జూలై 5, 2021

న్యూజిలాండులో ప్రమాణ స్వీకారం సంస్కృతంలో

Posted in భాషానందం, సాంఘికం-రాజకీయాలు at 12:17 సా. by వసుంధర

ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో

కొన్ని నెలల క్రితం ఓ టీవి ఛానెల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న ఒక సాహితీవేత్త సందర్భానుసారంగా కొన్ని తెలుగు పద్యాలను ఉదహరించాడు. దానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక మంత్రివర్యుడు స్పందిస్తూ, ‘ఆయన చదివిందాంట్లో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు’ అన్నాడు వెటకారంగా. సామాన్యుడికి అర్థం కాని భాష దేనికి అన్న ధ్వని ఉన్న ఆ వెటకారం- అలనాటి నన్నయ, తిక్కన, పోతన వగైరాలను, ఇప్పటి విశ్వనాథ, శ్రీశ్రీ, దాశరధి, సినారె వగైరాలను సూటిగా తాకి ఉంటుందన్న స్పృహ ఆయనకు ఉన్నట్లు అనిపించలేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, సాహిత్యాన్ని అలా తేలికచేయడం తనని తానే అపహాస్యం చేసుకోవడమని ఆయనకు స్ఫురించినట్లు లేదు. ఆ క్షణానికి ఎదుటి వ్యక్తిని చిన్నబుచ్చడమే ధ్యేయం అనుకోవాలి. ఏది ఏమైనా అలాంటి కొందరి దృక్పథంతో- భాష, సాహిత్యం మనుగడ కోల్పోవు.

అంతర్జాలం పుణ్యమా అని మన తెలుగు భాష- దేశపు ఎల్లలు దాటి అంతర్జాతీయంగా కూడా వ్యాప్తి చెందుతోంది. ఇక సామాన్యులకు భాష అర్థం కావడం అంటారా- తెలుగువారి ప్రియతమ నాయకుడు ఎన్టీఆర్ డైలాగ్స్ – భాష అర్థమవడం వల్లనే ప్రాచుర్యం పొందాయా? ఆయన నిత్యజీవితంలో వాడిన భాష సామాన్యులదేనా?

వాడుక భాషకు పూర్తిగా అలవడినవారు కూడా పురాణశ్రవణంలో ఉపశమనం పొందుతారని నేటి ప్రవచనాల ప్రాచుర్యం తెలియజేస్తుంది. వాడుక భాష అవసరం. సాహిత్యం అభిరుచి. పదవుల్లో ఉన్నవారికి అభిరుచి హుందాతనాన్ని ఇస్తుంది.

అలాంటి అభిరుచినే పాటించాడు భారత సంతతికి చెందిన గౌరవ్ శర్మ. ఆయన అభిరుచిని మనవాళ్లు ఆదర్శంగా తీసుకోగలరని ఆశిద్దాం.

Leave a Reply

%d bloggers like this: