జూలై 13, 2021

తెలుగు కథ విశిష్టతకో ‘నమ్మకం’

Posted in కథాజాలం, సాహితీ పథ్యం at 7:11 సా. by వసుంధర

వర్గ, ప్రాంత, కుల, మత, వగైరా విభేదాలతో- సాహిత్యంపైనా దాడి చేసేవారి సంఖ్య గణనీయంగా ఉన్నా- సమకాలీనమైన అన్ని అంశాలనూ స్పృశిస్తూ- అద్భుతమైన తెలుగు కథలు క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నాయి. అలాంటి వందలాది కథల పుస్తకాలూ, కథలూ- రచన మాసపత్రికలో సాహితీవైద్యం శీర్షికలో 1993-2017 వరకూ నెలనెలా పరిచయం చెయ్యబడ్డాయి.

తెలుగు కథ ఊహించని ఎత్తులో కొనసాగుతోందనడానికి నిదర్శనమైన అలాంటి మరో కథ- ఇటీవల మే 2021, స్వాతి మాసపత్రికలో వచ్చిన ‘నమ్మకం’.

డాక్టర్ స్వామి ఎండి, జనరల్ ఫిజీషియన్. భార్య అరుంధతి గైనకాలజిస్ట్. కొడుకు మధు- జనరల్ సర్జన్. కోడలు ఇందిర- గైనకాలజిస్ట్. ఈ నలుగురి పేర్ల మొదటి అక్షరాలతో వెలసింది ఐదు నక్షత్రాల ‘సామి హాస్పిటల్’.
స్వామి మనుమడు ఎనిమిదేళ్ల ప్రశాంత్‍కి ఆటల్లో తలకు గట్టి దెబ్బ తగిలింది. వారం రోజులుగా హాస్పిటల్ బెడ్ మీద మృత్యువుతో పోరాడుతున్నాడు. డబ్బు, వైద్యవిజ్ఞానం- రెండూ నిస్సహాయమైన క్షణాల్లో మరో వైద్యనిపుణుడు మిశ్రా, ‘ఏమో, ఒకొక్కప్పుడు ఏ మహిమ వల్లనో మాట ప్రభావానో- గుర్రం లేచి ఎగరనూవచ్చు’ అని జోక్‍లా అనేసి చేతులెత్తేశాడు.
అదే హాస్పిటల్లో సూర్యం అనే మధ్యతరగతి పేషెంట్ చేరి పది రోజులైంది. ఇంకా లక్షా డెబ్బైవేలు కట్టాల్సి ఉందని అతణ్ణి డిశ్చార్జి చేయడం లేదు. ‘అన్ని చోట్లా తెచ్చి ఉన్నదంతా పోస్తిమి. ఇంకా ఇంతకంటే ఎట్లా దేవుడా’ అని రోదిస్తున్న సూర్యం తల్లి తన కాళ్లు చుట్టేసి, ‘డాక్టర్ గారో, నా కొడుకుని వదలండి సారో. నీ బాంచన్ కాల్మొక్త’ అని రాగాలు పెడితే చీదరించుకున్నాడు డాక్టర్ స్వామి.
ఆమెకి కడుపు మండి, ‘డాక్టర్ సామీ. బీదాబిక్కీని ఇట్టా రాబందుల్లా పీడిస్తే పిల్లా పీచూ ఉంటే చస్తారు. ఆళ్లకి మా ఉసురు తగల్తది జాగ్రత్త. మంచి చేస్తేనే మంచిగ ఉంటది’ అని ఆగకుండా శాపనార్థాలు పెట్టింది.
ఉత్తప్పుడు అలాంటి మాటలు పట్టించుకోని స్వామి- ఏకైక వారసుడు చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న పరిస్థితి కలిగించిన బలహీనతలో- సూర్యాన్ని డిశ్చార్జి చేసి, ఆ బిల్లు తనకు పంపమని పిఆర్వోకి ఫోన్ చేసి చెప్పాడు.
ఆ తర్వాత మనమడు ప్రశాంత్ లో కదలిక వచ్చిందని కబురొస్తే, ఆయన చెవుల్లో మిశ్రా జోక్ మార్మోగడం కథకి ముగింపు.
పాత్రచిత్రణని సన్నివేశాల్లోంచీ స్ఫురింపజేసే ఈ కథలో- ఐదు నక్షత్రాల హాస్పిటల్ వాతావరణం, అది నడిపే వారి మనస్తత్వాలు విమర్శకు గురై ఉంటే కథ సాధారణం అయ్యేది. వాటిని వాస్తవంగానూ, అవగాహనతోనూ ప్రదర్శిస్తూ- దోపిడి ఊసెత్తకుండా, ఉదారత్వాన్ని ప్రబోధించకుండా,
ఒక అతిమామూలు సన్నివేశంతో- మానవత్వాన్ని తట్టి లేపిన అసమాన ప్రతిభ, ఈ కథను విభిన్నం చేసింది.
సందేశాన్ని సందేశంలా కనిపించనియ్యక, కథలోనే ఇమడ్చడం ఈ కథని విశిష్టం చేసింది.
యథాలాపంగా తీసుకునే పాఠకుణ్ణి కూడా వెంటాడుతూనే ఉండే కథాంశం హృద్యం. ఏ విషయాన్ని ఎంత చెప్పాలో ఎంతవరకూ చెప్పాలో అంతే చెప్పడం కథన పరిణతికి పరాకాష్ఠ.
సమకాలీన సమాజాన్ని ఓ కోణంనుంచి పరిశీలించినట్లు అనిపించినా- నిజానికీ కథ సమకాలీన క్షీరసాగరం. మధించినవారికి మధించినంత ఫలితాన్నిస్తుంది.
మే 2021, స్వాతి మాసపత్రికలో వచ్చిన ఈ కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే- ‘ఇది విహారి రచన
‘.

Leave a Reply

%d bloggers like this: