైన ప్రతికూలతలను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది’ అని వివరించింది. అంటే ఈ చీకటి నుంచి వెలుగుల్లోకి నడిపిస్తుందని అర్థం. వికారి, శార్వరి తమ పేర్లకు తగినట్టుగా ప్రవర్తించినప్పుడు ప్లవ సైతం తన పేరును సార్ధకం చేసుకొంటుందని ఆశించడం తర్కసహితమైన ఆలోచన.

ఇది తెలుగు సంవత్సరాలకు నామకరణం చేయడంలో మన పెద్దల అద్భుత వివేచన! అంటే ప్లవ నామ వత్సరంలో మానవాళి- ‘వికారి’ సృష్టించిన గాఢమైన ‘శార్వరి’ నుంచి తప్పక తేరుకుంటుందని, వికాసం దిశగా అడుగులు వేస్తుందని వారి ముందస్తు సూచన. అలా జరగాలన్నదే ప్రస్తుతం ప్లవను స్వాగతిస్తూ మనం చేయవలసిన ప్రార్థన!

‘అందరికీ అన్నీ తెలుసు, అదే మన అజ్ఞానం’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఆ అజ్ఞానంతోనే పెద్దల ఆలోచనలను చాలా సందర్భాల్లో మనం తప్పుపడతాం. వాటిని చాదస్తాలుగా భావిస్తాం. పెద్దల ముందుచూపుతో పరిచయం ఏర్పడే నాటికి ‘దీని వెనక ఇంత కథ ఉందా!’ అని ఆశ్చర్యపోతాం. నాలుక కరుచుకొంటాం.

కాలచక్ర గమనంలో అరవై ఏళ్లకోసారి ప్రకృతిలో సంభవించే వికృత పరిణామాలను, వాటి కారణంగా లోకంలో అలముకొనే గాఢ అంధకారాన్ని, దరిమిలా క్రమంగా విచ్చుకొనే వెలుగు రేకలను ముందే లెక్కలు కట్టి, పరిణామాలను పసిగట్టి- వికారి శార్వరి ప్లవ… అనే పేర్లతో కాల పురుషుడి నడకను సంకేతించిన పెద్దల దూరదృష్టిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. సంవత్సరాలకు పేర్లు పెడుతూనే వాటిలో ఒక నిగూఢ సందేశాన్ని ఇమడ్చటం మన పెద్దల దార్శనికత. అది బోధ పడితే ప్లవ నామ సంవత్సరం ముగియగానే ‘శుభకృత్‌’ ఆరంభం కావడంలోని ఆలోచనా రామణీయకత, శుభకృత్తును అనుసరించి ‘శోభ కృత్‌’ రావడంలోని  ఔచిత్యం మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. అభయాన్ని ప్రసాదిస్తాయి!


-ఎర్రాప్రగడ రామకృష్ణ

Leave a Reply

%d bloggers like this: