మే 3, 2021

పుస్తక సమీక్ష- సమ్మెట ఉమాదేవి కథానికలు

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 3:51 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

అవి కథలు కాదు. జీవిత అనుభవాలు

పుస్తక సమీక్షః సమ్మెట ఉమాదేవి కథానికలు
రచయిత్రి-సమ్మెట ఉమాదేవి
ఉమాదేవి కథలలో సున్నితత్వం కన్పిస్తుంది.ఇందులో మొత్తం 14 కథలు ఉన్నాయి.ప్రతికథలో సమస్య ఉంటుంది.ప్రతి కథకి చక్కని ముగింపు కన్పిస్తుంది.అందులో అంతర్లీనంగా సందేశం కన్పిస్తుంది.సందేశం పేరుతో భారీ సంభాషణలు ఉండవు.కథ కూడా వేగంగా సాగుతుంది.
ఈ సంపుటిలో మొదటి కథ ‘తడి’.ఈ కథ నీటి సమస్య చుట్టూ తిరుగుతుంది.మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది నీటి కొరతతోనే వస్తుందని ఎవరో అంటే విన్నాను.ఆ తీవ్రత మనకి ఈ కథలో కన్పిస్తుంది.ఇందులో చంద్రం పాత్ర ఆకట్టుకుంటుంది.మనుషుల స్వభావాన్ని నీటి సమస్య బయటపెడుతుంది.గుక్కెడు నీళ్ల కోసం చంద్రం పడే తిప్పలని రచయిత్రి చక్కగా వర్ణించారు.భూగర్భంలో నీరు ఇంకిపోతున్నకొద్దీ మనుషులలో సహాయపడే గుణమూ అడుగంటుకుపోతుంది.పెరుగుతున్న జనాభా,పట్టణీకరణ వల్ల మానవాళి పడుతున్న ఇబ్బందిని కళ్ళకి కట్టినట్లు ఆమె వివరించారు.ఎవరూ మారిన కథలో చంద్రం పాత్ర మారదు. మనుషులు సహజంగా మంచి వారే.పరిస్థితులే వారిని సంకుచిత స్వభావంగలవారిగా మార్చుతాయి.ఈ భావననే రచయిత్రి కథలోని చంద్రం భార్య మాలతితో చెప్పించారు.కథ ముగింపు ఆహ్లాదకరంగా ఉంటుంది.

రెండవ కథ ‘వెన్నెలలోగిలి ‘లో అనుబంధాలకి కులమతాలు అడ్డుకావనే విషయాన్ని రచయిత్రి చెప్తారు.చర్విత చర్వణం కథ ద్వారా ఒంటరి మహిళల బాధలను వర్ణించారు.మనం సాధారణంగా దేశరక్షణ కొరకు పాటుపడే సైనికుల త్యాగాన్ని గురించి తెలుసుకుంటాము.వారి కుటుంబాల గురించి మాములు సందర్భాలలో మనం ఆలోచించం.సైనికల కుటుంబాల మానసిక స్థితిని,వారు పడే సంఘర్షణని ‘నీ వాకిట తులసినోయీ..!’కథ ద్వారా రచయిత్రి చక్కగా వివరించారు.కథలలో ఎక్కువ స్త్రీ ప్రధాన భూమికగానే సాగుతాయు.రచయిత్రి ఉపాధ్యాయినిగా పనిచేయడం వల్ల క్షేత్ర స్థాయిలో వివిధ సమస్యల పట్ల చక్కని అవగాహన ఉంది.తన జీవిత అనుభవాలని కథా వస్తువుగా మలచిన తీరు అద్భుతం. ఆమె ఆంగ్ల ఉపాధ్యాయినిగా ఉన్నప్పటికీ,తెలుగుభాషపై రచయిత్రికున్న పట్టు మెచ్చుకోదగినది.ఆమె వాడిన భాష కూడా సరళంగా ఉంది.
ప్రతి కథలో మనకి మానవత్వం కన్పిస్తుంది.కథలు సుదీర్ఘంగా ఉండవు.బురద, ప్రవాహం,పితృదేవోభవ తదితర కథలు పాఠకులను ఆలోచింపజేస్తాయి.చర్విత చరణంలో అవని పాత్ర, జీవనహేల కథలో ధాత్రి పాత్ర ఆకట్టుకొంటాయి.

ఉమాదేవి కథలు ప్రవాహంలా సాగుతాయి.వీటిని చదివేటప్పుడు పాఠకులు పాత్రలతో మమేకం అవుతారు.మనిషిలోని మానవత్వాన్ని తట్టి లేపుతాయి.అందుకే వీటిని మనసులను కదిలించే కథలని చెప్పవచ్చు.

ప్రచురణ- కవీర్ణ ప్రచురణలు,హైదరాబాద్
పేజీలు-159,తొలి ప్రచురణ 2020
కాపీల కొరకు: సమ్మెట ఉమాదేవి, ఫోన్: 9849406722
వ్యాసకర్త-యమ్. రామ్ ప్రదీప్
తిరువూరు

Leave a Reply

%d bloggers like this: