జూన్ 8, 2021

‘బహుళ’ ఒక బృహత్తర అపూర్వ నవల -1 : బిఎస్ రాములు

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 11:06 ఉద. by వసుంధర

“బహుళ “ఒక బృహత్తర అపూర్వ నవల -1
– బి ఎస్ రాములు 8331966987

    అట్టాడ అప్పల నాయుడు గారి " బహుళ"  నవల ఒక బృహత్తర నవల.1912 లో మున్నీ ప్రేంచంద్ రాసిన"రంగ భూమి" , విశ్వనాథ సత్య నారాయణ "వేయి పడగలు, శివరా కారంత్ " మరల సేద్యానికి", ఎలెక్స్ హేలీ " ఏడు తరాలు", కళ్యాణ్ రావు " అంటరాని వసంతం" వంటి బృహత్తర, మహత్తర నవలలు  ఈ నవల చదువుతుంటే గుర్తుకు వచ్చాయి. ఆ కోవలో  చేరే గొప్ప నవల " బహుళ" . 

ఈ నవల లోని కథా వస్తువు కాలం. .. కాల పరిణామం. బహుళ నవల వందేళ్ల ఉత్తరాంధ్ర జీవితాలను, సమాజ పరిణామాలను, మానవుల ఆలోచనల్లో, సంస్కృతిలో, ఆశయాల్లో వచ్చిన మార్పులను అపూర్వంగా రికార్డు చేసింది. రాధేయ వామ పక్ష భావాల నుంచి జన జీవనంలో కలిసి పోయే క్రమానికి ప్రతినిధి. సత్యకామ్ పాత్ర బహుజన సమాజం ఆశిస్తున్న కోరుతున్న వారికి ప్రతినిధి. శ్రీకాకుళ ఉద్యమం, విశాఖ ఉక్కు ఉద్యమం, ప్రపంచీకరణ, బహుళ జాతీయ పెట్టుదారీ విధానం లోని పెద్దలు సమాజాన్ని రాజకీయాలను , సంస్కృతిని, జీవన విధానాలను మలుస్తున్న క్రమం దాకా ఈ నవలలో కన పడుతుంది.
100 ఏళ్ల సామాజిక విషాదం ఈ నవల ఇతివృత్తం. ఈ నవల చదవడానికి చేతిలోకి తీసుకొని పేజీలు తిప్పగానే గతమంతా కళ్లముందు కదలాడింది. ఉత్రాంధ్ర ప్రాంతంలో తిరిగిన అనుభవాలు, అక్కడి మనుషులు, అక్కడి సాహిత్యం ఒక ప్రవాహమై జలపాతమై ఉరికించాయి. ఆ ఉరవడిలో అకస్మాత్తుగా నాలోని తెలంగాణ వాది స్పృహ పైకి లేచింది. అలా మేం పుట్టిన్నించి అస్తిత్వం కోసం చేస్తున్న జీవన పోరాటాలు నాలో సమాంతరంగా ప్రవహించాయి. ఉత్తరాంధ్ర, తెలంగాణ రెండు జలపాత ప్రవాహాలు పక్క పక్కనే ఒరుసుకొని, సమాంతరంగా సాగాయి. వందేళ్ల ఈ సమాజ ప్రవాహగతిలో ఎట్టకేలకు తెలంగాణ తన అస్తిత్వాన్ని నిలుపుకుంది. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ ప్రవాహగతి నేపథ్యాన్ని ” జీవన యానం “, ” చూపు ” నవలలలో చిత్రించాను. ఆ ఘటనలు గుర్తుకు రాగా తెలంగాణ, ఉత్రాంధ్ర ప్రవాహాలు ఎక్కడో సంశ్లేషణ చెందినట్టనిపించింది. కాల గతిలో ఉత్తరాంధ్ర , తెలంగాణ ప్రవాహాల మధ్య ఎక్కడో లింకు తెగి పోయినట్టూ, దూరమైపోయినట్టూ అనిపించింది. అదేమిటంటే తెలంగాణా వందేళ్లుగా తన అస్తిత్వాన్ని నిలుపుకుంది. సగర్వంగా తల ఎత్తుకుంది. కాగా ఉత్తరాంధ్ర పోరాడి, అలసి పోయి, వలసపోయి, వలసవాదుల పాలై క్రమంగా వలసవాదుల దేశంగా పరిణామం చెందిన అమెరికా వలె మారి పోయిందా అనిపించింది. భారత దేశంలో 565 సంస్థానాలను కలిపి 14 రాష్ట్రాలు గా కుదించి ఒక సంచీ లో కుట్టడంతో చాలా ప్రాంతాలు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. 14 పెరిగి 29 రాష్ట్రాలైనప్పటికీ మరో 15 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు దశాబ్దాలుగా సాగుతున్నాయి. ఇందులో ఉత్తరాంధ్ర అస్తిత్వ ఉద్యమం తన ఉనికిని కోల్పోయి కోస్తాంధ్ర లో విలీనమైనట్టుగా తోస్తున్నది. ఆ అస్తిత్వ ఆరాటాన్ని ఈ నవల లో వినవచ్చు. ఆ గొంతు బలహీనంగా ఉండవచ్చు.
నేపథ్య సంగీతంలా నవలంతటా విస్రించి వినిపిస్తూ ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలు తమ మాతృభూమిలో అమెరికాలోని రెడ్ ఇండియన్స్ లా మార్జినలైజ్ అవుతున్న పరిణామం బహుళ నవల లో రీడ్ బిట్వీన్ గా కదలాడుతుంది. ఇదంతా నా ఊహేనో , నిజంగానే ఉందో ప్రొఫెసర్. కె. యస్ . చలం గారు చెప్పాలి. చందు సుబ్బారావు గారు చెప్పాలి. సాంతంగా, ప్రశాంతంగా
“బహుళ” నవల చదివితే మీకూ తెలుస్తుంది. నాలుగు దశాబ్దాల మిత్రుడు అట్టాడ అప్పల నాయుడు గారికి అభనందనలు.

Leave a Reply

%d bloggers like this: